దూరపు కొండలు

దూరపు కొండలు

రచన::అరుణ చామర్తి ముటుకూరి

భారతి ఎప్పుడూ కలలు కంటూ ఉంటుంది. ఆమె స్నేహితురాలు వాణి అలా కలలు కనకు. అవి నిజం కాకపోతే నిరాశ పడతావు అని చెబుతూ ఉన్న మానదు.
“వాణి మన పక్కనున్న సీరియల్ హీరోయిన్ .. ఎంత అదృష్టం కదా! ఎప్పుడు సక్కగా మేకప్ వేసుకుని, ఏది కావాలంటే ఆ బట్టలు నగలు అలంకరించుకుంటారు.”

నీ మొహం! చూసేందుకు అలా ఉన్నా, ఎప్పుడు మేకప్ వేసుకోవడం వల్ల మొహం పాడైపోతుంది. ఏది కావాలంటే అది తినలేరు శరీర లావణ్యం కాపాడుకోవడానికి. ఇక బట్టలు అంటావా, సినిమా వాళ్ళ లాగా వీళ్ళకి ఏమి ఇవ్వరు. అన్ని వాళ్ళు కొనుక్కునే సొంతం వే. ఎప్పుడో ఒకసారి కొందరు ఇస్తారేమో.”

” పోవే నువ్వు మరీనూ ప్రతిదీ అలాగే చెప్తావ్.”

” లేదు భారతీ, మా పెద్దమ్మ కొడుకు వచ్చినప్పుడు తన ఫోన్ లో యూట్యూబ్ లో నే ఇంటర్వ్యూలు చూసేదాన్ని. వాళ్లు చెప్పిన మాటలు నీకు చెప్తున్నాను. కావాలంటే మన ఇంటి పక్కన ఉన్నామెని కనుక్కో తెలుస్తుంది కదా!.”

“అంతేనంటావా అయితే” నిరాశ ధ్వనించింది భారతీ కంఠంలో.
దీనికి ఏంటో ఈ పిచ్చి ఇప్పుడైనా ఈ పిచ్చి తగ్గుతుందో లేదో. మధ్యతరగతి వాళ్ళం మనకు ఎందుకు హంగులు ఆర్భాటాలు. మంచం ఉన్నంతవరకే కాలు ముడుచుకోవాలి. వాళ్ళ నాన్న గొర్రె తోక బెత్తెడంతా జీతం ఉన్న ఉద్యోగము. ఈ పిల్ల ఏమిటో ఇలా. పోనీ స్నేహితురాలు కదా అని ప్రోత్సహిద్దాం అంటే, ఎక్కడ ఎవరి చేతిలో మోసపోతుందో అని భయం” నిట్టూరుస్తూ అనుకుంది వాణి.
****
మరో రోజు భారతి మరో కొత్త కోరికలతో వచ్చింది. “పోనీ సినిమా వాళ్ళ అయితేనో”
“హుష్” అని తల పట్టుకుంది వాణి.
“సరే !ఒక షరతు మీద అయితే నీకు నేను ప్రోత్సాహం ఇస్తాను…”

భారతి కళ్ళు మెరిసాయి చిత్రంగా. ఇన్నాళ్లకు నా దారికి వచ్చింది అనుకుంది. ఎందుకంటే వాణి లేనిదే, ఎక్కడికి వెళ్ళడానికి భారతి వాళ్ళం ఒప్పుకోదు. అందుకే వాణి సాయంతో తిరిగి ఛాన్స్ లు వచ్చిన తర్వాత.. వాళ్లే కారులో తీసుకెళ్తారు లే అనుకునేది భారతి.
నేను ఆంటీ తో చెప్పి పర్మిషన్ తీసుకుంటాను. శిల్పారామం చూడడానికి వెళ్తున్నామని. అలా రెండు మూడు రోజులు తిరుగుదాం.”మనసులో ఏదో ప్రణాళికతో ఒప్పుకుంది వాణి.
భారతీ తను చాలా అందగత్తెనని అనుకుంటూ ఉంటుంది. తను వెళ్ళగానే పెద్ద పీట వేసి తనకు ఆహ్వానం పలుకుతారనే భ్రమల్లో ఉంది.
భారతీయ వాళ్ళ అమ్మకి చెప్పి ఇద్దరు బయలుదేరారు. దారిలో పానీపూరి కనిపిస్తే చాలా రోజులైంది లాక్డౌన్ వల్ల తినలేదు తిందామని భారతి గొడవ. వాణి మౌనంగా అనుసరించింది.
మరోచోట మిరపకాయ బజ్జీలు కూడా అంతే.
అలా వాళ్ళు కృష్ణానగర్ కి చేరారు.
తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళింది వాణి.
ఆ ఇంట్లో అడుగు పెట్టగానే తన ఇంటి కంటే బీదరికం చూసి ఆశ్చర్యపోయింది భారతి.

“ఇదేంటి వీళ్ళు ఎవరో సీరియల్స్ లో చాలానే పాత్రలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు అని చెప్పింది వాణి. వీళ్ళ ఇల్లు ఏంటి ఇంత దరిద్రంగా ఉంది” తనలో తనే అనుకుంటూ.. ఇల్లంతా పట్టి చూసింది.
అప్పుడే లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. స్నానం చేసి వస్తున్నట్టుంది. మొహం మీద నల్ల మచ్చలు, పెద్దగా రంగు లేదు.. మొదట్లో అమ్మాయి ఎవరో గుర్తుపట్టలేదు భారతి ఆ అమ్మాయిని. దగ్గరికి రాగానే పరీక్షగా చూస్తే.. తన రోజు సీరియల్స్ లో చూసే అద్భుతమైన అందగత్తే అనుకుంటున్న అమ్మాయి. “మేకప్ లేకుండా ఇంత దారుణంగా ఉందా?”
ఏదేమైనా సీరియల్లో చేస్తుందని కొంత ఎగ్జైట్మెంట్ గురై..” మీకు సీరియల్ లో ఎలా అవకాశం వచ్చింది, నాకు మీ నటన అంటే చాలా ఇష్టం.. ఇలా చెబుతూ సీరియల్స్ లోనే మీరు చాలా బాగున్నారు కదా అనేసింది”
ఆ అమ్మాయి పేలవంగా నవ్వి,.. దాన్ని బట్టి మీకు అర్ధమయ్యే ఉంటుంది కదా సీరియల్స్ లో చూపించేవన్నీ నిజాలు కాదు. అందులో ధైర్యంగా ఉన్నట్టు ఒక పాత్ర వేసిన నిజ జీవితంలో అలా ఉంటారని కాదు. నిజంగా అందంగా కూడా ఉండకపోవచ్చు.”
“నిన్ను చూస్తేనే తెలుస్తుంది లే “మనసులో అనుకుంది భారతి
అక్కడ గోడకు వేలాడుతున్న పదహారణాల అచ్చమైన అందమైన అమ్మాయి ఫోటో చూసి.. “ఆ ఫోటోలో ఎవరు మీ చెల్లెలా..” అడిగింది టాపిక్ మార్చడానికి.
“నిజంగానే అడుగుతున్నారా?.. అది నేనే. అలా బాగున్నానే తీసుకున్నారు. ఆ లైట్ల వేడికి, మేకప్ లకి.. నా మొహం చర్మం ఇలా పాడయింది. కొద్దోగొప్పో నటిస్తాను కాబట్టి మేకప్ తో కవర్ చేసి తీసుకుంటున్నారు.
ఇంతలో వాళ్ళ అమ్మ అమ్మాయికి రాగిజావ, మాకు టీ తీసుకు వచ్చింది.
“అదేంటి మీకు టీ అలవాటు లేదా?” భారతి అడిగింది.
“ఒకప్పుడు నాకు టి అంటే చాలా ఇష్టం. కానీ దానివల్ల ఆకలి చచ్చిపోతుంది. నిజానికి మాకు కావాల్సింది అదే ఇలా సన్నగా మెయింటైన్ చేయాలి కదా. కాని కొవ్వు పెరగకుండా రాగిజావ తాగుతున్నాను. ఈమధ్య పాలు కూడా కల్తీ గానే ఉంటున్నాయి కదా.”
“అంటే షూటింగ్ లేనప్పుడు కూడా మీరు ఏది కావాలంటే అది తినలే రా”
అయ్యో అలా తింటే ఇంకేమైనా ఉందా?.. మా పరిస్థితి ఇలా ఉంటే ఇక సినిమాల్లో వాళ్ళు అయితే పాత్రకు తగ్గట్టు అని చాలా చాలా త్యాగాలు చేయాలి. వేరే దేశాలు చూడ్డానికి చూస్తారు అని.. మంచి మంచి బట్టలు అందంగా ఉన్నారని గొప్పగా అనిపిస్తుంది. కానీ తిండి సరిగా తినకూడదు, జ్యూసుల మీదే బతకాలి. వానపాటల్లో ఒక్కొక్కసారి కొంతమందికి పడక జలుబు చేస్తుంది .ఆస్తమా వస్తుంది. వాళ్ల అనుకున్నట్టు రాకపోతే ఇష్టం వచ్చినట్లు తిట్టే స్తారు. ఇక్కడ లాగా ప్రాంప్టింగ్ ఉండదు. ఇంత కష్టపడి పనిచేసినా, అయిన వాళ్లే డబ్బుకోసం ఏవేవో చేయమని కూడా చెప్తారు. ఆ తర్వాత ఆ డబ్బు కూడా మన పేరుతో ఏమీ ఉండకుండా
పోవడం కొంతమంది విషయంలో చూసే ఉంటారు కదా.”
వాణి దగ్గర విన్న మాటలే, ఆ అమ్మాయి నుండి వింటుంటే భారతికి ఒక్కొక్కటిగా పొరలు తొలగిపోతున్నాయి.
“మరో విషయం అడగొచ్చో.. లేదో, ఈ మధ్యన కమి…ట్మెం..ట్..”
సందేహిస్తూ అడిగింది
అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపడి ,ఇంట్లోకి చూసింది. వాళ్ళ అమ్మ దూరంగా ఎక్కడ ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది.
“ఆ జాడ్యమూ ఉంది. కాదన్న వాళ్ళకి ఛాన్స్ లు తక్కువ ఉంటాయి లేదా అసలు ఉండవు. అదృష్టం బావుండి ఒక సీరియల్లో క్లిక్ అయితే లేదా సినిమాలో బాగా పేరు వస్తే అప్పుడు వాళ్ళ వెంట పడతారు మా వాటిలో చేయమని. అప్పుడు ఇలాంటివి అడిగే సాహసం చేయరు. లేదా మనం చాలా గట్టిగా ఉంటే ఏదో చిన్నాచితక పాత్రలు ఇస్తారు. ఈ మధ్య అయితే.. సూటిగా మేం ఐదుగురం ఉంటాం అని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఎవరు ఎవరు అనేది మీ ఊహకే వదిలేస్తున్నా.”

“అంటే మీరు కూడా..”

“హుష్ ,ఏంటది? అలా ఏది పడితే అది అడిగేయడమేనా..” గట్టిగా కసిరింది వాణి.

“ఇంకొక్క సందేహం..”

“భారతిలో ఇంకా ఆశ ఉందా. ప్రయత్నం వృధా అయిపోయిందా”
అనుకుంది వాణి

“అడగనివ్వండి”అందా అమ్మాయి.

“సీరియల్ లో పాత్రలను బట్టి, బట్టలు వేసుకున్న మోడ్రన్ డ్రెస్సులు అంటే, ఎర్రి ఉండొచ్చు కలిగించేలా ,వికారంగా, ప్రదర్శిస్తున్నట్లు శరీరాన్ని ..”
“ఆ, మన ఇష్టంఏంఉండదు”అర్ధమైంది అన్నట్లుగా ముందే చెప్పేసిందాఅమ్మాయి.
“థాంక్స్ అండి నన్ను కలిసినట్టుగానీ, ఇలా చెప్పినట్టుగానీ ఎవరితోనూ చెప్పకండి. ఇది వరకు మేం అద్దెకి ఉన్న చోట వాణి పరిచయం కాబట్టి, ఈ మాత్రమైనా మాట్లాడాను”
ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్లు చెప్పింది.

అన్యమనస్కంగా బయలుదేరిన భారతికి దారిలో తనకు తెలిసిన చిన్న చిన్న పాత్రలు , ఫుట్ పాత్ మీద ఏవో అమ్ముకుంటూ కనిపించడం చూసి మనసు కలచివేసింది.

“ఏ విషయంలోనూ ఇంత లోతుగా వెళ్ళకూడదు ఏమో. అందంగా కనిపించే సీతాకోకచిలుకల వెనుక గొంగళి పురుగు ఉంటుందని తెలిసొచ్చింది. “వాణితో అన్నది
“మరి ! మన జీవితాలను అసహ్యించుకుంటూ ఎదుటి వాళ్ళకు ఏదో బావుంది అనుకుంటే.. నీకిలా చూపించాల్సి వచ్చింది. ఉన్నంతలో మనం బాగానే ఉన్నాం.”

“అవును! పాపం ఆ అమ్మాయి రాగి జావ తాగుతుంటే నాకు ఎందుకో బాధగా అనిపించింది. ఎన్ని కష్టాలు పడాల్సి ఉంది అని”
అందుకే ఇక మీదట ఆడంబరాలు గురించి మాట్లాడి ఇలాంటి వాళ్ళని బాధ పెట్టకు. సున్నితంగా హెచ్చరించింది వాణి.
అమ్మయ్య! అమ్మాయితో కావాలనే కొన్ని విషయాలు అలా చెప్పించి నా స్నేహితురాలిని కాపాడుకో గలిగాను.” మనస్ఫూర్తిగా అనుకుంటూ అందించింది వాణి.

***.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!