ఎడబాటు గీతిక

ఎడబాటు గీతిక

వెన్నెలరేయిలో వినువీధిలో
మిలమిల కాంతులీనుచూ
కొంటెగ కన్నుగీటిన నెలరాజును
గాంచి, వికసించి పరిమళించి
వయ్యారాల కలువభామ.!

తూరుపు తొలి వేకువలో
ప్రశాంత ప్రకాశ సుప్రభాత
భానుడు మెల్లగా మెత్తగా
చురుకైన చూపు విసురుతూ
మేను తడమగా మోహితయై
సింగారాల కమల కోమలిభామ.!

అట అరవిరిసిన ఆకాశరాజు
కవ్వింపుగ కరిమబ్బుల గాలమేసి,
మత్తైన మసక చీకటి మంత్రమేసి,
చెంపలపై చిరుగాలుల చిటికెవేసి,
మదిని మాయజేసి ఓలలాడించగా,
పులకించి పురివిప్పి నటనమాడుతూ
పరవశయై ముగ్ధయై మయూరిభామ.!

తల్లడిల్లెనే..తగని ఎడబాటునోపలేక.,
రేయి కరిగి నెలరాజు తెరచాటు కాగా.!
సందెవాలి రవిరాజు కనుమరుగుకాగా.!
చిరుజల్లుల తొలకరిగ కురిసి కరిమబ్బు
కరిగిపోగా..ఆకాశరాజు ఆలసిపోగా..!

వయ్యారి కలువ కన్నులు దాటని కలలు
కమల కోమలి చేతికొనలు దాటని ఆశలు
ముగ్ధ మయూరి పదము వీడని సంగతులు
తీరని కల్లలై..అడవి గాచిన వెన్నెలై మిగిలెనే..!

రచయిత: సత్య కామఋషి ‘ రుద్ర ‘

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!