ఉదయార్చన

(అంశం::” ప్రేమ”)

ఉదయార్చన

రచయిత :: సుధామురళి

‘నువ్వు మారిపోయావ్ ఉదయ్, మారిపోయావ్’ ముక్కు చీదుకుంటూ వచ్చింది అర్చన.

‘అందుకే నిన్ను ఆ F2 సినిమా ఎక్కువసార్లు చూడవద్దు అని చెప్పింది. చూడు ఇదే డైలాగ్ ని ఎన్నిరోజులుగా, ఎన్నెన్నిసార్లు చెప్పి అలసిపోయావో’ నవ్వుతూ ఆమెని నవ్వించే ప్రయత్నం చేశాడు ఉదయ్.

‘చూశావా, ఇప్పుడు కూడా నా బాధ నీకు నవ్వులాటగా ఉంది. ఇదివరకు ఇలా ఉన్నావా? నువ్వు చెప్పు’ అంటూ నిలదీతకు పూనుకుంది అర్చన.

అర్చన, ఉదయ్ మేనత్త, మేనమామ పిల్లలు. చిన్నప్పటినుంచీ కలసి చదువుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఒకరిపట్ల ఒకరు అభిమానం , ప్రేమ చూపించుకుంటూ పెరిగి పెద్దయ్యారు. వీళ్ల మధ్య ఏర్పడిన ఆ బాండింగ్ ను చూసి వీళ్ళ పెద్దవాళ్ళు చెరో సంబంధం వెతకడం ఎందుకని వీళ్ళనే ఒకరికి ఒకరిని ఇచ్చి పెళ్లి చేసేశారు.
ఇక అప్పటినుంచీ మొదలయ్యింది వీరి ప్రేమ ఎక్కువైన సంసారం.

‘సరే ఇప్పుడు నీకేం కావాలి? చెప్పు’ అనునయిస్తూ అడిగాడు ఉదయ్.

‘సాయంత్రం రమ్యా వాళ్ళ ఇంట్లో కిట్టీ పార్టీ ఉంది. ఇద్దరికీ ఫ్రెండ్ కదా తను. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదట. నిన్ను కూడా తీసుకుని రమ్మని నాకు ఫోన్ చేసి చెప్పింది’

‘అర్చనా, ఈరోజు నాకు కుదరదురా
అంతగా ఉంటే ఈ వీకెండ్ ఇద్దరం కలిసి రమ్యా వాళ్ళ ఇంటికి వెళదాం ok నా’ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఉదయ్.

అర్చన రమ్యకు ఫోన్ చేసి ‘రమ్యా మేము రావట్లేదు. నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. సండే కలుస్తాములే నిన్ను’ అని చెప్పి పెట్టేసింది.

రమ్యకు ఉదయ్, అర్చన ఇద్దరూ ప్రాణ స్నేహితులు. రమ్యా వాళ్ళ హుస్బెండ్ ఉదయ్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు. అలా కూడా రెండు కుటుంబాల మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. ఎందుకో అర్చన మాటల్లో ఏదో దాపరికం ఉందని గ్రహించిన రమ్య కిట్టీ పార్టీ క్యాన్సల్ చేసి అర్చనా వాళ్ళ ఇంటికి బయలుదేరింది.
రమ్య అర్చన వాళ్ళ ఇంటికి వెళ్లి తలుపుకొట్టేసరికి, తలుపుతీసిన అర్చన ముఖం బాగా ఉబ్బి ఉంది. ఏడ్చి, ఏడ్చి కళ్ళు సాయంత్ర సూర్యుడిలా ఎర్రగా మారిపోయి ఉన్నాయి.

‘ఏయ్ ఏంటి అర్చనా? ఇది. ఎందుకు అంతలా ఏడ్చి, ఏడ్చి ఉన్నావు. ఏమయ్యింది? ఉదయ్ ఏమన్నా అన్నాడా?’ అంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించింది రమ్య.

‘రమ్యా… ఉదయ్ నన్ను ఎప్పుడూ, ఏమీ అనడు. కానీ ఈ మధ్య ఎందుకో నా మీద ప్రేమ తగ్గిందని అనిపిస్తోంది నాకు. చూడు ఈరోజు కిట్టీ పార్టీకి రమ్మంటే కూడా ‘కుదరదు సండే వెళదాం’ అనిచెప్పి వెళ్ళిపోయాడు’

‘ఓస్ అంతేనా, దానికే ఇంతలా ఏడుస్తారా? ఎవరైనా. పిచ్చి పిల్లా’ అంటూ నవ్వేస్తున్న రమ్యను చూస్తూ ఉడుకుమోత్తనం ఆపుకోలేక అర్చన

‘ఇదే కాదు. ఈమధ్య నేను ఏం చేసినా ఏమీ చెప్పట్లేదు. మొన్నటికి మొన్న తనకు ఇష్టమని గుమ్మడికాయ హల్వా ఎంత కష్టపడి చేశానో తెలుసా? తిని కామ్ గా అయిపోయాడు
జస్ట్ బాగుంది అని ఒక్కమాట చెప్పాడు అంతే’ అంటూ మళ్లీ రొప్పడం స్టార్ట్ చేసింది

‘ఊ….’

‘చూడు, చూడు నీకూ అలుసైపోయాను’ చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్న అర్చనను చూస్తే రమ్యకు నవ్వు ఆగలేదు.

‘పెళ్లి అయ్యి సంవత్సరం అయ్యిందా, ఇంకా నెలతప్పలేదు నేను. డాక్టర్ దగ్గరికి వెళదాం , వెళదాం అని పోరు పెడితే ఒక్కసారి తీసుకెళ్లాడు. మళ్లీ లేదు’ అంటూ ఇంకా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది.

ఇప్పటికన్నా తనకు రామ్ తన హుస్బెండ్ చెప్పిన విషయాలు అర్చనకు చెప్పకపోతే వాళ్ళ కాపురం ఇబ్బందుల్లోకి వెళుతుంది అని అర్థం చేసుకున్న రమ్య

‘చూడు అర్చీ, ఉదయ్ కి నీ మీద ప్రేమ ఇంచుకూడా తగ్గలేదు. సరికదా పెరిగింది. నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళలేదు అంటున్నావు. అసలు మొదటిసారి వెళ్లినప్పుడు టెస్ట్స్ చేశారు కదా, రిజల్ట్ ఏమి వచ్చిందో తెలుసా నీకు? అని అడిగింది

‘లేదు, చూశావా అదీ చెప్పలేదు’

‘చెప్పలేదు కాదు, చెప్పలేక పోయాడు. నీకు గర్భ సంచిలో లైట్ గా ఇన్ఫెక్షన్ ఉంది. అది తగ్గకపోతే కాన్సర్ కు కూడా దారి తీయవచ్చు. ఇది తెలిస్తే నువ్వు ఇంకా డీలా పడిపోతావని నీకు చెప్పలేదు. నీ దగ్గర మందులు మింగిస్తూ నిన్ను చిన్నపిల్లలా చూసుకుంటున్నాడు’

‘********’

‘ఇక నువ్వు వంటలు చేసిపెడితే మెచ్చుకోక పోవడానికి కారణం అంటావా, ఈరోజు మెచ్చుకుంటే రేపు ఇంకా ఎక్కువ శ్రమపడి ఇంకా ఎక్కువ వంటలు చేసి నువ్వు ఎక్కడ అలసిపోతావో అనే’

‘హలో, హలో ఉదయ్ త్వరగా ఇంటికి రా….! నీతో మాట్లాడాలి’

ఉద్వేగం అణుచుకోలేని అర్చన ఉదయ్ కి ఫోన్ చేసి రమ్మని పిలవడం రమ్యకు ఆనందాన్ని ఇచ్చింది.

‘థాంక్స్ రమ్యా నువ్వూ చెప్పకపోతే నేనెప్పటికీ ఉదయ్ ని అర్థం చేసుకోలేక పోయేదాన్ని. ఎందుకంటే నేను బాధపడే విషయాలు ఉదయ్ ఎప్పుడూ నాకు చెప్పడు కనుక’ కళ్ళు తుడుచుకుని ఉదయ్ కోసం ఎదురుచూస్తున్న అర్చనను చూసి రమ్య తృప్తిగా బయలుదేరింది….

✍️✍️

*ప్రేమ* అంశం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!