స్నేహం కోసం

*స్నేహం కోసం*

 

రచయిత :: తేలుకుంట్ల సునీత

నందిని వాళ్ళ అమ్మ మంజువాణి భోజనానికి రమ్మనగానే నందిని అన్యమనస్కన్గానే వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది. పక్కనే నాన్న వాసుదేవ్ కూర్చుని తన కోసమే ఎదురు చూస్తున్నారు.
అమ్మ భోజనం వడ్డించి తను కూర్చుంది. తినడం మొదలు పెట్టారు.
“నందూ ఏమయింది, అన్నం అలా ఎంత సేపు కలుపుతావు? ఏం ఆలోచిస్తున్నావు? ” అని తల్లి మందలించగా బెరుకుగా తండ్రి వైపు చూస్తూ ఈ లోకంలోకి వచ్చిన నందు ” ఏం లేదు మమ్మీ బీటెక్ ఫైనల్ సెమ్ దగ్గరికి వస్తోంది కదా అదే టెన్షన్” అంతే అని తండ్రి వాసుదేవ్ ఏమంటాడో అని తలనొప్పిగా ఉందంటూ కొంచెం తినేసి తన రూంలోకి వెళ్ళింది నందిని.
బెడ్ మీద వెల్లకిలా తలకింద చేతులు పెట్టుకొని పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది నందూ.తాను తన తల్లికి అబద్ధం చెప్పానని, తన తండ్రి వాసుదేవ్ చండశాసనుడని, అర్ధం చేసుకోకుండా తననే ముందు నిందిస్తాడని, తల్లి పెంపకాన్ని కూడా తప్పు పడతాడని, తను చదువుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని, తనని చదివించడానికి బలవంతంగా ఒప్పుకున్నాడని,
తను రోజూ ప్రేమ, పెళ్లి అంటూ తన వెంటపడే పోకిరి వెధవ హరీష్ తో నరకం అనుభవిస్తున్నానని, నేను ఒప్పుకోకపోతే చస్తానని, రేపటిలోగా ఏదో ఒకటి తెల్చేయమన్నాడని,నాకు దక్కని నిన్ను ఇంకొకరికి దక్కనివ్వనని రోజుకో రకంగా శాడిస్టుగా ప్రవర్తిస్తున్నాడని ఎలా చెప్పగలను. ఏం చేయాలి అని తల పట్టుకుని ఏడుస్తుండగా…. తనకున్న ఒకేఒక బెస్ట్ ఫ్రెండ్ రాగిణి నుండి ఫోన్ రావడంతో…
నందు ఫోన్ ఎత్తుతుంది. “హలో నందూ ఏం చేస్తున్నావ్. రేపటి గురించి ఏం ఆలోచించావు. మీ పేరెంట్స్ కి చెప్పావా? అని రాగిణి అంది.
“రాగిణి నీకు తెల్సు కదా మా వాళ్ల గురించి. గతంలో కూడా ఇలాగే ఒక అబ్బాయి నా వెంట పడడం అది మా నాన్న దృష్టిలో పడడం కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ను, లెక్చరర్స్నీ మీరు పాఠాలు చెబుతున్నారా! లేక ప్రేమ పాఠాలు చెబుతున్నారా? అంటూ నానా రభసచేశాడు.
మళ్ళీ ఈ విషయం…ఎలా”..బాధతో మాటలు రాక మౌనంగా ఉంది నందూ.
“పేరెంట్స్ కి, ప్రిన్సిపాల్ కి ఎవరికి చెప్పొద్దు అంటావ్. అది గమనించిన హరీష్ గాడు ఎవరికి చెప్పుకోదు అనే ధీమాతో రెచ్చిపోతున్నాడు. ఈ సమస్య ఎలా తీరుతుంది.సరే నువ్వు బాధపడకు నందూ… నువ్వైతే కాలేజీకి రా”… అని ఫోన్ పెట్టేసింది రాగిణి.
రాగిణి ఫోన్ పెట్టేసి ఫ్రెండ్లీ గా ఉండే తన పేరెంట్స్ దగ్గరికి వెళ్లి హరీష్ గురించి చెబుతుంది.రాగిణి తండ్రి సుధీర్ మరోమాట మాట్లాడక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.
“రాగిణి నువ్వు హాయిగా రేపు కాలేజ్ కి వెళ్లు. వాడి సంగతి నేను చూసుకుంటా” అని భరోసా ఇచ్చాడు రాగిణి తండ్రి.
మళ్ళీ పొద్దున్నే నందూకి కాల్ చేసి కాలేజీకి రమ్మంటుంది రాగిణి. ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తారు. భయంభయంగా కాలేజీలో అడుగుపెట్టిన నందూకు హరీష్ కనబడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాయంత్రం రాగిణి బలవంతం చేయడంతో నందూ రాగిణి వాళ్ళ ఇంటికి వెళ్ళింది.
ఇద్దరూ రాగిణి రూంలోకి వెళ్తుండగా… అప్పుడే వస్తున్న సుధీర్ “రాగిణీ”…. అని పిలువగానే… థాంక్స్ డాడ్ అంటూ రాగిణి పరుగెత్తగా.. సుధీర్ రాగిణి నుదుటిపై ముద్దుపెట్టి నా బంగారు తల్లి అంటూ ” ఎందుకిలా భారం నీపై వేసుకున్నావు” అని సుధీర్ అడగ్గా రాగిణిని చూపిస్తూ.. ఫ్రెండ్ కోసం, దాని భవిష్యత్తు కోసం…డాడ్. నందూ పేరెంట్స్ మీలాగా సరిగా అర్థం చేసుకోరు డాడ్. అందుకే ఇలా… మరి మీకెలా ఈ విషయం…. అని రాగిణి అనబోతుండగా.. సుధీర్ కల్పించుకుని నేను మార్నింగ్ పోలీస్ స్టేషన్ నుండి కాల్ రాగా, స్టేషన్ కు వెళ్ళానని, స్టేషన్ ఎస్ఐ “వాడిని పట్టుకొచ్చి నాల్గు తగిలిస్తే, ఇబ్బంది పెట్టింది మీ అమ్మాయిని కాదట, వేరే అమ్మాయినట. నన్ను వదిలేయండి అన్నాడు. ఎవరైతే ఏంటిరా అని మరో నాలుగు తగిలించాను అని”అన్నాడంటూ “నాకు చాలా గర్వంగా ఉందిరా”. అని సుధీర్ అనడంతో… కన్నులార్పకుండా ఈ సంభాషణ అంతా వింటున్న నందూ సుధీర్ కి కృతజ్ఞతలు తెలిపి, రాగిణితో “నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం నాకు దేవుడిచ్చిన వరం” అంటూ ఆనంద భాష్పాలతో ఆలింగనం చేసుకుంటుంది నందూ.
తర్వాత రాగిణి తల్లిదండ్రులు, నందు తల్లిదండ్రులు కాన్వకేషన్ ప్రోగ్రాంలో కలుసుకొనగా.. జరిగిన విషయం అంతా సుధీర్ వాసుదేవ్ కి చెప్పి “పిల్లలకు మనతో మంచిచెడులు పంచుకునే అంత చనువు, స్వేచ్ఛను ఇచ్చి, ఏమంటారో అనే భయం లేకుండా.. మేమున్నామనే భరోసా ఇచ్చి, పిల్లలు మానసిక ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని గుర్తు చేయగా… తాను మారాలి అని అనుకొని వాసుదేవ్.. “తప్పకుండా సుధీర్ గారు నాకు జ్ఞానోదయం కలిగిందంటూ.. మీ అమ్మాయి నా ఆయుష్షు కూడా కలుపుకొని దీర్ఘ కాలం బతకాలి అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి, పట్టా తీసుకోవడానికి వెళుతున్న నందూతో స్టేజీపైకి వెళ్లాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!