ఆలి ఆక్రందన

ఆలి ఆక్రందన

 రచయిత ::  యం. సుశీల రమేష్

నా పేరు  శాంతి. నా కధనే చెప్పబోతున్నాను.

తాళి కట్టి నన్ను మీ దాన్ని చేసుకున్నారు. మొదటి రాత్రి నాలో నువ్వు సగం అన్నారు.

పెళ్లయిన కొత్తలో ఎంతో అపురూపంగా చూసుకున్నారు. దేహాలు వేరైనా మనది ఒకటే ప్రాణం అన్నారు.

నా చదువును మెచ్చుకున్నారు. నా ఉద్యోగాన్ని పొగిడారు.

మీరు పిలిచినప్పుడు వంట గదిలో నుండి రాలేదని నా మీద అలాగే వారు, వస్తే  అత్తగారు కోప్పడేవారు.

మిమ్మల్ని తండ్రి వేసిన వేళ పొంగిపోయారు. మీ చెల్లి పెళ్లికి నా నగలు తనకు ఇచ్చిన వేళ, నా జీవితం మీరు అయినప్పుడు అది నాకు పెద్ద సమస్యగా కనబడలేదు.

నా ఉద్యోగరీత్యా ఉదయం వెళ్లేటప్పుడు అన్ని పనులు చేసి వెళ్లేదాన్ని. అయినా కూడా  సూటిపోటి మాటలతో అత్తగారు ఆడపడుచు నన్ను అనరాని మాటలు అంటున్న మీరు స్పందించని తీరు చూసి నేను నివ్వెర పోయాను.

రాను రాను మీరంతా అయిన దానికి కాని దానికి నన్ను అవమానిస్తున్న ఏనాడు ఎదురు తిరగలేదు నేను, కారణం పిల్లలు, వారికి తండ్రి ప్రేమను దూరం చేయలేక మిన్నకుండిపోయాను.

మీ తల్లి ని ప్రేమిస్తారు తను మిమ్మల్ని కన్నది కాబట్టి.

మీ చెల్లి ని ప్రేమిస్తారు మీ తర్వాత పుట్టింది కాబట్టి.

మీ కూతురు అంటే పంచ ప్రాణాలు మీకు అందుకే కొడుకు తో సమానంగా పెంచారు.

నేను కూడా  ఆడ కూతురునే, ఆడ నుంచి వచ్చాను.

మీలో సగమై మీ ఆలిగా వచ్చిన నాపై ఎందుకింత వివక్ష.

పడకటింటి వస్తువుగా, ఇంటి పని మనిషి గా, అవసరాలు తీర్చే అక్షయ పాత్ర గా, మీకు సేవలు చేసినప్పటికీ చివరికి నాకు దక్కింది అవమానాలు చీదరింపులు.

పిల్లల పెళ్లిళ్లు ఘనంగా జరిపించారు.

నేను మీకు సహకరించకుండా నే అన్ని మీరు ఒక్కరే చేశారా?

ఏనాడైనా నన్ను తిన్నావా అని అడిగారా.

కొడుకు పెళ్లి చేసి  కోడలిగా వచ్చే అమ్మాయి గురించి ఆలోచించి వాళ్ళిద్దర్నీ కొత్త ఇంట్లో వేరే కాపురం పెట్టించారు. వాళ్లకి ప్రైవసీ ఉండాలని.

ఇన్నేళ్లలో ఇప్పటికీ మీకు మీ ఇంటి వారికి మీ బంధువులకు ఇంత చాకిరి చేస్తున్నా ఒక్కరికి కూడా నా మీద  జాలి కలగలేదు.

పైగా ఒక 10 నిమిషాలు ఫోన్ తీసుకొని కూర్చుంటే చాలు మీ అందరికీ ఎక్కడ  లేని కోపం వస్తుంది నా మీద.

మీలో సగంగా వద్దు కనీసం ఆడదానిగా కూడా నా మీద మీకు జాలి కలగడం లేదా?

రాముడు అరణ్యవాసంలో తన కాళ్ళ కింద ఉడతా ఉండడం చూసి తన చేతితో పైకి లేపి జాలిపడి, అంత సేపు నుంచి నా కాలు కింద బాధ భరించక పోతే చెప్పొచ్చు కదా అన్నాడంట.

అప్పుడు ఉడతా అన్నదంట, రామా నాకు ఎప్పుడైనా నా బాధ కలిగితే రామా రామా అనేదాన్ని, కానీ సాక్షాత్తు ఆ రాముని వల్లనే బాధ కలిగుతుంటే ఎవరితో చెప్పుకోను అన్నదంట.

అలా అని నాకు గుడి కట్టి నెత్తిమీద ఎక్కించుకొని పూజించండి అనడం లేదు.

ఇంట్లో ఉన్న ఆడవాళ్ళలో నేను కూడా ఒక ఆడదాన్ని మరి నా మీద ఎందుకు అంత వివక్ష చూపుతున్నారు. నేను చేసిన పాపం ఏమిటి?

ఆడపిల్లగా పుట్టడం నా తప్పా?

మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్పా?

నీలో సగం గా జీవించాలని నా కోరిక తప్పా?

మిమ్మల్ని ఎదిరించడానికి నాకు ఎంత సమయం పడుతుంది?

బయట నేను బ్రతకలేనా.?

మీ తో సమానంగా  సంపాదిస్తున్నాను. కానీ ఏనాడు నేను గర్వ పడలేదు.

మీ నుంచి అనురాగాన్ని తప్పా నేను ఏనాడు ఏది ఆశించలేదు.

ఒకవేళ నేను అడిగిన వాటిలో ఏదైనా మాట మీ మనసు నొప్పించి ఉంటే నన్ను మన్నించండి.

అసలు నా భావనే తప్పు అనుకుంటే వదిలేయండి.

అనురాగం కోసం ఆప్యాయత కోసం ఎదురుచూసే మీ ఆలీ రాస్తున్నా ఒక చిన్న ఉత్తరం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!