పొగడ్త – తెగడ్త

అంశం: హాస్య కథలు

పొగడ్త – తెగడ్త
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

లక్ష్మమ్మ కుటుంబం అంతా పెళ్లికి వచ్చారు. ఈ కరోన కారణంగా, చాలా కాలం కలుసుకోవడం కుదరకపోవడం వలన, కొంచెం పరిస్థితి చక్కబడుతుండటం తో పెళ్లికి వచ్చిన, బంధువులు అందరు మండపం అంతా తిరుగుతూ… సందడి చేస్తున్నారు. కౌసల్య లక్ష్మమ్మ కూతురు. చాలాకాలంగా తాను కొనుక్కున్న వస్తువులు ప్రదర్శించే ఆవకాశం కలగకపోవడంతో, ఒకేసారి, నక్లెస్, హారం, మొదలైన నగలన్ని అమ్మవారిలా ధరించి, తిరుగుతున్న కౌసల్యని చూసి, పెళ్లికీ వచ్చిన బంధువులంతా “మీ అమ్మాయి అచ్ఛంగా నీ పోలికేనే! మీ ఇద్దరిని పక్క పక్క చూస్తే, అక్కచెల్లెళ్ల వలె ఉంటారు” అంటుంటే తన వయసు తగ్గినట్లు ఉబ్బితబ్బిబ్బు అయింది లక్ష్మమ్మ. “ఏమండోయ్! చూసారా! మా బంధువులు అందరు ఏమంటున్నారో!? నేను, మన అమ్మాయి అక్కచెల్లెళ్లలా ఉన్నామట. మీరు ఆ జుత్తుకీ కొంచెం రంగు వేసుకోకపోతే, మనల్ని తండ్రికూతుర్లని అనుకుంటారు” అంటూ, గొప్పగా చెప్పింది. “ఓసేయ్ పిచ్చిమొద్దు! వాళ్లు నీ వయసు తగ్గింది అనడం లేదే. ఈ ఏడాది కాలంలో నీ కూతురుని ఇల్లు కదలనివ్వకుండా, ఏ పని చేయనివ్వకుండా కూర్చుని బాగా తినబెట్టావు. ఇప్పుడది లావుగా తయారైంది. దానికీ తోడు పట్టుచీర కట్టించి, అన్ని నగలు, దిగేసావు! చూడటానికి అచ్చంగా నీలాగే తయారైంది. పద్దేనిమిదేళ్లకే పెద్ద ఆరిందాలా తయారైంది. ఇప్పుడు చూడు. మీ బంధువులు ఏమంటున్నారో! అందుకే ముందు నుండి మొత్తుకుంటున్నాను. పనంతా మా అమ్మ మీదే పడేయకుండా నువ్వు, నీ కూతురు కూడా కొంచెం పని చేస్తుండండి అని” ఆ మాటలు వింటూనే, “నేను నా కూతురు అందంగా ఉన్నామని కుళ్లు మీకు” అంటూ, మండపంలోకీ వెళ్లేసరికి, అప్పుడే ఎవరో, “ఆ లక్ష్మిని చూసారా! ఇంతకాలం ఈవిడే రుబ్బురోలు అనుకుంటే, ఇప్పుడు కూతురిని ఇంకో రుబ్బురోలుని చేసింది” అని నవ్వుకోవడం చెవినబడటంతో, ఎలాగో పెళ్లయినంత వరకు ముళ్ల మీద కూర్చున్నట్లు గడిపేసి, ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ల అత్తగారికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చేసి, పనంతా ఆ తల్లికూతుర్లు చేసుకోవడమే కాకా, నడక, వ్యాయమాలు చేయడం మొదలుపెట్టారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!