తొలిప్రేమ

(అంశం::” ప్రేమ”)

తొలిప్రేమ

రచయిత :: నాగ మయూరి

మానస అంతులేని మనోవేదనతో శూన్యం లోకి చూస్తూ కూర్చుంది. ఎందుకో ఎంత ప్రయత్నించినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా తన జీవితం లో ఈరోజుని ఆమె మర్చిపోలేదు.అవును “తొలి ప్రేమ” మాధుర్యాన్ని మర్చిపోవటం ఎవరికి మాత్రం సాధ్యం?

అవి మానస చదువుకునే రోజులు. ఊర్లో పదవ తరగతి వరకే ఉండటంతో, కాలేజ్ చదువుల కోసం దగ్గరలోని పట్టణానికి వెళ్ళాలి. అలా మానస ప్రతిరోజూ తన స్నేహితులతో కలిసి బస్ లో కాలేజ్ కి వెళ్ళేది.

కో-ఎడ్యుకేషన్ కాలేజ్ పైగా చుట్టుపక్కల పల్లటూర్లు అన్నింటికీ ఒక్కటే కాలేజ్ కావడంతో ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది.

మానస చక్కగా చదువుకుని అన్నింటిలో తానే విజేతగా నిలిచేది. చదువులకు సరస్వతి అయితే చూపులకు లక్ష్మీ దేవిలా అందంగా ఉండేది.మంచి నడవడిక,మాటతీరు ఇలా అన్నింట ఆమెకు ఆమె సాటి.
మానసలో ఉన్న ఈ లక్షణాలన్నింటినీ కాలేజ్ లో చేరిన మొదటిరోజు నుంచి మౌనంగా గమనిస్తున్న వ్యక్తి ‘రహీమ్’. అతడికి మానస అంటే ఏదో తెలియని అభిమానం.ఎలాఅయినా తనతో మాట్లాడాలని,స్నేహం చేయాలని ఆరాటపడుతూ ఉండేవాడు.
రహీమ్ ఓ బాధ్యతగల యువకుడు. తల్లిదండ్రులు పెళ్ళయిన ముప్పై సంవత్సరాలకి లేక లేక కలిగిన ఏకైక సంతానం. అలా అమ్మ, నాన్న లు ఇద్దరు పెద్దవాళ్ళు కావడంతో రహీమ్ వారికి అన్ని విధాలుగా సహయం చేస్తూనే చదువుకునే వాడు.

చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. రహీమ్ తను మానస పెంచుకున్నది అభిమానం కాదు ప్రేమ. ఆమె ఎప్పుడూ అతనితో స్నేహితురాలులా మాత్రమే మాట్లాడేది. ఇంటి బాధ్యతల వలన చదువుకునే సమయం సమయం దొరకట్లేదని తెలిసి,మఖ్యమైన విషయాలతో నోట్స్ ప్రిపేర్ చేసి రహీమ్ కి ఇచ్చేది.తను చూపించే అభిమానానికి రహీమ్ కి ఆమె పట్ల మరింత ఆరాధనా భావం ఏర్పడింది.

రహీమ్ ఒకరోజు తన చిన్ననాటి స్నేహితురాలు, ఇప్పుడు మానసకి తనకి కామన్ ఫ్రెండ్ అయిన స్వప్న ద్వారా తన ప్రేమ విషయాన్ని మానసకి చెప్పేస్తాడు.

స్వప్న మాటలు వింటూనే మానస ముఖం రౌద్రంగా మారిపోతుంది. అసలు నాగురించి ఏమనుకుంటున్నారు? “జాలితో నోట్స్ రాసిస్తే కృతజ్ఞత చూపాల్సింది పోయి ప్రేమ”! అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే ప్రేమించడానికి సిద్దమనేనా? చెప్పమనడానికి అతనికి బుద్దిలేక పోతే నీకైనా ఉండద్దా అంటూ స్వప్పని బాగా తిట్టింది. ఆరోజు నుంచి మానస ,రహీమ్ తో మాట్లాడటం మానేసింది.

అలా సంవత్సరం గడిచింది. రహీమ్ మాత్రం మానసని ప్రేమిస్తూనే ఉన్నాడు. అనవసరంగా తొందరపడి మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసుకున్నానని అతను బాధ పడని రోజులేదు. ఈ ఆలోచనలలో పడి రహీమ్ చదువులో వెనకపడ్డాడు. సెకండియర్ లో సబ్జెక్ట్ లు ఉండిపోయాయి. ఇంక ఈ సంవత్సరం అయితే క్లాస్ లో కూర్చుంటున్నాడే కానీ తన మనసు తనలో లేక పాఠాలు చెవికెక్కట్లేదు.

రహీమ్ ని అలా చూస్తూ తట్టుకోలేని ఒక స్నేహితుడు ఓ సలహా ఇచ్చాడు. ” నీ ప్రేమని ఎవరితోటో ఆ అమ్మాయికి చెప్పించటం కాదు, నువ్వే వెళ్ళి నీ మనసులో మాట చెప్పు” ఆ అమ్మాయి ఒప్పుకుటుంది ఏమో! ఆ మాటలు రహీమ్ కి ఊపిరి పోసాయి. నిజంగా ఒప్పుకుంటుందా అన్నాడు. “ప్రేమించిన మాటే ధైర్యంగా చెప్పలేని వాడివి తనని జీవితాంతం ఎలా చూసుకోగలవనే భయంతో కాదంది ఏమో ఓసారి ఆలోచించి చూడు అంటూ అక్కడి నుంచి బయలదేరాడు.

రహీమ్ కి స్నేహితుడి మాటలు నిజం అనిపించి, ఎలా అయినా మానసతో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు.
ఆఖరి సంవత్సరం పరీక్షలకి సరిగ్గా నెలరోజుల సమయం ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. మానస పరీక్ష పూర్తిచేసి వచ్చే సమయానికి రహీమ్ భయట ఎదురుచూస్తూ నుంచున్నాడు.
మానస ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అంటూ పిలిచాడు.వేగంగా నడుస్తున్న మానస ఏంటి అన్నట్టు ఆగి చూసింది. వెంటనే రహీమ్ మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మానస ఈ మాట నీతో ఇలా చెప్పే ధైర్యం లేక స్వప్నతో చెప్పించాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుని జీవితాంతం నిన్ను నాకంటి పాపలా చూసుకుంటాను అంటూ ముగించాడు.
చూడు రహీమ్ నాకు ఇలాంటివి ఇష్టం ఉండవని ఆ రోజే స్వప్నకి చెప్పాను.ఇప్పుడు నీకు అదే చెబుతున్నాను. అయినా “మనం కాలేజ్ కి వచ్చేది చదువుకోవటానికి కానీ ఇలా ప్రేమ,దోమ అంటూ జీవితాన్ని తగలేసుకోడానికి కాదు”. ముందు నువ్వు ఈ నెలరోజులయినా కష్టపడి చదువు.నా గురించి కాదు నీ తల్లిదండ్రులు గురించి ఆలోచించు అనిచెప్పి వెళ్ళబోతుంటే….రహీమ్ నీళ్ళు నిండిన కళ్ళతో మానస ప్లీజ్ ఇంకొక్కసారి ఆలోచించూ అనగానే. మానస ఛీ ఇంత చెప్పిన నువ్వు మారవా! నిజంగా నువ్వు నన్ను ప్రేమించుంటే జీవితంలో ఇంకెప్పుడూ నీమొఖం నాకు చూపించకు అనిచెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మానస కి ఇప్పుడు వివాహమయ్యి ఇరవై సంవత్సరాలు గడిచింది. భర్తకు లేని వ్యసనం లేదు
కనీసం పిల్లలు లేరు.ఆ రోజు రహీమ్ ప్రేమ మానసకి అర్థమైనా, అంతకుమించిన ప్రేమ ఆమె మనసులోను ఉన్నా పెద్దలకి భయపడి మనసులో మాటని భయటపెట్టకుండా కఠినంగా మాట్లాడుతూ రహీమ్ ని బాధ పెట్టింది.

ఆతర్వాత రహీమ్ ఎలా ఉన్నాడో తెలియదు కానీ మానస మాత్రం ఆరోజు తను చేసిన తప్పుకి ఈరోజుకి శిక్ష అనుభవిస్తూనే ఉంది. అందుకే రహీమ్ తనతో మాట్లాడిన రోజుని మర్చిపోలేక ఇలా శూన్యం లోకి చూస్తూ గడిపేస్తోంది.

హమీపత్రం:- ఈ కథ నా స్వీయ రచన అని తెలియజేస్తున్నాను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!