నిశిరాత్రి

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

నిశిరాత్రి

రచయిత :: శ్రీదేవి విన్నకోట

ఆ రాత్రి నా జీవితంలో అత్యంత భయంకరమైన రాత్రిగా మారుతుందని నేను కలలో కూడా అనుకోలేదు.ఆరోజు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12:00.కన్నుల పొడుచుకున్నా కనబడని కటిక చీకటి.

అదో పెద్ద అడవి అక్కడ నేను తప్ప మరెవ్వరూ లేరు. ఒంటరితనం అనే భయంతో నా గొంతు పిడచ కట్టుకు పోతుంది.అసలు నేనా అడవిలోకి  ఎలా వచ్చానో నాకే తెలియని అయోమయ పరిస్థితిలో భయంగా  భాధగా ఉన్నా నేను .

నా శరీరం చెమటతో తడిసి ముద్దయి పోతోంది. నా గొంతు ని ఎవరో పట్టుకుని నొక్కుతున్నట్లు, నా ఊపిరి ఆగిపోతున్నట్టు, ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఒక భయంకరమైన అనిజీ  ఫీలింగ్ నాకు. పెద్దగా అరవాలని పిస్తోంది కాని గొంతు నించి మూలుగు లా చిన్న అరుపు తప్ప మాట బయటికి  దాటి రావడం లేదు.

వెక్కివెక్కి ఏడుస్తున్నాను నాకు విపరీతంగా భయమేస్తోంది. ఇక్కడ  ఎవరైనా ఉన్నారా ప్లీజ్ ఒకసారి కనిపించండి మాట్లాడండి, నన్ను రక్షించండి అని గట్టి గట్టిగా అరుస్తున్నాను.

అక్కడ నాకు నా గొంతు తప్ప మరో చిన్న శబ్దం కూడా వినపడలేదు. అడవిలో నా గొంతే నాకే రీ సౌండ్ తో మళ్లీ మళ్లీ భయంకరంగా ప్రతిధ్వనిస్తోంది. నేను ఒంటరిని అయిపోయిన బావం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరో మనిషి తోడు కావాలని నా మనసు నన్ను  అర్ధిస్తుంది.ఆ అడవిలో పిచ్చిదానిలా తిరుగుతున్నాను.అసలు ఎటు వైపు వెళ్లినా మళ్లీ అక్కడికే తిరిగి వస్తున్నా

అలా ఎంత సేపు తిరుగుతూ ఉండిపోయానో నాకే తెలియదు. అలా నాలో నేనే ఏడుస్తూ అరుస్తూ నా బాధను నాలో నేనే దాచుకుంటూ భరిస్తూ ఆ అడవిలో ఒక చోట కూలబడి పోయి అలా అచేతనంగా  కూర్చుండిపోయాను. అసలు ఏం జరుగుతుందో నేను ఆ వంటరీ భయంకరమైన ప్రదేశానికి ఎలా వచ్చానో అసలు అర్థం కావట్లేదు,

ఇంతలో ఎక్కడి నుంచో దూరంగా మాటలు వినిపిస్తున్నాయి. నా కళ్ళకి వెలుగు. నా శ్వాస కి ఊపిరి. నాలో పోతున్న ప్రాణం నాకు మళ్ళీ తిరిగి వచ్చాయి. నా గుండె బరువు దిగి పోయి నేను మామూలు మనిషిని అవుతున్న ఫీలింగ్ నాకు తిరిగి వచ్చింది.

కళ్ళు నెమ్మదిగా తెరిచి చూసాను. నేను నా మంచం మీదే ఉన్నాను. పక్కనే మా నానమ్మ. ఏమే  రాక్షసి పిల్లా ఏంటి.ఆ అరుపులు కేకలు నీకు పిచ్చి గాని పట్టిందా.లేదా ఏ గాలి అయినా సోకిందా. దయ్యం పట్టినదానిలా తిక్కతిక్కగా అరుస్తున్నావు. అంటూ తిట్ల దండకం అందుకుంది.

పూర్తిగా నిద్ర నుంచి మెలకువ వచ్చిన నాకు అది కల అని అర్థం కావడానికి ఐదు నిమిషాలు పట్టింది.
ఈ లోపు నానమ్మ తిట్లదండకం టీవీ 9.నిరంతర వార్తా వాహినీ లా అలా అలవొకగా కొనసాగుతూనే ఉంది.
పగలంతా పని పాట లేకుండా కూర్చుని ఆ హర్రర్ స్టోరీస్ చదువుతూ వాటి గురించే ఆలోచిస్తూ,ఆ దిక్కుమాలిన ఫోన్లో 24 గంటలు వాటితోనే ఏడుస్తూ ఉంటావు. మరి ఇలాంటి కలలు రమ్మంటే రావు, రాత్రులు ఏమో ఇలా నా నిద్ర చెడగొడుతూ ఉంటావు. నువ్వే పెద్ద దెయ్యంలా తయారయ్యావు ఇంకొక్కసారి ఇలా అరిచావు అంటే నీ పక్క తీసుకెళ్లి వరండాలో వేస్తాను జాగ్రత్త అంటూ నా మీద ఇంకా అరుస్తూనే ఉంది,

సర్లే నేను అరుస్తున్నానని నువ్వు ఎందుకు ఇంకా గట్టిగా అరుస్తావ్ అలా. ఏదో చిన్న పిల్లని నిద్రలో పీడకల వచ్చి అరచి చచ్చాను అంతే కదా.. దానికే ఇంత పెద్ద ఇష్యూ చేస్తావ్ ఏంటి. పడుకో నోరు మూసుకుని అని నేను గట్టిగా దబాయించి మాట్లాడేసరికి మా నాన్నమ్మ సైలెంట్ అయి నిద్రపోయింది.

ఇంతకీ మీకు నాపేరు చెప్పలేదు కదూ నాపేరు నిశాంతి, అందరూ ముద్దుగా నిశి అని పిలుస్తారు. నిశి అనే నాపెరుకి అర్థం కటిక చీకటి అని మీకు తెలుసా.
ఎవరికి తెలిసినా తెలియక పోయినా నాకు మాత్రం చాలా బాగా తెలుసు. అందుకే నాకు అప్పుడప్పుడు ఇలాంటి కలలు రావడం నేను అలా అరవడం మామూలే, ఇలా ఆలోచిస్తూ నాలో నేనే నవ్వుకుంటూ మరో వైపు తిరిగి ఇంతకు ముందు వచ్చిన కలనీ అసలు ఏమాత్రం తలుచుకోకుండా హాయిగా దుప్పటి ముసుగేసి నిద్ర పోయా మరో కమ్మనికల కోసం ఎదురు చూస్తూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!