విలువ లేని గాయం

విలువ లేని గాయం

రచయిత :: జయసుధ కోసూరి

ఉబికొస్తున్న ఆవేశం..
ముక్కు పుటాలను అదరగొడుతున్నా..
పౌరుషంతో గుండెలు ఎగసిపడుతున్నా..
అణచుకోవాలని చూసే “ఆడతనాలం”.!!

మనిషికి తప్ప మనసుకి విలువివ్వని ఆచారాల మధ్య
పచ్చగ మెరిసే తులసిమొక్కలం..!

యుద్ధం చేస్తూనే ఉంటాం మౌనంగా..
నిత్యం కలసిరాని మనసులతో, మనుష్యులతో..!

నోటికొచ్చిన చెత్తంతా మామీద దులిపినా..
మౌనంగా మూలనుండే డస్ట్ బిన్లం..!

సంప్రదాయమంటూ, సంఘంలో గౌరవమంటూ..
వంటింటికి పరిమితం చేసినా మోగని స్టీలు పాత్రలం..!
బతుకు వెలగని జ్యోతులం..
గడ్డకట్టిన కన్నీళ్లం..!

ఒంటి బాధలెన్నున్నా నీ రాతిరాటకు సిద్దమైన బొమ్మలం.
ఎంత చదివినా భర్తీ చేయని ఖాళీలం.

రెప్ప దాటని కన్నీళ్ల వానలో
ఉప్పెనై ఎగసిన ఉదితలం..!

పౌడరద్దిన చెంపలపై
చాచి పెట్టి కొట్టినా చలించని నిలువెత్తు గాయాలం..!
ఆర్ధిక పుష్టి లేని ఆడ దేహాలం..! గడపదాటని ఇంటి మర్యాదలం..!

ఎవరూ తాకని మెత్తటి గుండె
వెనకాల మండే అగ్ని కణాలం. నిద్రపోతున్న నిశ్శబ్దాలం..!

తట్టిలేపకు నాలో ధైర్యా(న్యా)న్ని..
తట్టుకోలేవు..
స్మశానపు సమాజాన్ని చూసేదాకా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!