ప్రేమిస్తే

(అంశం::” ప్రేమ”)

ప్రేమిస్తే

రచయిత :: శివరంజని

అతుల్ హైటెక్ సిటీలో ఓ ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవలే అంతర్గత బదిలీ మీద కొత్త ప్రాజెక్ట్ కు మారాడు. కొత్త ప్రాజెక్ట్ అవడం మూలంగా ట్రైనింగ్ జరుగుతుంది.

ఆరోజు శుక్రవారం. ట్రైనర్ అతుల్ తో ఈరోజు అంతర్గత బదిలీ మీద మరో ఉద్యోగిని రాబోతుంది, తనొచ్చాక మీ ఇద్దరికీ కలిపి ట్రైనింగ్ ఇస్తాను అన్నాడు. కాసేపటికి మేనేజర్ అందరినీ పలకరిస్తూ తమ వైపే రావడం అతుల్ గమనించాడు.

ఉంగరాల జుట్టు, పొడువాటి బొట్టు, పెద్ద పెద్ద కాటుక కళ్లు, కోనేరు లాంటి ముక్కు, గులాబీ రంగు పెదవులు, శంఖం లాంటి మెడ, అయిదున్నర అడుగుల ఎత్తున్న అజంతా శిల్పం లాంటి అందమైన, ఆకర్షనీయమైన అమ్మాయి మేనేజర్ తో పాటు వచ్చింది.

మేనేజర్ అతుల్ ట్రైనర్ తో “ఈమె మాధురి, మన కొత్త ఉద్యోగిని. అతుల్ తో పాటు ట్రైనింగ్ ఇవ్వు” అన్నారు.
అతుల్ కు నోట మాట రావడంలేదు. సరిగ్గా వారం క్రితం జరిగిన కంపెనీ వార్షికోత్సవంలో అతుల్ మాధురి చేసిన కూచిపూడి నృత్యం చూసి ఫిదా అయ్యాడు. ఆరోజు ఉద్యోగులంతా డాన్స్ చేస్తున్నప్పుడు, మాధురితో పరిచయం పెంచుకోడానికి తనతో డాన్స్ చేద్దామనుకున్నాడు. కానీ మాధురి బృందంలోని అబ్బాయిలు తమ బృందం అమ్మాయిల చుట్టూ కంచు కోట కట్టారు, వేరే బృందం అబ్బాయిలు, తమ సహోద్యోగినులతో డాన్స్ వంకతో ఇబ్బంది పెట్టకుండా రక్షణ కవచంలా ఉన్నారు.

భోజనం చేసేటప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు కూడా అతుల్ కు మాధురితో మాట్లాడే అవకాశం దొరకలేదు. ఆరోజునుండి అతుల్ కు ప్రతిరోజు మాధురి గుర్తొస్తోంది. ఈరోజు నుండి తన బృందంలో తనతో పాటు తనపక్కనే కూర్చొని ట్రైనింగ్ తీసుకోబోతుంది అంటే అతుల్ ఆనందానికి అవధులు లేవు. ఏం చేసి మాధురిని ఇంప్రెస్ చేద్దామా అని ఆలోచిస్తున్న అతుల్ ని ట్రైనర్ తట్టి, ట్రైనింగ్ రూముకు వెళ్దామా అని అడిగాడు.
అతుల్ మాధురిలు ట్రైనర్ ను అనుసరించారు.

అప్పటివరకు ఒకమాదిరిగా శ్రద్ధ చూపిన అతుల్ మాధురి వచ్చాక తనను ఇంప్రెస్ చేయడం కోసం, ట్రైనింగ్ మీద విపరీతమైన శ్రద్ధ చూపాడు. మాధురికి వచ్చే అనుమానాలు నివృత్తి చేయసాగాడు. బృందం అంతా కలిసి భోజనానికి వెళ్లినా మాధురి ఎప్పుడు మౌనంగానే ఉండేది.

ఎంత ప్రయత్నించినా అతుల్ సహోద్యోగి రేఖను దాటి మాధురికి చేరువ కాలేకపోయాడు. బృందంలో ఉన్న సభ్యులందరికి అతుల్, మాధురిని ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయింది. ప్రేమ, పెళ్లి లాంటి వాటికి దూరంగా ఉండే మాధురిని కొందరు సహోద్యుగులు పరోక్షంగా టీస్ చేయడంతో మాధురి, అతుల్ ను దూరం పెట్టసాగింది.

నిజానికి మాధురికి కూడా అతుల్ అంటే చాలా ఇష్టం. కంపెనీ వార్షికోత్సవం రోజు కూచిపూడి నృత్యం చేసిన రోజు నుండి అతుల్ తనను ఆరాధనగా చూడటం మాధురి గమనించింది. తనని పరిచయం చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న అతుల్ కు కావాలనే దూరంగా ఉంది. తన చిన్నతనంలో జరిగిన ఆ దుర్ఘటన తాలుకు నీలి నీడలు తననింకా వదలలేదు. ఆ దుర్గటన తాలుకు విషాదం జీవితాంతం తనతోనే ఉంటుంది. తన జీవితంలోకి ఎవ్వరిని ఆహ్వానించొద్దు అని ఎప్పుడో నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఇద్దరు ఒకే ప్రాజెక్ట్ లో ఉండటం, మాధురికి ఓ వైపు దుఃఖంగా మరోవైపు సంతోషంగా ఉన్నది.
ఎంత వద్దనుకున్నా అతుల్ అభిమానపు చూపులు, అతను చూపించే ప్రేమ మర్చిపోలేకపోతుంది. ఎంత కావాలనుకున్న అతుల్ కు దగ్గర కాలేకపోతుంది. “అతుల్ కు దగ్గరవడమంటే, తనని శిక్షించినట్టే. నేను నిజంగా తనను ప్రేమిస్తే, దూరంగానే ఉండాలి” అని తనకు తను సద్దిచెప్పుకుంటోంది.

అతుల్ కు కంపెనీ నుండి అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. ఆఫీస్ లో అందరికీ హోటల్ లో పార్టీ ఇచ్చాడు. అదేరోజు మాధురిని ప్రపోజ్ చేయాలని అనుకున్నాడు. అతుల్ ఇక తనకు కనిపించడు అనే ఊహను తట్టుకోలేక మాధురి వాష్ రూమ్ కి వెళ్లి ఏడుస్తోంది. అక్కడికి వచ్చిన మాధురి చిన్ననాటి స్నేహాతురాలు అస్మిత “ఏమైంది మాధురి, ఎందుకెడుస్తున్నావ్” అంటూ దగ్గరికి తీసుకున్నది.

మాధురి జరిగిందంతా చెప్పి, తను అతుల్ ని ప్రేమిస్తున్న విషయం, తన ఆవేదన కూడా చెప్పింది.

“పిచ్చి పిల్లా, దీనికెందుకేడవటం, ఉన్నదున్నట్టు తనతో చెప్పు” అని సలహా ఇచ్చింది.

చాలా సేపటినుంచి మాధురిని వెతుకుతున్న అతుల్ తను కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత మాధురికి ఎదురుగా కూర్చొని, “నేను నిన్ను మొదటిసారి చూసినప్పటినుండి ప్రేమస్తున్నాను, నువ్వొప్పుకుంటే నీతో ఏడడుగులు నడిచి జీవితాంతం నీతో ప్రయాణించాలని ఉంది” అన్నాడు.

“నీకు ఏదైనా చెప్పడానికి ముందు, నీకు నా గురించి పూర్తిగా తెలియాలి” అన్న మాధురితో

“చిన్నప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం, అందులో కొన్ని కాలిన మరకలు ఇప్పటికి నీ శరీరం మీద ఉండటం, నా ప్రేమను రవ్వంత కూడా తగ్గించవు” అన్నాడు అతుల్.

“నీకు తెలుసా” అన్న మాధురితో, “నా మీద కొండంత ప్రేమ ఉన్నా, నన్నెందుకు దూరం పెడుతున్నావ్, అని తెలుసుకుంటే తెలిసింది, నా ప్రేమ ముందు అది నథింగ్ ” అన్నాడు అతుల్.

నవ్వుతూ హత్తుకున్న మాధురితో “వారంలో పెళ్లి నీకు ఓకే నా” అని అడిగాడు అతుల్.

వారంలో మాధురి అతుల్ ల పెళ్లి జరిగింది. ఇద్దరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వారికి ముద్దులు మూటగట్టే అయిదేళ్ల బాబు కూడా ఉన్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!