కంటిపాప

కంటిపాప

రచయిత ::  కమల’శ్రీ’


“రేయ్… ఈ అమ్మాయే రా మనం చూసింది!.”

“అవును రా. ఈ అమ్మాయే.”

“ఏ మాటికి ఆ మాటే చెప్పుకోవాలి. పిల్ల ఫోటో లో కంటే బయటే బాగుంది రా.”

“నిజమే రా. వాడేవాడో ఫోటో సెన్స్ లేని వాడు తీసినట్టున్నాడు ఆ ఫోటో. అందులో కంటే బయటే సూపర్ గా ఉంది.”

“అవును రా. ముఖాన్ని క్లారిటీ లేకుండా తీశాడు ఎవడో.”

“అలాగే ఉంటాయి రా. సెల్ఫీ కదా అందులోనూ రాత్రి తీసినట్టు గా ఉంది. అందుకే అలా ఉంది.”

“నిజమే రా. సెల్ఫీ లో కాకుండా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంటుంది. అడిగి చూద్దామంటావా.”

“ఇప్పుడు కాదు లేరా పక్కనే ఎవరో ముసలి వాడు ఉన్నాడు కదా. ఆ పిల్ల అడ్రెస్ ఎక్కడో కనుక్కుని వెళ్లి అడుగుదాం.”

“అడ్రెస్ ఎందుకు రా. కింద ఫోన్ నంబర్ ఉంది. దానికి ఫోన్ చేసి రేట్ కనుక్కుందాం.”

వాళ్ల సంభాషణ వింటుంటే ఒళ్లు గగుర్పొడించింది వేద కి. ఎవరి కోసం వీల్లింత చీప్ గా మాట్లాడుకుంటున్నారు.అయినా ఒక ఆడ పిల్ల కోసం ఎలా మాట్లాడుతున్నారో. వాళ్ల అమ్మా నాన్నా నేర్పిన సంస్కారం ఇదేనా. ఏం మనుషులో ఏంటో?!.” అనుకుంటూ ఉండగా “వేదా! ఇంకా బస్ రాలేదా అమ్మా?!.” అన్నాడు ఆమె తండ్రి. ఆయన పుట్టుగుడ్డివాడు.

“లేదు నాన్నా. రాలేదు.’” అని బస్ కోసం రోడ్ వైపు చూస్తుండగా ఆమె ఫోన్ మ్రోగింది.

“హలో! ఎవరూ?.” అంది రోడ్ వైపు చూస్తూనే.

“హేయ్ పాపా. నీ రేటెంతా?!.”

“వాట్ ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మీరూ?!.” అంది కోపం గా.

“ఓష్ ఏం మాట్లాడుతున్నామా. నీ ఫోటో ని పోర్న్ సైట్ లో అప్లోడ్ చేసి, కింద ఫోన్ నంబర్ ఇచ్చి ఏం మాట్లాడుతున్నారు అంటుంది రా పెద్ద పతివ్రత లాగా.” అంటూ వేద వైపు చూసి వెకిలి నవ్వు నవ్వాడు వాడు.

‘అంటే వాళ్లిద్దరూ ఇంతసేపూ మాట్లాడింది నాకోసమేనా?!. కానీ నా ఫోటో ఎలా…?’అనుకుంటూ ఉండగా “ఏంటి పిల్లా పక్కన ముసలోడు ఉన్నాడనా. తర్వాత చేస్తాం లే?. అప్పుడు చెప్పు నీ రేటెంతో?!.” అంటూ ఫోన్ పెట్టేశాడు వాడు. ఇంక వేద కి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు.

‘నాన్నా బస్సు వచ్చేసరికి ఆలస్యం అయ్యేలా ఉంది. మనం ఆటోలో వెళ్లిపోదాం.” అంది.

“ఎందుకమ్మా! డబ్బులు  దండగా. కాసేపు ఆగుదాం లేం. బస్సులోనే వెళ్దాం లే.” అన్నాడు తండ్రి రామయ్య.

“అయితే అవ్వనీ నాన్నా. అసలే షుగరు. వేలకి తినకపోతే మీ ఆరోగ్యం ఏమౌతుంది?.” అంటూ అటుగా వస్తున్న ఆటో ఆపి అడ్రెస్ చెప్పింది.

ఆటో వెళ్దుందే గానీ ఆమె మాత్రం మాటి మాటికీ వెనక్కి చూస్తూనే ఉంది. ఎక్కడ ఇందాక చేసిన వాళ్లు వెనకే ఫాలో అవుతున్నారేమోనని. అసలు తన ఫోటో అలాంటి సైట్ లో ఎలా. అని అనుకుంటూ ఉండగా మరోసారి ఫోన్ మ్రోగింది.

“ఏయ్ అమ్మాయ్ చాలా బాగున్నావు. నీ ఎత్తు పల్లాలు అయితే ఇంకా బాగున్నాయి. ఓ ఫైవ్ డేస్ కి ఎంత తీసుకుంటావో చెప్పు.” అంటూ అవతలి వ్యక్తి అంటుంటే కన్నీటిని అదుపు చేసుకోలేక, బాధని ఎలా వెళ్ల గక్కాలో తెలీక మనసులోనే కుమిలిపోయింది.

” అమ్మా వేదా. ఇప్పటికే నీకు చాలా ఖర్చు అవుతుంది నా వల్ల. నీ పదేళ్ల వయసప్పుడు మీ అమ్మ చనిపోయింది. చిన్న  టీ దుకాణం లో పని చేస్తూ వచ్చే డబ్బులతో ఇంటిని నెట్టుకుని వచ్చావు. కష్టపడి డిగ్రీ చదివి పాస్ అయ్యి ఓ ప్రైవేట్ కంపెనీలో  ఉద్యోగం సంపాదించావు. ఉదయం అంతా ఉద్యోగం చేసి వచ్చినా సాయంత్రం నాకేం కావాలంటే అది స్వయంగా చేసి పెడతావు. ఇప్పుడేమో నాకు ఇష్టమైన శాస్త్రీయ సంగీత కార్యక్రమం రవీంద్ర భారతిలో అవుతుందని తెలిసి అక్కడకు తీసుకుని వెళ్లావు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నా కంటిపాప వి అయి నా అమ్మలా మారావు. నీకేం చేసి ఈ తండ్రి ఋణం తీర్చుకోగలడు చచ్చి నీ కడుపున పుట్టడం తప్పించి.” అంటూ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన దారి పొడుగునా. కానీ అవేవీ వినిపించుకునే స్థితిలో లేదు వేద. దారి పొడవునా ఆమెకి ఏదో ఓ ఫోన్ నో మెసేజ్ నో వస్తూనే ఉన్నాయి. అవతలి వ్యక్తి ఆడే మాటల తూటాలు ఆమె గుండెని తాకి ప్రాణాలను హరించేలా ఉన్నాయి. ఆమె ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఆటో ఆగడంతో దిగి డబ్బులిచ్చి ఇంట్లోకి వెళ్లింది తండ్రి ని తీసుకుని.

ఇంట్లో కి వెళ్లిందే కానీ ఆమె మనసు మనసులో లేదు. ‘అసలు తన ఫోటోలు… ఎలా…?!.’ అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి కొన్ని రోజుల క్రితం తను ప్రేమించిన వాసంత్ బ్రతిమ లాడటం తో టాప్ లెస్ ఫోటో పంపింది. ‘అంటే వాసంత్ నేనా ఈ పని చేసింది.ఎంత మోసం చేశాడు. ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మాటలూ, ఛాటింగ్ లతో రాత్రిల్లూ  గడిచిపోయేవి.

ఓ రోజు ఫ్రెండ్ పుట్టిన రోజు పార్టీ అంటూ పిలిచి అక్కడ ఎడ్వాంటేజీ తీసుకుని తనని లోబరుచుకోవాలని చూస్తే అతని నుంచి ఎలాగోలా తప్పించుకుని వచ్చింది. ఇక మరుసటి రోజు నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను ఆన్సర్ చేయలేదు.

ఓసారి ఎదురుపడి అడిగితే “ఇన్నాళ్లూ నీ వెనుక తిరిగింది ప్రేమతో అనుకున్నావా. కాదు వ్యామోహం. నీలాంటి అందమైన పేదింటి  అమ్మాయి ప్రేమకే పడుతుంది. అందుకే ప్రేమ పేరుతో నీతో పరిచయం పెంచుకున్నా. ఎన్ని ప్రయత్నాలు చేసానే నిన్ను లోబర్చుకోవాలని.  ఏం ఒక్కటీ ఫలించ నివ్వలేదు. ఆఖరికి పుట్టిన రోజు పార్టీ అని అబద్ధం ఆడి తీసుకెళ్తే అక్కడి నుంచి తప్పించుకున్నావు. ఇక నీ వెనుక తిరిగి టైం వేస్ట్ అని నువ్వు ఫోన్ చేసినా ఆన్సర్ చేయడం మానేసా.” అని అతను అనేసరికి లాగిపెట్టి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె అలా కొట్టడం అక్కడ ఉన్నవారంతా చూశారు. అంటే ఆ అవమానం తట్టుకోలేక నన్ను ఇలా వీధిన పడేలా చేశాడా.’ ఇలా ఆలోచిస్తూ ఉండగా ఫోన్  మ్రోగింది.లిఫ్ట్ చేసిన ఆమె అవతలి వ్యక్తి అనే మాటలు వినలేక ఫోన్ గొంతు నొక్కేసింది.

మాటికి మాటికి వచ్చే ఫోన్ లతో ఆమె మనసు విరిగిపోయింది. ఏదో వండానని అనిపించి తండ్రి కి వడ్డించి , మందులు వేసి ఆయన పడుకున్నాక గది తలుపు వేసుకుని ఫ్యాన్ కి చున్నీ కట్టీ ఓ స్టూల్ పై ఎక్కి చున్నీలో తలపెట్టింది.

నన్ను క్షమించు నాన్నా. ప్రేమ పేరు చెప్పి ఒకడు నన్ను మోసం చేశాడు. వాడికి నేను లొంగలేదనే అక్కసుతో నా ఫోటో ఫోర్న్ సైట్ లో పెట్టాడు. అప్పటి నుంచీ వచ్చే కాల్స్ తో నేను మానసికంగా చనిపోయాను. ఇక నేను బ్రతికున్నా చనిపోయినట్టే. నీ కంటిపాప నిన్ను అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోతుంది నాన్నా.” అని స్టూల్ ని తన్న బోతుండగా తలుపు తెరుచుకున్న చప్పుడు కి తల తిప్పి చూసింది. ఎదురుగా తండ్రి కన్నీళ్లతో.

“ఏమ్మా! ఈ గుడ్డి తండ్రిని వదిలేసి నీ దారిన నీవు పోతున్నావా?!.” అనేసరికి “నాన్నా!.” అంటూ భోరున విలపిస్తూ క్రిందకి దిగింది.

నా కూతురు చాలా ధైర్య వంతురాలు అనుకున్నా. ఇలా ఓ చిన్న సమస్య కి భయపడి చావుని ఆశ్రయిస్తుంది అనుకోలేదు. ఇప్పుడేంటీ నీ ఫోటోలు ఏదో తప్పుడు సైట్ లో ఉన్నాయి, దాంతో ఫోన్ లు వస్తున్నాయి. ఆ మాత్రం దానికే చనిపోవాలా.” అన్నాడాయన.

తండ్రి ని చూసింది వేద ఆశ్చర్యంగా.

నాకెలా తెలుసనా. ఇందాక నువ్వు స్నానం కి వెళ్లినప్పుడు నీ ఫోన్ మ్రోగితే నేను లిఫ్ట్ చేసి మాట్లాడాను. ఆ తర్వాత కంగారుగా వంట ముగించి నాకు భోజనం పెట్టి మందులు ఇచ్చి నేను పడుకోగానే తలుపు వేశావు. అప్పుడే అర్థం అయ్యింది నాకు ఇలాంటిదేదో చేస్తావని.అసలేం జరిగింది తల్లీ?!.” అన్నాడాయన అనునయంగా.

వేద ఏడుస్తూ మొత్తం చెప్పింది.

“ఓహ్ ఈ మాత్రం దానికే చనిపోవాలా. నువ్వు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా పిరికి వారిలా తనువు చాలించ కూడదు.  నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడక పోవచ్చు కానీ ఎలా బ్రతకాలో చెప్పానో. ఏది తప్పో ఏది ఒప్పో చెప్పాను. సమాజం పోకడ వివరించాను. నువ్వూ అలానే పెరిగావు. కానీ ఓ గంజాయి మొక్క లాంటి మనిషి ప్రేమ నిజమని నమ్మి మోసపోయి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేలా చేసుకున్నావు. ఇంతవరకూ సరే. చావాలని ఎందుకు అనుకున్నావమ్మా. నువ్వు చనిపోతే ఈ తండ్రి, తల్లి లేని బిడ్డ అయిపోతాడని అనుకోలేక పోయావా.” అనేసరికి తండ్రిని పట్టుకుని ఏడ్చింది.

“తప్పు చేసిన వాడు ఎక్కడో సంతోషంగా ఉంటే నువ్వు చావాలనుకోవడం ఏంటి?. వాడికి శిక్ష పడేలా చేయాలి కానీ. రేపు మనిద్దరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం. నువ్వు ధైర్యంగా పడుకో. ఆ ఫోన్ నా కివ్వు.” అంటూ కూతుర్ని ఓదార్చి ఫోన్ పట్టుకుని వెళ్లాడు రామయ్య.

తండ్రి చెప్పింది నిజమే. తప్పు చేసినవాడికి శిక్ష పడాలి కానీ ఏ తప్పూ చేయని నాకెందుకు?. చేస్తా వాడికి శిక్ష పడేలా చేస్తా.

‘నిన్ను కంటిపాపలా చూసుకుంటానని అంటావెప్పుడూ. కానీ నువ్వే నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు నాన్నా. నీవు నేర్పిన మంచి మాటలే నేనే తప్పూ చేయకుండా చూశాయి ఈ రోజు.’ అనుకుంటూ కళ్లు మూసుకుంది వేద.

***

You May Also Like

4 thoughts on “కంటిపాప

  1. అమ్మాయిలు అజగ్రత్తగా ఉండకూడదని, విలువలే కాపాడుతాయని చాలా చక్కగా చెప్పారు మీ కథలో. కథ బాగుందండి.

  2. తెలియక చేసే తప్పు మొత్తం జీవితాన్నే పాడుచేస్తుంది.
    తోడుండే ధైర్యం ఎప్పుడూ అండై నిలుస్తుంది.
    బాగుంది అక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!