అర్షిక

అర్షిక

రచన: రాయల అనీల

‘ఇంకా ఎంత సేపు మేడం ….చూసినవే చూస్తున్నారు ఏది ఫైనల్ చేయట్లేదు’

“నచ్చాలి కదండీ….అది ఒకసారి చూపించండి”

‘అది ఇందాక చూపించాను మేడం ఇప్పుడే లోపల పెట్టాను’

“ఒక్కసారి చూపించండి ….అదేదో బాగుంది “

‘ఏంటి మేడం…. మీరు వచ్చి 3 గంటలు అవుతుంది ఒక్కటి కూడా తీసుకోవట్లేదు అందరూ వెళ్లిపోతున్నారు మా షాప్ టైం కూడా అయిపోయింది ….మీరు రేపు రండి మేడమ్ రేపు కొత్త స్టాక్ కూడా వస్తుంది ‘

“అయ్యో …. లేదు లేదు ఇవాలే కొనాలి ఒక్క 10 నిమిషాలు ఆగండీ

ఇదిగో వీటిని ప్యాక్ చేయండి  …. హ విడివిడిగా ప్యాక్ చేయండి “

బిల్ కట్టి కొన్న ప్యాకెట్స్ స్కూటీలో పెడదాం అని వచ్చేసరికి అప్పటిదాక మోగి మోగి ఇక నా వల్ల కాదని ఆగిపోయిన ఫోన్ ని చూస్తే ” అమ్మ నుంచి 28 మిస్డ్ కాల్స్

అమ్మ ఏంటి ఇన్ని సార్లు కాల్ చేసింది…. వామ్మో ఇప్పుడు కాని ఫోన్ లిఫ్ట్ చేస్తే అంతే ఇక ఏంచేద్దాం…. హ మెసేజ్ చేద్దాం….  అదే మంచిది

“వస్తున్నా…. మమ్మీ 15 మినిట్స్ ” అని మెసేజ్ చేసి స్కూటీ స్టార్ట్ చేసేలోగా ట్రింగ్ .. ట్రింగ్

అమ్మ మెసేజ్ ‘ ఇంటికి రా నీ పని చెప్తా ‘ అమ్మో మాంచి ఫైర్ మీద ఉందనుకుంటాగా అర్జెంట్గా కూల్ చేయాలి ” సరే మమ్మీ నీ ఇష్టం …. లవ్ యూ “

మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ కొన్న పాకెట్స్ రూమ్ లో పెట్టి హమ్మయ్య ఎవరూ చూడలేదు అని వెనకకు తిరగ్గానే అమ్మ చేతులు కట్టుకొని కోపంగా చూస్తుంది

” అయ్యా ఇలా బుక్ అయ్యాను ఏంటి …. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి “

‘ఏంటి ఏం చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా ‘

” అబ్బే అలాంటిది ఏమి లేదు అమ్మ …. ఐనా నేనేందుకు అలా చేస్తాను అమ్మ అయినా నాగురించి నీకు తెలీదా చెప్పు “

‘ చాలు చాలు…. ఆపేయ్ ఇక ‘

” సరే….అమ్మ “

‘ఐనా నీకు ఎన్ని సార్లు కాల్ చేయాలే …. ఫోన్ వుంది దేనికీ లిఫ్ట్ చేయాలి అని తెలీదా

ఎంత భయమేసిందో తెలుసా అసలు ‘

” అయ్యో సారీ అమ్మ …. చెప్పాను కదా లక్కీ దగ్గరకి వెళ్తున్నాను అని చాలాకాలం తర్వాత ఫ్రెండ్ ని కలిసానుగా డిస్టర్బన్స్ ఎందుకని ఫోన్ సైలెంట్ లో పెట్టాను ఇలా అవుతుంది అని అనుకోలేదు …. సొర్ర్య్ అమ్మ ఇంకోసారి ఇలా చేయను “

‘ సరే సరే నేనేం మిమ్మల్ని డిస్టర్బ్ చేయనులేకాని ….నీకు లేట్ ఐతే నాకు ఒక కాల్ చేసి చెప్పు బంగారం నాకు టెన్షన్ లేకుండా ఉంటుంది ‘

” సరే అమ్మ “

‘ భోజనం చేద్దువుగాని రా నాన్న ‘

” లేదమ్మా …. నాకు ఆకలిగా లేదు “

‘ అదేంటే పోనీ పాలైన తాగు ‘

” అలాగే …. అమ్మా నాకు కొంచెం వర్క్ వుంది గుడ్నైట్ “

‘ మరీ లేట్ చేయకు చిన్నా ….తొందరగా పడుకో ‘

” సరే అమ్మ “

రూంలోకి వచ్చి ఎప్పటినుంచో రాయాలనుకొని రాయలేకపోయిన డైరీని తీసుకొని

నిన్ను ఎప్పటినుంచో రాద్దామనుకుంటున్న కానీ రాయలేదు ఇవాళ రాస్తున్నాను ఎందుకంటే ఇవాళ నేనెంతో సంతోషంగా వున్నాను ఎందుకోతెలుసా అసలైన సంతోషం అంటే ఏంటో తెలిసింది ఇదే రోజున కాబట్టి.

అవును అప్పటిదాకా నేను అనుకునే సంతోషం అసలైనది కాదు అది కేవలం తాత్కాలికమే  అని అప్పుడే అర్థమైంది. ఇంకొకటి నా పేరుకున్న అసలైన అర్ధం తెలిసింది కూడా ఆరోజే…..

హేయ్… నీకు నా పేరు తెలీదు కదా ….నా పేరు అర్షిక.

మా అమ్మ నాన్న ఎంతో ఇష్టపడీ మరీ పెట్టుకున్నారంట నాపేరు కానీ ఇంట్లో చిన్నదాన్ని అని అమ్మ ‘చిన్నోడా’ అని నాన్న ‘మమ్మీ’ అని పిలిచేవారు అక్క ని ‘పెద్దోడా’ అని పిలిచేవారు

నీకు తెలుసా అమ్మ ,నాన్న అసలు నాకు ఏ పని చెప్పేవాళ్ళు కాదు అక్క ఐతే ఇంకా గారాబం చేసేది

ఏ పని చేయనిచ్చేది కాదు. అసలు బాదంటే ఏంటో కూడా తెలీకుండా పెంచారు మా వాళ్ళు అంతేనా అక్కకి, నాకు ఐతే చాల స్వేచ్చ ని ఇచ్చారు ఎప్పుడు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు . అమ్మాయిలు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎప్పుడు కట్టడి చేయలేదు . నలుగురిలో ఎలా ప్రవర్తించాలో, సాటి మనిషికి ఎలా సాయపడాలో, ఎలా గౌరవించాలో మాత్రమే చెప్పేవారు . మా ఇష్టాన్ని ఎప్పుడూ కాదనేవారే కాదు

నేను కూడా చాలా అల్లరి పిల్లని తెలుసా …. చిన్నపుడు చదువులో ముందుండేదాన్ని, అమ్మ ని కూడా తెగ విసిగించేదాన్ని అంట అది చెప్పు ఇది చెప్పు అని . అందుకే 13 సంవత్సరాలకే నా పదవతరగతి కూడా పూర్తయింది…. నా ఫ్రెండ్స్ అందరు నా కన్నా పెద్దవాళ్ళే ఐనా వాళ్ళతో పోటీపడి మరి చదివే దాన్ని కానీ వాళ్ళకి ఉన్నంత జనరల్ నాలెడ్జి ఉండేది కాదు ఆ విషయంలో అక్క నాకు చాల హెల్ప్ చేసేది .

**

ఒకసారి ఏమైందో తెలుసా అప్పుడే నా ఇంటర్ పూర్తయ్యింది.

అక్క : ‘ అర్షి …. నేను చెప్పేది విను ఈ కాలేజీ అంత పెద్ద కాలేజీ ఎం కాదు ఇందులో జాయిన్ అవ్వకు ‘

నేను : ” ఎం కాదు నీకు ఇష్టం లేక అలా చెప్తున్నావ్ “

అక్క : ‘ నీ తలకాయ ..నాకిష్టం లేక కాదే ఈ కాలేజీ నువ్వనుకునెంత ఏమి ఉండదు ‘

నాన్న : ‘ మమ్మీ ..నా మాట వినమ్మ అక్క చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు ‘

నేను : “పోండి …. మీరిద్దరూ ఒక్కటే నేను అమ్మ ని అడుగుతా “

నేను : ” అమ్మ…. అమ్మ “

అమ్మ : ‘ఏంటి చిన్నోడా ….ఏమైంది’

నేను : ” అమ్మ మరేమో నాన్న,అక్క,నన్ను B.Tech వేరే కాలేజీ లో జాయిన్ అవ్వమంటున్నారు నాకేమో ఇష్టం లేదు నువ్వు చెప్పు ఎక్కడ జాయిన్ అవ్వమంటావో “.

అమ్మ : ‘ పెద్ద సమస్యే వచ్చిందే నా చిట్టితల్లికి …. నేను ఎక్కడ చెపితే అక్కడ జాయిన్ అవుతావా మరి నువ్వు ‘

నేను ; ” హ ..అమ్మ “

అమ్మ : ‘ ఐతే నువ్వు అక్క చదివే కాలేజీ లో జాయిన్ అవ్వు ‘

అక్క : ‘ అదేంటి అమ్మ నువ్వు కూడా ‘

అమ్మ: ‘ అది చిన్నప్పటి నుంచి నీతోనే కదా స్కూల్ కి ,కాలేజీ కి వెళ్ళేది మరి ఇప్పుడు వద్దు అనేసరికి  దానికి కష్టం గా వుంది .అందుకే మీకేం చెప్పాలో తెలియక మీరు చెప్పే కాలేజీ లో జాయిన్ అవ్వను     అంటుంది ‘

నాన్న : ‘ వద్దు అని కాదురా …. ఎప్పుడు ఇలానే ఉంటే అది నలుగురిలో ఎలా కలుస్తుంది .ఇప్పుడు కాకపోయినా జాబ్ వచ్చినప్పుడైనా అది ఒక్కతే ఉండాలిగా ‘

అమ్మ : ‘ అప్పటి సంగతి అప్పుడు చూస్కుందాంలెండి ‘

నేను ; ” థాంక్యూ థాంక్యూ థాంక్యూ ….అమ్మ “

చూసావా అదేంటో నేను అమ్మ కి ఏమి చెప్పకపోయినా నేనేం అనుకుంటానో, నాకేం ఇష్టమో అన్ని అమ్మ కి తెలుస్తాయి.ఎంతయినా అమ్మ కదా అంతే బిడ్డ బాధ తెలిసిపోయిద్ది , నాన్నేమో నా భవిషత్తు గురించి ఆలోచిస్తాడు అంతే తేడా .

అలా అక్క చదివే కాలేజీ లోనే జాయిన్ అయ్యా ఎలాగో మా అక్క సీనియర్ కాబట్టి నన్ను ఎవరూ ర్యాగింగ్ అని ఇబ్బంది పెట్టలేదు.

ప్రసన్న అని నా క్లాసుమేట్ చాల తక్కువ టైం లోనే బెస్టుఫ్రెండ్ ఐంది. ఇద్దరిలో ఎవరు కాలేజీ కి రాకపోయినా ఇంకొకరం వెళ్ళేవాళ్ళమే కాదు అంత బెస్టుఫ్రెండ్స్ అయ్యాము .

B.Tech మొత్తం కొంచం అల్లరి ,కొంచం చదువుతో పూర్తయింది .

ఇక అప్పుడొచ్చింది అసలు సమస్య అప్పటిదాకా ఏ కన్ఫ్యూషన్ లేకుండా సాగిపోయిన నా జీవితంలో అప్పుడు మొదలయింది కన్ఫ్యూషన్ .

తర్వాత ఎం చేయాలి అని అక్కేమో ఎంటెక్ చేస్తుంది నాకేమో ఎంటెక్ ఇష్టం లేదు , అప్పటిదాకా సాఫ్ట్వేర్ సైడ్ అనుకున్నా అది నచ్చలేదు, ఎం చేయాలి ఎం చేయాలి అని తెగ చించి చించి చివరికి గవర్నమెంట్ బ్యాంకింగ్ సైడ్ వెళ్దాం అని అనుకున్నా నా నిర్ణయం చెప్పా మా వాళ్ళకి అమ్మ ఫుల్ హ్యాపీ ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అంటే పని తక్కువ అని ఎందుకంటే తన బిడ్డ ఎక్కడ కష్టపడిపోతాదేమో అని అమ్మ ఆలోచన, నాన్నేమో సాఫ్ట్వేర్ అని ఎందుకంటే తొందరగా సెటిల్ అవ్వొచ్చు ,గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్కువ సమయం పడుతుంది ఒకసారి ఆలోచించు అన్నారు ..

నాన్న చెప్పింది కూడా నిజమేగా అని ఆలోచించా అలా ఎన్ని రోజులు ఆలోచించినా నా నిర్ణయం మారలేదు .

తొందరగానే ఉద్యోగం సంపాదిస్తా నాన్నా అని చెప్పి బ్రతిమిలాడి మరి ఒపించా అప్పుడు నాన్న ఏమన్నారో తెలుసా ” మేము ఏది చెప్పిన మీ మంచి కోసమే రా మీరు వృద్ధి లోకి రావాలనే , ఆడపిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా , మీకంటూ ఒక విలువ ఈ సమాజంలో ఉండాలనే మా ప్రయత్నం, ఆడపిల్లలకి ఆస్తి,నగలు ,అందం కన్నా ఆత్మాభిమానమే ఒక ఆభరణం ,మీరు ఎవరి ముందైనా తలెత్తుకొని బతికేలా ఉండాలి రా “. నువ్వు ఈ రంగంలోనే పైకి రావాలని నేను చెప్పడం లేదు రా నువ్వు ఏ రంగం లోకి వెళ్ళిన నీ కంటూ ఒక గుర్తింపు ఉండాలనే మా కోరిక.

నీకు ఎలా ఇష్టమో అలానే చెయ్ కానీ ఏది చేసినా వంద శాతం దానికి న్యాయం చేయాలి కానీ దేనిని మధ్యలోనే వదిలేయకూడదు అలా వదిలేసిన రోజే నీ ఓటమి మొదలవుతుంది.
” అలాగే నాన్న ” అని అని చెప్పి వచ్చేసా

నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న ఒప్పుకున్నారని ఆ ఉత్సాహంతోనే ఎగ్జామ్స్ కి ఎంతో కష్టపడి మరీ ప్రిపేర్ అయ్యాను ఎగ్జామ్స్ రాశా ఖచ్చితంగా సెలక్ట్ అవుతాను అని ఎంతో ధీమాగా ఫలితాల కోసం ఎదురు చూశా కానీ నా ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది సెలెక్ట్ అవ్వలేదు ఎంతో బాధేసింది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయింది లేదు నా జీవితంలో అప్పటి వరకు చూడలేదు మొదటి సారి చూసేసరికి తట్టుకోలేకపోయాను చాలా బాధేసింది.

అయినా మళ్లీ అంతే పట్టుదలతో కష్టపడి చదివి మళ్ళీ ఎగ్జామ్ రాశాను మళ్ళీ మళ్ళీ ఎన్ని ఎగ్జామ్స్ రాసిన అసలు సెలెక్ట్ అవ్వట్లేదు అలా రెండు సంవత్సరాలు పూర్తయింది అక్క ఎంటెక్ కూడా అయిపోకముందే దానికి తన కాలేజీలోనే జాబ్ వచ్చింది. అమ్మ, నాన్న ఎంతో సంతోషపడ్డారు నాకు చాలా సంతోషం వేసింది.

ఈ సారి ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని పట్టుదలతో ఎగ్జామ్స్ రాశాను మళ్ళీ సెలెక్ట్ అవ్వలేదు. ఈ సారి చాలా కోపం వచ్చింది, ఏడుపు కూడా రాలేదు , అమ్మ నాన్న తిట్టిన బాగుండు అనిపించింది కాని వాళ్ళు ఏమి అనలేదు పైగా “నువ్వు సాదిస్తావ్ రా చిన్నోడా” అని ఇంకా ప్రోత్సహించేవారు, ఇంత నమ్మకం ఏంటి నా మీద అని అది చూసి ఇంకా బాధేసింది, ఒకరకంగా డిప్రెషన్లోకి వెళ్లి పోయా కొన్ని రోజులు ఎగ్జామ్స్ రాయడం మానేశా అలా ఉన్నప్పుడు ఒకరోజు నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి “ఏదైనా చివరిదాక ప్రయత్నించు మధ్యలోనే ఆపేస్తే అదే నీ ఓటమి” అని

లేదు లేదు…. నేను ఓడిపోను ఓడిపోవాలి అని అనుకోలేదు కూడా  నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో తెలుసుకున్నాను ఈ సారి కష్టపడి కాదు కాదు ఇష్టపడి ఎగ్జామ్స్ రాశాను నా మూడు సంవత్సరాల కల నెరవేరిన రోజు ఆ రోజున నేను సాధించాను అన్నదానికన్నా నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్నదే నాకు ఎక్కువ సంతోషాన్నిఇచ్చింది .

అప్పుడు మా అమ్మ నాన్న కళ్ళల్లో వచ్చిన మెరుపు నాకు ఇప్పటికి గుర్తుంది తెలుసా అది చూసి ఎంత సంతోషం వేసిందో, ఆ మెరుపు కోసం ఏమైనా చేయాలి అని అనిపించేది …….ప్రపంచం మొత్తం నా ముందే ఉందనిపించింది.

ఇందులో పెద్ద గొప్పేమి వుంది అని నీకనిపించొచ్చు కానీ నా వరకు  తల్లితండ్రుల సంతోషాన్ని మించిన ఆనందం ఇంకోటి లేదు .

“అసలు వాళ్ళేమి కోరుకోరు మనం పుట్టినప్పటి నుంచి మన గురించే ఆలోచిస్తారు మన అవసరాల కోసం వాళ్ళ ఆనందాన్ని కూడా వదులుకుంటారు , సమాజంలో  మనం ఎవరి ముందు తక్కువ కాకూడదని తలకు మించిన భారాన్ని ఐనా ఇష్టంగా మోస్తారు , అలాంటిది వాళ్ళు మన నుంచి ఆశించేది కేవలం మనం ప్రయోజకులు ఐతే చూడాలని అది కూడా వాళ్ళ స్వార్దానికి కాదు మన భవిషత్తు బాగుంటదనే వాళ్ల ఆరాటం కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళ మాట వినకుండా చిన్న చిన్న సరదాలకే   ఆనందపడిపోయి అసలైన ఆనందం అంటే ఏంటో గుర్తించలేకపోతున్నాం”.

అలా అని అందరూ ఒకలానే వుండరు అందరికి అన్ని సదుపాయాలు ఉండకపోవచ్చు కానీ ఉన్నప్పుడైనా సద్వినియోగించుకోవాలి …. వాళ్ళ సంతోషం కోసం ఆ మాత్రం చేయలేమా చెప్పు….

అందుకే అసలైన ఆనందం అంటే ఏంటో తెలిసింది ఇదే రోజున కాబట్టి ఇవాళ నాకు చాలా ఆనందంగా వుంది …..హమ్మయ్య  నీతో అన్ని పంచుకున్న…. ఓకే బాయ్ నాకు నిద్రొస్తుంది ….

డైరీ : ‘ ఓయ్ ఓయ్ ఓయ్…. ఏంటి ఇందాక ఏదో కొన్నావ్ చెప్పకుండానే వెళ్ళిపోతున్నావ్’

నేను : “ఓ అదా చెప్పడమే మర్చిపోయా అక్క కి ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరింది ఎంగేజ్మెంట్ కోసమని ఏదో చిన్న షాపింగ్ చేశా అక్కకి, అమ్మకి, నాన్నకి నా తరపునుంచి ఏవో బహుమతులు  ….అయినా అన్నీ నీకు చెప్పాలా ఏంటి”
డైరీ : ‘ ఇప్పుటి దాకా నేను అడగకపోయినా చెప్పావ్ ఇప్పుడు అడుగుతున్న చెప్పట్లేదు ….పో నేను నీతో మాట్లాడట్లేదు’
నేను : “సరే సరే అలగకు చెప్తున్నా …. ఏమీ లేదు అక్క పెళ్ళికి నా తరపు నుంచి చైన్ కొనిద్దాం అని ఎప్పటి     నుంచో అనుకున్న అందుకే ముగ్గురికి కలిపి తీసుకున్నా …..సీక్రెట్ కదా అందుకే చెప్పలే ….నువ్వు కూడా ఎవరికీ చెప్పకు ….నేనే ఆ రోజు సర్ప్రైస్ చేస్తా ….మరి మీరు కూడా చెప్పరు కదా ….

బాయ్ బాయ్ నేను మీ అర్షిక…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!