నేరానికి శిక్ష

(అంశం::” ప్రేమ”)

నేరానికి శిక్ష

రచయిత :: బండి చందు

ఓరోజు సాయంత్రం కాలేజ్ అయిపోయాక ఫ్రెండ్స్ తో కలిసి బస్టాండ్ లో బస్ కోసం ఎదురుచూస్తున్నాను. ఫ్రెండ్స్ అందరూ వీకెండ్ టూర్ వెల్దామని ప్లాన్ వేస్తున్నారు. కానీ నేను మాత్రం అవేవి పట్టించుకోకుండా బస్ కోసం అటూఇటూ చూస్తున్నాను. అలా చూస్తున్న నా కళ్ళు ఒక బస్ కిటికీ వద్ద ఆగిపోయాయి. ఆ కిటికీ నుండి గాలికి ఊగుతున్న ఒక జుంకి, రెపరేపలాడుతున్న తెల్లని చున్నీ నా కళ్ళను అక్కడినుండి కదలనివ్వట్లేదు. పారిజాత నందనవనపు దారి మరిచిపోయిన దేవకన్యలా ఉంది తన లావణ్యం. తన కనురెప్పల చప్పుడు నా హృదయ సవ్వడిని మరింత వేగం చేస్తున్నాయి. తను నుదుటన సవరించుకునే ముంగురులు నా నోట మాట రానివ్వకుండా అలాగే చూస్తూ ఉండేలా శపించేసాయి. కదలిక లేక నిల్చుండిపోయిన నేను ఫ్రెండ్స్ అరుపులతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను.

ఎలాగైనా తన గురుంచి తెలుసుకోవాలని ఫ్రెండ్స్ ఎంత చెబుతున్నా వినకుండా తను కూర్చున్న బస్ ఎక్కాను. బస్ అయితే ఎక్కాను కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియదు. పోనీ తనతో మాట్లాడుదాం అనుకుంటే ఏమనుకుంటుందో అని భయం. ఇంతలో నా వెనకాల నుండి చందు అని ఒక పిలుపు తెలిసిన గొంతులాగే అనిపించింది. వెనక్కి చూస్తే తను మా ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ప్రత్యూష. తనని చూడగానే నా భయం కాస్తా సంతోషంగా మారిపోయింది. క్షేమసమాచారాల తరువాత నేను కిటికీ వద్ద కూర్చున్న అమ్మాయి గురుంచి చెప్పి వివరాలు అడిగాను. ప్రత్యుష కొంచెం సందేహిస్తూనే ఎందుకు అని అడిగింది. నేను ఏమిచెప్పాలో తెలియక ఊరికే మా ఫ్రెండ్ కోసం వివరాలు చెప్పవా అని మళ్ళీ అడిగాను.

తన పేరు సంధ్య. మా పక్క ఊరే. మా కాలేజ్ లొనే చదువుతుంది ఇప్పుడు డిగ్రీ ఫైనలియర్. నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంది అని చెప్పి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. ఇక నా ఆనందానికి హద్దులు లేవు బస్ దిగి త్వరగానే ఇంటికి వచ్చాను. నంబర్ అయితే తీసుకున్నాను కానీ ఫోన్ చేయడానికి భయమేసింది. వాట్సాప్ లో తన ప్రొఫైల్ చూస్తూ వారం రోజులు గడిపేసాను. ఒకరోజు సాయంత్రం అనుకోకుండా తన నుండి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసాను తను ఎంతో కాలం నుండి తెలిసిన వ్యక్తిలా నాతో మాట్లాడింది. నేను ఆశ్చర్యంతో నా నంబర్ ఎక్కడిది అని అడిగాను. తను ప్రత్యూష ఇచ్చింది అని చెప్పింది . ఆరోజు చాలాసేపు ఫోన్లో మాట్లాడుకున్నాం. ఆరోజు ఫోన్ లో మీరు మీరు అని మొదలైన మా పరిచయం తను నన్ను రేయ్ అని పిలిచేవరకు, నేను తనతో నేరుగా కలిసేవరకు వచ్చింది తను ఏ చిన్న విషయమైనా నాతో పంచుకునేది. తనతో ఒక్కరోజు మాట్లాడకపోయినా తనని కలవకపోయినా నాకు ఆరోజంతా నరకంలో ఉన్నట్టు ఉండేది.

తనని మొదటిసారి చూసినరోజే తనకి నా ప్రేమ విషయం చెప్పాలనుకున్న. కానీ ఏమంటుందో అని చెప్పలేదు ఇప్పుడు చెప్పకపోతే నేను ఏమైపోతానో అని భయమేసి ప్రేమికులరోజున తనకి నా ప్రేమ గురుంచి చెప్పాను. కానీ తను బదులుగా ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది. సమాధానం కోసం ఎదురుచూస్తున్న నాకు కొద్దిసేపటి తరువాత తను ఫోన్ చేసి నాకు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలని వున్నా చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే నాకు నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు నేను నీతో ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పినా ఎదో ఒకరోజు నిజం కాదని తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఇప్పుడే చెబుతున్నా ఇక నువ్వు ఎప్పటికి నాకు ఫోన్ చేయవద్దు అని పెట్టేసింది.

ఏన్నో మాటలు చెవిన పడినా అందులో నాకు ఫోన్ చేయవద్దు అనే ఒక్క మాట మాత్రమే వినపడింది. ఆ మాటలు నిజాలని తెలిసిన అబద్దాలు కావాలని ఆ క్షణం నేను కోరుకొని దేవుడు లేడు. ఇన్నిరోజులు తనకు నిశ్చితార్థం అయిన విషయం నాతో చెప్పకుండా నా మనసులోని మాట చెప్పగానే తను నిశ్చితార్థం గురుంచి చెప్పినప్పుడు నాపై నాకే అసహ్యం వేసింది. తన మనసులో ఏముందో తెలుసుకోక నేనె తొందరపడి నా ప్రేమను చెప్పనేమో. ఇక నన్ను నేను జీవితంలో క్షమించుకోలేని శిక్ష వేసింది. నేనె తనని తప్పుగా అర్థం చేసుకున్నానేమో. అందుకే చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నా.

అయినా కొన్ని ప్రేమలు అర్దాంతరంగా ఆగిపోతేనే బాగుంటాయి అదికూడా మొదలవ్వకమునుపే….

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!