ప్రకృతి పై ప్రేమ

ప్రకృతి పై ప్రేమ

రచన : పి. వి. యన్. కృష్ణవేణి

చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మధ్యలో సన్నని తారు రోడ్, ఆ రోడ్ పైన నేను ఉన్న కారు.  మా వారు డ్రైవింగ్ సీట్లో. నేను చుట్టూ చూస్తూ ఉంటే,  మావారు మాత్రం నన్నే చూస్తున్నారు, నేను గమనించలేదు ఆయన్ని, ఏమి చేయను ? 40 సంవత్సరాలు అనుబంధం, ఆ ప్రకృతితో నాకు, కానీ, మళ్ళీ ఇప్పుడు పూర్తిగా నా సొంతమౌతోంది ఆ ప్రకృతి.  ఆలా అనుకున్నప్పుడు, నా మనసు ఒక దూది పింజమే అయింది. ఈ ఊరు, ఈ గాలి, సెలయేరు ……. అని రాగం తీస్తూ ఉన్న నాకు, నా గతం కళ్ల ముందు నాకు కదిలింది.

మాది తూర్పు గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు.  ఇంకా అటువైపు ప్రకృతి సోయగాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎందుకంటే,  ఆ సోయగాన్ని వివరించటం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది కదా! మా వూరు అయితే, ప్రకృతి తల్లి ఒడిలో ఉన్నట్లు  ఉంటుంది.

నా చిన్నతనంలో ఆ ఊరిలో నేను చేసిన అల్లరి, నేను పొందిన ఆనందం, అంతా, ఇంతా కాదు.  ఆ ఊరికి మధ్యలో ఉంటుంది మా ఇల్లు.  ఇంటి చుట్టూ ప్రహరీ.  పెద్ద మండువా ఇల్లు మాది.   ఇల్లు ఎంత పెద్దదో చుట్టూ ఉండే స్థలం కూడా అంత పెద్దది.  దానిలో రక రకాల పూల మొక్కలు, కాయగూర మొక్కలు, సపోటా, మామిడి కాయ మొక్కలు ఉండి,  నిద్ర లేచి బయటకు రాగానే స్వాగతం చెపుతున్నాయా? అన్నట్టు నన్ను చూసి నవ్వే, నేను పెంచిన రోజా మొక్కలు.

ఆలాగే సాయంత్రం అయ్యేసరికి, మంచి సుగంధం అల్లుకునే సన్నజాజి, విరజాజి మొక్కలు. ఇంకా ఇంటి ఆరుగు మీద కాలక్షేపం కోసం చుట్టూ చూస్తే, దూరంగా పచ్చదనంతో నిండి ఉన్న కొండలు, కొండలపైన నుంచి, ఎగసిపడే కెరటాలు, నాలాగే ఆనందంగా గంతులేస్తున్నట్లు ఉంటాయి.  ఇంకా ఊరు నిండా ఆకాశాన్ని అంటినట్లు ఉండే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, ఆకాశంలో సూర్య, చంద్రుల్ని అందుకోవాలన్నట్లు ఎదుగుతూ ఉంటాయి.  ఇదండీ మా ఊరు, మా ఇల్లు అంటే నాకు మదిలో ఉన్న  ప్రేమ.

ఇంకా కారు ఆ రోడ్డుపైనే, ఆలా ఆలా స్పీడుగా వెళుతోంది.  నాలోని ఆనందం చూసి, మావారు చిన్నగా నవ్వుకున్నారు నేను అదేమి గమనించన్నట్టుగా కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాను.  ఇంకా 10 కి. మి. అంతే ఇప్పుడు మేము ఉండే ఇంటికి చేరుకోవచ్చు.  కొంచెం కొంచెంగా బయటనుంచి నాకిష్టమైన మట్టివాసన, నా ముక్కుకు తాకుతోంది.
నేను ఈ సారి, గుర్తుకొస్తున్నాయి…..గుర్తుకొస్తున్నాయి….. అన్న పాట నెమరువేసుకుంటూ ఉన్నాను.   హ! మీకు ఇప్పటికే అర్ధం అయి ఉంటుంది కదా! నాకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో, పాటలన్నా అంతే ఇష్టం.  ఇంకో ఇష్టం కూడా వుందండోయ్,  ఏమిటో తెలుసా, బట్టల పిచ్చి. ఆ పిచ్చి గురించి తరువాత చెప్తాను.

ఆ పిచ్చిలు, అవన్నీ కూడా ఇంకా ఆలాగే ఉన్నాయి.  పెద్ద వయస్సు వచ్చిందని మనస్సు మారదు కదా ! నేను ఆలోచనలో ఉండగానే, మా కాలేజీ రోడ్డులోకి వచ్చేశాము.  ఆ ప్లేసులోకి రాగానే ఇంకా ఇంకా అక్కడే ఉండాలని ఉంది.  కానీ జీవితం నడచినట్టే, కారు కూడా నడుస్తూ ఉంది.

మేము ఉండబోయే ఊరులోకి వచ్చింది కారు.  ఈ ఊరు కూడా చాలా బాగుంది మా చిన్నప్పుడు ఉన్న ఊరులాగా అందంగా ఉంది. హ! ఈ ఊరులో ఒక చిన్న ఇల్లు కొన్నారు మా వారు.   మా శేషజీవితంలో ఆనందం కోసం.

అవును మరి, చిన్నప్పటినుంచి ఈ ఊరి  పైన అభిమానం నాకు.  పెళ్లి కుదిరింది, పెళ్ళికొడుకు హైదరాబాద్ లో  ఉద్యోగం అనగానే మొదటగా ఈ ఊరు వదలి  వెళ్లాలని ఏడిచాను నేను.  కానీ ఎప్పటికైనా తప్పదుకదా !  అని అమ్మ, నాన్న నచ్చ చెప్పారు నాకు. అనుకున్నట్లుగానే శ్యామ్ ( మా వారు ) చాలా మంచి వారు నా అభిరుచికి తగినట్లుగానే  హైదరాబాద్ లోనే ఒక మంచి ఇల్లు, చుట్టూ విశాలమైన స్థలం ఉండేటట్లుగా చూసి కొని ఉంచారు,  మా పెళ్లి అయ్యే నాటికీ.  తరువాత నేను వెళ్ళేక, మా ఇంటిని ఒక నందనవనంలాగా తయారు చేసుకున్నాను.

అలాగే జీవితంలో కూడా ఏ లోటు లేకుండా మేము ఇద్దరం, మాకు ఇద్దరు అన్నట్టు గానే ఇద్దరు ముత్యాలాంటి పిల్లలు, వాళ్లు ఇద్దరూ కూడా జీవితంలో స్థిరపడ్డారు.  మా అబ్బాయి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. హైదరాబాద్ లోనే.  మా అమ్మాయి సైకోలజీ లో గ్రాడ్యుయేషన్ చేసింది. వాళ్ళు వైజాగ్ లో ఉంటున్నారు.  మా పిల్లల ఇద్దరికీ 6 నెలల తేడా తోనే పెళ్లి చేసాము. ఇక మా వారు, ఈ మధ్య నే రిటైర్ అయ్యారు.

భాద్యతలు అన్నీ తీరిపోయాక, మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలన్న నా కోరిక ప్రకారం, మా వారు నా కోసం ఈ ప్రకృతి మాత ఒడిలో నాకు ఒక ఇళ్లు కొన్నారు.

నా ఆలోచనలకి తెర వేస్తూ, మా ఊరు వచ్చింది. ఇద్దరం కారు దిగాము. అప్పటికే సాయంత్రం 5 గం . అక్కడ దిగేసరికి, మేము వస్తున్నామని తెలిసిన నా చిన్ననాటి స్నేహితులు ఇద్దరు, ముగ్గురు వచ్చి మాకు చల్లటి కొబ్బరిబోళ్లం నీళ్లు అందచేశారు.

నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడే స్థిరపడ్డారని తెలిసి, మా వారు నాకోసం ఇక్కడే ఇల్లు తీసుకున్నారు. మరి మా సొంత ఊరిలో నా బంధువులు ఉన్నా, దూరంగా ఉంటేనే బంధాలు నిలుస్తాయి అన్న చిన్న నమ్మకం. అందుకే దగ్గరలోని పక్క ఊరిలో మాకు తీసుకున్నారు ఇల్లు. మా బంధువులు అందరూ రేపు వస్తామన్నారు.

నేను, మా వారు, మా స్నేహితులు కాసేపు కూర్చుని మాట్లాడుకున్నాము. తరువాత వాళ్ళు వెళ్లిపోయారు. మా వారు ఫ్రెష్ అయి వచ్చాక, నేను ఫ్రెష్ అయి వద్దామని వెళ్ళాను.

స్నానం చేసి  వచ్చాక, మా వారు నన్నే తదేఖంగా చూస్తున్నారు. అవును మరి, ఎందుకు చూడరు?

నేను ముందే చెప్పానుగా, నాకు ఈ ప్రకృతి అంటే ఎంత ప్రేమో, బట్టలు అన్న అంత ప్రేమ అని. నాకు చిన్నప్పటి నుంచి ప్రకృతి మార్పుని బట్టి, చీర, ఆ రోజుల్లో అయితే డ్రెస్ లేక లంగావోణీ, గాగ్రా వేసుకోవటం అలవాటు.

ఎలాగంటారా? వాన పడినప్పుడు, నీలం రంగు(వాటర్ కలర్), ఎండగా ఉన్నప్పుడు, లైట్ ఆరంజ్(సూర్యుడి రంగు), సూర్యోదయానికి (లైట్ పసుపు), సూర్య అస్తమయానికి(లైట్ క్రీమ్), మబ్బుగా ఉంటే, ఆకట్టుకునే, పింక్ కలర్, అలాగన్నమాట.

అలాగే కాలేజీకి వెళ్ళేటప్పుడు రెడీ అయి వెళ్లేదాన్ని. సరే , ఇప్పుడు ఏంటి, 60 లో ప్రేమ అనుకోకండి. మా వారి చూపుకి  కారణం వేరే ఉంది.

ఇప్పుడు, ప్రకృతికి నిదర్శనంగా, నిండు ఆకుపచ్చ చీర కట్టుకున్నాను. అదే మా వారి ఆశ్చర్యానికి కారణం. మాములుగా అయితే, నిండు రంగులు స్కూల్ కి డీసెంట్ గా ఉండవు అని కట్టేదాన్ని కాదు.కానీ, ఈ రోజు ప్రకృతితో పాటు నేను స్పందించాలి కదా, నా చిన్నతనంలో లాగా.

ఇంతకీ నేను మీకు చెప్పలేదు కదా, నేను ఒక స్కూల్ లో టీచర్ ని. ఇక్కడ పిల్లలకి సరి అయిన విద్య అందట్లేదు అని మా ఫ్రెండ్స్ చెపితే, నేను ఇక్కడకి ట్రాన్సఫర్ పెట్టుకున్నాను. కానీ, అంతకుముందే, మా వారు నా కోసం ఇల్లు ఇక్కడే కొన్నారు అనేది, యాదృచ్చికం. ఇన్నేళ్ల జీవితంలో నన్ను బాగా అర్ధం చేసుకున్నారు.  అందుకే  అంటారు, ప్రేమకు వయసు లేదు అని.

మా వారు రిటైర్ అయింది ఫారెస్ట్ డిపార్టుమెంటు. కనుక తను  ఇక్కడ, నర్సరీ ఏర్పాటు చేసుకుని, ఇంకా కొత్త వంగడాలతో, కొత్త మొక్కల సృష్టి, అలాగే ఇక్కడ వాళ్లకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు నేర్పే ఒక చిన్న సంస్థ లాంటిది నెలకొల్పాలని, మా ఆలోచన. ఆ ఆలోచనకి మా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్.  ఓపిక ఉన్నంత వరకూ, ఎదో ఒక విధంగా, ఎదుటి వారికి ఉపయోగపడాలి అనేది మా ఇద్దరి కోరిక. అందులో, మాకు ఇప్పుడు అవకాశం కూడా కలసి వచ్చింది. ఇంకా ఏమి కావాలి చెప్పండి, ఈ వయసులో, మానసిఖంగా సంతోషంగా ఉండటానికి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!