అవసరం

అవసరం

రచన: శ్రీదేవి విన్నకోట

“ఉద్యోగం చేస్తూ, ఇంటి పనులు చేయలేక పోతున్నాను అమ్మ” ఉద్యోగం మానేద్దాం అంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న గవర్నమెంట్ ఉద్యోగం, అసలు మానాలని లేదు, ఫోన్లో తల్లితో తన గోడు వెళ్లబోసుకుంది సుమతి. మీ ఆయన్ని కాస్త పనులలో సహాయం చేయమను, సలహా ఇచ్చింది తల్లి రుక్మిణి. పాపం ఆయన చేయాలన్నా ఆయనకి అసలు ఖాళీ ఉండదు, ఆయన చేసేది ప్రైవేట్ కంపెనీ కావడంవల్ల విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత కూడా
ఆ లాప్టాప్ లో వర్క్ చేస్తూనే ఉంటారు పాపం ఆయనకి ఇంట్లో పనులు చెప్పలేను అమ్మ, అత్తయ్యకేమో ఒకరోజు బాగుంటే మరో రోజు ఒంట్లో బావుండదు, ఆవిడని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అంది సుమతి, పోని ఇంట్లో పని చేయడానీకి ఎవరైనా మంచిగా నమ్మకంగా ఉండే పని మనిషిని పెట్టుకోండి, సలహా ఇచ్చింది రుక్మిణి కూతురికి,
అదే చూస్తున్న అమ్మ ఇప్పుడు వచ్చిన చిక్కు అదే కదా ఇద్దరం పొద్దున్నే వెళ్ళిపోతాం, అత్తయ్య ఇంట్లో ఒక్కరే ఉంటారు. బాబేమో నాలుగింటికి ఇంటికి వచ్చేస్తాడు, వాడు బాగా చిన్నోడు, కొత్తగా చేరే పని వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో తెలియదు, అయినా ఆయనకి అత్తయ్యకి పని మనుషులు అంటే ఇష్టం ఉండదు. మన పని మనమే చేసుకోవాలి అంటారు, చస్తున్నా అనుకో వీళ్ళతో, అంటూ తల్లి దగ్గర బాధపడింది సుమతి, సరేలే నువ్వు ఎక్కువ ఆలోచించి బాధపడకు, అసలే ఒట్టి మనిషివి కూడా కాదు, జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో లో ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం, మీ నాన్న గారు పిలుస్తున్నారు మళ్ళి చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది రుక్మిణి, సుమతికి ఈ మధ్యనే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఒంట్లో బాగోలేని అత్తగారు, ఐదేళ్ల చిన్నబాబు, బాగా బిజీగా ఉండే భర్తతో, ఆమెకు ఇంట్లో  పనులు చేసుకోవడం కష్టంగా ఉంది, బయోమెట్రిక్ సిస్టం కావడంతో ఆఫీస్ కి టైం కి వెళ్ళాలి, లేదంటే ఒక పూట ఆబ్సెంట్ పడిపోతుంది, దానికి తోడు తనకి ఇప్పుడు మూడో నెల, డాక్టర్లు కొంచెం రెస్ట్ గా ఉండాలని చెప్పారు, కొత్తగా వచ్చిన ఉద్యోగం కావడం వల్ల అంతగా సెలవులు పెట్టడానికి కూడా లేదు, అందుకే ఇంతగా బాధపడుతుంది. భర్త శ్రీధర్ కి ఈ విషయం చెప్తే నీకు అంత కష్టంగా అనిపిస్తే ఉద్యోగం మానేసి దగ్గర ఉండి బాబుని అమ్మ ని జాగ్రత్తగా చూసుకో, ఇలాంటి సమయంలో నువ్వు విశ్రాంతిగా ఆరోగ్యంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలి, లేదా ఏదో ఒక రకంగా డెలివరీ అయ్యే వరకు సెలవు పెట్టడానికి కుదురుతుంది ఏమో చూడు అంటాడు, నెలలు నిండాక ఎలాగో మెటర్నటీ లీవ్ ఉంటుంది, సెలవులు ఇప్పటినుంచే ఎందుకు అని అనిపిస్తుంది తనకి,
చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయడం తన కల, ఉద్యోగం వచ్చి విధి సహకరించిన ఏంటో తన పరిస్థితి అని వాపోయింది, అలా ఒక వారం రోజులు గడిచిన తరువాత ఆదివారం నాడు రుక్మిణి కూతురు సుమతికి ఫోన్ చేసింది. చెప్పమ్మా అంది సుమతి, మన వీధిలో ఉండే కాంతం తెలుసుగా నీకు, నువ్వు అత్తా అని పిలిచే దానివి చాలా మంచి మనిషి, ఆమె ఒక్కతే ఉంటుంది ఒంటరిగా, నలుగురు పిల్లలు ఉన్న ఆమె పిల్లలు ఎవరూ పట్టించుకోవడం లేదు, ఆమెకు ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు, పాపం తనకి తానే పని చేసుకుంటూ కష్టపడి బతుకుతుంది, ఆమెతో మాట్లాడాను, మీ ఇంటికి వచ్చి ఉండడానికి ఒప్పించాను, కష్టం వచ్చి ఇలా రావడానికి ఒప్పుకుంది కానీ చాలా ఆత్మాభిమానం గల మంచి మనిషి, నువ్వు ఆమెను నన్ను ఎలా చూసుకుంటావో అలాగే బాగా చూసుకోవాలి ఆమె పిల్లల ప్రేమ కి దూరమై ప్రేమ రాహిత్యంతో బాధపడుతుంది ఆ ప్రేమను నువ్వు ఆమెకు ఇవ్వాలి అంటూ ఈ విషయం గురించి మీ ఆయనతో ఆలోచించి ఏమన్నారో నాకు చెప్పు  అంటూ ఫోన్ పెట్టేసింది అమ్మ, సుమతి భర్తకి అత్తగారికి విషయం చెప్పింది, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు నీ ఇష్టం అన్నారు. తల్లికి సరే అని విషయం చెప్పిన మరో వారం రోజుల్లోనే అలా కాంతం  సుమతి వాళ్ళ ఇంటికి చేరింది. అన్ని విషయాల్లో సుమతికి అండగా చేదోడువాదోడుగా ఉంటూ, కొన్ని రోజులకే ఇంట్లో మనిషిలా అదే తన సొంత కుటుంబం అన్నట్టుగా వారితో కలిసిపోయింది, ఇప్పుడు సుమతి తన పని తాను ప్రశాంతంగా చేసుకోగలుగుతుంది, కాంతమ్మను తన అమ్మలాగే చూసుకుంటూ ప్రేమగా ఆమె అవసరాల్ని ఆరోగ్యాన్ని పట్టించుకుంటూ, అలా సుమతి సమస్య పరిష్కారం అయిపోయింది. ఒక్కోసారి అవసరం కోసం మనుషులు కలిసినా ఎదుటి వ్యక్తులకు మనం ప్రేమను చూపిస్తే మళ్లీ ఆ ప్రేమే మన చెంతకి తిరిగి వస్తుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!