తన పేరు సంధ్య

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

తన పేరు సంధ్య

రచన: బండి చందు

ఉదయం నిద్దుర లేవకముందే పక్కన ఉన్న ఫోన్ మ్రోగింది. ఎవరా అని చూస్తే ఊరి నుండి అమ్మ ఫోన్ చేస్తుంది. ఇంత పొద్దున అమ్మ చేయడమేంటి అనుకోని కంగారుగా లిఫ్ట్ చేసి అమ్మ ఏమైంది అని అడిగాను. ఏం లేదురా ఈరోజు ఇంటికి రారా! నీకు పెళ్లిచూపులు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాకు ఏమి చేయాలో తోచలేదు. హడావిడిగా ఊరికి బయల్దేరి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే లోపలి నుండి అమ్మ బయటికి వచ్చి రారా ఎలా ఉన్నావ్ అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. అమ్మ అసలు నాకు పెళ్లిచూపులేంటి నేను ఇప్పుడే పెళ్లి చేసుకొను అని చెప్పాను.

అయినా అమ్మ వినకుండా ఏర్పాట్లు అన్నీ చేసేసింది. ఇక చేసేదేమీ లేక అమ్మతో కలిసి అమ్మాయిని చూడడానికి వెళ్ళాను. కానీ మనసు మాత్రం తప్పు చేస్తున్నావని ఇంటి నుండి బయల్దేరిన మరుక్షణం నుండి హెచ్చరిస్తోంది. కారణం మనసులో ఉన్న అమ్మాయి పెళ్లిచూపులు చూసే అమ్మాయి ఇద్దరు వేరు కాబట్టి. అవును! తన పేరు సంధ్య చాలా మంచి అమ్మాయి. నేనంటే తనకి చాలా ఇష్టం. కాలేజ్ చదివే రోజుల్లోనే ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టం ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ డిగ్రీ అయిపోయాక ఉద్యోగపు వేటలో హైదరాబాద్ కి వచ్చి ఇక్కడే ఉండిపోయాను. ఉద్యోగం వచ్చింది నెలకు జీతం పదిహేను వేలు. ఉద్యోగం వచ్చాక ఇంటికి వెళ్ళడానికి సమయం దొరకలేదు. కానీ తనతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడిని. తనతో మాట్లాడిన ప్రతిసారి నాలో ఏదో తెలియని ఉత్సాహం. అలా చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంతలోనే అమ్మ పెళ్ళిచూపులంటూ ఫోన్ చేసి తొందరపెట్టేసింది. ఈ పెళ్లిచూపుల విషయం తనతో చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఎంత ప్రయత్నించినా తన ఫోన్ మాత్రం కలవలేదు.

నాకు ఇష్టం లేకపోయినా అమ్మ సంతోషం కోసం పెళ్లిచూపుల్లో కూర్చున్నాను. అమ్మాయి రాగానే అమ్మ సైగతో తనని చూసాను. కానీ నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు నేను ఇష్టపడ్డ అమ్మాయి సంధ్య. తనని చూడగానే నా కళ్ళలో అంతులేని సంతోషాన్ని మా అమ్మ గమనించింది. కానీ నన్ను సంతోషం కన్నా సందేహాలు ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అదే సందేహాన్ని అమ్మని అడిగితే రేయ్ నేను నీకు అమ్మనిరా నీ మనసులో ఏముందో నాకు తెలియదా! సంధ్య నాకు అన్ని విషయాలు చెప్పిందిరా. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా నాకు ఈ విషయం గురుంచి చెప్పాలనిపించలేదారా? అని అడగ్గానే ఏం చెప్పాలో తెలియక అది అమ్మ నేను చెప్పాలనుకున్నాను కానీ ధైర్యం చాలలేదు అని అంటుండగానే అమ్మ నన్ను దగ్గరకి తీసుకొని నువ్వు ఎంత ఎదిగినా నాకు మాత్రం ఇంకా చిన్న పిల్లవాడివేరా, కానీ ఒక్క విషయం నా కోడలిని మాత్రం కష్టపెట్టకుండా చూసుకోవాలి అని చెప్పింది. అమ్మ మాటలు విన్నాక నాలోని భయాలు సందేహాలు అన్నీ తీరిపోయాయి. వెంటనే సంధ్యకి ఫోన్ చేసి తను పరిచయమైన ఇన్నేళ్లలో తనకి ఎప్పుడూ చెప్పని మాట ఒకటి చెప్పాను అదే “ఐ లవ్ యూ” అని. ఆ క్షణం నా జీవితానికి మర్చిపోలేని ఒక మధురానుభూతి. నా సంతోషమే తన సంతోషం అనుకునే అమ్మని నన్ను అమ్మలా చూసుకునే సంధ్యని ఇచ్చింది. నిజంగా ప్రేమ ఎంత మధురమైనదో కదా!….

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!