నేటి విందు భోజనాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: బాలపద్మం
విందు భోజనాలు అంటేనే ఓ ప్రత్యేకత ఉండేది, ఎగిరి గంతులు వేసేవారు ఆహ్వానితులు. ఇక ఆ భోజన ఏర్పాట్లు చేసే వారి హడావిడి సరేసరి. అదొక ప్రత్యేకమైన అభిమానంతో కూడిన ప్రక్రియ. ఏదో భోజనానికి పిలిచాం, వచ్చారు, తిన్నారు అనే ధోరణి అస్సలు ఉండేది కాదు. ఊరిలోని వారు, వచ్చిన బంధు మిత్రులు, ఆత్మీయులు కూడా తలో చేయి వేసి ఏర్పాట్లు పూర్తి చేసే వారు. తినే ఆహార పదార్థాల ఎంపిక కూడా శ్రద్ధగా ఉండేది. ఇక వండి వడ్డించే వారు చాలా శుభ్రంగా శుచిగా ఉండే వారు.
పలానా వారి ఇంట భోజనాలు అని మరో ఇంట భోజనాలు దాకా చెప్పుకునేలా ఆసక్తికరంగా ఉండేవి రుచులు. మరి కొంత మంది విందు ఏర్పాట్లు చాలా కాలం గుర్తుండి పోయేవి. తినడానికి అరటి ఆకులు లేదా తామర, బాదం, టేకు వంటి ఆకులుతో చేసిన విస్తరాకులు వాడే వారు. దాని వలన వేడి పదార్ధాలు వడ్డించినపుడు ఆకు లోని ఔషద గుణాలు పదార్థాలను చేరేవి. అంతే కాదు ఏ పదార్థం ఎటువైపు వడ్డించాలి అనే లెక్క కూడా ఉండేది. ఇక వడ్డనలో చూపే ఆప్యాయతకే ముందు కడుపు నిండి పోయేది. అసలు వృధా కాకుండా కూడా జాగ్రత్త పడేవారు. పర్యావరణం పై శ్రద్ద ఉండేది. ప్లాస్టిక్ లేదా వాడి పారేసే వాటిని వినియోగించే వారు కాదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఈ పద్దతి పాటిస్తున్నారు. త్రాగడానికి మంచినీటి కోసం ఎవరి గ్లాసు లేదా చెంబులు వారే తెచ్చుకునే ఆచారం ఉండేది. దీని వల్ల ఒకరి ఎంగిలి ఇంకొకరు లేదా ప్లాస్టిక్ సీసాలు, గ్లాసుల అవసరం ఉండేదే కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే దానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. దైవ స్మరణ చేస్తూ తినేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. నేడు కాల క్రమేణా అన్నీ మారిపోయాయి. కేవలం తన స్థాయికి తగ్గట్టు మందిని పిలవడం, ఎక్కువ రకాలు పెట్టడమే తప్ప వాటిపై రుచి, శుచి, శ్రద్ద కానరావడం లేదు. ఇక అతిథి అభ్యాగతి అన్న భావనే లేదు. వెళ్ళే వారికి శ్రద్ధగా శుభ్రంగా తినే వ్యవధి అసలు లేదు. వడ్డించే ప్లేటు, తాగే నీటి గ్లాసు, చెంచాలు వంటివి అన్నీ పర్యావరణ కాలుష్య కారకాలే. ఇక నుంచుని ఓ చేత్తో పట్టు కోవడం, ఓ చేత్తో తినడం, సగం పారేయడం ఇదీ పద్దతి. ఇక తినే వాడికి శ్రద్ద లేకుంటే వడ్డించే వాడికి ఎక్కడిది. దైవ స్మరణ మాట ఆ దేవుడు ఎరుగు, అన్నీ మధ్యలో అశ్లీల నృత్యాలు, పాటలు లేదా కబుర్లు. ఇలా భోజనం సమయంలో అన్నీ అనారోగ్య కర విధానాలే. ఎప్పుడో వండి తెస్తారు, అక్కడ వేడి చేసి పెడతారు. అవి వేడిగా లేకపోతే వాటి అసలు రుచి తెలుస్తుంది. ఇక ఎన్నో సందర్భాలలో తిన్న వారు అనారోగ్యం పాలు కావడం చూస్తూనే ఉన్నాం. పాత పద్దతులు అని తీసి పారేయకుండా ఎంత మందికి చక్కగ వండించి, వడ్డించ గలమో అందరినే పిలుచుకుని ఒక ఆత్మీయ సంగమంలా, అనురాగం తో విందు భోజనాలు ఉంటే ఆరోగ్యం-ఆహ్లాదం కదా!
nice article. bagundi
baagundi. baagaa chepparu
baagaa explain chesaaru. nice
Nice one.
Nice article
super. suitable for present situation