ఇక్కడే ఉన్నాను

ఇక్కడే ఉన్నాను

రచన – మంగు కృష్ణకుమారి

ఉమాసరస్వతి పెళ్ళయి అత్తింటికి‌ వెళుతున్నప్పడు ఆమెకి తల్లీ, అమ్మమ్మ అందరూ చెప్పిన సుద్దుల్లో “అత్తగారి దగ్గర అన్నీ నేర్చుకోమ్మా” అన్నది ఒకటి.

అత్తగారు తాయారమ్మ దగ్గర, ఉమాసరస్వతికి బాగా నచ్చింది ఒకటి ఉంది. తాయారమ్మ ఎవరు ఏ ప్రశ్న వేసినా, నెగిటివ్ గా జవాబు చెప్పదు. ఆమె చెప్పినది ఒకటయితే అక్కడ జరిగేది వేరొకటి కూడా ఉంటుంది. ఉమా సరస్వతి, అత్తగారి దగ్గర ఇలాగే మాటాడ్డం బాగానే నేర్చుకుంది.

ఆఖరికి అత్తగారికే రగులుకొనేలాటి జవాబులు ఇచ్చేది. “ఏమే సరస్వతీ, వంటయిందే”
“అయిపోయిందత్తయ్యా” చాలా సందర్భాల్లో అప్పటికి ఇంకా అన్నం ఉడుకుతూనో, ఇంకా కూర తరుగుతూనో ఉండేది.

అయినా ఎప్పుడూ “ఇంకా ఆలస్యం ఉంది” అనిమాత్రం చెప్పదు. ఏ అక్క ఇంటికో వెళుతూ ఉంటే “ఎప్పుడొస్తావ్ ఉమా” అని భర్త వెంకటేశం అడిగితే

“ఇక్కడున్నట్టు రానూ! ఓ గంటలెండి” అని చెప్తుంది.

అలా చెప్పిన ఎన్నిసార్లో ఆమె రెండురోజుల తరవాత వచ్చేది. చటక్కున ఇంట్లో కనపడకుండా మాయం అయేది. ఏ మూడు నాలుగుగంటల తరవాతో వచ్చేది.

తాయారు భయంతో గడ్డకట్టి “ఏమయేవే అమ్మాయ్, ఇల్లూ వాకిలీ వెతికేం” అంటే “అయ్యో, మీకు పండక్కి కొత్త చీర కొంటానని‌ చెప్తూనే ఉన్నాగా! ఇదిగో చీర” అనేది.

ఆడపడచు గౌరి “వదినా టైలర్ నా బ్లౌజ్ లు ఈవారంలో ఇచ్చేస్తాడా?” అంటే “ఎందుకు ఇవ్వడూ? ఇచ్చేస్తాడులే” అంటుంది. అప్పటికి అసలు ఆమె ఆజాకెట్ల బట్టలు ఇంకా టైలరుకు ఇవ్వలేదని చెప్పేచెప్పదు.

మొదటినించీ తల్లి పెత్తనంలో ఉన్న వెంకటేశం అలా అలా భార్య పెత్తనంలోకి మారిపోయేడు. అమెని గట్టిగా ఏదీ అనే సాహసం లేదతనికి.

ఇలా అత్తగారు,భర్తా మొత్తుకుంటూ, పిల్లలూ, దగ్గరివాళ్ళ జోకులకి నవ్వుతూ ఉండగానే తాయారమ్మ దాటిపోయింది. తనకి ఇంత ఙ్ఞాననోధ చేసినావిడ దాటిపోడం ఉమాసరస్వతే ఎక్కువ క్రుంగిపోయింది.

నెమ్మదిగా పెద్ద కొడుక్కి పెళ్ళి చేసేరు. కోడలు కల్పనకి పుట్టింట్లో అత్తగారిని చూసి నేర్చుకోమని ఎవరూ సుద్దులు చెప్పలేదు.

కొత్త కాపురం మోజులో ఆమెకి అత్తగారి సంగతి బోధపడలేదు.

ఆరోజు, చిన్నాన్న కూతురుకి బాగా లేదంటే చూసి వస్తానని గంటన్నర దూరంలో‌ ఉన్న ఊరు వెళ్ళింది. సాయంత్రానికి వచ్చేస్తాననే చెప్పింది.

కల్పనకి రాత్రి వంట చేయడానికి అత్తగారు వస్తారా, రారా అని సందేహం వచ్చి ఫోన్ చేసింది. “బస్ ఎక్కేసానే అమ్మాయ్! వస్తున్నా” అంటూ చెప్పింది.

కల్పన హుషారుగా భర్తకీ, అత్తగారికీ ఇష్టమయిన ఆలూకర్రీ, కందిపచ్చడి చేసేసింది. ఉడకపోతకి స్నానం చేద్దాంఅని టవల్ తీసుకొని, మళ్లా ఇంట్లో ఎవరూ లేరు, అత్తగారు వస్తే తలుపు తీసిందికి ఎవరూ ఉండరు కదా, అసలు ఆవిడ ఇంటికి ఎంత దూరంలో ఉందా అని ఫోన్ చేసింది.

ఉమాసరస్వతి ఫోన్ తీసింది. కల్పన “ఎక్కడున్నారత్తయ్యా” అడిగింది. “వచ్చేసేనే….. అమ్మాయ్, మన సందుకి దగ్గరలోనే ఉన్నాను” బస్ హారన్ కూడా వస్తుంటే ఫోన్ పెట్టేసింది.

కల్పన అత్తగారు వచ్చిన తరువాత స్నానానికి వెళదాం అని వీధి తలుపు తీసి కూచుంది. అయిదు‌ నిమిషాలు పట్టదులే అనుకుంటే, అరగంటయినా రాలేదు. లోపలికి వచ్చిన వెంకటేశం కోడలు బిగుసుకొని తెలివితప్పే పరిస్థిలో ఉండడం చూసి కంగారు పడ్డాడు.

ఏడుస్తూ అంతా చెప్పి, అత్తగారికి ఏదో అయి ఉంటుంది అని చెప్తూ ఉంటే, లోపలకి అడుగు పెట్టింది ఉమాసరస్వతి, వెనకాతలే ఆమె కొడుకు శ్రీరామ్ కూడా.

కల్పన కంగారు విని ఫక్కున నవ్వుతూ‌ “నీకు ఇంకా అమ్మ భాష పట్టుబడలేదులే” అన్నాడు శ్రీరామ్.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!