సుధాపరిణయం

సుధాపరిణయం

సావిత్రి కోవూరు

“ఏంట్రా అశోక్ ఇంత ఉదయాన్నే వచ్చావు. ఏమైనా పనా?”అన్నది విశాలాక్షి.

“లేదు అత్త. మంచి కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది రాత్రే తెలిసింది. మొదట మీకు, మామయ్యకు స్వీట్ ఇద్దామని వచ్చాను”

“ఓ కంగ్రాట్యులేషన్స్. ఉదయమే ఇంత మంచి న్యూస్ చెప్పావురా. వెళ్ళు మీ మామయ్య రూంలో ఉన్నారు స్వీట్, న్యూస్ చెప్పిరా” అన్నది విశాలాక్షి.

“అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు రా” అన్నది.

“బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నారత్త. అమ్మ సాయంత్రం మీ దగ్గరికి వస్తానన్నది. మీతో ఏదో మాట్లాడాలట”

“సరేలే కూర్చో. కాఫీ తాగుతావ?”అన్నది విశాలాక్షి.

“లేదత్తా, ఇప్పుడే తాగివచ్చాను. సుధా వచ్చిందట కనబడటంలేదు”

“ఆ వచ్చింది నిన్న. దానికి పెళ్లి కుదిరింది కార్డ్ ఇవ్వడానికి వచ్చింది. పెళ్లి ఇంకా వారం రోజులు ఉంది. ఎవరో స్నేహితురాలిని కలవడానికి వెళ్ళింది”

అశోక్ ఆ మాట వినగానే మౌనంగా కూర్చున్నాడు. “ఏంట్రా ఆలోచిస్తున్నావ్” అన్నాడు రామారావు.

“ఏం లేదు మామయ్య” అన్నాడు అశోక్.

“ఏం లేదంటావేంట్రా. నీ ముఖం చూస్తుంటే ఏంటో చెప్పాలనుకుంటున్నట్టుగా ఉంది. చెప్పు ఏంటి సంగతి?” అన్నది విశాలాక్షి.

“ఏం లేదు అత్తా. ముందు సుధా వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె మాటతీరు మర్యాద అదీ నాకు బాగా నచ్చింది. అందుకే మా ఇంటికి తీసుకు రమ్మని, అమ్మ చేత మీకు చెప్పించాను. సుధను చూసిన అమ్మకు, నాన్నకు కూడా బాగా నచ్చింది. నేను అప్పుడే ఆమెనెలాగైన పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీతో ఆ విషయం మాట్లాడాలని అమ్మ సాయంత్రం మీ దగ్గరికి వస్తానన్నది” అన్నాడు అశోక్.

“అదేంట్రా ఒక్క మాట అయినా నాతో ముందు చెప్పలేదు. కనీసం సుధకైనా చెప్పావా”

“లేదత్తా నాకు జాబ్ లేకుండా పెళ్లి గురించి మాట్లాడటం బాగుండదని చెప్పలేదు. ఇంతట్లోనే ఆమెకు పెళ్లి కుదిరుతుందనుకోలేదు” అన్నాడు.

ఈ పెళ్లి కూడా దానికి అంత ఇష్టంగా లేదురా మా అక్క చనిపోయాక, సుధా వాళ్ళ నాన్న వసుంధరను పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ సవతి తల్లి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆమె నోటికి ఒక హద్దనేది లేదు. సుధ ఇంటి పనంత చేసినా ఆమెకు తృప్తి లేదు. రోజుకొకసారైన ఏదో తప్పు ఎంచి కొడుతుంది. తిండి కూడ సరిగ్గా పెట్టదు. అవ్వన్ని చూడలేక నా దగ్గరికి తెచ్చుకుందామంటే, వాళ్ళ నాన్నను వదలి రానంటుది సుధ. నేనేమి చేయలేక దాన్ని ఆ నరకంలో వదిలేశాను. సుధా ఇంటర్ అయిపోగానే వసుంధర తన కజిన్ ఎవరికో పిల్లలు లేరని, దీనిని అతనికి అంట కట్టాలని చూసింది. వాళ్లు బాగా ఆస్తి పరులంతా దీనిని అతనికి ఇచ్చి పెండ్లి చేయాలని చూసింది.

అప్పుడు నేను, మీ మామయ్య వెళ్లి కనీసం డిగ్రీ అయినా చదువుకోని. చురుకైన పిల్ల బాగా చదువుతుంది. అనవసరంగా చదువు మాన్పించవద్దని బ్రతిమిలాడితె ఆగిపోయింది.

ఈ లోపల సుధా వాళ్ళ నాన్న హార్ట్ఎటాక్ వచ్చి చనిపోవడం వల్ల ఆమె కడ్డు చెప్పేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడేమో వాళ్ళ నాన్న పోయిన నెల  లోపల పెళ్లి చేస్తే మంచిదని ఎవరో చెప్పారట. అందుకని సడన్గా వాళ్ల కజిన్ తో పెళ్ళికి ముహూర్తం పెట్టించేసింది. ఇప్పుడు ఎవరు చెప్పినా వినే స్థితిలో లేదు. సుధనేమో చాలా అమాయకురాలు. బాగ చదువుకుంది, పని పాటలు అన్ని వచ్చు, చాలా ఓపిక గలది, కాని వాళ్ల పిన్నికి ఎదురు చెప్పి నెగ్గ లేనని తెలుసుకున్నది. వసుంధర కజిన్ సుధ కంటే 15 సంవత్సరాలు పెద్దవాడు. భార్య ఉంది కానీ, పిల్లలు కాలేదని మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడట. వాళ్లు బాగా స్థితి మంతులు. కనుక దీనినిచ్చి పెండ్లి చేస్తే తను కూడా వాళ్ళ ఇంట్లో హాయిగా ఉండొచ్చని ప్లాన్ వేసుకుంది.

నాకు ఎటు తోచడం లేదు. సమయం కూడా ఎక్కువ లేదు. ఇంత తొందరగా సుధకు తగ్గ మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతారులే అని నేను కూడా చూస్తూ ఉన్నాను.

పెళ్లి వారం రోజులే ఉంది. ముందు నీ సంగతి తెలిసి ఉంటే ఏదో ఒకటి చేసేదాన్ని. నీవు కొంచెం ముందు చెప్పాల్సింది నాకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు” అన్నది విశాలాక్షి.

“ఏమో అత్త, నాకు కూడా ఏమీ తోచడం లేదు. మా అమ్మ, నాన్నలను పిలుస్తాను. మీరే మాట్లాడి చూడండి. నేను మాత్రం ఆ అమ్మాయికి ఇష్టమయితే, ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆమె ఇష్టం తెలుసుకుని మీరే ఏదైనా చేయండి” అన్నాడు అశోక్.

“సుధకు కూడా ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. రాత్రంతా ఏడుస్తూనే పడుతుంది” అన్నది విశాలాక్షి.

“ఇప్పుడు తను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. కాసేపట్లో వస్తుందేమో” అన్నది.

“ఈ లోపల మా అమ్మ నాన్నలను రమ్మని చెప్తాను” అని అశోక్ వాళ్ళ అమ్మ వాళ్లకి ఫోన్ చేసి పిలిపించాడు.

వాళ్లు వచ్చిన తర్వాత విషయం అంతా చెప్పింది విశాలాక్షి, తన ఆడపడుచు పరిమళకు ఆమె భర్త రవీందర్ కు.

“అయ్యో అశోక్ చాలా రోజులు అయింది నాకు చెప్పి. నాకు మీ అన్నయ్యకు కూడా సుధ బాగా నచ్చింది వదినా, కాని వాడికి ఉద్యోగం రాగానే అడుగుదామనుకున్నాను. ఇంత తొందరగా ఆ అమ్మాయి పెళ్లి కుదురుతుందనుకోలేదు” అన్నది పరిమళ

“మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు” అన్నాడు రామారావు.

“మొదట ఆ అమ్మాయి అభిప్రాయం ఏంటో కనుక్కోవాలి. ఆ అమ్మాయికి మన అశోక్ నచ్చితే అప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడదాం” అన్నాడు రవీందర్.

“ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల పిన్ని వసుంధర ఈ పెళ్ళికి ఒప్పుకోదు” అన్నది విశాలాక్షి.

“ఒకవేళ ఆ అమ్మాయికి కూడా నన్ను చేసుకోవడం ఇష్టం అయితే, నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఆ అమ్మాయి మేజర్ కాబట్టి ఈ ఊర్లోనే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంటాను. పెళ్లయింతర్వాత వాళ్ల పిన్ని మమ్మల్ని ఏం చేయలేదు కదా” అన్నాడు అశోక్.

ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుండగానే సుధా వచ్చేసింది. అందరిని ఒకసారి పలకరించి లోపలికి వెళ్ళింది. పెళ్లి చేసుకుంటున్నాను అన్న సంతోషం ఆ అమ్మాయి ముఖంలో ఏ కోశానా లేదు. కొంచెం సేపు తర్వాత విశాలాక్షి, పరిమళ లోపలికెళ్ళి విషయం అంతా చెప్పారు సుధకు.

“ఏమో పిన్ని నాకేం తెలియడం లేదు. నా బుర్ర పని చేయడం లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నానంటేనే గోల గోల చేసేసింది పిన్ని. వారం రోజుల క్రితం ఒక ఉద్యోగమొచ్చింది. ఉద్యోగమొస్తే తన మాట విననని ఆర్డర్ పేపర్ చింపి పడేసింది.

ఇప్పుడు ఎలాగో బ్రతిమిలాడి నచ్చ చెప్పి వచ్చాను. రేపు నేను వెళ్లకపోతే చాలా అల్లరి చేస్తుంది” అన్నది సుధా.

“అది మేము చూసుకుంటాం మొదట నీకు అశోక్ అంటే ఇష్టమా కాదా చెప్పు. అశోక్ చాల బుద్దిమంతుడు నీవంటె చాల ఇష్టపడుతున్నొడు. లాస్ట్ ఇయర్ వచ్చి నప్పుడు కూడా చూసావు కదా. నీవు ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంటికి ఎన్నోసార్లు వచ్చాడు. అశోక్ ని చేసుకోవడం ఇష్టమైతే, నీకు ఇష్టం లేని పెళ్లి ఆపడానికి మేం ప్రయత్నిస్తాం” అన్నది విశాలాక్షి.

“అదేంటి పిన్ని ఈ లోకంలో నా క్షేమం కోరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, అది నువ్వు ఒక్కదానివే. నీవు ఎలా చెప్పినా, ఏం చేసినా నా మేలు కోరే చేస్తావని నాకు తెలుసు. నీకు ఏది మంచిగా అనిపిస్తే అలా చేయి. నాకేం అభ్యంతరం లేదు. కానీ నావల్ల మీరంతా చిక్కుల్లో పడడం నాకు ఇష్టం లేదు. పిన్ని  తనకు ఇష్టం లేని పని ఎవరు చేసినా ఎంతకైనా తెగిస్తుంది. అందుకే మౌనంగా ఆమె చెప్పినట్టు వింటున్న” అన్నది సుధ.

“అదంతా నేను చూసుకుంటాను. రేపు పెళ్ళికి సిద్ధంగా ఉండు. ఈ లోపల అశోక్ తో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు” అన్నది.

సుధా తనకు అశోక్ ని చేసుకోవడం ఇష్టమేనని చెప్పింది.

వెంటనే విశాలాక్షి, రామారావు, పరిమళ, రవీందర్ షాపింగ్ కి వెళ్లి ఇద్దరికీ కొత్తబట్టలు తెచ్చారు. ఆర్య సమాజంకు వెళ్లి వీళ్ళ పెళ్లి విషయం చెప్పి వచ్చారు. మరుసటి రోజు వెళ్లి పెళ్లి చేసి తీసుకు వచ్చారు. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత, క్లోజ్ ఫ్రెండ్స్  కొంతమందిని పిలిచి చిన్న పార్టీ అరెంజ్ చేశారు.

పార్టీలో అనివార్య కారణాల వల్ల సడన్ గా పెళ్లి చేయాల్సి వచ్చింది. కనుక నెక్స్ట్ వీక్ గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇస్తాము అందరు తప్పకుండ రావాలని అనౌన్స్ చేశారు. రవీందర్ దంపతులకు ఒక్కగానొక్క కొడుకుంటే పెళ్లి ఇంత సింపుల్గా అయినందుకు చాలా అసంతృప్తిగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితి కనుక సర్దకున్నారు.

సుధా వాళ్ళ పిన్ని రోజుకు పది సార్లు ఫోన్ చేస్తుంది ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉంటావు. పెళ్లి ఎల్లుండే తెలుసు కదా. తొందరగా వచ్చేసేయ్ అని.

విశాలాక్షి ఫోన్ చేసి సుధకు విపరీతంగా జ్వరం వచ్చింది. అందుకే లేట్ అయింది. రేపు వచ్చేస్తుంది. అని చెప్పింది.

మరుసటి రోజు సుధను అశోక్ ను తీసుకొని వెళ్ళింది విశాలాక్షి. వీళ్ళు వెళ్లేసరికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వచ్చి విడిదిలో ఉన్నారు. సాయంత్రము ఎదుర్కోలు కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేస్తూండగా, అశోక్ ఎస్.ఐ. అయిన తన స్నేహితుడు ఒకతనిని, ముగ్గురు కానిస్టేబుల్స్ ని తీసుకుని హాల్ కు వచ్చి,

“ఈ అమ్మాయి నా భార్య. మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఈ తతంగమంతా ఆపేయండి” అన్నాడు.

అప్పుడు వసుంధర “ఏం మాట్లాడుతున్నావ్ నీవెవరో మా అమ్మాయికసలు తెలియదు. ఏవో కథలు చెప్తే మేము నమ్మాలా” అని అరవటం మొదలు పెట్టింది. పెళ్ళి కొడుకు తరపు వాళ్ళు, పెళ్లి కొడుకు కూడా విచిత్రంగా చూస్తున్నారు.

ఎస్.ఐ “ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయడం నేరం. ఇదివరకే ఆ అమ్మాయి పెళ్లి నా స్నేహితుడు అశోక్ తో జరిగింది. కావాలంటే రుజువులు చూపిస్తాం. అయినా మీరు వినకపోతే అరెస్టు చేయాల్సి ఉంటుంది” అని గట్టిగా అనేసరికి

వసుందర “మా అమ్మాయికి పెళ్లి కాలేదు. ఏమే మూగమొద్దు చెప్పు నీకు పెళ్లి కాలేదని ఆ ఎస్ ఐ తో” అన్నది.

సుధ “నాకు పెళ్లి అయ్యింది ఎస్.ఐ.గారు. ఈ అశోక్ తో. ఇదిగో తాళిబొట్టు. ఇదిగో ఫొటోస్, పెళ్లి సర్టిఫికెట్” అని చెప్పేసరికి వసుంధర తెల్లబోయింది.

పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఈ గొడవలన్నీ ఎందుకులే అని ఒక్కొక్కరు వెళ్లిపోయారు పెళ్లి కొడుకు తో సహా.

సుధ అశోక్ చేయి పట్టుకొని విశాలాక్షితో కలిసి అత్తవారింటికి వెళ్ళి పోయింది తేలికైన మనసుతో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!