అమ్మ కల! నాన్న ఆశయం!

అమ్మ కల! నాన్న ఆశయం!

రచన: కవి రమ్య

“శుభోదయం బంగారు! అప్పుడే కదులుతున్నావు. ఆకలేస్తోందా? ఆగాగు. నీకు నచ్చిన దోస వేస్తున్నాను.తిన్నాక, ఎలా ఉందో చెప్పాలి!” అని మాట్లాడుతున్న తన అమ్మ సంగీత గొంతు వినగానే తన గర్భంలో ఎదుగుతున్న తొమ్మిది నెలల పసికందు గిర గిరా తిరిగింది.

అమ్మ హృదయస్పందన వింటూ గర్భాలయంలో ఊగిసలాట మొదలెట్టింది. దోస తినగానే తన అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పాలని ఉబలాటపడుతూ చిన్ని వేళ్ళతో స్పర్శించింది. ఆ తల్లికి బిడ్డ స్పర్శ పేగు బంధం ద్వారా తెలియగానే ఉబ్బితబ్బిబైంది.

“నాన్నా! అమ్మా! చూడండి బొజ్జలో ఉన్న బేబీ ఎలా కదులుతూ ఉందో. దోసలు నచ్చాయట” అని కన్నవాళ్ళతో అంది.

“అబ్బాయి వచ్చేస్తాడన్నాడు. ఇంకా రాలేదేంటి. లీవ్ పెట్టుకున్నాడా? ఎప్పుడైనా నొప్పులు రావచ్చు అని డాక్టర్ అన్నారు కదా” అన్నారు సంగీత నాన్న శేఖర్

“ఏదో అత్యవసర దేశ సురక్షిత సమస్య రావడంతో మళ్ళీ సెలవులు రద్దు చేసేసారు” అని నిట్టూర్చింది.

“ఇలా డీలపడిపోతే ఎలారా బంగారు? నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా బాధపడతుంది. ధైర్యంగా ఉండాలి. ఏరి కోరి చేసుకున్నావుగా. మరి సైనికుడి భార్య అంటే ఎంత గుండె ధైర్యంతో ఉండాలి చెప్పు” అని సంగీత అమ్మ రత్నం ధైర్యం చెప్పి తలకి జడ వేసింది.

శేఖర్ భక్తి టీవీ పెట్టగా, సంగీత రిమోట్ లాక్కుని “నాన్నా! నా బేబీ కూడా రేపు వాళ్ళ నాన్నలాగా దేశ సేవ చేయాలి. నాకేమో వాళ్ళ నాన్న పొలికలతో అబ్బాయి కావాలి మరి మా ఆయనకు నాలాంటి అమ్మాయి. ఎవరు పుట్టినా మన దేశానికి సేవ చేయాల్సిందే” అని చెబుతూ ఓ సైనికుడి సినిమా చూస్తుండగా ఫోను మోగింది.

రత్నం ఫోనులోని వార్త విని గుండె పట్టుకుంది. శేఖర్ కి సైగ చేసి పక్కకి రమ్మంది.

“ఏమైంది?”

“అదీ…మరీ…అల్లడు… తీవ్రంగా గాయపడ్డారు అంట. విద్రోహులు దొంగ దెబ్బ తీసారు అంటున్నారు. మీరొకసారి వెళ్ళిరావాల్సిన అవసరం ఉంది” అని నవ్వుతున్న కూతురి వంక మరియు కడుపులో ఉన్న బిడ్డ వంక చూసింది.

“మనమ్మాయిని చూసుకో. అల్లుడిని నేను తీసుకొస్తాను. ఆ అబ్బాయికి అన్నీ మనమేగా!” అని హడావుడిగా బయల్దేరుతూ “మా స్నేహితుడికి ఒంట్లో బాలేదు సంగీత! వెళ్లొస్తాను” అన్నాడు.

“నాన్నా! ఆయన బ్రతికున్నారా లేక” అని పంటిబిగువున బాధని అపుకుంది.

“లేదమ్మా! గాయాలు అయ్యాయి అంతే” అని కూతురి కళ్ళలో కన్నీళ్ళు చూడలేక వెళ్లిపోయారు.

మరుసటి రోజు…

శేఖర్ అస్థిమిత స్థితిలో ఉన్న సంగీత భర్త పృథ్వితో ఇల్లు చేరాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉన్నట్టుండి భయపడింది. “అమ్మా! ఏమైంది? నీ గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటోంది. నేను భరించలేకపోతున్నాను. ఏడుపొస్తోంది. నువ్వు ఏడుస్తున్నావా? నాన్న ఏరి? వచ్చేసారా! అయితే నువ్వు నవ్వాలి కదూ. మరి ఎందుకు బాధ పడుతున్నావు?” అని కదిలి గుండుతో రుద్దింది.

అప్పుడుగానీ సంగీతకి గుర్తు రాలేదు తనలో మరో ప్రాణం ఉందని. బాధని ధైర్యంతో పక్కకి మళ్లించి ప్రేమగా కడుపు నిమిరి “కంగారుపడకు రా కన్నా! ఏం కాలేదు. నాన్న వచ్చారు కాకపోతే అలసిపోయారు. కొద్ది నెలల్లో అంతా సర్దుకుంటుంది” అంది. అది విన్న పసికందుకి సాంత్వన కలిగింది. నిదురలోకి జారింది.

పృథ్వి ప్రాణం ఉన్న బొమ్మలా అయిపోయాడు. ఉలకడు, పలకడు. డాక్టర్లు “పోరాటంలో జరిగిన తీవ్ర మానసిక ఒత్తిడి మరియు దొంగ దెబ్బ తీసి మెరుపు దాడి చేయడం వల్ల అతని మానసిక స్థితి దెబ్బతింది. ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేము” అన్నారు.

అది విన్న సంగీత ఇక తట్టుకోలేకపోవడంతో తన శరీరంపై ఒత్తిడిపడింది. పురిటి నొప్పులు మొదలయ్యాయి. “అమ్మా! నేను వస్తున్నాను. ఎవడు మా నాన్నని ఇబ్బంది పెట్టింది. వాడిని వదలనమ్మా! నేను ఈ మట్టి మీదే పుడతాను. దేశంకోసమే బ్రతుకుతాను. నాన్న ఆశయం, నీ కోరిక నెరవేరుస్తాను. కానీ దానికన్నా ముందు నువ్వు ఈ యుద్ధం చేయక తప్పదమ్మా! పోరాడి గెలువు” అని అమ్మ గర్భాలయంలో ఆఖరిసారిగా పలికింది.

బయటకిరాగానే షఠారి వాయువు పీల్చి కడుపులో జరిగింది మరిచినా ఆ బిడ్డ దేశం పై తెలియని ఇష్టం పెంచేసుకున్నాడు.

తన బిడ్డ భరత్ అనే నామధేయం ధరించాడు. తనలోని దేశ భక్తి చూసిన పృథ్వికి మానసిక స్థితి మెరుగయ్యింది. భరత్ ని విద్రోహులకి సింహస్వప్నంగా మారి ఎందరో భారతీయుల ఆశీర్వాదాలు అందుకున్నాడు. ఉగ్రవాదం అన్న పేరు వింటేనే ఇతని రక్తం మరిగిపోతుంది.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!