అనుకోని అతిథి

అనుకోని అతిథి

– కమల ముక్కు (కమల’శ్రీ’)

మాధవయ్య ఇంటికి ఓ దూరపు బంధువు వచ్చాడు. పేరు సారధి. మధ్యవయస్కుడు. ఆరడుగుల ఆజానుబాహుడు.

ఏదో వ్యవసాయం పై రీసెర్చ్ చేసే పని ఉండటంతో ఆ ఊర్లో ఓ నెల పాటు ఉండాలి అని చెప్పాడు.

ఆ మాట వినగానే మాధవయ్య గొంతులో వెలక్కాయ పడినట్టుగా అనిపించింది. అతనో చిన్న కంపెనీలో గుమస్తా. వచ్చే సంపాదన కాస్త ఇంటి అవసరాలకే చాలడం లేదు. అయినా అతని భార్య సీత ఉన్నంతలో సర్దుకుని కుటుంబాన్ని నడుపుతోంది.

ఇప్పుడో కొత్త వ్యక్తి తమతో పాటే చేరారు. దాదాపు నెలపాటూ అతన్ని చూసుకోవడం అంటే మాటలా. అలా అని మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పలేకపోయాడు మొహమాటం తో.

మొదటి వారం పాటు గా సారధి కి మంచి మంచి విందు భోజనం ఏర్పాటు చేశాడు తమ శక్తికి మించినదైనా. అతనికి మాత్రమే ఆ వంటలు వండి తమకు మాత్రం మామూలు వంటలు వండుకునేవారు. సారధికి ముందుగా వడ్డించి అతను తినడం ముగించాక అందరూ తినేవారు. తనతో కలిసి తినమంటే పెందలాడే తినడం తమకి అలవాటు లేదని కాస్త సమయం దాటాక తింటామని చెప్పేవారు ప్రతీరోజూ.

ఆ తరువాతి వారం నుంచి ఏం చేయాలో వారికి పాలుపోలేదు.

“ఏమయ్యా సరుకులు నిండుకుంటున్నాయి. ఇప్పుడేం చేద్దామయ్యా?!.” అంది మాధవయ్య భార్య సీత.

“అదే నాకూ పాలుపోవడం లేదు సీతా. రోజూ ఆయనకి ఓ రెండు రకాల కూరలు పెట్టి మనం ఉదయం వండగా మిగిలిన కూరలు తినేవాళ్లం. ఇప్పుడేమో అవీ లేవు. రోజూ వేసే వాళ్లం ఇప్పుడు తక్కువ తక్కువ వడ్డిస్తే అంత బాగోదేమోనే?!.” అన్నాడు మాధవయ్య.

“మనమింత ఇబ్బంది పడుతూ ఆయనని చూసుకోవడం అవసరం అంటారా. మనకసలే చిన్న పిల్లలు. వారికి కూడా కడుపు నిండా పెట్టలేకపోతున్నాం. కానీ ఓ అతిథికి మాత్రం పంచభక్ష్యాలూ పెడుతున్నాం. వారం దాటేసరికే ఇలా ఉంటే, ఇంకో మూడు వారాల పాటు ఎలా చూసుకోగలం అండీ.” అంది సీత.

“మనమెంత ఇబ్బంది పడినా మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అతిథికి మాత్రం ఇబ్బంది కలిగించకూడదు శారదా. ఏదో ఒక ఉపాయం దొరక్కపోదులే.” అని నడుం వాల్చాడు మాధవయ్య.

” ఏంటో ఈ మనుషులు. తాతముత్తాల కాలంలో కోట్లకు మించిన సంపద ఇలా అతిథి అభ్యాగతులకు ఆదరిస్తూ ఉన్న ఆస్తిని కాస్తా ఆవిరి చేసి ఇప్పుడీ పరిస్థితికి వచ్చారు. ఆస్తి పోయినా కూడా మీ పిచ్చి పోలేదండీ బాబూ.” అనుకుంటూ ఆ రాత్రి కి ఏం వండాలో అని ఆలోచిస్తూ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది సీత.

“అక్కా… సీతక్కా …. ఈ రాత్రి కి డిన్నర్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నారు.” అంటూ వంటగదిలోకే వచ్చేసాడు సారధి.

“ఇంకా ఏవీ అనుకోలేదు సారధీ. బియ్యం కడిగి పెట్టాను. మీ బావ గారు కూరగాయలు తేవడానికి మార్కెట్ కి వెళ్లారు.” అంది సీత.

“అవునా! నేను కాస్త ముందే రావాల్సింది. నేను రీసెర్చ్ చేస్తున్న పొలం యజమాని కాస్త బెండకాయలు, చిక్కుడు కాయలూ, బీరకాయలూ ఇచ్చాడక్కా. అవి తీసుకుని వచ్చాను. బావ మళ్లీ కొంటే అవి వేస్ట్ అవుతాయి. ఇప్పుడే వెళ్తున్నాడు అంటున్నావుగా నేను వెళ్లి బావని కొనొద్దని చెప్తాను.” అంటూ తన చేతిలోని కూరగాయల సంచి సీతకి ఇచ్చి, బయటకు వెళ్లాడు సారధి, మాధవయ్య ని పిలుచుకు రావడానికి.

“పోనీలే వీటితో ఓ మూడు పూటలు గడపొచ్చు. కానీ నిండుకుంటున్న బియ్యం, ఉప్పూ, పప్పూ పరిస్థితీ?!.” అని అనుకుంటూ లేత బెండకాయలు తరిగి వేపుడు చేసింది. కాస్త రసం తమకీ, సారధి ముద్ద పప్పూ చేసింది.

రాత్రి భోజనాల సమయంలో ముందు సారధికి వడ్డించబోతుంటే “అక్కా! నేనొక్కడినే ఎలా తింటాను. అందరం కలిసి తిందాం.” అని పట్టుపట్టడంతో ఉన్న కాస్త కూర, పప్పూ, రసం అందరూ సర్దుకుని తిన్నారు.

ఓ రెండు రోజులు పోయాక అక్కా సీతక్కా… అంటూ హడావిడిగా వచ్చాడు సారధి.. భుజాన ఓ చిన్న మూట పట్టుకుని.

“ఏంటి సారధీ?!.” అంది సీత ఆశ్చర్యంగా.

“అక్కా! మన ప్రెసిడెంట్ గారు లేరూ ఆయన మ
పొలంలో పండే ధాన్యం చాలా బాగుంటాయని నాన్నగారు ఎప్పుడో అన్నారటా. ఇందాక నేను పొలంకి వెళ్లి వస్తుంటే ఈ అర బస్తా బియ్యం ఇచ్చారు. వెళ్లేటప్పుడు మా ఇంటికి తీసుకెళ్లమని మరీ మరీ చెప్పారు.” అన్నాడు సారధీ.

“సరే నాయనా…. అంటూ ఆ మూటని అందుకుని ఓ మూలన పెట్టబోతుంటే అక్కా ఇప్పుడు రోజూ వండే రేషన్ బియ్యమే వండుతున్నావా…”

“హా అవునయ్యా. ఏం?!.”, బియ్యం డబ్బాలో బియ్యం నిండుకోవడంతో ఆ రాత్రికి ఏం వండాలో తెలీకపోయినా, సారధికి నిజం చెప్పలేక అబద్ధం ఆడేసింది సీత.

“ఏమనుకోకపోతే నాకా రేషన్ బియ్యం అలవాటు లేదక్కా. కానీ మీరు ఏం వండితే అది తినాలి కాబట్టి తింటున్నా. ఈ బియ్యం కాస్త వాడుకున్నా మా నాన్నగారు నన్నేం అనరు. కాబట్టి ఈ బియ్యం వండవా ఫ్లీజ్…” అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు సారధి.

“హమ్మయ్యా ఈ పూటకి గండం గడిచింది. మరి తమ పరిస్థితి ఏంటీ?!.” అనుకుంటూ ఉండగా “అక్కా నాకు వేరే గా మీకు వేరేగా ఎందుకు వండటం. అందరికీ కలిపే అన్నం వండేసెయ్యి. నీకు కాస్త శ్రమ తగ్గుతుంది.” అన్నాడు మళ్లీ వచ్చిన సారధి.

“సరేనయ్యా!.” అంటూ అందరికీ కలిపే వంట చేసింది.

అలా సారధి అక్కడ ఉన్నంత వరకూ రెండు రోజులకోసారి కూరగాయలను రైతులనుంచి తెస్తూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. సారధి రీసేర్చ్ సమయం ముగియడంతో తన ఊరికి వెళ్లిపోయాడు.

వచ్చినప్పుడు తమకు భారం అనుకున్న సీత, అతను వెళ్లిపోతుంటే సొంత తమ్ముడు వెళ్తున్నంతగా కన్నీరు పెట్టుకుంది. వాళ్ల పిల్లలు రామ్, రమేష్ లకు సారధి బాగా చేరిక అవ్వడం తో “మావయ్యా మళ్లీ ఎప్పూడొస్తావూ? త్వరగా రావాలి.” అంటూ మారాం చేశారు.

మాధవయ్య కి కూడా కాస్త బాధగానే ఉంది. సొంత బావమరిదే వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని వెళ్లిపోయాడు సారధి.

***

రోజులు గడుస్తున్నాయి. ఓ రోజు మార్కెట్ కి వెళ్లి వస్తుండగా సారధి రీసెర్చ్ కి వెళ్లే పొలం యజమాని కనిపిస్తే మీ పొలంలో కూరగాయలు బాగా ఉన్నాయి రంగయ్యా. మా సారధికి ఇచ్చారటా గా ఎలా ఉన్నాయో చూడమని. అన్ని కూరగాయలు ఉచితంగా ఇస్తే నీకు నష్టం కదా.” అన్నాడు మాధవయ్య.

“ఊరికే ఎవరిచ్చారు మాధవయ్యా. అవి అతను డబ్బులిచ్చి కొన్నాడు గా.” అని , నాకు కాస్త పని ఉంది వెళ్లాలి అంటూ వెళ్లిపోయాడు రంగయ్య.

ఇంకాస్త ముందుకు వెళ్లాక ఎదురొచ్చిన ప్రెసిడెంట్ గారు కూడా అదే చెప్పారు.

వాళ్లిద్దరూ చెప్పింది విన్నాక విషయం కాస్తా కాస్తా అర్థమవ్వసాగింది మాధవయ్యకి. విషయం సీతకి చెప్పాలని ఇంటికి వడివడిగా వెళ్లాడు. గుమ్మం దగ్గరే ఎదురైన సీత ఏమండీ మన బియ్యం డబ్బాలో ఈ డబ్బులు , ఈ పేపరూ కనిపించాయి.” అంటూ ఓ పేపర్, డబ్బులూ ఇచ్చింది.

పేపర్ అందుకుని చదవడం మొదలుపెట్టాడు మాధవయ్య.

“అక్కా, బావా… నేను వెళ్లాక మీకు నిజం తెలుస్తుంది. అంతకంటే ముందే నేనెందుకు ఇలా చేశానో మీకు తెలియాలి. ఈ డబ్బులు మీవే…అర్థం కాలేదా… నేనో దొంగని.

ఓ రోజు బావగారు పని చేసే కంపేనీ డబ్బులు డ్రా చేసి వస్తుంటే ఎవరో దొంగ కాజేశాడు కదా. దాంతో నెలకు ఇరవై వేలు వచ్చే ఉద్యోగం తీసివేయడంతో మీ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆ డబ్బు దొంగతనం చేసింది ఎవరో కాదు నేనే.

కానీ నేనా డబ్బులు కావాలని దొంగతనం చేయలేదు. మా ఫ్రెండ్ ఒకడికి ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉంది. ఎవరూ లేని నన్ను ఆదరించింది వాడి కుటుంబమే. అలాంటి వాడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఏం చేయాలో తోచక అప్పుడే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న మిమ్మల్ని చూసి మీ చేతిలోని బ్యాగ్ ను పట్టుకుని పారిపోయాను. ఆ డబ్బులతో మా ఫ్రెండ్ ఆరోగ్యం బాగైంది. తరువాత ఎలాగోలా మీ అడ్రస్ తెలుసుకుని మీరు పనిచేసే కంపెనీ కి వెళితే అప్పటికే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసారనీ, ఆ డబ్బు లు మీ ఫీ.ఎఫ్ డబ్బుల్లో కట్ చేశారనీ, ఇంకో చిన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని బ్రతుకుతున్నారనీ తెలిసింది.

మీ ఇంటి అడ్రెస్ కనుక్కుని మీ ఊరు వచ్చి చూసేసరికి చాలీచాలని జీతంతో మీరు పడే అవస్థలు చూస్తుంటే చాలా బాధ కలిగింది. దాంతో రీసెర్చ్ పేరిట మీ ఇంట్లో ఉండి మీ అవసరాలు తీర్చాలని అనుకున్నా. కానీ అన్ని బాధల్లో ఉన్నా కూడా నాకు నాలుగు రకాలు వండిపెట్టి మీరు ఉదయం వండే కూరలతో సరిపెట్టుకోవడం, సరుకులు లేక ఇబ్బంది పడటం… అన్నీ చూస్తుంటే మీకెలాగైనా సహాయం చేయాలనిపించి కూరగాయలూ, బియ్యం తెచ్చాను.

వెళ్లేటప్పుడు నేను మీ దగ్గర దాచేసిన డబ్బుతో పాటూ , నా సేవింగ్స్ కూడా కలిపి ఈ బియ్యం డబ్బాలో ఉంచాను. నేను చేసిన తప్పుకి ఇది తక్కువే. అందుకే నేను పనిచేసే కంపెనీలో బావగారికి ఓ మంచి ఉద్యోగం చూశాను. నెలకి ముప్ఫైవేల జీతం. పిల్లలిద్దరికీ ప్రెయివేట్ స్కూల్లో సీటూ చూశాను.

ఇంకా ఎలా నా తప్పుని సరిదిద్దుకోవాలో అర్థం కాలేదు. మన్నించి స్వీకరిస్తారనీ , నా మీద కోపం తగ్గితే క్రింద ఉన్న నా ఫోన్ నెంబర్ కి ఫోన్ చేస్తారనీ ఆశిస్తున్నా. ఒకవేళ ఫోన్ రాకపోతే మీకు నాపై కోపం తగ్గలేదు అనుకుంటూ జీవితాంతం బాధతో బ్రతికేస్తా.

మన్నిస్తారని ఆశిస్తూ మీకు ఏమీ కాని

సారధి…”

అది చదవగానే కళ్లు చెమర్చాయి భార్యాభర్తలకు. తప్పు చేసినా కూడా ఆ తప్పుని సరిదిద్దుకోవాలని అతను చేసిన ప్రయత్నం మంచిదే అయినా ఆ డబ్బుని మాత్రం స్వీకరించలేక పోయారు. అదే చెప్పాలని సారధికి ఫోన్ కలిపారు భార్యాభర్తలు.

కానీ సారధి చెప్పేది విని అశ్రువులతో నిండిపోయాయి ఇద్దరి నయనాలూ…

“ఆ మొత్తం మా అక్కకి కట్నంగా ఈ తమ్ముడు ఇచ్చాడు అనుకోండి బావగారూ… మీరెప్పుడు వస్తున్నారో చెప్తే ఇళ్లూ, వగైరా ఏర్పాట్లు చూస్తానని” చెప్పి ఫోన్ పెట్టేసాడు సారధి.

***

ఓ వారం తర్వాత సారధి దగ్గరకు పయనం అయ్యారు. అనుకోని అతిథి గా వచ్చిన సారధి వారికి ఆత్మీయుడైనాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!