హరిత హారం

హరిత హారం

రచయిత :: నాగ మయూరి

హరిత తన స్కూల్ తరపున టీచర్లతో, స్నేహితులతో కలిసి ఒక పురాతన మ్యూజియం చూడటానికి వెళ్ళింది.అక్కడ కొన్ని వందల ఏళ్ళ నాటి వస్తవులు ఎన్నో భద్రపరచబడి ఉన్నాయి.
పిల్లలు అంతా వాటిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు.ఆ వస్తువుల చరిత్ర గురించి చెప్పడానికి గాను అక్కడ కొంతమంది గైడ్ లు ఉన్నారు. వారంతా పిల్లలకి ఆ వస్తువుల విశేషాలు,వాటిని ఏ కాలంలో వాడే వారు అనే విషయాలను గురించి వివరిస్తున్నారు.

ఆ మ్యూజియంలో మూడవ ప్రపంచ యుద్ధానికి ముందు వాడిన అనేక రకాల యంత్రాలు, పనిముట్లు ఉన్నాయి.

ఇంకా గైడ్ అక్కడ ఉన్న పెద్ద పెద్ద బొమ్మలను చూపిస్తూ పిల్లలు ఈ ప్రక్కన వున్నవి అన్నీ ఇరవయ్యో శతాబ్దానికి చెందిన మనుషుల బొమ్మలు.
అంటే మనం ఇప్పుడు యభైయవ శతాబ్దం లో ఉన్నాం కదా మనకంటే ముప్పై శతాబ్దాల ముందు ఈ భూమి మీద జీవించే మనుషులు ఇలా ఉండేవారు అని చెప్పారు.

ఆ బొమ్మలు ఐదు ఆరు అడుగుల ఎత్తుతో, చాలా బలంగా ఉన్నాయి. పిల్లలో కొందరు తమ తలలని పైకెత్తి ఆ బొమ్మలను చూస్తున్నారు. కొంతమంది ఏమో అంత ఎత్తు చూడలేక నేల మీద పడుకొని ఆ బొమ్మలని గమనిస్తూ….అమ్మో ! ఎంత ఎత్తుగా ఉన్నారో అని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఈలోగా టీచర్ ఇటు చూడండి పిల్లలు అని పిలిచారు.ఆ ప్రక్కన ఉన్నవన్నీ కూడా ఒకప్పుడు భూమి మీద జీవించిన మొక్కలే అని చెప్పారు.
ఇంతలో గైడ్ ఆమొక్కల పేర్లు ,వివరాలు చెప్తున్నాడు.
ఆ చెట్లని చూస్తుంటే మరో ప్రపంచం లోకి వెళ్ళినంత ఆశ్చర్యంగాను,ఆనందంగాను ఉంది హరితకి. “అయ్య బాబోయ్ వంకాయ చెట్టు ఇంత పెద్దగా ఉంది ఏంటి టీచర్” దీని ఎత్తు ఎంత? అని అడిగింది హరిత.
అది “రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు” ఉంటుందని గైడ్ చెప్పారు. అవునా కాయలు కూడా మన “కొబ్బరి బోండాలా పెద్దగా ఉన్నాయి” అంది ఒక విద్యార్థిని.
మూడు అంగుళాల ఎత్తు ఉండే వంగ చెట్టుని మనం మహవృక్షం గా చెప్పుకుంటాం కదా టీచర్ పైగా దాని కాయల కోయాలంటే నిచ్చెన కావాల్సందే. అలాంటిది మూడు అడుగులు ఉంటే అమ్మో ఆకాశాన్ని తాకే దాని కాయలు ఎలా కోసేవారో అంటూ పిల్లలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు.

ఆ మాటలు విన్న టీచర్ పిల్లలు అప్పట్లో మనుషులు కూడా మనం ఇంతకు ముందు చూసిన బొమ్మలా ఐదు,ఆరు అడుగులు పొడవు ఉండేవారుట దానితో వాళ్ళు ఎటువంటి సాధనాలు లేకుండా చాలా తేలికగా ఆ కాయలని కోసుకునే వారు అని చెప్పారు.
పిల్లలకు అదో అద్బుతంలా అనిపించి నోరుతెరిచి మరీ టీచర్ మాటలు వింటున్నారు.

ఇంతలో ఆకుపచ్చ రంగు ఆకులతో, పసుపు రంగులో నిగనిగలాడుతూ వేలాడే పండ్లు తో అందంగా ఉన్న ఒక పళ్ళచెట్టు మీద పడింది హరిత దృష్టి.
వెంటనే గైడ్ ని పిలిచి “అంకుల్ ప్లీజ్ నాకు ఈ చెట్టుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి” అని అడిగింది.
దీనిని మామిడి చెట్టు అని పిలుస్తారు దీని ఫలాలు మంచి రంగుతో, రుచితో చాలా బాగుండేవి అని అప్పట్లో కంప్యూటర్ లో పొందు పరిచిన సమాచారం ద్వారా తెలుస్తోంది. అంతే కాక మామిడి ఆకులను శుభకార్యాల టైమ్ లో ఇంటికి తోరణాలలా అలంకరించే వారుట అని గైడ్ చెప్పారు”.

అవును పిల్లలు “ఈ మామిడి ఆకులు చెట్టు నుండి వేరు చేసిన తర్వాత కూడా డభై రెండు గంటలపాటు ప్రాణాలతోనే ఉండేవిట. అందువల్ల శుభకార్యాలులో జనాలు అంతా ఒకచోట చేరే టైమ్ లో తోరణాలుగా కట్టిన ఈ ఆకులు చక్కగా కావలిసినంత ఆక్సిజన్ అందించేవిట” అంటూ టీచర్ కూడా ఆ చెట్టును గురించి వివరించారు.

అవును టీచర్ గారు ఆక్సిజన్ అంటే గుర్తొచ్చింది ఆ బొమ్మలో ఒక్కరు కూడా మనలాగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోనే లేదు కదా! అన్నారు పిల్లల ఆశ్చర్యంగా చూస్తూ….

ఈ వింతలన్నీ చూసిన హరిత చిట్టి బుర్రలో బోలెడు సందేహాలు కలిగాయి.
వెంటనే టీచర్ దగ్గరకి వెళ్ళి ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టింది.
టీచర్ ముప్పై శతాబ్దాల క్రితం అలా ఉండే మనుషులం ఇప్పుడు ఇలా ఎందుకు అయిపోయాం? …
ఒక్క అడుగు ఎత్తు ఉన్న మనిషిని ప్రపంచ పొడగరిగా గిన్నిస్ బుక్ లో ఎక్కించారు కానీ అప్పుడు వాళ్ళు అంత ఎత్తు ఎలా పెరిగారు?….
ఇంకా ఆ చెట్లు అన్నీ ఇప్పుడు ఏమైపోయాయి?….
టీచర్ చూడమ్మ హరిత “ఆనాడు మన మనుషులు అంతా చేసిన తప్పుల ఫలితమే ఈనాటి మన దుస్థితికి కారణం”.నాగరికత పేరుతో విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని, దానిలో గృహోపకరణాల తయారీ కోసం చెట్లుని నరికి ఆ కలపని వాడేవారు. రకరకాల అవసరాల పేరుతో దట్టమైన చెట్లతో కూడిన అడవులను నరకేసారు.ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది.
ఆకాశం నుండి అతినీలలోహిత కిరణాలు భూమిని చేయకుండా కాపాడే ఓజోన్ అనే పొర పూర్తిగా చిరిగిపోయి ప్రజలు వ్యాధుల పాలయ్యారు. దానికి తోడు మూడవ ప్రపంచ యుధ్ధంలో వాడిన అణుబాంబుల ప్రభావంతో ఇలా మనుషులలో ఎదుగుదల లోపించింది చివరికి మనం ఇలా రెండు, మూడు అంగుళాలు మాత్రమే పెరుగుతున్నాం. అప్పటి వారు కనక చెట్లు నరకడం మానేసి పకృతికి చేదోడుగా నిలుస్తూ పచ్చని మొక్కలను పెంచి ఉంటే ఈ రోజు మనం ఇలా వంగ మొక్క కి నిచ్చెన వేసుకునే పరిస్థితి వచ్చేది కాదు.ఎన్నో రకాల వృక్ష జాతులు నేడు అంతరించి పోయాయి. మిగిలిన వాటినైనా మనం జాగ్రత్త గా కాపాడుకుంటూ పెంచుకోవాలి అని హరితతో టీచర్ చెబుతున్నారు……

ఈలోగా “హరిత లేమ్మా స్కూల్ కి టైమ్ అవుతోంది. పైగా ఈరోజు నీ పుట్టినరోజు కదా గుడికి కూడా వెళ్ళాలి. త్వరగా లేచి రెడీ అవ్వు అన్న అమ్మ పిలుపుతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన హరిత చుట్టూ చూసుకుని ఓహో ఇదంతా నా కల” అనుకుంది.
తన కలని గురించి వాళ్ళ అమ్మతో చెప్పింది. అంతా విన్న హరిత తల్లి ఇది ఈరోజు నీకలే కావచ్చమ్మా కాని ఏదో ఒకనాటికి ఈ కల నిజమయ్యే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికే “కరోనా పేషెంట్ లకి ఆక్సిజన్ దొరకక పడుతున్న అవస్థలను గూర్చి మనం ప్రతిరోజూ పేపర్ లో, టి.వి లలో చూస్తూనే ఉన్నాం కదా.

నీ కలలోలా జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా “మనం అంతా అడవులను నరకడం మానేసి, పచ్చని చెట్లని పెంచాలి” అని చెప్పింది.

హరిత వాళ్ళ అమ్మ మాటలు విని తనూ చెట్లని పెంచాలి అని నిర్ణయించుకుంది.

హరిత తన తండ్రి దగ్గరకు వెళ్ళి “పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకి చాక్లెట్ ల బదులు మొక్కలు పంచి పెడతానని అడిగింది”.

హరిత కోరికని తల్లిదండ్రులు ఆనందంగా ఒప్పుకొని హరితకి కొన్ని మొక్కలు తెచ్చిచ్చారు.

హరిత స్కూల్ లో స్నేహితులు అందరికీ తన కల గురించి చెప్పి , వారందరిని తానిచ్చిన మొక్కలు నాటమని అడుగుతుంది.

ఇదంతా చూసిన స్కూల్ టీచర్ గారు నిజంగా మనం అంతా చెట్లని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. అప్పుడు ఇలా ఆక్సిజన్ సిలండర్స్ కొనుక్కోవలసిన పరిస్థితి రాదు అంటూ హరితని మెచ్చుకున్నారు.

హరిత, తన స్నేహితులు కలిసి తమ ఊరు అంతటినీ పచ్చని హరిత హరంతో అందంగా తీర్చిదిద్దారు.

 ***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!