చదువుకున్న విలువ

చదువుకున్న విలువ

రచన: జె వి కుమార్ చేపూరి

బస్టాండ్ లో కూలీగా పనిచేసే కృష్ణయ్యకు ఒక కూతురు స్ఫూర్తి. తాను రాత్రి పగలు పనిచేసి కష్టపడి అమ్మాయిని చదివిస్తున్నాడు పట్నంలో. తన సంపాదనలో సగం అమ్మాయి చదువుకే ఖర్చు పెట్టేవాడు. తన అదృష్టం బాగుండి కూతురు స్ఫూర్తి డాక్టర్ అయ్యింది. కూతురు ఆదర్శభావాలతో యడ్లపాడు గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో, డాక్టర్ గా గ్రామస్థులకు సేవ చేయడానికి వచ్చింది. తక్కువ రోజుల్లేనే గ్రామస్థులందరికీ దగ్గరైంది. ఊరి కామందు భూషణం అభిమానాన్ని కూడా చూరగొంది. ఒకనాడు భూషణం ఏకైక మనవడు ఆరేళ్ళ వాసు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉండగా స్ఫూర్తి దగ్గరకు తెచ్చాడు. ఎలాగైనా తన మనవడికి ప్రాణభిక్ష పెట్టమని బతిమిలాడాడు. స్ఫూర్తి వారం రోజులు వాసుకి వైద్యసేవలందించి ప్రాణాపాయ స్థితి నుండి తప్పించింది. భూషణం ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. తన మనవడిని బతికించిన స్ఫూర్తికి చేతులెత్తి దండం పెట్టాడు. తనకెంత డబ్బు కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు స్ఫూర్తి తనకేమీ అవసరం లేదని తన తండ్రి ఏమి కోరితే అది ఇవ్వని అడిగింది. దానికేం భాగ్యం అన్నాడు కామందు భూషణం. స్ఫూర్తి తండ్రిని పిలిచింది. లోపలి నుండి బయటకు వచ్చిన కృష్ణయ్యను చూసి కంగు తిన్నాడు భూషణం. కృష్ణయ్యా స్ఫూర్తి నీ కూతురా అని అడిగాడు. అవునన్నాడు కృష్ణయ్య. వెంటనే భూషణం కృష్ణయ్య చేతులు పట్టుకుని నన్ను క్షమించు కృష్ణయ్య, నీ నిరక్షరాస్యతను అలుసుగా తీసుకొని ఆనాడు నా పొలాన్ని ఆనుకొని ఉన్న, నీ రెండెకరాల పొలాన్ని నా పేరుమీద రాయించుకొని నిన్ను ఊరి నుండి గెంటేసాను. క్షమించరాని పాపానికి ఒడిగట్టాను. అయినా నీ కూతురిచేత నా ఒక్కగానొక్క మనవడిని బతికించావు. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ పొలంతోపాటు నీ ఇంటిని మరొక ఐదెకరాల మాగాణిని నీకిప్పుడే ఇస్తాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. మీ పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటిని నేనే కట్టించి ఇస్తాను, దయచేసి కాదనకు అను ప్రాధేయపడ్డాడు.

అప్పుడు కృష్ణయ్య, అయ్యా భూషణం గారు మీరు ఒక విధంగా నాకు మేలే చేశారు. చదువురాని నన్ను మీరానాడు మోసం చెయ్యక పోయి ఉంటే, నాకు చదువు విలువ ఎప్పటికీ తెలిసేది కాదు. ఆనాడు మీరలా చేయబట్టే కసితో నా కూతురును పట్నంలో డాక్టర్ ను చదివించా అన్నాడు.

ఆరు నెలల కాలంలో కృష్ణయ్య పాత ఇంటి స్థానంలో సర్వ హంగులతో నూతన భవనం కట్టించి, కృష్ణయ్య రెండెకరాల పొలంతో పాటు మరో ఐదెకరాల మాగాణి పొలాన్ని కానుకగా ఇచ్చి భూషణం తన మాట నిలిబెట్టుకున్నాడు. తాను ఊరివారందరికీ తలలో నాలుకగా మారి అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.

స్ఫూర్తికి తన తండ్రి తనను అంత పట్టుదలగా ఎందుకు చదివించాడో అప్పుడు అర్ధమయ్యింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!