నేనున్నానని

(అంశం : “మానవత్వం”)

నేనున్నానని

రచన: శ్రీదేవి విన్నకోట

“చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని నీకేం కాదని
నిన్నటి రాతనే మార్చేస్తానని”ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం,ఈ పాటలా నా జీవితంలో కూడా ఇలా నేను ఒకరికి సాయ పడ్డాను. ఇలా సాయపడ్డాను అని చెప్పడం కంటే కూడా నా కుటుంబంలో నా కర్తవ్యాన్ని నేను సరిగ్గా నిర్వహించాను అని చెప్పడం బావుంటుందేమో.

నా పేరు లావణ్య, మావారు జగదీష్,నా పెళ్లి అయిన
మూడు సంవత్సరాల తర్వాత మా ఆడపడుచు గారి(తన పేరు వసంత) భర్త గుండెపోటుతో చనిపోయారు, అప్పటికీ వాళ్ళకి నాలుగేళ్ల పాప ఉంది, మా ఆడబడుచు భర్త చనిపోయేనాటికి మూడు నెలల ప్రెగ్నెంట్, ఆమెకి అప్పటికి 29 .30 సంవత్సరాలు లు ఉంటాయి, నిజం చెప్పాలంటే నేను కూడా చిన్నదాన్నే, ఆప్పటికీ మాకు ఇంకా పిల్లలు లేరు, నాకు 21, 22 ఇయర్స్ ఉండొచ్చు అంతే,

వాళ్ల అత్తింటి వాళ్లు అంత మంచి వాళ్ళు కాదు.
తను అంత బాధలో ఉన్న కనీస అవసరాలు కూడా తీర్చే వాళ్లు కాదు, తాను అక్కడ ఉండలేకపోయేది.
వాళ్ల సూటిపోటి మాటలు, నీవల్లే నీ భర్త చనిపోయాడు అన్నట్టు చూసేవాళ్ళు, పోనీ ఏమైనా పని చేసుకుందాం ఏదైనా అవసరానికి అని బయటికి వెళ్దాం అన్నా భర్త పోయిన ఆడవాళ్లు ఇంట్లోనే ఉండాలి అనే సాంప్రదాయం పేరిట ఆమెను బయటకి వెళ్ళనిచ్చేవారు కాదు, బయట వారిని కూడా  ఎవరిని చూడనిచ్చేవారు కాదు తనని చూస్తేనే అశుభం అన్నట్టు ఉండేవారు,

ఒకపక్క భర్త పోయిన బాధ, మరోవైపు తను మూడు నెలల గర్భవతి, మరోవైపు నాలుగు సంవత్సరాల పసిపిల్ల,నిజంగా అక్కడ ఉన్న కొన్ని నెలలు తను నరకమే  అనుభవించింది భర్త పోయిన తర్వాత,
ఏం పని చేసిన మాట్లాడినా తప్పే, నవ్వితే తప్పు, కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, ఎవరితో అయినా నోరు తెరిచి మాట్లాడితే తప్పు, అత్త మామ ఇద్దరు బావ గార్లు,ఇద్దరు మరుదులు, నలుగురు తోటి కోడళ్ళు అందరూ మాటలతో హింసించేవారు,

బావగార్లు, మరుదుల వెకిలి చూపులు తను  అక్కడ అసలు భరించలేకపోయేది. అక్కడ ఉమ్మడి కుటుంబం. సొంత ఇల్లు, అందుకే ఎంత కష్టమైన వాళ్లు ఎన్ని తిట్టినా ఓర్చుకుంటూ అలాగే ఉండేది, కానీ వాళ్ల ఆగడాలు మరీ శృతి మించి పోయాయి, మేము  ఆస్తమాను వెళ్లి చూసి వస్తూ ఉండేవాళ్ళము, తన భర్త ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇప్పుడు అంత హింసించబడుతుంది, తర్వాత కొన్ని నెలలకి ఆమెకి బాబు పుట్టాడు. (తన తండ్రిని మింగేసి పుడుతున్నాడు ఈ బిడ్డ పుట్టడం ఇంటికి అరిష్టం, అబార్షన్ చేయించుకోమని, లేదా ఆ బిడ్డను కడుపులోనే చంపేయాలి అని వాళ్ల అత్తింటి వాళ్లు చాలా ప్రయత్నం చేశారు, కానీ అందుకు మా ఆడపడుచు ఒప్పుకోలేదు, జాగ్రత్తగా ఉంది) దేవుని దయ వల్ల బాబు ఆరోగ్యంగా పుట్టాడు, అలా ఒక సంవత్సరం గడిచింది,

ఒకరోజు అర్ధరాత్రి, తను అందరూ పడుకున్నాక ల్యాండ్ లైన్ నుంచి చాలా రహస్యంగా ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఏం అడిగిందో తెలుసా మావార్ని, తమ్ముడు నాకు ఆకలేస్తుంది, రెండు రోజుల నుంచి అన్నం తినలేదురా, బాబుకి పాలు రావట్లేదు, గుక్కపట్టి ఏడుస్తున్నాడు, వాడికి ఏమవుతుందో అని నాకు  భయమేస్తుంది, పాపకూడా బాగా నీరసించిపోయింది,

మా అత్త ఇంటి వాళ్ళు తిండి కూడా  పెట్టట్లేదు, మీ బావగారు పోయిన బాధ కంటే కూడా, ఆకలి బాధ మరీ భయంకరంగా ఉంది అంటూ ఏడ్చేసింది, తన
బాధను చూసి నాకు ఎంత ఏడుపొచ్చిందంటే, నిజంగా రాస్తుంటే ఇప్పుడు కూడా ఏడుపొస్తుంది, మేము ఇంకా ఉపేక్షించలేదు, మా వారు పొద్దున్నే వెళ్దాము వాళ్ళ ఊరు అని చెప్పిన, నేను చచ్చిన ఒప్పుకోను ఇప్పుడు తీసుకెళ్తారా తీసుకెళ్ళరా అంటూ మొండిగా వాదిస్తూ కూర్చున్న. ఆయనకి కూడా బాధగానే ఉంది,

ఇద్దరం అప్పటికప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళాం, రాజమండ్రి నుంచి చాలా దూరం మచిలీపట్నం, మేము అప్పుడు బయలుదేరితే మర్నాడు మధ్యాహ్నం అయిపోయింది బస్సులోనే, వెళ్లేటప్పుడు తనకోసం హోటల్ లో భోజనం పార్సిల్ చేయించుకుని వెళ్ళాం, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నేను చేసిన పని తనకి భోజనం పెట్టి పాపకి అన్నం తినిపించడం, చాలా పెద్దగా గొడవ అయింది వాళ్లతో, నేను మా వారు అసలు ఊరుకోలేదు,

నేనైతే వాళ్ళ అత్తగారిని వాళ్ళందర్నీ మీరు మనుషులా రాక్షసులా,నెలల పసిబిడ్డ ఉన్న  తల్లికి అన్నం పెట్టలేక పోయారు, తను ఆకలితో ఎలా ఉంటుంది, బాబు కి పాలు ఎలా పడతాయి, వాడికి వాడి తల్లికి ఏదైనా అయితే మీరేం చేసేవారు అని చాలా కోపంగా అడిగాను, అప్పుడు వాళ్ళ అత్త గారు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, నాకు చెట్టంత కొడుకే పోయాడు, వీళ్ళు ఉంటే ఎంత చస్తే ఎంత అంది, నిజంగానే వాళ్ళు రాక్షసులే, చాలా పెద్ద గొడవ అయింది, ఇంచుమించు మా ఆడబడుచునీ ఇంట్లోంచి గెంటేసిన అంత పని చేశారు,

పైగా ఒక రోజు అన్నం పెట్టకపోతే పుట్టింటి వాళ్లకి ఫోన్ చేసి చెప్తావా అంటూ ఆమెను కూడా తిట్టారు,
ఇక మేము తనని అక్కడ ఉంచదలుచుకోలేదు, నేను తన బట్టలు సర్ధేసాను, తనను తీసుకుని మా ఇంటికి వచ్చేసాం, వాళ్లు చిల్లిగవ్వ కూడా ఇవ్వము,ఇక నీకు మాకు సంబంధం లేదు అన్నారు మా ఆడపడుచుతో,
మీలాంటి మానవత్వం మంచి మనసు లేని రాక్షసులతో సంబంధం లేక పోవడమే మంచిది  అన్నా నేను, అప్పటి నుంచి ఇప్పటివరకు నేను అన్ని విషయాల్లో మా ఆడపడుచు కి తోడుగానే ఉన్నాను, మేం పన్నెండేళ్ళపాటు కలిసే ఉన్నాం,

తనకి ఏం కష్టం వచ్చినా ముందు నాకే చెప్తుంది, పిల్లల్ని కూడా మా పిల్లల్లాగే చూసుకున్నాం, వాళ్లు నన్ను కూడా అమ్మ అనే పిలుస్తారు.ఇప్పుడు పాప బాబు చక్కగా చదువుకుంటున్నారు, ఏ విషయం అయినా వాళ్ళ అమ్మ కంటే ముందు నాకే చెప్తారు, అప్పటివరకు కోడలు కొడుకు పెళ్ళాం అనుకున్నా అమ్మాయి ఇలా కొడుకు చనిపోగానే పరాయిది అయిపోతుంది అత్తింటి వారికి, భర్త చనిపోయి పుట్టెడు బాధలో ఉంది తను ఎలా బతుకుతుంది
అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి, అంతగా హింసించారు తనని,

భర్త పోయిన తర్వాత తను అక్కడ ఉన్నది ఒక సంవత్సరమే అయినా ఒక జన్మ కి సరిపడా బాధను తనకు ఇచ్చారు, అసలు తనని ఎలా తిట్టాలి అనిపించిందో నాకు అర్థం కాదు ఎందుకంటే తను చాలా సైలెంట్ నోట్లో మాటే పెద్దగా రాదు నెమ్మదిగా చాలా ఒద్దికగా ఉంటుంది, ఇప్పుడు భర్త లేడు అనే ఒక్క బాధ తప్ప కష్టాలన్నీ తీరి సంతోషంగా బాగానే ఉంది,

తనకి వాళ్ళింట్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని, మా ఆడపడుచు పెళ్లి అయిపోయి భర్తతో వెళ్ళిపోయింది అని మేము ఇంకా ఆమెకూ ఆమె పిల్లలకు ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదు అని ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ అత్తింటి వాళ్ళు ఇప్పటికీ, నేనైతే అంత తేలిగ్గా వదిలిపెట్టను వాళ్ళని, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి 18 ఇయర్స్ నిండగానే చెప్తా  వాళ్ల సంగతి అనుకుంటూ ఉంటాను
ఇలా తన జీవితంలో నేను ఎప్పుడూ తోడుగానే ఉన్నాను తనకి నేనున్నాను, ఎప్పటికీ ఉంటాను.
తన మరదలిగా తననీ సంతోషంగా చూసుకోవాల్సిన అవసరం బాధ్యత నాకుంది, అందుకే నేను ఒక స్నేహితురాలిగా, చెల్లెలిగా, మరదలిగా, అన్ని పాత్రల్లో అన్ని విషయాల్లో తనకు ఎప్పటి తోడునై నిలచి ఉన్న.

ఈ కథలాంటి వ్యధ నిజంగా కొందరి జీవితాల్లో జరిగిన కథ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!