ఏ చిలిపి కళ్ళలోని కలవో

(అంశం:”తుంటరి ఆలోచనలు”)

ఏ చిలిపి కళ్ళలోని కలవో

రచన: రమాదేవి బాలబోయిన

బెంగళూరులో ఒక ఫేమస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు రాఘవ. అందరిలో చాలా ప్రతిభ గలవాడిగా పేరుతెచ్చుకున్నాడు. మేనేజ్మెంట్ నుండి కొలీగ్స్ దాకా రాఘవని అభిమానించేవారే అందరూ. ఎప్పుడూ చిన్న రిమార్క్ రాకుండా పనిచేసే రాఘవ ఆరోజంతా పరధ్యానంగా ఉన్నాడు.

ఆ రోజంతా పనిచేసి అలసిపోయినా సాయంత్రానికి త్వరత్వరగా ఇల్లు చేరాలనే ధ్యాసే రాఘవని ఒక్కచోట నిలవనీయడంలేదు. తనువంతా ఒక తుళ్ళింతలాగుంది. మనసంతా తీయతీయని మధురోహలతో నిండిపోతోంది. ఎప్పుడెప్పుడు ఇల్లు చేరతానా అనే తహతహ అతనిలోఅంతలా అల్లుకుపోవడానికి కారణం రెండేళ్ళ క్రితం నుండి ఇప్పటివరకు జరిగిన సంఘటనలు చెప్పుకోవాలి మరి.

******. ******. *****
చిన్నప్పటి నుండి ర్యాంకులకోసం పోటాపోటీగా పోటీ పడుతూ చదువు తప్ప వేరే ధ్యాసంటూ లేకుండా పెరిగాడు రాఘవ.

హైస్కూల్ లో చదువుతున్న రోజుల్లో తోటి విద్యార్థులు అతన్ని తమ జట్టు లో కలుపుకోవడానికి విశ్వప్రయత్నం చేశారు. విశ్వామిత్రునిలా ఏమాత్రం చలించలేదు. టీనేజీ లోనే చెక్కుచెదరని మనసున్న రాఘవ తరువాతి కాలంలో అదే బాటలో పయనించాడు. అన్నింటా అందరూ మెచ్చుకునేన్ని విజయాలు అధిరోహించాడు. అందరూ అతనిని ఒక వింతగా చూసేవారు. చాలామంది ఆరాధించే వారు.
చదువు పూర్తైంది,ఊహించనంత చక్కని ప్యాకేజీ తో బెంగళూరులో ఉద్యోగం. అన్నాళ్ళుగా తనదైన ప్రపంచంలో ఉండిపోయిన రాఘవకిపుడు కొత్తలోకంలోకి అడుగుపెట్టిన ట్లనిపించసాగింది. ఇన్నాళ్ళు లోకాన్ని కేవలం చూసే అతనిపుడు తన కొలీగ్ పూర్ణిమతో పరిచయమయ్యాక ఆస్వాదించసాగాడు.

ఇప్పుడతనికి చల్లని రాత్రులు ఆమె జతలో వెచ్చగా మారిపోయేవి. వెన్నెల రాత్రులు, వానాకాలపు పగళ్ళు, రసవంతంగా మారిపోయే వి. ఆరునెలల పరిచయంలో అన్నీ నిద్రలు కాచిన మెలకువలే. అది ఇరుపెద్దల అంగీకారంతో వివాహ బంధం గా మారిపోయింది. కొత్త కొత్త బాధ్యతలు పరిచయమవసాగాయి. అన్నింటినీ తొలిసారి చూస్తూ జీవితమాధుర్యపు అంచులదాకా అలాగే ఉండాలని కోరుకోసాగాడు. రోజులు నెలలుగా,నెలలు సంవత్సరాలుగా మారినా ఆస్వాదనలో మరింత నేర్పరి గా మారాడు.

అంతలో ఓరోజు హాస్పిటల్ నుండి ఫోన్ కాల్
ఆఫీసునుండీ అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్ చేరుకున్న అతనికి పూర్ణిమ తీపికబురు చెప్పింది. అతడు తండ్రి కాబోతున్నాడనీ.

చంటిపిల్లాడిలా ఎగిరిగంతేసాడు. భార్యను అరచేతులమీద నడిపించినంత సందడి చేసాడు. కోరిన వన్నీ తీర్చాడు. తొమ్మిది నెలలు గడిచి ప్రసవానికి వెళుతున్న భార్యను కూతురి ని అత్తారింటికి పంపిన తల్లిలా సాగనంపాడు.కానీ అక్కడి వాతావరణం సరిపడక రెండో రోజునే బెంగళూరు వచ్చేసింది పూర్ణిమ.

****. *****. *****
ఈరోజే పూర్ణిమ డెలివరీ డేట్… అనుకోకుండా అదేరోజు సడెన్గా ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ అంటూ ఆఫీసులో తప్పనిసరిగా ఉండాలని మేనేజ్మెంట్ ఒత్తిడి. దానితో పూర్ణిమను హాస్పిటల్ లో చేర్పించి ఆఫీస్ కి చేరుకుని పని బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడు. మేనేజ్మెంట్ అతనికి బెస్ట్ ఎంప్లాయ్ గా గుర్తించి ప్రశంసించారు. అప్పుడే పూర్ణిమ వారసుడికి జన్మనిచ్చిందనే తీయని కబురందింది. ఇక భర్తగా, తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించేందుకు, రాఘవ ఆగమేఘాలపై పయనమయ్యాడు. తన కంటిపాప నీ,చంటిపాపడినీ మనసంత కళ్ళు చేసుకొని చూసుకుని మురిసిపోవాలని.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!