ప్రయాణం

(అంశం::” ప్రేమ”)

ప్రయాణం

రచయిత :: సురేఖ దేవళ్ళ

“ఈరోజైనా నా కళ్ళకూ,మనసుకూ నచ్చే భామ కనిపిస్తుందో లేదో” తనను బస్ ఎక్కించడానికి వచ్చిన స్నేహితుడితో అన్నాడు తపస్వి.

“అబ్బా! నీకీ పిచ్చి పోదా రా!!” తలకొట్టుకుంటూ అన్నాడు కార్తీక్.

“ఇది పిచ్చి కాదురా. మూడు తరాలుగా మాకు వారసత్వంగా కలిసివస్తుంది..మా తాత,మా బామ్మను తిరుపతి వెళ్ళే ప్రయాణంలో చూసి ఇష్టపడి, పట్టుబట్టి మరీ చేసుకున్నడు ఆకాలంలో..

మా నాన్న, మా అమ్మను ఫ్రెండ్ పెళ్ళి కని బెంగళూరు వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణంలో కలుసుకుని, ఆ తర్వాత ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు.

అలాగే నా డ్రీమ్ గర్ల్ కూడా ఇలా ప్రయాణాల్లోనే కలుస్తుందని నా నమ్మకం” అన్నాడు ఊహల్లో తేలిపోతూ తపస్వి.

‘మూసుకుని ఉండకుండా అనవసరంగా కెలికాను వీడిని.. ఈ వంశ చరిత్ర వినలేక సచ్చిపోతున్న. ఇప్పటికి ఓ వెయ్యి సార్లు విని ఉంటా ఇది’ అని మనసులోనే సణుక్కున్నాడు కార్తీక్.

“ఏంట్రా! ఏదో అంటున్నావ్? అర్థం కాలేదు!?” అన్నాడు తపస్వి.

“ఏం లేదు రా! నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రా.. నాకు పనుంది, నేను వెళ్తా మరి. వెళ్ళగానే ఫోన్ చెయ్యి. ఎప్పుడూ ఊహల్లోనే కాకుండా నేలమీద ఉండు అప్పుడప్పుడు. సరేనా!!” అన్నాడు కార్తీక్.

“సరే సరే. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. బై” అంటూ బస్ ఎక్కాడు తపస్వి.

“అందరూ వచ్చినట్లేనా!?” అనడుగుతూ అందర్నీ పేర్లతో పిలుస్తూ, తన దగ్గర ఉన్న లిస్ట్ లో చెక్ చేసుకుంటూ ఉన్నాడు గైడ్.

తపస్వి తన పక్కన సీటు ఖాళీగా ఉండడం గమనించాడు. మిగతా అన్ని సీట్లు ఫుల్ అయ్యాయి.

“ఒకమ్మాయ్ రాలేదు!!” తనలోతను అనుకుంటున్నట్లుగా పైకే అందరితో అన్నాడు గైడ్.

అమ్మాయన్నమాట వినపడగానే ఊహల్లోకి వెళ్ళిపోయాడు తపస్వి. ఓ అందమైన అమ్మాయి తన పక్కన కూర్చోబోతుంది అని అనుకునేసరికి ఉత్సాహం ఎక్కువ అయిపోయింది.

బస్ డోర్ దగ్గరే చూపులు అతుక్కుపోయాయి.

లిస్ట్ లో వివరాలు ఉండడంతో అందులో చూస్తూ కాల్ చేస్తూండగానే పరిగెత్తుకుంటూ వచ్చింది ఓ అమ్మాయి.

“తమస్విని అంటే మీరే కదా!?” అడిగాడు గైడ్.

“అవును” అంది ఆమె.

ఆసక్తిగా చూస్తున్న తపస్వి నీరుకారిపోయాడు. ఆ అమ్మాయి తన కళ్ళకు నచ్చలేదు. నీరసంగా తలతిప్పి బయటకు చూస్తూ ఉండిపోయాడు.

ఆ అమ్మాయి వచ్చి తపస్వి పక్కన కూర్చుంది. కొన్ని గంటలు కలిసి ఉండాలి, అందులోనూ మాట్లాడకుండా ఉండడం అసలే చేతకాని తపస్వి, తనని చూసి నవ్వాడు.

జూ లో జంతువుని చూసినట్లు ఎగాదిగా చూసి నవ్వకుండా మొహం పక్కకు తిప్పుకుంది ఆమె.

‘దీనికేమైనా పిచ్చా!! మొహమాటానికైనా నవ్వకుండా, నేనేదో వింతగ్రహం నుండి వచ్చినట్లు అలా చూసింది’ మనసులోనే తిట్టుకున్నాడు తపస్వి.

“ఎక్కువసేపు మౌనంగా ఉండలేక హాయ్! ఎక్కడివరకూ వెళ్తున్నారు?” అనడిగాడు తపస్వి.

“అనకాపల్లి వరకూ!!” ఠక్కున సమాధానం వచ్చింది ఆ అమ్మాయ్ నుండి.

“అయ్యో! ఈ బస్ అక్కడికి వెళ్ళదండీ.. డైరెక్ట్ కేరళ. మధ్యలో ఎక్కడా స్టాపుల్లేవు” కొంచెం కంగారుగా అన్నాడు.

“కదా! మరి తెలిసీ ఎక్కడివరకూ అనడిగారెందుకు?” సూటిగా చూస్తూ అడిగింది తమస్విని.

ఏం చేయాలో తెలియక హిహిహి అంటూ పిచ్చి నవ్వు ఒకటి నవ్వాడు.

“మీరు యాడ్స్ కి మోడల్ లా చేస్తూ ఉంటారా!?” అడిగింది తమస్విని.

“లేదండీ. అదేం, అలా అడిగారు?” ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగాడు తపస్వి.

“కోల్గేట్ యాడ్ లా మీ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతుంటేనూ!!” అని అర్థోక్తిగా ఆపింది.

‘ఈరోజు నీ టైం బాలేదురా యెధవా!’ అని తనని తానే తిట్టుకున్నాడు.

తమస్విని అతన్ని చూస్తూ రాబోతున్న నవ్వుని పెదవుల మీదే అణిచిపెట్టేసింది.

బస్ చాలాదూరం వెళ్ళిన తర్వాత ఓచోట గర్భవతిగా ఉన్న ఒకామె, ఆమెతో మరొక వృద్ధురాలు బస్ ని ఆపమన్నట్లుగా రోడ్ మధ్యకు వచ్చేసినట్లుగా వచ్చేశారు.

డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అందరూ అటు చూశారు.

ఫలానా ఏరియాకి వెళ్ళాలి అర్జెంటుగా అంటూ బ్రతిమిలాడుతుంది ఆ వృద్ధురాలు.

కండెక్టర్ ఒప్పుకోవడం లేదు..

“మేము ఆ రూట్ లో వెళ్ళము, మీరు చెప్పిన రూట్ అంటే పది కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి “అంటున్నాడు.

బస్ లో అందరూ సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు.

కడుపుతో ఉన్న ఆమె కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి.

ఆమెని చూస్తే జాలి వేసింది తపస్వికి. లేచి వెళ్ళి కండెక్టర్ తో ” భయ్యా! వాళ్ళు ఏదో అత్యవసరమై ప్రయాణం అయినట్లున్నారు.. ఆడబిడ్డ కడుపుతో ఉంది..ఎంతసేపని ఇక్కడే ఉంటారు. మనకు మహా అయితే ఓ అరగంట ఆలస్యం అవుతుంది అంతే కదా!!” అన్నాడు ప్రయాణీకులు అందరినీ చూస్తూ.

అందరూ దానికి ఒప్పుకున్నట్లుగా తలూపారు..ఆ ఆడవాళ్ళు ఇద్దరూ బస్ ఎక్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా చేతులు జోడించారు.

తపస్వి తన సీటు ఆ గర్భవతికి ఇచ్చి నిలబడ్డాడు. మెచ్చుకోలుగా చూసింది తమస్విని. తన సీటును ఆ వృద్ధురాలుకి ఇచ్చి తను కూడా తపస్వి పక్కనే నిలబడింది.

అది చూసిన తపస్వి ‘ఈ అమ్మాయి పిసినారి అనుకుంట. నోటితో కాకుండా కళ్ళతో మాట్లాడుతోంది. ఫర్వాలేదు, ఈమెకీ మనసుంది.. చూడగా చూడగా ఈ అమ్మాయి కూడా బానే ఉంది’ అనుకున్నాడు చిన్నగా నవ్వుకుంటూ.

ఆడవాళ్ళిద్దరినీ వారికి కావాల్సిన చోట దింపేసి, తమ రూటులో వెళుతోంది బస్… ఈసారి బస్ కొంచెం సందడిగా మారింది. అందరూ అంత్యాక్షరి ఆడుకుంటూ, సరదా మాటలతో హాయిగా గడిచిపోయింది. తర్వాత నిద్రపోయారందరూ.

సగం దూరం పైగా వెళ్ళిన తర్వాత బస్ బ్రేక్ డౌన్ అయ్యింది…ఉసూరుమంటూ దిగారు అందరూ.. తెల్లవారుజామున నాలుగున్నర అవుతోంది సమయం.

బస్ డిపోకు ఫోన్ చేశాడు డ్రైవర్.. ఇంకో మూడు గంటల వరకూ ఈ రూట్లో బస్ లేమీ రావని చెప్పారు.

‘అన్ని గంటలు ఏం చేయాలబ్బా’అని ఆలోచిస్తున్నాడు తపస్వి.

“మూడు గంటలు ఇక్కడే ఖాళీగా ఉండి ఏం చేస్తాం..మనం నడవగలిగినంత దూరం నడుచుకుంటూ వెళ్దామా? చుట్టూ ప్రకృతి ఎంత బాగుందో..ఈ సమయంలో అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే భలే ఉంటుంది..నడవగలిగిన వారు నడుచుకుంటూ వెళ్దాం..ఏమంటారూ!?” ఉత్సాహంగా అంది తమస్విని.

ఓ నాలుగు జంటలు హుషారుగా బయల్దేరారు.

‘దీనికీ బ్రెయిన్ ఉందే!’ తమస్వినిని చూస్తూ అనుకున్నాడు తపస్వి.

“వాళ్ళందరూ వెళ్ళిపోయారు.. మీరు చూడటం ఆపితే మనం వెళ్దాం” అంది తమస్విని చిలిపిగా.

తపస్వి నవ్వుతూ ముందుకు అడుగులు వేశాడు.

చిన్న చిన్న మాటలతో మొదలైన వారి ప్రయాణం, చాలా తక్కువ సమయంలోనే పర్సనల్ విషయాలు చెప్పుకునేటంతగా బలపడింది. మీరు నుండి నువ్వు కు వచ్చింది.

“ప్రేమ పైన నీ అభిప్రాయం ఏమిటి?” సడెన్ గా అడిగింది తమస్విని.

“అదొక మ్యాజిక్. మనిషికి ఆనందంగా బ్రతకడానికి కావలసిన. ఆక్సిజన్ ప్రేమ. మన గురించి ఆలోచించేవారు, మనకోసం తపన పడేవారు, మన సమక్షం కోసం ఆరాటపడేవారు ఉండడం అదృష్టం. ఒక్క ప్రేమలో మాత్రమే ఇది సాధ్యం” స్థిరంగా చెప్పాడు తపస్వి.

అది విన్న తమస్విని కళ్ళల్లో చిరుతడి ఆనందంతో.

“మరి నీ అభిప్రాయం ఏంటి?” ప్రశ్నించాడు తపస్వి.

“ఒక మనిషిని ప్రేమించడం అంటే ఆ వ్యక్తిలోని లోపాలతో సహా ప్రేమించగలగాలి. మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించడం, అవసరానికి ఇష్టపడడం కాదు.. ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు ఎంతగా మమకారం పెంచుకుంటామో, మనం చనిపోయే క్షణం వరకూ కూడా అదే మమకారం, అంతకు రెట్టింపు ప్రేమ ఆ ఇద్దరి మధ్యనా ఉండాలి” ఉద్వేగంగా అంది తమస్విని.

“వావ్..ఎంత బాగా చెప్పావు.. నిన్ను చేసుకునేవాడు అదృష్టవంతుడు” అన్నాడు తపస్వి మనస్పూర్తిగా.

‘ఈ అమ్మాయి మనసుకెందుకు ఇంత నచ్చేస్తోంది!! మనసుకు నచ్చడం వల్లనేమో కొన్ని గంటల ముందు యావరేజ్ గా కనిపించిన అమ్మాయి, ఇప్పుడు చాలా అందంగా కనిపిస్తోంది’ అనుకున్నాడు మనసులో.

ఇప్పుడు ఒకరి సమక్షాన్ని మరొకరు అమితంగా ఇష్టపడుతున్నారు.

కనుచూపుమేరలో ఎక్కడో లీలగా మిగతా జంటలు కనిపిస్తున్నాయి.

“తపస్వీ! నువ్వు అదృష్టవంతుడివి అని నీకెప్పుడూ,ఎవరూ చెప్పలేదా?” ఆరాధనగా చూస్తూ అడిగింది తమస్విని.

“హహ… కొంతమంది అంటారు.. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను అదృష్టవంతుడినని నాకు తెలుసనుకో ” నవ్వేస్తూ చెప్పాడు తపస్వి.

తమస్విని బుగ్గలు ఎరుపెక్కాయి..

“అవునూ! ఎందుకలా అడిగావు?” ఆమెనే పరిశీలనగా చూస్తూ అడిగాడు తపస్వి.

ఆమె సమాధానం చెప్పడానికి తడబడింది. చెంపలు సిగ్గుతో మరింత ఎరుపెక్కాయి…

ఒక పక్క మనసును ఆహ్లాదపరిచే వాతావరణం, మరోపక్క రెండేళ్ళుగా తాను ఆరాధిస్తూ, తన మనసును దోచిన మనోహరుడు…
ఆమె మనసులో ఏదో తెలియని వింత అలజడి.

ఆమె చెప్పకుండానే ఆమె సమాధానం అర్థం అయింది తపస్వికి..
సంతోషంగా “నువ్వు చెప్పు, నేను అదృష్టవంతుడినే అంటావా?” చిలిపిగా అడిగాడు తపస్వి.

చిన్నగా నవ్వుతూ అవునన్నట్లుగా తలూపింది.

“అయితే, నా అదృష్టాన్ని మరింత పెంచుతూ నీ జీవితభాగస్వామినయ్యే వరమిస్తావా?” అన్నాడు ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ.

ఆమె సంతోషంతో “తప్పకుండా!” అంటూ అతన్ని హత్తుకుంది పరవశంతో.

‘నేను నిన్ను రెండేళ్ళుగా ఎంతగా ప్రేమిస్తున్నానో మన మొదటిరాత్రి నాడు చెబుతా నీకు’ అనుకుంది తమస్విని మనసులో తృప్తిగా.

‘నా కల నెరవేరింది.. నా డ్రీమ్ గర్ల్ ఈ ప్రయాణంలో నా చెంతకొచ్చింది’ అనుకున్నాడు తపస్వి సంతృప్తిగా.

అయిపోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!