ప్రేమ ప్రయాణం

(అంశం::” ప్రేమ”)

 ప్రేమ ప్రయాణం

రచయిత :: శ్రీదేవి విన్నకోట

ఓ కన్నె పిల్ల అయిన ఆడపిల్లకి ఎవరికీ  బయటికి కూడా చెప్పుకోలేనన్ని కలలు కోరికలు ఆశలు ఉంటాయి. అవన్నీ తీరాలని  కలల్లో తేలిపోతూ తన జీవితం గురించి కథలు కథలుగా ఆలోచిస్తూ ఊహలతో ఉసులకి ఊపిరి పోసుకుంటూ ఉంటుంది

నా పేరు సహస్ర .మా అమ్మానాన్నలకు నేను అక్క ఇద్దరమే పిల్లలం అక్క నా కంటే ఏడు సంవత్సరాలు పెద్దది. తనకి పెళ్లి అయ్యి ఒక బాబు. మా బావగారు బ్యాంక్ లో జాబ్ చేస్తారు. వాళ్లది ముచ్చటైన కలతల్లేని కమ్మని సంసారం.

మీకు నా గురించి చెప్పలేదు కదూ. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు చదువంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ నాన్న గారు డిగ్రీ పాస్ కావాల్సిందే అని స్ట్రిక్ట్గా చెప్పడంతో తప్పక చదువుతున్నాను.
నాకు చదువు కంటే కూడా కథలు కవితలు రాయడం
నా చుట్టూ ఉన్న అందర్నీ పరిశీలించడం వారి గురించి తెలుసుకోవడం ఇవి నాకు ఇష్టమైన పనులు.

ఇక్కడ నేను మీకు కొంచెం మా అమ్మ గురించి చెప్పాలి.నాన్నకి కోపం చాలా ఎక్కువ. మా ఇంట్లో రూల్సు క్రమశిక్షణ గురించి చెప్పే పాఠాలు ఎక్కువే. అమ్మకి సొంత అభిప్రాయం అంటూ ఉండదు. నాన్న అవును అంటే అమ్మ అవును అంటుంది. నాన్న వద్దు అంటే
అది అమ్మ కి ఎంతో ఇష్టమైన పని అయినా సరే ఇక దాని జోలికి వెళ్లదు. అది ప్రేమో లేక భయమో ఇవన్నీ కాక గౌరవమో నాకు ఎప్పటికీ అర్థం కాదు. కానీ  నేను మా అమ్మను తిడుతూనే ఉంటాను. నీకంటూ ఒక సొంత వ్యక్తిత్వం ఉండదా అని నా ప్రశ్నకి సమాధానం ఎప్పుడు అమ్మ చిరునవ్వే అవుతుంది.

అక్క వాళ్ళు బెంగళూరులో ఉంటారు. బావగారు ఆక్కడ జాబ్ చేస్తారు. అక్కని చిన్నపిల్లలా చూసుకుంటారు.
నాకు బావగారు అన్న ఇష్టమే. నాతో కూడా చాలా చక్కగా ప్రవర్తిస్తారు. నాకు ఆయన్ని చూస్తే గౌరవ భావం కలుగుతుంది. ఆయన పెద్దమనిషి తరహాగా ఉంటారు.

ఆ రోజు మా స్కూటీ పై కాలేజీకి వెళుతున్నా నాన్నతో కలిసి.  నాన్న డ్రైవ్ చేస్తున్నారు నేను వెనకాల కూర్చున్న ఇంతలో ఓ చోట ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కాసేపు బండి ఆపారు. నా పక్కనే మరో బండిమీద అతను ఎవరో, నా గుండె  ఒక్కసారి ఆగి కొట్టుకుంది ఒకసారి.అది రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటా. ఆ బండి అందంగా ఉందో లేక అతను ఆ బండికి అందాన్ని తీసుకొచ్చాడో
నాకు అర్థం కాలేదు అంత బాగున్నాడు అతను.
నేను చూడకూడదు చూడకూడదు అనుకుంటునే అతని వంక  చూస్తూనే ఉన్నా. ఎందుకో తెలియదు గాని నా చూపులు అతనికి తెలిశాయి ఏమో తెలీదు  అతను ఉన్నట్లుండి నా వంక చూశాడు. ఒక్క క్షణం అతని కళ్ళు నా కళ్ళు కలుసుకున్నాయి. నా మనసులో ఎక్కడో చిరు గంటలు మోగిన మువ్వల సవ్వడి. చూపులు కలిసిన శుభవేళ అనే పాట గుర్తొచ్చింది నాకు హఠాత్తుగా. నా పెదవులపై సిగ్గుతో కూడిన చిరునవ్వు, అతని పెదవులు కూడా చిన్నగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అతను నా వంకే అలా చూస్తూ ఉండిపోయాడు. నాకు మొదటిసారిగా అప్పుడు అనిపించింది. నేను కూడా చాలా అందంగా ఉంటాను అని.

ఇంతలో సిగ్నల్ క్లియర్ అవడంతో మా బండి ముందుకి బయలుదేరింది. అతను నా వంకే చూస్తూ (నేను కూడా చూస్తున్నాను) మమ్మల్ని ఫాలో అవ్వసాగాడు. నాకు అమ్మో నాన్నగారు చూస్తే చంపేస్తారనే భయం ఓ పక్క మళ్లీ అతను మిస్ అయిపోతే కనిపించడేమో అనే కంగారు ఓ పక్క  ఇంతలో మా కాలేజీ రావడంతో నాన్న నన్ను డ్రాప్ చేసి  దిక్కులు చూడకుండావెళ్ళు
లోపలికి  అంటూ ఆయన వెళ్లిపోయారు. నేను ఒక్క క్షణం మా నాన్న వెళ్లే వరకు చూసి  అతను ఉన్నాడేమో చూద్దామని అటు వైపు తిరిగాను.

అతను కాలేజ్ గేట్ కి కొంచెం పక్కగా బండి ఆపి ఆ బండి మీదనే కూర్చుని ఉన్నాడు. అతనిలో ఏదో గ్రేస్. అతని దగ్గరికి వెళ్లి మాట్లాడమని చెప్తున్న నా మనసు నీ నిగ్రహించుకుంటూ కాలేజ్  లోపలికి నడిచాను. మళ్లీ ఆగి వెనక్కి తిరిగి చూసాను. అతను నా వంక చూస్తున్నాడు
అతని కళ్ళల్లో పలకరింపు పెదవులపై చిరునవ్వు నన్ను కట్టిపడేశాయి. నేను ఇంకా కాసేపు అక్కడే ఉంటే అతనితో మాట్లాడేస్తాను ఏమో అని భయం వేసింది.
గబుక్కున వెనక్కి తిరిగి లోపలికి నడిచాను. ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్  లోంచి అతని మొహం లో నేను వెళ్ళిపోతున్నాను అన్న నిరాశ కనిపిస్తుంది నాకు.

క్లాసులు అయిపోయే వరకు ఎలాగో ఓపిక పట్టి బయటికి వచ్చాను. సమయం ఐదు అవుతోంది. కాలేజ్ కి వచ్చేటప్పుడు నాన్నగారు డ్రాప్ చేయడం వెళ్లేటప్పుడు నేను ఆటోలోనో  సిటీ బస్సులోనో వెళ్లిపోవడం ఎప్పుడూ మామూలుగా జరిగే విషయమే. కానీ బయటికి రాగానే నా కళ్ళు అతని కోసం వెతుకుతున్నాయి. ఇంతసేపు నాకోసం ఎందుకు ఎదురు చూస్తాడు,అని అనిపిస్తోంది ఓ పక్క,మరోవైపు అతన్నీమరొక్క సారి చూడాలనే నా ఆశ  కోరిక నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రోడ్ మీద ఐస్ క్రీమ్ బండి కనబడగానే ఓ కోన్ ఐస్ క్రీం తినాలనిపించింది. ఆగి బ్యాగ్ లోంచి డబ్బులు తీసుకుని ఐస్ క్రీమ్ కొనుక్కుందాం అని బండి దగ్గరికి వెళ్లాను.  ఇంతలో అతను నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఒక్క క్షణం నేను తడబడ్డాను. ఐస్ క్రీమ్ తినాలి అనుకుంటున్నావా సహస్ర అని అడిగేసరికి నేను గొంతు పెగల్చుకుని నాపేరు మీకు ఎలా తెలుసు అని అడిగాను. తెలుసుకోవాలి అనిపించింది తెలుసుకున్నాను. ఎలా అనేది నీకు అనవసరం ఏమో అన్నాడు. నేను అతన్ని తప్పించుకొని ముందుకు నడవబోయాను. అతను చప్పున నా చేయి పట్టుకుని  నీతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడాలి సహస్ర అన్నాడు. నేను నా చేతిని విడిపించుకోడానికి ప్రయత్నిస్తూ ఏంటిది మీరెవరో నాకు తెలుసా. ఇలా ఒక తెలియని అమ్మాయి చేయి పట్టుకోవడం కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడిగాను కోపంగా.
నాకు అతను ఎంత నచ్చినా ఇప్పుడు అతను చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు. చాలామంది మా వంక వింతగా చూస్తున్నారు.  నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాను. కాబట్టి సైలెంట్ గా బండి మీద కూర్చో అని చెప్పాడు. నేను నాకు వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ నేను కూర్చోనూ అన్నాను గట్టిగా.

ఎందుకు సాహి అంత మొండితనం చేస్తున్నావ్ అన్నాడు లాలనగా. నన్ను సాహి అని అమ్మ అక్క మాత్రమే పిలుస్తారు. మరి ఇతనికి ఎలా తెలుసు అనిపించింది నాకు. నేను మీకు తెలుసా అని అడిగాను. అతను నవ్వాడు. బాగా తెలుసు బంగారు ఎలా తెలుసో చెప్తాను
మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ప్లీజ్ బండెక్కు అన్నాడు బ్రతిమాలుతూ. నేను ఒక్క నిమిషం ఆలోచించి తన మొహం లోకి చూసాను. అతనిని చూస్తుంటే మంచివాడి లాగే అనిపించాడు, కానీ మోసగాడి లా అనిపించలేదు.
సరే అంటూ బండి ఎక్కి  కూర్చున్నాను.

ఓ పది నిమిషాల ప్రయాణం తర్వాత మీరు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళడం లేదు కదూ. మరి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగాను కొంచెం కంగారుగానే. మీ ఇల్లు నాకు ఎలా తెలుస్తుంది. నిన్ను కిడ్నాప్ చేస్తున్న సాహి డియర్ అన్నాడు అతను అల్లరిగా, నాకెందుకో మనసులో అలజడి గా అనిపిస్తోంది. సిటీ అవుట్ స్కట్స్ల్ లోకి  వచ్చేసాము. జన సంచారం చాలా తక్కువగా ఉంది పచ్చని చెట్లు తలలూపుతూ చిరుగాలులతో పలకరిస్తున్నాయి. లేలేత చీకట్లు ముసురుకుంటున్నాయి. ఎందుకో నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది. మనసులో తొలిసారిగా ఒక అపరిచితుడు తో వచ్చి తప్పు చేశానేమో అనే భావం నాలో వణుకు పుట్టించింది. అతను బైక్ నీ ఓ చోట ఆపి దిగు అన్నాడు ఇక్కడ ఎందుకు అని అడిగాను చెప్తాను గా దిగు బంగారు అన్నాడు. అసలు బుద్ధున్న ఏ అమ్మాయి అయినా ఇలా ఓ పరాయి మగాడి నీ.నమ్మి వస్తుందా నేను పిచ్చిదాన్ని కాబట్టి వచ్చేసాను అని మనసులో అనుకుంటూ అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాను. అతను బండి లాక్ చేసి బండి లో నుంచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసి ఎక్కడైనా కూర్చుందాం ఓ పది నిమిషాలు అంటూ కూర్చోవడానికి మంచి ప్లేస్ కోసం వెదకసాగాడు. ఆఖరికి ఓ పెద్ద చెట్టు మొదలు మీద కూర్చుంటూ కమాన్ సాహీ అని పిలిచాడు. నేను భయపడుతూనే అతని దగ్గరికి వెళ్లాను. పొద్దున్న అతన్ని చూడగానే కలిగిన ఇష్టం ఇప్పుడు అంతగా కలగడం లేదు. ఇప్పుడు నామనస్సు నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోననే  ఆందోళన లో ఉంది. అతను కూల్ డ్రింక్ బాటిల్ మూత ఓపెన్ చేసి తాగు అంటూ ఇచ్చాడు.ఉహూ నాకొద్దు
నాకు కూల్డ్రింక్స్ తాగే అలవాటు లేదు అన్నాను.
ఇది స్ప్రైట్ ఇది తాగితే మనం సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుకోవచ్చు. అతను అచ్చు యాడ్లో చెప్పినట్లే చెప్తున్నాడు  అమ్మో నాకొద్దు  ఏ మత్తు మందో కలిపి
ఇస్తే నా గతి ఎం కావాలి,ఇలా నాలో నేనే ఆలోచించుకుంటూ అతను ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోకుండా ఉండిపోయాను.  ఓయ్ నేను మాట్లాడుతుంటే నువ్వెక్కడో  ఆలోచిస్తావ్ ఏంటి
అమ్మాయి అన్నాడు చిరుకోపంగా నా వంక చూస్తూ.

నేను ఆలోచనలన్నీ పక్కనపెట్టి చెప్పండి ఎందుకు తీసుకు వచ్చారో నన్ను అన్నాను సీరియస్గా, మనం పెళ్లి చేసుకుందామా బంగారు అన్నాడు చాలా సున్నితంగా ప్రేమనీ అంత తన గొంతులోకి తెచ్చుకుని చాలా మార్దవంగా
అతను అలా అడిగేసరికి నాకేం చెప్పాలో అర్థం కాలేదు.

నేను నీకు నచ్చాను అని నాకు తెలుసు. లేదు అని మాత్రం చెప్పకు. పొద్దున్న నన్ను అలా చూస్తూ ఉండిపోయిన నీ కళ్ళని అడుగు నేనంటే ఇష్టం ఉందో లేదో చెబుతాయి. నేను కూడా నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను దీన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారనుకుంటా సహస్ర అన్నాడతను. నేను మౌనంగా ఉండిపోయాను. ముందు నేను అంటే నీకు ఇష్టం ఉందో లేదో చెప్తే మీ నాన్నగారితో మాట్లాడతాను. ఏమంటావ్ అని అడిగాడు. నన్ను ముందు ఇక్కడి నుంచి ఇంటికి తీసుకు వెళ్ళండి అన్నాను. అతను చిలిపిగా నవ్వుతూ
భయపడకు .నేను  నిన్ను ఏమీ కొరుక్కు తినేయ్యను .దానికి ఇంకా కాస్త సమయం ఉంది లే కంగారు పడకు అని అనగానే నా బుగ్గలు ఎర్రబడ్డాయి. అతని మొహం చూడలేక మొహాన్ని మరోవైపు తిప్పుకున్నాను సిగ్గుగా.

నువ్వు ఇంకా నీ అభిప్రాయం చెప్పలేదు సాహి అన్నాడతను ప్రేమగా. నేను మాట్లాడలేదు మౌనం అంగీకారం అని అనుకోవచ్చా బేబీ అని అడిగాడు.
ఒక్కసారి మొహం పైకెత్తి అతనితో మాట్లాడబోయి ఆగిపోయాను. అతను నన్నే చూస్తున్నాడు.
నేను ఏ విషయమైనా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను అన్నాను కొంచెం బెరుకుగా.

నాతో పెళ్లి నీకు ఇష్టమే కదా ఫైనల్ గా చెప్పు అన్నాడు.
ఎవరైనా చూడగానే ప్రేమలో పడతారు అని చెప్తే  ఇప్పటివరకు నమ్మలేదు నేను కానీ అది నిజమే. మిమ్మల్ని చూడగానే నాకెందుకో మీరే నా జీవిత భాగస్వామి అనిపించింది. మీతోనే నా జీవితాన్ని పంచుకోవాలి అనిపించింది. కానీ అది తీరని తీయని కలగా ఉండిపోతుంది అనుకున్నాను. కానీ మీరు కూడా నాలాగే ఆలోచించారు సిగ్గు పడినా నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. చెప్పాక ఇక వెళదామా అని అడిగాను. ఇంత మాట్లాడావు ఇంకా నన్ను నమ్మవాఅని అడిగాడు అతను. అవును మీ పేరేంటి హఠాత్తుగా అడిగాను నేను. పుల్లయ్య నా పేరు పుల్లయ్య అన్నాడు

అదేం పేరు అంత పాతగా ఉంది. నాకీ పేరు నచ్చలేదు అంటూ నేను ఏడుపు మొహం పెట్టేసరికి,ఏయ్ పిచ్చి
ఈ రోజుల్లో ఇలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా. ఒకవేళ ఏ తాత గారి పేరో అని పెట్టుకున్నా మంచి నిక్ నేమ్ కూడా పెట్టుకుంటారు  అన్నాడు. సరే చెప్పండి మీ పేరు అన్నా ,ఉహూ ఇప్పుడు కాదు రేపు మీ ఇంటికి వస్తాను. మీ నాన్న గారి తో మాట్లాడడానికి అప్పుడు ఆయన ఒప్పుకుంటే చెప్తాను. అన్నాడు మరి అప్పటి వరకు నేను ఏమని పిలవాలి అని అడిగాను. నీ ఇష్టం
డార్లింగ్ అనో డియర్ అనో ఎలా అయినా పిలువు నేను పలుకుతాను. అయినా నా పేరు వినగానే నువ్వు చాలా సంతోషపడతావులే అంటూ పైకి లేచాడు అతను. నేను కూడా నా కళ్ళల్లో అతనిపై ఉత్తుత్తి కోపాన్ని ప్రదర్శిస్తూ లేవబోతుంటే అతని చేయి నాకు అందించాడు. ఆ చేతి ని అందుకొని లేచి నిలబడ్డాను. అతని చేతుల్లో నాకో భరోసా కనిపించింది. బాబోయ్ ఇంత ఆలస్యం అయిపోయింది. నాన్న గారు ఏమంటారో అమ్మ కంగారు పడి పోతుంది. అనుకుంటూ త్వరగా తీసుకెళ్ళమని అతన్ని కంగారు పెట్టేసాను. అతను ఒక గంటలో
మా ఇంటికి కాస్త దూరం లో బండి ఆపి నన్ను అక్కడ దించేసి నేను నిన్ను ఇలా మీ ఇంటికి దూరంగా రోడ్డుమీద వంటరిగా వదిలేది ఈ ఒక్క సారే అంటూ అతను వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ గాడ్ నాన్న గారు ఇంకా ఇంటికి రాలేదు. హమ్మయ్య అనుకుంటూ ఇంట్లోకి నడిచాను. అమ్మ  ఇంత లేట్ ఏంటి అని అడిగింది. ప్రైవేట్ క్లాసు ఉందమ్మా అంటూ
ఓ అందమైన అబద్ధం ఆడేసి  నా రూమ్ లోకి నడిచాను.

ఇంటికి వచ్చాను అన్న మాటే గాని అతని తలపులే నన్ను వేదిస్తున్నాయి ఎటు చూసినా అతని మాటలే వినిపిస్తున్నాయి.ఒక మనిషిని చూడగానే ఒక్కరోజులో
ఇంత ప్రేమించగలరు అని ఎవరైనా చెబితే నేను నమ్మే దాన్ని కాదు. కానీ నా విషయంలో జరిగింది కాబట్టి నేను నమ్మక తప్పదు. ఆ రాత్రి చాలా ఆలస్యంగా తెల్లవారి నట్టు అనిపించింది. నాకైతే అసలు నిద్ర పట్టలేదు
రేపు వచ్చి అతను ఏం మాట్లాడతాడో నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో ఇదే నా భయం అంతాను

అనుకున్నట్టుగానే తెల్లవారింది. నాన్న ఎవరితోనో పొద్దున్నే పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు. ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో అమ్మ రాగానే అడిగాను ఎవరు అమ్మా నాన్న అంత గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమో నాకు తెలియదు ఉంది అమ్మ
ఇంతలో అక్క నా సెల్ కి కాల్ చేసింది. ఏం చేస్తున్నావ్
సాహి అంటూ అక్కకి విషయం మొత్తం చెప్పాలి అనిపించింది. కానీ ఇప్పుడు కాదు నాన్న గారు బయటికి వెళ్లిపోయాకనే  చెప్పాలి అనుకున్నాను. అమ్మతో చెప్పాను ఈ రోజు కాలేజీకి వెళ్ళను అమ్మ అని. అమ్మ ఎందుకు అని కూడా ప్రశ్నించలేదు. సరే నీ ఇష్టం అంది.

సమయం గడుస్తున్న కొద్దీ నాకెందుకో గుబులుగా అనిపిస్తుంది. అతను వస్తాడేమో నాన్నగారు ఏమంటారో అని ఇంతలో బయట ఎవరో వచ్చిన సడీ అయింది.
ఎవరా అని చూస్తే అక్క బావ కారు దిగుతున్నారు. నాకు ఒక్క క్షణం ఆశ్చర్యంగా అనిపించింది కనీసం వస్తున్నామని అయినా చెప్పలేదు. ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చారు అనిపించింది. అయినా సంతోషంగా అక్క కి ఎదురు వెళ్లి చిరునవ్వులు చిందిస్తున్న బాబుని అందుకున్నాను. రండి బావగారు అని పిలుస్తూ
ఆయన్ని పలకరించాను. ఎలా ఉన్నావ్ రా అని అడుగుతున్న మా బావగారికి బాగున్నాను అంటూ తల ఊపాను. మా మధ్య ఎందుకో బావామరదళ్ళ మధ్య ఉండే సరదాలు ఉండవు. అతన్ని చూస్తే నాకు అన్నయ్య లేని లోటు తీరుతున్నట్టు గా అనిపిస్తుంది.

నాకు ఇప్పుడు హమ్మయ్య అనిపించింది .ఒకవేళ ఇప్పుడు అతను వచ్చిన నాన్నగారు పెద్దగా కోపం తెచ్చుకోరు బావగారి ముందర.హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. బాబుని నాకు అప్పగించేసి అక్క వంటింట్లో చేరింది. బావగారు నాన్నగారితో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారు. నేను బాబు ని తీసుకుని నా రూం లో కి వచ్చేసాను. వాడి తో ఆడుకుంటూ అతని గురించి ఆలోచిస్తున్నా. కాల్ చేద్దామంటే కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు.అయినా ఇడియట్ కనీసం పేరైనా చెప్పలేదు. పైగా పేరు అడిగితే పుల్లయ్య అని చెప్తాడా అతన్ని నిజంగా ఆ పేరుతోనే పిలవాలి అప్పుడు చూడాలి అతని మొహం. అలా అనుకోగానే నా పెదవుల మీద కి చిరునవ్వు వచ్చింది.

కానీ నాకు ఒకటి మాత్రం అర్థం కాలేదు. ఇప్పుడు బావగారు ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చినట్టు. నాన్న గారు బావగారు అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నట్టు. అక్క ని చూస్తుంటే కూడా నా దగ్గర ఏదో దాస్తున్నట్టు కాస్త తేడాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఎలాంటి విషయమైనా నాతో చెప్పే అక్క
ఇప్పుడు వస్తున్నాము అని కూడా చెప్పలేదు ఎందుకనో. అలా ఆలోచిస్తూ ఉండగానే సాయంత్రం అయిపోయింది.
అక్క బావ బయటికి వెళ్దామా అని అడిగారు. అమ్మో నేను బయటికి వెళ్లినప్పుడు అతను వస్తే, ఉహూ నేను రాను, నాకు కాస్త తలనొప్పిగా ఉంది అక్క అని చెప్పాను
సరేలే రేపు వెళ్దాం లే ఏం పర్వాలేదు అంది అక్క.
నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అతను ఇంకా రాలేదు ఏంటి. భయపడ్డాడు ఏమో లేదా నిన్న టైం పాస్ కోసం అలా చేశాడా, కానీ నాకు అతన్ని చూస్తే అలా అనిపించలేదు మంచివాడు లా అనిపించాడు.

ఇంతలో నేను ఇలా ఆలోచిస్తూ ఉండగానే మా ఇంటి ముందు ఏదో ఒక బండి ఆగిన శబ్దం వినబడింది. బయటికి పరిగెత్తుకు వెళ్లి చూడాలనే నా మనసుని కంట్రోల్ చేసుకుంటూ రూమ్ లోనే ఉండిపోయాను.
నాకు బయట అతని మాటలు వినబడుతున్నాయి.
హాయ్ అంకుల్ నమస్తే అంటూ నాన్న తో మాట్లాడడం
మా బావగారిని విష్ చేయడం అక్కని పలకరించడం
అన్ని తెలుస్తున్నాయి కానీ నాకు బయటికి వెళ్లడానికి
ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు ఏమవుతుందో నాన్నగారు ఎలా ఫీలవుతారో ఇలా పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో అక్క లోపలికి వచ్చింది. నేను కూర్చున్న దాన్ని లేచి నిలబడ్డాను. నాకు మరీ అంత గౌరవం అక్కర్లేదులే, అంది కోపంగా ఏమైంది అక్క అని అడిగాను, చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నావా , నేను వయసులో పెద్దదాన్ని అయినా సరే నా ప్రతి విషయం నీకు చెప్తాను. కానీ నువ్వు నాకు ఏమీ చెప్పలేదు. అంటే నాకు పెళ్లి అయిపోయింది అని నువ్వు నన్ను పరాయి దానిలా చూస్తున్నావా అంది కోపంగా, అయ్యో అక్క అసలు ఏం జరిగింది చెప్పు అన్నాను. ఎవరో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి వరకు వచ్చి ఆ అబ్బాయి మన ఇంటికి వచ్చి చెప్తే గానీ మాకు విషయం తెలియలేదు. నువ్వు నోరు తెరిచి చెప్పలేదు ఇదీ అంతా ఎప్పటినుంచి మొదలైందో చెప్పు అంది. నిజంగానే అక్క ఇది ఎప్పటి నుంచో మొదలవలేదు. నిన్నటి నుంచి మొదలైంది
అన్నాను. నువ్వు అబద్దాలు చెప్తే మేము నమ్మాలి మరి అంది అక్క నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అక్క. నిన్న పొద్దున్న ఒకరినొకరు చూసుకున్నాము.
నిన్న సాయంత్రం మాట్లాడుకున్నాము. అంతే అన్నాను.
ఇంతలో కాసేపటికి అమ్మ లోపలికి వచ్చి సాహినీ కాస్త రేడి చేసి తీసుకురా అని చెప్పింది అక్కకి.
అక్క ఓ పది నిమిషాల తర్వాత నన్ను బయటకు తీసుకు వచ్చింది. తీసుకొచ్చి సోఫాలో నాన్నగారి పక్కన కూర్చో పెట్టింది.నా ఎదురుగా కుర్చీలో అతను
నేవి కలర్ బ్లూ టీ షర్ట్ జీన్స్ లో చాలా హ్యాండ్ సమ్ గా మ్యాన్లీ గా ఉన్నాడు. ఒక్కసారి మా చూపులు కలుసుకున్నాయి.
నన్ను చూడగానే అతని కళ్ళల్లో మెరుపు నాకు తెలుస్తోంది.  ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు అంత సైలెంట్ గా ఉన్నారు. నాకేమో మనసులో భయం గా అనిపిస్తోంది.  ఇప్పుడు చెప్పండి అన్నారు మా నాన్నగారు. అంకుల్ నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను. మీక్కూడా ఇష్టమైతే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు సీరియస్ గా.

ఒకవేళ మేము ఒప్పుకోకపోతే అన్నారు నాన్న గారు.
అప్పుడు ఏం చేయాలో ఇంకా నేను మీ అమ్మాయి ఆలోచించుకోలేదు అంకుల్ అన్నాడు. అతను అలా మాట్లాడుతుంటే నాకు చెమటలు పట్టేస్తున్నాయి.
నాన్నగారితో అలా మాట్లాడొద్దు అని చెప్పాలనిపించింది కానీ వీలు కాదే ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను.
అక్కడి వాతావరణం అంతా కొంచెం గంభీరంగానే ఉంది.

ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో అన్నట్టు అందరూ సైలెంట్ గా ఉండి పోయారు. ఇంతలో నాన్న గారు, బావ గారితో ఏమంటారు అల్లుడు గారు అని అడిగారు. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే చేసేద్దాం మామయ్య
అన్నారు మా బావ గారు. ఒకవేళ మీకు మీ అమ్మాయికి ఇష్టం కాకపోయినా నేను బలవంతంగా అయినా సరే పెళ్లి చేసుకుంటాను అన్నాడతను. అతను అలా మర్యాద లేకుండా మాట్లాడటం నాకు నచ్చలేదు.
ఇంతలో మా బావగారు అతని భుజం మీద గట్టిగా కొట్టారు.ఇంకా నీ వేషాలు చాలు సంతోష్ అంటూ.
ఏం బ్రో కాస్త ఎక్కువైందా నా ఓవరాక్షన్ అని అడిగాడు అతను. నాకేమీ అర్థం కాలేదు.అక్క వైపు చూశాను కోపంగా . అక్క నవ్వుతూ అయ్యో నా చిట్టి చెల్లి అతను
బావ గారి వాళ్ళ బాబాయ్ కొడుకు. నాకు మరిది నీకు అతను తెలియదు గానీ అతనికి నువ్వు ఎప్పటి నుంచో తెలుసు. అతను ని ఫోటో చూసిన క్షణం లోనే నిన్ను ఇష్టపడ్డాడు. కానీ అతను ఇష్టపడితే సరిపోదు కదా.
మా చెల్లికి మీరు కూడా ఖచ్చితంగా నచ్చి తీరాలి అని చెప్పాను.  అందుకే అతను తనని తాను నీకు కూడా నచ్చేలా చేసుకున్నాడు. ఇదంతా నేను నీకు ముందే చెప్తాము అనుకున్నాను సాహి కానీ ఇదంతా నీకు గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం గా మిగిలిపోతుంది అని నువ్వే తెలుసుకుంటావు అని నేను ఏమి చెప్పలేదు.
అంది అక్క నన్ను బ్రతిమాలుతూన్నట్టుగా కానీ నేను బుంగమూతి పెట్టాను. అతను బుజ్జగిస్తున్నట్టుగా
నా కళ్ళలోకి చూసాడు. నేను అతని వంక చూడకుండా మొహం కోపంగా తిప్పేసుకున్నాను. అప్పుడే ఈ మాటలు అవన్నీ దగ్గర దగ్గరగా 15 రోజుల నుంచి జరుగుతున్న నాకు చిన్న విషయం కూడా తెలియదు.
అమ్మ గాని అక్క గాని ఏ విషయం చెప్పలేదు. అందుకు మాత్రం నాకు బాగా కోపం వచ్చింది. ఇంతలో అతను లేచి నిలబడ్డాడు. సరే అంకుల్ నేను వెళ్తాను . రేపు సాహి నీ చూపించటానికి అమ్మ నాన్నను తీసుకొస్తాను.
అంటూ బై అన్నయ్య బై వదిన అంటూ అమ్మకి కూడా చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నా ఒళ్ళోఆడుకుంటున్న
బాబునిఎత్తుకునే వంకతో బాబుని తీసుకుని వాడ్ని ముద్దు చేస్తూ మళ్లీ వాడిని నా ఒళ్ళు పడుకో బెడుతూ
ఐ లవ్ యూ సాహి.నేను నీకు కాల్ చేసి నీతో తర్వాత మాట్లాడుతాను.  ఇంకా నీతో చాలా మాట్లాడాలి
నామీద కోపం తెచ్చుకోకు బంగారు అంటూ  అతను వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు తెలిసింది అతని పేరు సంతోష్. నా పేరు చెప్తే నీకు సంతోషం కలుగుతుంది
అన్నాడుగా. తన పేరే సంతోష్ నాకు అతని పేరు వినగానే సంతోషంగానే అనిపించింది. ఇంతలో నాన్న
బావ గారితో నాకు అల్లుడు అయినా కొడుకు అయినా
మీరే. మా సాహికి కూడా మంచి సంబంధం తీసుకొచ్చారు.
మీకు ఎంతో రుణపడి ఉంటాను అల్లుడు అన్నారు.
అయ్యో మావయ్య మన మధ్య రుణాల గొడవేంటి.
నాకు మా అమ్మ నాన్న ఎంతో మీరు కూడా అంతే.
మీరు అలా మాట్లాడితే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది.
అయినా నాకు సాహినీ చూస్తే నా చెల్లెలు లాగే అనిపిస్తుంది. అన్నాడతను. అంతా మా అదృష్టం మా పిల్లల అదృష్టం. ఈ రోజుల్లో ఆడ పిల్లలకి మంచి భర్త దొరకడం కష్టమే కానీ మేము ఏం పుణ్యం చేసుకున్నామో
మీలాంటి వారు అల్లుడిగా దొరికారు.  అన్నారు.
ఇంతలో అక్క చాల్లే నాన్న ఆపండి మీ పొగడ్తలు. అనడంతో ఇంకా ఆపేశారు.

ఇంతలో అక్క నన్ను నీ ఫ్రెండ్ శైలజ ఫోన్ చేస్తుంది అంటూ లోపలికి పిలిచింది. నేను లోపలికి వచ్చి ఫోన్ తీసుకున్నాను. హలో అనగానే సారీ అంటూ అవతలి వైపు నుంచి అతని గొంతు, నాకేం చెప్పక్కర్లేదు అంటూ కాల్ కట్ చేశాను. వరుసగా సారీ సారీ అంటూ మెసేజ్ ల వర్షం కురుస్తూనే ఉంది. వెంటనే నేను అతని నెంబర్ కి ఫోన్ చేసి ఇంక చాలు ఆపండి అన్నాను. అమ్మయ్య కోపం తగ్గిందా అంటూ అతను ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అమ్మ వాళ్ళుఏమో, రేపు పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు ఏం చేయాలి. పెళ్లి ఎలా చేయాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ హాల్ లోనే ఉన్నారు.
నాకు చాలా సంతోషంగా అనిపించింది.
నా ఒక్క రోజు ప్రేమ ప్రయాణం పెళ్లి అనే స్టేషన్లో ఆగి మరికొద్ది రోజుల్లో ముగియ బోతోంది.  ఎప్పటికీ నా సంతోష్ తో కలిసి ఉండబోతున్నాను నేను.అందుకే ఈ సంతోషం నాకు.మరి నా కథ చదివి మీరు కూడా సంతోషంగానే ఉన్నట్లేగా మరి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!