నేనీ దరిని నువ్వా దరిని

అంశం:: (“ఎవరికి వారే యమునా తీరే..” )

నేనీ దరిని నువ్వా దరిని

రచన: పద్మావతి తల్లోజు

         “నీలిమా! వెంటనే బయలుదేరి రండి. లహరి, రేవంత్ ఇందాకే సిటీ నుండి వచ్చారు. ఎందుకో ఇద్దరి మధ్య సఖ్యత సరిగ్గా లేనట్టుంది. లహరి దిగులుగా కనబడుతోంది. అది నీతోనే అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడుతుంది”అని  హడావిడిగా చెప్పి ఫోన్ పెట్టేసింది నీలిమ తల్లి సావిత్రమ్మ.

          నీలిమ చెల్లెలు లహరి సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది. ఆరు నెలల క్రితమే తనతో కలిసి పనిచేసే రేవంత్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. లాక్ డౌన్ లో ఇంకా దగ్గరయ్యారనుకుంటే, ఇదేంటి ఇలా… అని ప్రయాణం చేస్తున్నంతసేపు ఎంత ఆలోచించినా  నీలిమకు అర్థం కాలేదు.

          కారు దిగగానే గుమ్మం ముందు కూర్చున్న రేవంత్ నవ్వుతూ ఎదురొచ్చాడు. ఆ నవ్వులో జీవం లేదు. అన్నదమ్ములిద్దరూ మాటల్లో పడగానే సరాసరి చెల్లి గదిలోకి వెళ్ళింది ఆత్రుతగా! తన అలికిడి వినగానే పరిగెత్తుకొచ్చి కావలించుకునే చెల్లి, పరధ్యానంలో మంచం మీద నుండి దిగకపోవడం నీలిమను కలచివేసింది. తనకేమీ తెలియదన్నట్టు గానే లహరిని కబుర్లలోకి దింపి, అసలు విషయాన్ని రాబట్టింది నీలిమ.

           “నా చిన్నతనం నుండి  గమనిస్తున్నానక్క! రోజు సాయంత్రం పూట నాన్న అమ్మకి’ టీ ‘చేసి ఇవ్వడం. బావ అయితే ఉల్లిగడ్డ కోస్తే నీ కంట్లో నీళ్లు వస్తాయని తానే తరిగేవాడు. వర్క్ ఫ్రొం హోమ్ అంటూ.. ఇద్దరం వర్క్ చేస్తున్నాం కదా! రేవంత్ ఇంటిపని  కూడా షేర్ చేసుకుంటే తప్పేంటి? పైగా నేనెప్పుడూ నైటీలో ఉంటున్నానని, ట్రెడిషనల్ గా కనిపించడం లేదని గొడవ. ఆ చీరలు మోస్తూ తిరగటం నావల్ల కాదక్క! ఎందుకో రేవంత్ కి నా మీద ప్రేమ తగ్గిందని నా అనుమానం” అంది లహరి  కంటనీరు పెట్టుకుంటూ.

           ఇవి చాలా చిన్న సమస్యలు అని మనసులో అనుకున్నది నీలిమ. కాకపోతే మనకు చిన్నగా అనిపించినవి వేరొకరికి ,వారి ఆలోచన పరిధిని బట్టి పెద్దగా అనిపించవచ్చు. సమస్య చిన్నదైనా సానుకూలంగా పరిష్కరించాలే గాని ,తెగేదాకా లాగ కూడదని నీలిమ నిర్ణయించుకుంది

             “నీ బాధ నాకు అర్థమవుతుంది లహరి! నీకు చేతి సాయం అవసరమైతే, నీ శ్రమ అతనికి కనబడేలా చేసి అతని సాయం కోరితే బాగుండేది. కానీ, నువ్వు  నాన్నను, బావను ఉదాహరణగా చూపి అతని అహం దెబ్బ తీశావు. మాది పల్లెటూరు. పైగా పెద్ద సంసారం. రోజుకు అరకిలో ఉల్లిగడ్డల తరిగితే కళ్ళు ఎర్ర బారవా? అందరి ముందు మీ బావ సాయం చేయడం ఇబ్బందిగా అనిపించి నేనే వాటిని నీళ్లలో నానబెట్టి తరగడం అలవాటు చేసుకున్నాను. ఇక నాన్న అంటావా? రోజంతా కష్టపడే అమ్మకు నాన్న నుండి దొరికే చిన్నపాటి ప్రేమ ఆయన చేతి’ టీ.’అయినా నా గత ఆరు నెలలుగా రేవంత్ సహకారం లేకుండానే నువ్వు ఉద్యోగం, ఇల్లు నెట్టు కొస్తున్నావా? ఎదుటివారిలో తప్పులు వెతికితే  ప్రేమ చిన్నబోతుంది. ఇచ్చి పుచ్చుకుంటే అదే ప్రేమ రెట్టింపై తిరిగోస్తుంది. నీలా  పెద్దగా చదువుకోలేదు. నా మనసుకు తోచింది చెప్పాను. ఆ పై నీ ఇష్టం”! అంటూ లహరినీ ఆలోచనలో పడేసి వంటింట్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది నీలిమ.

       కాసేపటికి వెనక గాజుల గలగల వినిపించి నీలిమ, సావిత్రమ్మ తలతిప్పి చూసి  సంతోషంతో తబ్బిబ్బు అయ్యారు. నీలి రంగు కాటన్ చీర, చేతుల నిండా గాజులు, పాపిట కుంకుమ, కొద్దిపాటి నగలతో కొత్త పెళ్ళికూతురులా మెరిసిపోతుంది లహరి. వారిద్దరూ తేరుకునే లోపే రేవంత్ కోసం కాఫీ కలుపుకొని, తమ బెడ్ రూమ్ వైపు వెళ్ళిపోయింది లహరి.

          గుమ్మం దగ్గరికి వచ్చిన లహరిని కళ్ళు విప్పార్చి తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు రేవంత్. తనలో తగ్గిందనుకొన్న అదే ప్రేమ… కళ్ళలో తొణికిసలాడే సరికి పరవశంలో చూసుకోకుండా అడుగేసి కిందపడిపోయింది లహరి. అప్పుడు! రేవంత్ చేసిన  హడావిడి… అంతా ఇంతా కాదు. చంటిపాపలా తనని ఎత్తుకుని మంచం పై చేర్చి కాలికి మర్దన చేయసాగాడు. మరోవైపు ఐస్ తీసుకురమ్మని సావిత్రమ్మ ని, డాక్టర్ కి ఫోన్ చేయమంటూ నీలిమని పురమాయించాడు.

         తనకేం కాలేదంటూ మంచం దిగపోతున్న లహరిని గదమాయిస్తూ”ఇంకెప్పుడూ నీకు అలవాటు లేని చీరలు ట్రై చేయకు లహరి.! అయినా  పిలిస్తే నేనే వచ్చి కాఫీ తీసుకునే వాడినిగా! నీ హెల్త్ గురించి పట్టించుకోకుండా  ఎప్పుడూ నా కోసం ఏదో ఒకటి చేయాలని తాపత్రయపడతావ్.ఇక ఈ రోజంతా మంచం దిగావంటే నా మీద ఒట్టే!”అంటున్న భర్త మందలింపులో  దాగున్న ప్రేమను ఆస్వాదిస్తూ, అతన్ని అలాగే మురిపెంగా చూస్తూ ఉండిపోయింది లహరి.

           వారి మాటలు బయటినుండి వింటున్న సావిత్రమ్మ అంది కదా!”గుమ్మం తగలడం కూడా ఒకందుకు మంచిదే అయింది నీలు! లేదంటే రేవంత్ గురించి మనం ఎంత చెప్పినా ఆ మార్పు తాత్కాలికమే అయ్యేది. ఇక మొగుడిని వదిలి మన దగ్గరికి రమ్మన్నా ., రాదు! మీ చెల్లి”

         “కాలు అడ్డుపెట్టి కింద పడేసింది నేనైతే, గుమ్మాన్ని పొగుడుతున్నా వేంటమ్మా?” అని  ఒక్కసారిగా నీలిమ బాంబు పేల్చింది. ముందు షాక్ అయిన సావిత్రమ్మ తర్వాత కూతురి సమయస్ఫూర్తిని అభినందిస్తూ హాయిగా నవ్వేసింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!