అత్యాశ

అత్యాశ

రచన: సావిత్రి కోవూరు

ఒకరోజు సాయంత్రం ఇంటికి దగ్గరలో ఉన్న పార్క్ కి  వెళుతున్నాను. నా ఎదురుగా వస్తున్న ఒక జంట నా దగ్గరకు రాగానే “సార్, సార్ ఒక్క నిమిషం ఆగండి” అన్నారు.

వాళ్ళు ఏదో కట్టుకథ చెప్పి డబ్బు అడుగుతారేమో అనుకున్నాను. కానీ వాళ్ళుఅలా చేయలేదు.

ఒక ఫోటో చూపి “సార్ ఈ వ్యక్తి మీకు ఎక్కడైనా కనిపించాడా? కనిపిస్తే దయచేసి చెప్పండి సార్” అన్నారు.

ఆ ఫోటో ఒక్క క్షణం చూసి “నాకు ఎక్కడా కనిపించలేదు” అని చెప్పి ముందుకు కదిలాను.

వాళ్ళు నా వెనుక అడుగులేస్తూ “ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఎక్కడని వెతకాలి. చాలా తప్పు చేశాను. నీవు అడ్డుకోక పోతె ఆ రోజే డబ్బు ఇచ్చేసే వాడిని.  ఇప్పుడు ఈ వెతికే బాధ తప్పేది. అంతా నీ వల్లనే అయ్యింది” అని గట్టిగా అంటున్నాడు.

వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే నాకు కొంచెం కుతూహలం కలిగి “ఎవరతను అతని కొరకు ఎందుకు వెతుకుతున్నారు” అన్నాను.

“మీకు కనిపించ లేదు కద సార్. మీకు చెప్పినా లాభం లేదు. అయినా సరే చెప్తాను వినండి” అన్నాడు.

“ఆ ఫోటోలో ఉన్నతను చాలా మహిమ గల వాడు సార్. చూడడానికి మామూలుగా ఉంటాడు. సిల్కు జుబ్బా ధోతితో, నుదుటిపై విభూతి రేఖల మధ్యలో పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని ఉంటాడు. వెంబడి ఇద్దరు ముగ్గురు శిష్యులు ఉంటారు. ఒకరోజు మా ఇంటి ముందర నుండి వెళ్తూ, మా ఇంటి ముందర ఆగిపోయి నాతో ఈ ఇంటి యజమాని ఎవరు? ఆయనకు ఒక రహస్యం చెప్పాలి” అన్నాడు.

“నేనే ఈ ఇంటి యజమానిని. ఏమిటి నీవు చెప్పే రహస్యం” అని అడిగితే,

“ఇది ఎవరు వినకూడదు సార్. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో కూర్చుని చెప్తాను” అన్నాడు.

సరేనని ఇంట్లోకి పిలిచాను. అతను “మీ ఇంట్లో గుప్తంగా లక్ష్మీదేవి తాండవిస్తుంది. మీరు తెలుసుకోలేకపోతున్నారు” అన్నాడు.

మొదట మేము అదంతా పైసలు కొరకు కట్టుకథలు చెబుతున్నాడు అనుకున్నాము. కానీ మళ్లీ మళ్లీ అదే మాట చెబుతుంటే, నాకు ఆశ పుట్టి “ఆ ధనలక్ష్మి ప్రత్యక్షమవ్వాలంటే మేమేం చేయాల”ని అడిగితే

“మీ ఇంట్లో ధనలక్ష్మికి శాంతి పూజ చేస్తే సరిపోతుంది లక్ష్మీ దర్శనమిస్తుంది. దానికి కొంత ఖర్చు ఎక్కువే అవుతుంది మీరు ఒప్పుకుంటే నా శిష్యులు నేను కలిసి శాంతి పూజ చేస్తాము” అన్నాడు.

పూజ ఎంత ఖర్చవుతుందని అడిగితే , పూజ సామాగ్రీకి లక్ష వరకు అవుతుందని, తనకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వనక్కర్లేదు అన్నారు. అంత ఖర్చు అయితే మాకు ఏ పూజలు అక్కర్లేదు అని చెప్పేసి నేను వాళ్లను పొమ్మని చెప్పాను. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే చేస్తాం. మేము నమ్మని వారి కొరకు పూజలు చేయడం వృధా అయిపోతుంది. అని వెళ్ళిపోయాడు. నాకు అతను చెప్పే మాట వల్ల కొంచెం ఆశ పుట్టి మళ్ళీ పిలిచి మీ మాటలు నమ్ముతున్నాను పూజలు చేయమన్నాను.

“పూజ 15 రోజులు చేయాల్సి ఉంటుంది. పూజకు నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, కోళ్లు, మేకలు, పండ్లు, పూలు, హోమ సామగ్రి, పూజ సామగ్రి అన్నింటికీ కలిపి ఒక లక్ష వరకు అవుతుంది” అన్నాడు.

అంత ఖర్చు అనేసరికి నేను వెనుకాడాను. కానీ మా ఆవిడే “పూజ చేయిద్దాం అండి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. అతను చెప్పినట్టు నిజంగానే ధనలక్ష్మి ఉంటే మనం నష్టపోతాం కదా” అన్నది.

 సరేనని అన్నింటికీ ఒప్పుకుని పూజ చేయించాము. పదిహేను రోజులు గురువుగారి, శిష్యుల ఖర్చులన్నీ మేమే భరించాలని చెప్పాడు. ఒకవేళ ఆ పరిసరాలకు ఎవరైనా వెళ్ళినట్లయితే పూజలకు విఘ్నం కలిగి ధనలక్ష్మి అదృశ్యమై పోవడమే కాకుండా ఇంటి వాళ్ళకు తీవ్ర నష్టం జరుగుతుంది అని చెప్పాడు. అంత ప్రమాదం ఉన్నప్పుడు ఈ పూజ మాకు అవసరం లేదు అన్నాను.

“శిష్యుల్లో ఒకతను నా దగ్గరకు వచ్చి, మీకు కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దొరికే అవకాశాలు ఉన్నాయి. మీ ఖర్చు పూజకు ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది. మీరు గురువుగారి సంతోషానికి ఒక ఐదు లక్షలు ఇస్తే చాలా సంతోషిస్తారు. మీ ఇష్టం ఉంటే చేయించుకోండి లేకపోతే లేదు. మా గురువుగారు ఆ పూజ ఒప్పుకోవడమే చాలా గొప్ప. బలవంతం ఏమీ లేదు” అన్నాడు.

అప్పుడు ఒప్పుకొని మేము ముందు పోర్షన్ కు మారి, కొంచెం దూరంగా ఉన్నా వెనక పోర్షన్ వాళ్లకు ఉండడానికి, పూజకు అన్ని సౌకర్యాలు కల్పించి పూజా సామాగ్రికి పదిహేను రోజులు వాళ్ళు పూజ చేయడానికి కావలసినవి వాళ్ళ ఖర్చులకు, కావలసిన వస్తువులకి డబ్బులు ఇచ్చాను. ధన లక్ష్మి ప్రసన్నతకై పదిహేను రోజులు వెనక పోర్షన్ లో వాళ్లు పూజలు నిర్వహించారు. ధనలక్ష్మి ప్రసన్నం అయిందనీ, మీకు దర్శనమిస్తుందని చెప్పి వెళ్లిపోయారు.

మేము గురువుగారికి ఇచ్చే దక్షిణ మాకు ధనలక్ష్మి వచ్చిన తర్వాతనే ఇస్తామని చెప్పాము. అలా వెళ్లిన ఆ మహానుభావుడు మళ్లీ మాకు కనిపించలేదు. మేము వెళ్ళిన ఐదు రోజులకు పౌర్ణమి రోజున గురువుగారు చెప్పిన స్థలంలో తవ్వి చూస్తే బంగారు నాణాలతో ఉన్న బిందె కనిపించింది.

ఇదంతా జరిగి సంవత్సరం అవుతుంది. మేము ఇప్పుడు కోటీశ్వరులం కావడానికి గురువుగారి అనుగ్రహమే. ఆ సంతోషంతో ఆయనను తృప్తిపరచి, సత్కరించాలి అనుకుంటున్నాము కానీ మాకు ఇంకా ఆయన దర్శన భాగ్యం కలుగలేదు. ఆయన ఇదే ప్రాంతంలో తిరుగుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాము.

మీకు ఎప్పుడైనా కనిపిస్తే మా విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్తాము. మాకు ఫోన్ చేయండి” అని చెప్పి దూరంగా నిలిపిన కారెక్కి వెళ్లిపోయారు.

నేను అదంతా విని అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. నేను దీర్ఘంగా ఆలోచించడం చూసి మా ఆవిడ “ఏమిటండి ఎలా ఉన్నారు” అన్నది.

పార్కులో కనబడ్డ జంట గురించి వాళ్ళు చెప్పిన గురువు గురించి అంతా చెప్పాను.

అంతా విన్న మా ఆవిడ “అవునా రెండు నెలల క్రింద ఒకావిడ మన పక్కింటావిడను కూడా ఇలాగే అడిగిందట. కానీ ఆమె చెప్పింది మాత్రం వేరేగా ఉన్నది. ఆమె కూతురుకు ఏదో జబ్బు చేసి ఎంతమంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని హాస్పిటల్ కు తిరిగినా బాగ కాలేదట. చాల బాధ పడేదట. ఎవరో ఒక గురువుగారు వచ్చి ఏమో పూజలు చేసి బొట్టు పెట్టాడంట. ఆ రోజు నుండి ఆ అమ్మాయి జబ్బు  మెల్లమెల్లగా నయం అయిందట. ఇప్పుడు ఆరోగ్యంగా తిరుగుతుందట. అతడు పూజ చేసినందుకు డబ్బేమి తీసుకోలేదట. వాళ్ళే సంతోషంగా ఏమన్న ముట్ట చెప్పాలని వెతుకుతున్నారట. అతను కనిపించడం లేదని, అతను ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడని తెలిసిందని అన్నదట. అందుకే ఒకవేళ వాళ్ళకు కనిపిస్తే చెప్పండి అని వేడుకున్నాదట. వాళ్లు కూడా ఈ విషయం అంతా చాలా తేలికగా తీసుకున్నారట. మరి మీకు కూడా వాళ్లు అతని కొరకు వెతుకుతున్నామని చెప్పారంటే నిజమే అయి ఉంటుందండి” అన్నది

“ఏమోలే ఇవన్నీ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఎందుకు” అన్నాను.

కానీ మా ఆవిడ “ఏమోనండీ ఇదంత వింటుంటే కొందరు మహాత్ముల దగ్గర మహిమలు ఉంటాయేమో అనిపిస్తోంది” అన్నది.

ఇలా జరిగిన 15 రోజులకే ఒకరోజు మధ్యాహ్నం ఎవరో మా ఇంటి తలుపు తడితే వెళ్లి తలుపు తీసాను. ఎదురుగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. మా తలుపు ఎందుకు తట్టాడు అని చూస్తుండగా “కొంచెం నీళ్ళు ఇప్పించండి దాహంగా ఉంది” అన్నాడు

మా ఆవిడని కేకేసి నీళ్ళు తీసుకురమ్మని చెప్పాను. అతనిని చూసి ఎవరతను అన్నట్టుగా చూసింది. తెల్లటి సిల్క్ జుబ్బా దోవతి కట్టుకొని నుదుటన విభూతి రేఖల మధ్యన పెద్ద కుంకుమ బొట్టుతో గంభీరంగా ఉన్నాడు.

నా ముఖం చూసి “మీరేనా ఈ ఇంటి యజమాని” అన్నాడు.

“అవును” అన్నాను.

“మీకు తొందరలోనే శుభ యోగం పట్టనుంది. మీ ఇంటిలో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఈ ఇల్లు కట్టి వంద సంవత్సరాలకు పైనే  అయి ఉంటుంది. మీ పూర్వీకులు దాచిన లక్ష్మి మీ యోగ ఫలం వలన మీకు ఇప్పుడు దక్కనుంది” అని చెప్పి కదిలాడు.

అతను వెళ్ళగానే మా ఆవిడ “ఏవండి ఇతనే అయివుంటాడండి  వాళ్ళు వెతికే గురువు గారు. మీకు వాళ్ళు చెప్పినట్టుగానే సిల్కు జుబ్బ, దోతి కట్టుకొని, విభూతి రేఖలు పెద్ద కాసంత బొట్టు పెట్టుకొని ఉన్నాడు కదా. మన ఇల్లు కట్టి వంద సంవత్సరాలు దాటిందని కూడ నిజమే చెప్పాడు చూశారా? మన పూర్వీకులు ఎవరైనా ధనాన్ని దాచిపెట్టారేమో మన ఇంట్లో. అప్పుడు బ్యాంకులు ఉండేవి కావు కదా. అతను నిజమే చెబుతున్నాడేమొ. పూజ చేయించి చూద్దాం” అన్నది.

నాకు కూడ అతను చెప్పేది నిజమేనేమో అనిపించింది. వెంటనే బయటకెళ్ళి అతనిని ఇంటికి తీసుకు వచ్చాను. తర్వాత అతనిని “మా ఇంట్లో ధనరాశి ఉందని చెప్పారు కదా. మరి అది మాకు దక్కాలంటే మేమేం చేయాలి” అని అడిగాను.

అతను “మీ ఇంట్లో పదిహేను రోజులు పూజలు చేసి ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎవరు విఘ్నం కలిగించ కూడదు. కనుక మీరు ఎవరికీ చెప్పకండి. మీరు కూడా మేము పూజ చేసినన్ని రోజులు ఆ ప్రాంతాలకు రాకూడదు. మీరు పదిహేను రోజులు మేము చెప్పినట్టు పూజా సామాగ్రి అంతా తెప్పించండి” అన్నాడు.

“ఆ పూజా సామాగ్రులన్ని తేవడానికి మాకేం తెలియదు. కనుక మేము డబ్బులు ఇస్తాము మీరే తెచ్చుకోండి” అని చెప్పాను.

అతను “సరే మొత్తం ఒక లక్ష వరకు అవుతుంది ఇవ్వండి. మిగిలితే మీకు ఇచ్చేస్తాను” అని చెప్పాడు. ఆ రోజు నుండి పదిహేను రోజులు మేము మా ఫామ్హౌస్ కు వెళ్ళిపోయి,  మా ఇంటిని అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్లకి అప్పగించాను. అన్ని రోజులు మేము ఫామ్ హౌస్ లోనే ఉన్నాము.

పదిహేను రోజుల తర్వాత ఇంటికి వెళితే గురువుగారు “పూజలు సక్రమంగా జరిగినాయి. ధనలక్ష్మి ప్రసన్నురాలైంది. పౌర్ణమి రోజు నేను ముగ్గు వేసిన దగ్గర తవ్వి చూడండి. మీకు ధనము దర్శనమిస్తుంది” అని చెప్పారు.

మేము “మీ ఫీజు కూడా తీసుకోమని ఐదు లక్షలు వాళ్ళకి ఇచ్చి పంపించాను. తర్వాత ఇంట్లో కెళ్ళి చూస్తే ఇంటి నిండా కోసి పడేసిన నిమ్మకాయలు, కొబ్బరి కాయలు,గుమ్మడి కాయలు, పూలు, ముగ్గులు, ముగ్గుల మధ్యన కోళ్లు, మేకలు కోసిన రక్తము భయంకరంగా ఉన్నది. మేము కదిలించకుండా పౌర్ణమి నాడు ఆయన చెప్పిన ప్రాంతంలో తవ్విచూస్తే ఒక చిన్న బిందె దానిలో చిన్నచిన్న బంగారు నాణాలు కనిపించాయి. మా ఆనందానికి అంతులేదు. ఎవరికీ చెప్పకుండా దాచుకున్నాము. ఆరు నెలల తర్వాత మా ఆవిడ నగలు చేయించుకుంటానని రెండు బంగారు నాణాలు తీసుకుని కంసలతని దగ్గరి కెళ్ళి నగలు చేయమని చెప్పగా, అతను దానిని పరీక్షగా చూసి ఇవి ఎక్కడివి మీకు? 6 నెలల క్రితం ఒకతను నా దగ్గరకు ఒక ఇత్తడి బిందె ఒక గరిట తీసుకుని వచ్చి, వాటిని కరిగించి నాణాలు చేయమంటే నేనే చేసి ఇచ్చాను. అవే ఇవి. ఇవి బంగారు నాణాలు కావు.ఇత్తడి నాణాలు” అని చెప్పాడు.

మేము కక్కలేక మింగలేక ఎంత ఘోరంగా మోసపోయామో తెలుసుకుని తలవంచుకుని ఇంటికి వచ్చేసాం. ఇది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఇంత చదువుకుని ఈ మోసానికి ఎలా గురి అయ్యామో నాకు అర్ధం కావటం లేదు. దీనికంతటికీ మా దురాశే కారణం అని తెలుసుకున్నాం.

తర్వాత ఎప్పుడో పేపర్లో  నన్ను మొదట పలకరించిన జంట, వాళ్ళ గురువు గారు, ఆయన శిష్యుల ఫోటోలు వేసి  ఈ గ్యాంగ్ మొత్తం వీధుల్లో తిరుగుతుంటారు. కొంచెం డబ్బున్న వాళ్ళని ఎంచుకొని మోసం చేస్తుంటారు. వాళ్లని పోలీసులు పగడ్బందిగా ప్లాన్ చేసి అరెస్టు చేశారని న్యూస్ వేశారు.

కానీ ఈ లోపలే ఎంతోమంది మాలాంటి వాళ్ళు మోసపోయివుంటారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!