నేను,నాన్న.. ఓ చీమ కథ..

నేను,నాన్న.. ఓ చీమ కథ..

రచన: ఎన్.ధన లక్ష్మి

నాన్న నాకో ఒక డౌట్  అని ముద్దుగా అడిగింది రమ్య వాళ్ళ నాన్న సూర్య తో అప్పుడే టి. వి లో అతడు మూవీ లో గిరిబాబు ధర్మవరపు సుబ్రహ్మణ్యం తో ” దేవుడా కూతురు ని ఇవ్వమంటే క్వశ్చన్ బ్యాంకు ని ఇచ్చావు అని……
ఈ డైలాగ్ వినపడగానే వాట్ ఆ టైమింగ్ యార్ అంటూ సమీరా పక పక నవ్వింది
నాన్న నేను క్వశ్చన్ బ్యాంకునా! …అమ్మ ఎందుకు నవ్వుతోంది  అని ఏడుపు మూతి పెడుతుంది …
“మా బుజ్జి  కదా! మీ అమ్మ కు ఏమి డౌట్స్ రావు ఎందుకంటే మీ అమ్మ కు బుర్ర అనేది లేదు కాబట్టి ”
” ఏంటి ఏమి అన్నారు?నాకు బుర్ర లేదు అని అంటారా అని కోపంగా చూస్తుంది ”
“నేను జోక్ చేశాలే !నువ్వు నా స్మాల్ గూగుల్ బాక్స్ వి అన్ని గుర్తు ఉంటాయి అని పొగడడం తో సమీరా అసలు విషయం మర్చిపోయి నవ్వుతుంది…
ఇప్పుడు చెప్పు బుజ్జి ఏంటో డౌట్ అన్నావు! నాన్న పాము కుట్టిన , తేలు కుట్టిన విషం మన నోట్ల నుంచి వస్తుంది .ఒక్కోసారి మనం చనిపోతాము కదా …మరి చీమ కుడితే ఏమి కాదు ఎందుకు ….???????నేను టీవీ లో చూసాను.పాము కాటు వేయడం వల్ల మనిషి చనిపోయాడు అని .. ప్లీజ్ నాన్న నా డౌట్ క్లియర్ చేయవా! బుజ్జి నేను నీకు ఒక కథ చెపుతాను విను నీకే క్లారిటీ వస్తుంది ఓకే నా..
ఊరికి కొంచెం దూరంగా ఉన్న ప్రదేశంలో నాలుగు కార్లూ, నాలుగు మోటార్ సైకిళ్ళూ,వచ్చి ఆగాయి.    నలుగురు మనుషులు దిగి ఆ ప్రదేశంలో కొలతలు కొల్చి మార్కింగ్ చేసారు. ఆ నలుగురిలో ఒకతను ‘రేప్పొద్దున్నే కూలీల్ని దింపి ఈ ప్రకారం పనులు మొదలు పెట్టెయ్యండి చెప్పిన ముహూర్తానికి. ఏడాదిన్నర లో ఇళ్ళిచ్చెయ్యాలి.”అని మేస్త్రీ తో చెప్పి రండి పోదాం అని మిగతా వాళ్ళని పిలవంగానే అందరూ కార్లెక్కి వెళిపోబోతూ,ఆగి ,మూలగా ఉన్న ఓ రాయి చూపించి, మేస్త్రీ తో ఏదో చెప్పి వెళిపోయారు.
మేస్త్రీ తనవాళ్ళతో ఎంతమంది కూలీలు రావాలో అన్నీ చర్చించి పని వాళ్ళని తీసుకుని వెళ్లి పోయాడు.
ఆ జాగాలో నివాసం ఉంటున్న చీమ కుటుంబాలన్నీ తల్లడిల్లి పోయాయి. మొన్న మొన్ననే ఇంకో దగ్గర ఉంటున్నవాళ్ళం, ఇక్కడ కొచ్చి ఇంకా పుట్ట పూర్తిగా కట్టుకోనేలేదు, అప్పుడే ఇక్కడిక్కూడా వచ్చేసారు ఖర్మ , అని విసుక్కోవడం మొదలెట్టాయి.
” ఏం చేస్తామర్రా! మన ఖర్మ! మళ్ళీ కొత్త జాగా  వెతుక్కోడమే అంది ఓ బామ్మ చీమ.
” హుఁ! వాళ్ళొస్తే మనం ఎందుకు పారిపోవాలి? కుట్టి చంపేద్దాం”  అంది ఓ విప్లవ చీమ.
” అయ్యో!  అంత అదృష్టం కూడానా మనకి!  మన చీమ జాతికి ఉపకారం చేద్దామని ఒకడూ, పావురానికి ప్రత్యుపకారం చేద్దామని మరొకడూ  ఆలోచించి ఇలా మనం పుట్ట ముంచారు. ” అంది బామ్మ చీమ కోపంగా.
పాత చరిత్ర తెలియని పిల్ల చీమలు ” బామ్మా ! బామ్మా! అప్పుడేం జరిగిందో తెలియదు. చెప్పవా? ” అని సూతుడిని శౌనకాది మునులు అడిగినట్లు అడిగాయి…
బామ్మ ఎత్తు గా ఉన్న ఓ చిన్న రాతి మీద కెక్కి కూర్చుని మొదలు పెట్టింది.
“పూర్వం పాములూ, తేళ్ళూ కుడితే మానవుడు, చచ్చి పోయేవాడు. కానీ మనం కుడితే చచ్చి పోయేవాడు కాదు. అందుకని ఓ చీమ ఘోరమైన తపస్సు చేసింది.
బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ఆ నాలుగు ముఖాలూ, నాలుగు చేతులూ ధగధగా ఆభరణాలూ అవన్నీ చూసి చీమ ఖంగారు పడిపోయి సరిగ్గా ఆలోచించుకోకుండా,”  కుట్టగానే చచ్చి పోయేటట్లు”  వరమిమ్మంది. అక్కడికీ బ్రహ్మ అడిగాడు” ఎవరు” అని. అందులో మెలిక అర్థం చేసుకోలేక పాపం ” మేము” అంది ఈ చీమ.  “తథాస్తు” అని ఆయన అంతర్థానం అయిపోయాడు. ఆ తర్వాత గానీ వరం శాపం అయిందని తెలియలేదు. ” అని నిట్టూర్చింది బామ్మ చీమ. పిల్లచీమలు కూడా నిట్టూర్చాయి.
” మరి పావురాన్ని రక్షించిన చీమ వల్ల ఏమైంది?” అడిగింది చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలంతో ఓ చీమ.
”  చెప్తాను కానీ చాలాసేపయింది పంటికింద కేమీలేక , కొంచెం నీరసం గా ఉంది” అంది బామ్మ చీమ.
చిన్న చీమలు చుట్టూ చూశాయి.ఇందాక వచ్చిన వాళ్ళు తిని విసిరేసిన టిఫిన్ప్ కనబడ్డాయి.గబగబా వెళ్లి కొంచెం ఉప్మా పిసరూ, ఓ చిన్న గారె ముక్కా  మోసుకొచ్చి ఓ ఆకులో పెట్టి ఇచ్చాయి.
బామ్మ చీమ అవి తిని త్రేన్చి మళ్ళీమొదలు పెట్టింది.
” మీకందరికీ పావురం వేటగాడూ కథ తెలుసు కదా?” అంది.
” ఓ తెలుసు! పావురాన్ని చంపబోతుంటే వేటగాణ్ణి కుట్టి పావురాన్ని రష్చించింది ఒక చీమ “అని ఓ బుడుగు చీమ జవాబిచ్చింది.
“హుఁ ఆ చీమే కనక కుట్టక పోయి ఉంటేనా….” అని బామ్మ చీమ నిట్టూర్చింది.
” ఏం? ఏం జరిగేది కుట్టకపోతే? ” అన్నాయి చీమలు ఆత్రంగా.
” కుట్టకపోతే కథ వేరుగా ఉండేది. కుట్టడం వల్ల మన కథ మలుపు తిరిగిపోయింది” అంది బామ్మ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.
” అబ్బా! చెప్పు బామ్మా తొందరగా! కుట్టినందువల్ల మన కథ ఎలా మారిందో” అని అసహనంగా అన్నాయి పిల్లచీమలు.
” చెప్తా! చెప్తా! కుట్టక పోతే వేటగాడికి ఆహారం దొరికి వెళ్ళేపోయేవాడు. కుట్టడం వల్ల పావురం బతికిపోయింది కానీ వేటగాడి కి ఆహారం దొరక్క వాడికి చీమల మీదా పావురాల మీదా కోపం వచ్చేసింది.
వాడు పగబట్టి జంతుజాలాన్నే నాశనం చెయ్యాలని సంకల్పించాడు. అప్పట్లో జంతు జాలం ఎక్కువా మనుషులు తక్కువా. అందుకని వాడి వల్ల అవక తపస్సు చేసాడు.
యథాప్రకారం బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వీడు బోల్డు పద్యాలు పాడి ఆయన్ని పొగిడి ఆఖర్న మాయాబజార్ సినిమాలో ఎస్వీ రంగారావు లాగా తల్లో ఈకలన్నీ ఊగిపోతూ ఉండగ… జంతువులన్నిటినీ చంపగలిగే శక్తి ఇమ్మని ప్రార్థించాడు.
“అప్పుడు బ్రహ్మ  ,అమందానంద కందళిత హృదయారవిందుడై ” అని పెద్ద సమాసం చెప్పినందుకు ఊపిరి తీసుకోవడానికి ఆగింది.
బామ్మా నీకింతింత పెద్ద మాటలు ఎలా తెలుసు ” అంది ఓ బుల్లి చీమ.
” చాలా తరాల మావాళ్ళు ఓ స్కూలు గోడలో కాపురం ఉండేవారు.తెలుగు క్లాసులో ఈ పద్యాలు వినీ వినీ వంశ పారంపర్యంగా మాకూ నేర్పారు ” అంది బామ్మ చీమ …
” అబ్బబ్బా! రామాయణం లో పిడకల వేట ఏమిటి? అసలు విషయం చెప్పనివ్వండి.”అని ఓ చీమ విసుక్కుంది.
” ఇంకేముంది చెప్పడానికి. బ్రహ్మ అన్నాడు కదా”  ఓ వేటగాడా!  నేను  ఈ వరం ఇస్తే  ప్రకృతి కి నష్టం .తద్వారా మీకే నష్టం . ఈ వరం తప్పించి ఇంకోటి కోరుకో అన్నాడు.అప్పుడు వేటగాడు తెలివిగా  మా మానవజాతి విపరీతంగా పెరిగిపోయేటట్టు వరం ఇమ్మన్నాడు. బ్రహ్మ అలాగే వరం ఇచ్చేసాడు, మెలిక తెలుసుకోలేక..
అంతే!మనుష్య జాతి విపరీతంగా పెరిగిపోయింది.  నివసించడానికి ఇళ్ళకి భూమి మీద జాగా లేక ఆకాశ హర్మ్యాలు వచ్చాయి. అందరికీ భూదాహం పెరిగి పోయింది.వీళ్ళ  అరణ్యాలనీ,చెరువుల్నీ దొరువుల్నీ ఆఖరికి శ్మశానాలని కూడా విడిచి పెట్టకుండా ఆక్రమించేసారు. అన్నీ పూడ్చి ఏదో ఒకటి కట్టేస్తున్నారు. అందువల్ల క్రమంగా జంతు జాలం నశిస్తోం ది.వీళ్ళు విచక్షణ లేకుండా ప్రకృతిని నాశనం చేస్తున్నారు అది తమ వినాశనానికి దారితీస్తుందని తెలిసినా సరే.  అలా పూర్వం ఉన్న చీమలు దూరని చిట్టడవులూ కాకులు దూరని కారడవులూ మాయం అయిపోయి, దూరడానికి కాకులూ చీమలమాట అటుంచి పులులూ సింహాలూ కూడా  లేవు, ఈ మానవుడి క్రౌర్యానికి బలయిపోవడంవల్ల. పక్షుల సంగతి చెప్పేఅక్కరలేదు. పాపం !చెట్లు లేక అల్లాడుతున్నాయి. అలా వేటగాడి సంతతి పగ తీర్చు కుంటోంది .” అని భారంగా నిట్టూర్చింది, బామ్మ చీమ.మనసులు భారమైపోగా మిగిలిన చీమలు కూడా నిట్టూర్చాయి.
ఇంతలో తండ్రి చీమలన్నీ వచ్చాయి, ఆతృతగా. ” ఏమిటీ ! అవతల కొంపలు మునిగి పోతుంటే కథలు చెప్పుకుంటూ కూర్చున్నారా! లేవండి!లేవండి! ఎవరు తీసికెళ్ళ గలిగిన ఆహారం వాళ్ళు పట్టుకుని బయల్దేరండి. ముసలి వాళ్ళూ పిల్లలూ ముందు, పదండి. మేం వెనకనించి వస్తాం ” అని తొందర పెట్టాయి.
బామ్మ చీమ ” ఒరే!బతికినన్నాళ్ళు బతకను. నేను నడవలేను . ఆ మూల ఉన్న రాయి చూశావా! వాస్తు ప్రకారం అక్కడే ఉండాలి, దాన్ని తియ్యొద్దని  చెప్పడం విన్నాను.అందుకని దానికింద తలదాచుకుంటాను, మీరందరూ క్షేమంగా వెళ్ళండి, ” అని రాతి వైపు నడవడం మొదలెట్టింది.
మిగతా చీమలన్నీ భారంగా  బామ్మ కి వీడ్కోలు చెప్పి వలసపోడానికి సిద్ధమయ్యాయి ,వేటగాణ్ణి తిట్టుకుంటూ.
వామ్మో నాన్న ఇంత కథ ఉందా???
అవునురా కన్నా!నీకు తెలుసా బుజ్జి తల్లి చీమ లు మనకు ఎన్నో విలువలు నేర్పిస్తాయి ..
అవునా ! అవి ఏంటి నాన్న .?
” క్రమ శిక్షణతో ఉండాలి అని, ఎపుడు రేపటి గురించి  జాగ్రత్త పడమని, పొదుపుగా ఉండాలని చెపుతాయి.
“అవును నాన్న ! నేను కూడా చూసా అందుకే కదా అవి ఫుడ్ ని తీసుకువెళ్లడం అది కూడా ఒక లైన్ లో  ఇట్స్ ఆసమ్ నాన్న. మరి షుగర్ అదే కాదు స్వీట్స్ ఎక్కడవున్నా చీమలు ఎందుకు ఎక్కువ ఉంటాయి నాన్న ”
బుజ్జి స్వీట్స్ ఆర్ షుగర్ అనేది మన మనీ అనుకో ఎలా అయితే చీమలు స్వీట్స్ ఉన్నప్పుడు చుట్టూ ఉంటారో అలాగే బంధువులు కూడా మన చుట్టూ డబ్బు ఉన్నప్పుడే పక్కన ఉంటారు లేదు అంటే లేదు నీ దగ్గర ఏమి లేకపోయిన నీ  తోడు విడవకుండా ఉంటారో వాళ్ళ తోనే ఉండాలి.వారి తోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి అర్థం అయిందా బుజ్జి
హా నాన్న !
తమరి డౌట్స్ క్లియర్ అయితే రండి మనం కలిసి భోజనం చేదాం అని సమీరా పిలవడం తో వారు తినడానికి వెళ్తారు.అల భోజనం చేస్తూ కూడా రమ్య అడిగే డౌట్స్ చెప్తున్న సూర్యని అపురూపమంగా చూసుకోన్ని మురిసిపోతుంది సమీరా..

_______________

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!