మళ్లీ మొదలైంది

మళ్లీ మొదలైంది

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

నా కళ్ల కు ఎదురుగా నలుగురు. నల్లగా, చూడటానికి భయంకరంగా ఇద్దరు, ఒక మాదిరిగా, చూడటానికి మామూలుగా ఉన్న ఇంకో ఇద్దరు.

సినిమాల్లో చూపించినట్టుగా చేతిలో గదలతో, చేతిలో తాడుతో, అది సినిమాల్లో చూపించే యమపాశమా, అలాగే ఉంది. అంటే వీళ్లు  యమభటులా? ఏంటి నన్ను ఇప్పుడు వీళ్ళతో తీసుకుని వెల్లిపోతారా?

నాది ఏమంత పెద్ద వయసు కూడా కాదు, ఒక 30 ఏళ్ళు  అంతే. ఇంకా పిల్లలు కూడా చిన్న పిల్లలే. ఇప్పుడు నేను వీళ్ళ తో వెళ్లి పోతే మా పిల్లల పరిస్థితి ఏమిటి? అయినా నాకు ఇంకా జీవితం మీద ఆశ చావలేదు.

లేదు, సినిమాల్లో చూపించినట్టుగా, లేదా పురాణాల లో మన సావిత్రి గారు ఫైట్ చేసినట్టుగా, నేను కూడా యముడి మీద యుద్దం ప్రకటించాలి అని ఆలోచిస్తున్న నాకు, ఆ నలుగురు ఏదో మాట్లాడుకోవటం వినిపించి, వాళ్ళ వైపు చూసాను.

ఏంటి మీరు ఎందుకు వచ్చారు? ఆవిడ మహా సాధ్వి. మంచి మనిషిగా పేరు తెచ్చుకొని, ఒక జీవితానికి సరిపడ పుణ్యం సంపాదించుకోంది. మేము కదా, రాధ ( అంటే నన్ను) ని తీసుకువెళ్ళాలి అన్నారు చూడటానికి బాగున్నారు కాబట్టి దేవ భటులు అనుకుంటా.

ఆ మాటకు వెంటనే, యమభటులు లాంటి వారు, వెటకారంగా నవ్వుతూ, అది అంతా నటన. ఎదుటివారి మెప్పు, పొగడ్తల కోసం వేసుకున్న వేషం.

తన నిజ స్వరూపం వాళ్ల భర్త, పిల్లల దగ్గర మాత్రమే బయటపెట్టెది. ఊరి వాళ్ళకి పాయసం, ఇంట్లో వాళ్ళకి గంజి నీళ్ళు పెట్టే, వీర సాద్వి అని నవ్వారు, నా వైపు చూస్తూ.

అవునా? అన్నారు ఆశ్చర్యం గా దైవ భటులు నా వైపు చూస్తూ.

నేను కూడా ఆశ్చర్యంగా అందరినీ మార్చి మార్చి చూస్తున్నాను. నోట మాట రాలేదు నాకు.

రాధ గారు చేసేది కాలేజి లో లెక్చరర్ ఉద్యోగం. కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో తగుదునమ్మా అంటూ పాల్గొనడం, ఖర్చు మొత్తం తానే భరించిందేమో అన్నట్టుగా ఒకటే హడావిడి చెయ్యటం. కానీ, అవి కాలేజి కమిటీ వాళ్ళు ఇచ్చిన డబ్బు అని ఎవరికీ తెలియదు.

అంతేనా,హడావిడిగా ఇంటికి వచ్చి, నాలుగు పచ్చడి మెతుకులు పిల్లలకి, రవికి పెట్టేసి గడిపేస్తూ ఉంటుంది . ఎమైనా అంటే, ఉద్యోగం చేసే ఆడవాళ్లు అలాగే ఉండాలి అంటుంది.

రవి కి ఆకలి వేసి, ఎమైనా అడిగితే, లేదా నేను చేస్తాను అందరికీ అన్నా కూడా, వామ్మో నాకు పని ఎక్కువ అయిపోతుంది. ఇల్లంతా చిరాకు చేసేస్తారు. మీరు ఏమి మొదలు పెట్టకండి అనేది. మాటల్లో కూడా గౌరవం, పిల్లల పైన ప్రేమ ఏమి ఉండేవి కాదు. ఇలాంటి ఆడవాళ్ళ వల్ల పిల్లలకు, వాళ్ళ ఇంట్లో వారికీ కూడా మనశ్శాంతి ఉండదు.

అందుకే, నీకు శిక్ష విధించే సమయం మొదలు అయ్యింది. పద పోదాము అని చెయ్యి పట్టుకుని లాగుతున్నారు యమభటులు.

నేను రాను … నాకు బతకాలన్న ఆశ ఉంది.నేను, నా పిల్లలు….నేను రాను, నేను రాను అంటూ ఏడుస్తున్న నాకు రవి పిలుపుతో ఘాడ నిద్రనుంచీ మెలుకువ వచ్చింది. ఏంటి నేను ఎక్కడ ఉన్నాను? నాకు అంతా అయోమయంగా ఉంది అనుకుంటూ చుట్టూ చూశాను.

ఏంటి కలవరింతలు, కాలేజికి లెక్చరర్ లేటుగా వెళితే, పిల్లలు ఇంకెప్పుడు వస్తారో, అని నన్ను చూసి నవ్వుతున్నాడు రవి.

ఈ రోజు నేను కాలేజికి సెలవు పెడతాను. చాలా తలనొప్పి గా ఉంది. ఈ రోజుకి రెస్ట్ తీసుకోవాలి అన్నాను.

అవునా, బాగా ఎక్కువ గా ఉందా? అంటూ కంగారు పడుతూనే, నా ఒళ్లు వేడి చూస్తున్నాడు రవి. నేను కూడా సెలవు పెడతాలే. ఇప్పటికి పడుకో, పిల్లల్ని స్కూల్ లో దింపి వస్తాను అని చెప్పి, అప్పటికే రెడీ అయి ఉన్న పిల్లల్ని తీసుకుని వెళ్లాడు.

తిరిగి వచ్చిన తరువాత ఇద్దరకీ టీ పెట్టాను. తాగుతూ కూర్చుంటే, రవితో రెపటినుంచీ నేను పార్ట్ టైం జాబ్ కి అప్ప్లయ్ చేస్తాను రవి అదే కాలేజీలో అన్నాను.

ఏమి జరిగిందో తెలియక అదేంటి అన్నాడు రవి. అయినా నీకు ఎలా వీలుగా ఉంటే అలా చెయ్యి. నాకు నువ్వు ఎలా చేసినా ఒకే అన్నాడు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ, నుదురు తాకి చూసాడు.

ఒక అమ్మగా, ఒక మంచి ఇల్లాలుగా నన్ను నేను మార్చుకునే సమయం ఇది. అందుకే, ఇప్పటి నుంచే నా సమయం మొదలైంది అనుకుంటూ కళ్లు మూసుకున్నాను. చాలా రోజుల తర్వాత అదీ ప్రశాంతంగా…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!