బంగారు గాజులు

బంగారు గాజులు

రచన::పి. వి. యన్. కృష్ణవేణి

నల్లటి మేఘాలు, నీలి ఆకాశంలో చంద్రుడుని దాచేస్తున్నాయి. ఆ చీకటి వేళ ఇంకా కటిక చీకటి అలుముకుంది. మబ్బుల చాటున దాగిన ముత్యంలాంటి తార ఒకటి తలుక్కున మెరిసింది. నా మెదడులో ఉన్న ఆలోచనలాగానే.

పార్కులో కుర్చున్న నా మీద ఒక నీటి బిందువు ఆకాశంలో నుంచీ నా నుదురు తాకింది. తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉండే ఆనందం తలపించింది. అప్రయత్నంగానే నేను నుదురు తడుముకున్నాను. నా నుదురు తాకిన ఆ బిందువు చల్లదనం నాలో దాగి ఉన్న మది జ్ఞాపకాలను వెతికి తీసాయి. నాకు తెలియకుండానే నా గతం కళ్లముందు కదలాడుతున్నది.

చిటపట చినుకుల్లో చిందులు వేసే వయసు నాది. సన్నటి ఝల్లు నింగి నుంచి నేల రాలగా, నా మనసు మురిసింది. ఎందుకో తెలియదు!!!!! నా చిలిపితనానికి ఈ వాన తోడు అయితే నా ఆనందానికి అవధులు ఉండవు.

కళ్ళల్లో చిలిపితనం, కాళ్లల్లో చిందేసే హుషారు, పలుచటి పరికిణి, రెండు జడల్లో సన్నజాజులు గుభాలించే సువాసన, కాళ్ళకి వెండి పట్టీలు, చేతులకు చిన్ని చిన్ని రాళ్ల గాజులు, చూసే వాళ్ళను అబ్బుర పరచే అందం నాది.

అలా ముస్తాబు అయి ఉన్న నేను, చేతులు చాచి వానా వానా వల్లప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప అని వానలో తడుస్తూ పాట పాడుతుంటే, చుట్టూ ఉన్న వాళ్లు వారి చప్పట్లతో నన్ను అభినందించారు. కొందరి కళ్లల్లో ఒక రకమైన అసూయ కూడా ఆ చిన్న వయసులోనే నాకు అవగతం అవుతోంది.

రమ్యా…. ఇంట్లోకి రా…. వీదిలో వేసిన చిందులు చాలు… అంటూ అమ్మ అరిచిన అరుపుతో లోపలకు వెళ్లాను. లోపలకు అడుగు పెడుతూనే, నాన్న చెంతకు లేడిలా పరుగు పెట్టాను. నాన్న ఒడిలో ఓ బొమ్మలా ఒదిగిన నేను, నాన్నా… నాకు బంగారు గాజులు చేయించవా… నా క్లాసులో నీలూ… వేసుకుంది ఎంత బాగున్నాయో అంటూ గారాలు కురిపించాను.

సరేలే ఓ కోరికలు…. నాకు పండుగ వస్తే కానీ ఓ చీర జాకెట్ కొనరు, నీకు మాత్రం అప్పుడే బంగారు గాజులు కావాల్సివచ్చాయా? బానే ఉంది సంబరం.

అయినా మగ పిల్లాడులాగా ఆ వీధుల్లో డాన్సులు ఎంటే. వాన పడిందంటే చాలు, నీకు అదుపు, ఆజ్ణా ఏమి ఉండదు. మగ రాయుడివి అయిపోతావు. పైగా ఆ నీటిలో తడిస్తే, జలుబు ఒకటి అమ్మాయి గారికి. ఆ తర్వాత నేను చాకిరీ చెయ్యలేక చావాలి అంటూ విసుక్కుంది అమ్మ.

నాకెందుకో, మనసు చివుక్కుమంది. ఆడ, మగ తేడా ఎందుకు చూపించాలి ఇంత చిన్న విషయాలకే అని నా హృదయం కలవరపడింది. ఏదో చిన్నా, చితకా చిందులు కాదు నేను వేసేది. డాన్స్ టీచర్ దగ్గర మంచి మెప్పుని పొందాను నేను అంటూ ఉడుకున్నాను.

నా కోపంలో దాగిన ప్రేమ నీకు కనపడదు రమ్య… చీటికి మాటికి అలుగుతావు అంటూ తల నిమిరింది అమ్మ. నాన్న చిన్నగా చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు.
అన్నయ్య బాగా తడిసిపోయి కాలేజి నుండి అప్పుడే వచ్చాడు. అందరం కలసి వాడికి సపర్యలు చేస్తున్నాము.

సరదా సరదాగా సాగిపోతున్న నా జీవితంలో నీ బాల్య జీవితం ముగిసింది అంటూ నన్ను గుచ్చే ఇంకో సందర్భం రానే వచ్చింది. మా అమ్మనాన్న, తాతయ్యబామ్మ, అన్నయ్య, బాబాయి, అత్తయ్యలు, పెద్దమ్మలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కానీ, ఆ రోజు నుంచీ నాలో కూడా నాకు కూడా తెలియని చిన్న మార్పులు మానసికంగాను, శారీరకంగానూ ఎన్నో వచ్చాయి.

అమ్మ ఎప్పుడూ చెప్పే ఆడపిల్లల లక్షణాలు నాలో మొదలయ్యాయి. కానీ, ఇష్టాయిష్టాలు మారలేదు. మనసు ఇంకా సున్నితంగా మారింది. మా అన్నయ్య వచ్చి పక్కన కూర్చున్నా సరే ఏదో తెలియని సిగ్గు నన్ను మునుపటిలా కేరింతలు కొట్టనివ్వటం లేదు.

అదేమి గమనించని మా అన్నయ్య మాత్రం, చెల్లి నీకు పంక్షనికి ఏమి గిఫ్ట్ ఇవ్వను అని అడిగాడు. నేను ఏమి ఆలోచించ కుండా, బంగారుగాజులు అన్నాను.

వామ్మో, నాకు ఉద్యోగం లేదే తల్లీ, ఏదో చదువుకుంటూ నా మానాన నేను బతుకుతున్నా… నన్ను వదిలేయి… ఏదో ఒకటి నేనే కొంటానులే అంటూ వెళ్ళిపోయాడు.

మదిన పుట్టిన కోరిక, మనసు కోరుకునే చిలిపితనం రెండూ ఎప్పటికీ పోవు అని నాకు అప్పుడే అర్థం అయ్యింది.

ఆ రోజు సాయంత్రం బాగా వర్షం కురిసింది. నా మదిలో పులకరింత మొదలైంది. పైన బట్టలు తెస్తాను అని చెప్పి వెళ్లిన నేను, తడిసి ముద్దయ్యి,వానలో బాగా ఎంజాయ్ చేసి తర్వాతనే కిందకి వచ్చాను.

అప్పటికే మా పక్కింటి బామ్మగారు వచ్చి, మా అమ్మకు నా గురించి కంప్లైంట్ చేసి వెళ్ళిపోయింది.

అమ్మ మళ్లీ నా తల తుడుస్తూ, హిత బోధ మొదలుపెట్టింది. అమావాశ్య రోజు మబ్బులు పట్టిన ఆకాశంలాగా అయిపోయింది నా ముఖం.

డైరీ ఓపెన్ చేసి రాస్తున్నాను భాద పడిన మనసుతో.

ప్రేమలో భాద్యత,
నీకు ఉంది ఆ అర్హత

మనసు కోరిక తెలుసుకో
ఆట పాట అంగీకరించు

అమ్మాయిలో అణకువ,
అదిమి పెట్టిన ఉల్లాసం

ఆపవద్దు నా ఆవేశం
ఇదే నా జన్మ కర్తవ్యం.

అమ్మ అన్నం పెట్టాను అన్న పిలుపుతో బయటకు వెళ్లాను.

అలా ఆప్యాయత నిండిన హృదయానికి, స్వార్ధం తెలియని అమ్మ ప్రేమకు, భాద్యతతో కూడిన ఒక ప్రేమించే మనసుకు నా అర్థం తెలియని కోపంతో దగ్గర కాలేక  పోయాను.

చదువు ముగిసింది. నా చిలిపితనానికి అడ్డు కట్ట పడింది. నేనే పెద్దదానిలా మారి, ఒక కుటుంబాన్ని భాద్యతగా మొయ్యాలసిన పరిస్థితి. అప్పుడే తెలిసింది నాకు ప్రేమలో ఉండే భాద్యత విలువ.

ఒకరోజు రాత్రి, అందరికీ భోజనాలు వడ్డించి నేను మాత్రం రామ్( మా వారు) కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.

బయట వర్షం పడేలా ఉంది. తనేమో ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేద్దామంటే పెళ్లై కనీసం వారం రోజులు కూడా కాలేదు. కొత్తగా కొంచెం బెరుకుగా ఉంది.

వివరం కనుక్కోనే అంత చనువు లేదు

మనకెందుకులే అని వదిలేసే నిర్లక్ష్యం కాదు

చనువుగా మెలిగే దగ్గరతనం ఏర్పడలేదు

విధిలించుకునే చిన్న భంధం కాదు

నువ్వు లేనిదే నేను లేను అనేంత ఆదర్శం కాదు

నువ్వు నాకు కావాలి అనుకునే స్వభావం మాది

నేను ఆలోచనలో ఉండగానే, రామ్ వచ్చాడు. కొంచెం తడిసినట్టు ఉన్నారుగా అన్నాను. హా, మన ఏరియాలోకి అడుగు పెట్టిన తర్వాత వాన పెద్దది అయ్యింది అన్నాడు.

అయినా ఈ రోజు లేట్ అయ్యిందే అన్నాను. నా ముఖం వైపు చూసి, చిరునవ్వుతో నీ కోసమే షాప్ కి వెళ్లాను అన్నాడు.

నా కోసమా ఏమి తెచ్చారు అన్నాను. చెప్తాను అన్నం తిను ముందు అన్నాడు. అన్ని పనులు ముగించుకుని బెడ్ రూం లోకి వెళ్లాను.

రామ్ ఏదో డైరీ వ్రాయటం చూసి, నాకున్న హాబీ నే అనుకుని మురిసిపోయాను. నన్ను చూసి తన పక్కన కుర్చొవటానికి ప్లేస్ ఇచ్చాడు. చదవమని చూపించాడు.

నా మనసు లోపల పదిలం నీ రూపం
నీ నగుమోము నాకు ఒక వరం
ఇన్నాళ్లు ఎక్కడ దాచావు ఈ సోయగం
నా కనుల కునుకు లేకుండా చేస్తోంది నీ అందం

ప్రేమించలేదేలా  నిన్ను మునుపు
నా కంట పడలేదే నీ రూపు
నా మనసు దోచిందే ఈనాడు నీ సౌదర్యం
నువ్వు లేని నా జీవితం వ్యర్ధం

మావిచిగురు రంగు చీర కట్టుకుని
జడలో మల్లెలు మాల పెట్టుకుని
చంద్రబింబం లాంటి మోముకు
నీ చిరునవ్వు అవుతోంది ఆభరణం

నీ అందాన్ని కొల్లకొట్టటానికి చెయ్యాలి ఓ రణం
నీ సోయగాలే నా మనసుకు చేస్తాయి గాయం
నీ ప్రతి అణువూ నాకు నువ్వు ఇచ్చే కానుకలే
ఈ రోజు నా దేవికి నేను ఇచ్చే బహుమానమే

ఈ బంగారు గాజులు

తీరదు నీ ఋణం
ఆగదు నా ప్రణయం
పోయే వరకూ నా ప్రాణం
అందిస్తాను నీకు నా సహకారం.

చాలా బాగుంది అంటూ తల పైకి ఎత్తిన నా ఎదురుగా రామ్… నా రామ్… బంగారుగాజుల పెట్టెతో…

అయ్యో ఇప్పుడివన్నీ ఎందుకు రామ్!!!

నా ప్రేమ దేవతకు తాను కోరుకున్న ఓ చిన్న ప్రేమ కానుక నా తరుపునుండీ…. పుట్టిన రోజు శుభాకాంక్షలతో… అంటూ నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు.

వీరి ఆనందం హద్దులు దాటుతుంది అనుకుంటు ఆ శశి మేఘాల మాటున దాక్కున్నాడు. నా ప్రియ నన్ను కోరుతుంది అనుకుంటూ సన్నటి చినుకులు భూమికి చేరినాయి.

ఆ ఆనంద సమయాన్ని వృధా చెయ్యని రమ్య తన కోరిక పక్కన పెట్టి, తన మీద ప్రేమ పెంచుకున్న వాడికి తనని పూర్తిగా అర్పించుకోవటానికి, అదీ మనస్పూర్తిగా సిద్దపడింది

మేడమ్, ఈ లోకంలో ఉన్నారా??? నీ చిన్ననాటి కోరిక ఈ బంగారు గాజులు అని మన పెళ్లిలో తెలిసి, ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను నా స్వప్న సుందరికి అవే నేను సమర్పించ బోయే బహుమానం అని అన్నాడు

అతని మాటల్లో తన పై ప్రేమ కనపడింది
అతని బహుమానంలో తన కోరిక తీర్చాలన్న తపన కనిపిస్తుంది
గిఫ్ట్ బెడ్ రూంలో ఇవ్వడం వల్ల అతనిలోని కోరిక కనిపిస్తోంది
అన్నింటికంటే మించి, తన పుట్టిన రోజును వైభవంగా జరపాలనే అతని తాపత్రయం నచ్చింది

బయట కురుస్తున్న వాన సాక్షిగా
నింగిలోన దాగి ఉన్న తారల సాక్షిగా
దోబూచులాడుతున్న చందమామ సాక్షిగా
నింగి నేల నీరు తలపించే వర్షం సాక్షిగా
నేను నీకు ఎప్పటికీ సొంతమే…
ప్రేమ నీది ధ్యానం నాది
భాద్యత నీది భంధం నాది
భావం నీది అనుభూతి నాది
నీ ఇల్లు నందనవనం చేసే పూచీ నాది

అంటూ అతని కళ్లల్లోకి చూస్తు తనని తను మర్చిపొయింది.

ఆ తన్మయత్వంలోనే ఆమెను ఉండనిచ్చి, ఆప్యాయంగా మరియూ సున్నితంగా తన చేతులను ఆమె ఒంటిపై నాట్యం చేయిస్తున్నాడు. అతని పెదవులు ఆమె శరీర భాగాలను స్పృశిస్తున్నాయి.

అతని తీపి ముద్దులకు ఆమె పరవశించి అతనికి అనుకూలంగా మారుతోంది. జరిగిన రాత్రులు అన్నింటి కన్నా, ఆలుమగల మధ్య అనురాగం ఈ రేయి వాళ్లకు బాగా తెలుస్తోంది.

అలసి పోయి నిద్ర పోతున్న రామ్ ని చూసి నవ్వుకుంటూ లేచి చీర కట్టుకుని మేడ పైకి వెళ్ళింది. తనకిష్టమైన వర్షంలో నిలువునా తడిసినది.

మధురానుభూతి మదిన ఉండగా
తొలకరి ఝల్లు ఆనందమే కదా!!!
కోరుకున్న ప్రేమ వెంట ఉండగా
వదలి వచ్చిన ప్రేమ జ్ఞాపకం దరిచేరదు కదా!!!

ఒక్క నిమిషం అమ్మ వాళ్లు అందరూ గుర్తుకు వచ్చారు. మరుక్షణమే… రమ్యాలు అంటూ రామ్ పిలుపు విని అటు తిరిగింది. ఏంటి రమ్యా ఇది చిన్న పిల్లలలాగా…ఇంత వర్షంలో.. అదీ రాత్రి పూట… నీకు ఎమైనా అయితే అంటూ మందలించాడు

ప్రేమించే వాళ్ళు దొరకటం గొప్ప కాదు
అమ్మలాగా ప్రేమించే వాళ్లు దొరకటం గొప్ప

వెంటనే వెళ్లి అతన్ని కౌగిలించుకుని వర్షంలోకి నడిచింది. తన కోరిక తీరింది. ఆ చలికి తట్టుకోలేని రామ్ మాత్రం రమ్యని ఆ రాత్రి నిద్రకు దూరం చేసాడు. ఆ చలిలో ఇద్దరూ తమకంగా సేద తీరుతున్నారు. ఎన్నో తీపి సంతకాలు, మధుర జ్ఞాపకాలు వారి సొంతం చేసుకున్నారు.

రమ్య కలలోంచి ఇలలోకి వచ్చింది. అమ్మో ఎప్పుడో వాన మొదలైనట్టు ఉంది. పార్క్ లో కూడ అందరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. చినుకు పెరుగుతోంది అనుకుంటూ వడివడిగా అడుగులు వేసింది.

ఈ రోజు వాకింగ్ కి రామ్ రాలేదు. కోడలు టీ అన్నా పెట్టిందో లేదో అసలు. నా కొంగు పట్టుకునే ఉండేవాడు ఎప్పుడూ… కనీసం అడిగి అన్నా తాగాడో లేదో… టిఫెన్ ఎమైనా తిన్నాడో లేదో అనుకుంటూ అడుగులు వేస్తూ ఉంది వేగంగా… ఎదురుగా వచ్చే లారీని గమనించకుండా.
తన రామ్ కోసం

తన ప్రేమ కోసం నడకలో వేగం
తనకు చేరువవ్వటానికి మనసు పడే ఆరాటం
వయసుతో సంభంధం లేని మమకారం
వారి ప్రేమ నిలుస్తుంది చిరకాలం.

స్పృహ కోల్పోయిన రమ్యకు నుదుటపై పడిన ఆ వాన చినుకు ఆయువును ఇచ్చింది. ఆ నిమిషానికి గండం గడిచింది.

ఏంటి రమ్యాలు!!! రోడ్డు మీదకు వెళ్లినప్పుడు కూడా ఏదో ఆలోచనలేనా!!! చూసి నడవవా, అంటూ కోప్పడ్డాడు రామ్.

వానలో ఎప్పుడూ తీపి గుర్తులేనా రామ్… ఇలాంటి మధుర గాయాలు కూడా ఉండాలి కదా!!! అంటూ నవ్వాను

ఆ బంగారు గాజులే మారాయి ఆమెకు విలువైన ప్రేమ కానుకగా. రామ్ మాత్రమే మారాడు ఆమెకు సర్వస్వంగా.

ఇద్దరూ ఉన్నన్ని రోజులు వారికి ప్రేమలో ఉన్న రోజులే. ప్రతీ రాత్రి వాళ్లకు వసంత రాత్రే. వారి జీవిత చరమాంకంలో కూడా వారు గొప్ప ప్రేమికులే.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!