నీ హృదిని స్వర్గ సీమగా మార్చు..!
రచయిత: సోంపాక సీత
కరిగిపోయిన ఆస్తులకు సాక్ష్యంగా
పట్టాలమీద పట్టాలు నీ చేతిలోకొచ్చి వాలాయి!
రాజ్యాంగమిచ్చిన దయార్ద్ర హక్కులతో
త్రివర్ణాలను ఒంటికి అద్దుకున్నావు!సంస్కృతీ,సాంప్రదాయాలు పెట్టిన ప్రసాదంతో
పచ్చకర్పూరంలా పరిమళిస్తున్నావు!
పూర్వజులొసగిన పారంపర్య భిక్షతో
సమాజ వదనంపై గుబురు మీసంగా మెరుస్తున్నావు!
సప్తవ్యసనాల కొలిమిలో కాలిపోతూ
బూడిద పంచుతున్నావెందుకు నరుడా?
నీ ఆలు,బిడ్డలకు నిక్కమైన తోడు,నీడ;నీవేగా?
ఆలోచనాంతరంగ సాగరాన్ని మథించు..!?
అనురాగాభిమానాలను అడవి గాచిన వెన్నెల కానీయకు ?
నీ మదిలో పెల్లుబికుతున్న వాత్సల్యాన్ని పునాది రాళ్లుగా
మలుస్తూ హృదిని స్వర్గసీమగా మార్చు..!