భయం భయం

(అంశం:: “అర్థం అపార్థం”)

భయం భయం

రచన:: మంగు కృష్ణకుమారి

మూడు రోజులై శ్రీదేవికి చెయ్యి నరికినట్టుంది. పక్కింటికేసి ‘పదే పదే’ చూస్తోంది. ఎక్కడా పద్మావతి జాడ లేదు. అప్పటికీ ఆపుకోలేక పద్మావతి గారి భర్త రఘురాం కనిపిస్తే, “పద్మగారు ఏరండీ?” అంది.

“ఏదో పనిలో ఉందండీ” ముభావంగా అనేసి లోపలికి వెళిపోయేడు.

చిన్నబుచ్చుకొని లోపలికి వచ్చేసింది శ్రీదేవి.

వంట చేస్తూ, ఆరిన బట్టలు తీస్తూ, పిట్టగోడమీదనించీ, పక్కింటి పద్మావతితో కబుర్లు చెప్పడం శ్రీదేవికి చాలా అలవాటు. ఇద్దరి మధ్యా అలా అలా కబుర్ల వారధి తెగ నడుస్తూ ఉంటుంది. ఇద్దరి పిల్లలూ సెటిల్ అయిపోయేరు. అమెరికా, ముంబై, ఆస్ట్రేలియా ఇలా ఉన్నారు. ఆఇంట్లో ఆ దంపతులు, ఈఇంట్లో ఈ దంపతులు మాత్రమే
ఉండడం కూడా వాళ్ళ స్నేహానికి కారణం.

కరోనా రాడం దేశమే ఉలిక్కిపడింది. పిల్లల సూచనలమేరకు, శ్రీదేవీ, పద్మావతి గోడ దగ్గర కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మాస్క్ వేసుకోడం మొదలెట్టేరు.

హఠాత్తుగా శ్రీదేవికి టేస్ట్ పడిపోయింది. తలమీద ఎవరో సుత్తితో కొడుతున్నట్టు అనిపిస్తోంది. లైట్ గా జ్వరం. కొడుకు ఆన్ లైన్‌లోకి వచ్చి వెంటనే ఇద్దరినీ,
కరోనా టెస్ట్ చేయించుకోమని గోల పెట్టేడు. శ్రీనివాసు వెంటనే ఇద్దరికీ టెస్ట్ చేయించే ఏర్పాటు చేసేడు.

శ్రీదేవికి పోజిటివ్, శ్రీనివాసుకి నెగెటివ్ వచ్చేయి. శ్రీదేవికి హొమ్ క్వంరనటైన్ చాలన్నారు. ఆమె ఆడపడచు కూతురు ఓ మంచి హాస్పిటల్ లో‌ నర్స్ గా పని చేస్తోంది. “అత్తా, నువ్వు ఇక్కడ జాయిన్ అయిపో, లేకపోతే మాఁవకి కూడా వచ్చే ప్రమాదం ఉంది” అని తనే కార్ లో వచ్చి శ్రీదేవిని హాస్పిటల్ లో ఎడ్మిట్ చేసేసింది.

మంచి వైద్యం దొరకడం శ్రీదేవి వేగమే కోలుకుంది. డిశ్చార్జ్ తరవాత కూడా ఆడపడచు కూతురు తమింటికే తీసుకెళ్ళింది. “మేడమీద గదిలో నువ్వు ఉండు అత్తా! నీకు అన్నీ అక్కడకి పంపే పూచీ నాది” అని పదిహేను రోజులు పూర్తి స్థాయి రెస్ట్ ఇచ్చింది. ఆమె నర్స్ ట్రైనింగ్ శ్రీనివాసే చెప్పించేడు. పెళ్ళి ఖర్చు సగం పెట్టేడు. తన అక్క‌ కష్టాల్లో ఉందని శ్రీదేవీ, శ్రీనివాసు చాలా సాయాలు చేసేరు. ఆ కృతఙ్ఞత పుష్పకి చాలా ఉంది.

మొత్తానికి డాక్టర్ “మీరు చాలా నార్మల్ అయిపోయేరు. మామూలుగా ఉండొచ్చు” అని చెప్పిన తరవాత విజయోత్సాంతో తనింటికి వెళ్ళింది శ్రీదేవి.

అప్పటికే ఆమెకి కరోనా వచ్చి తగ్గిందని ఆకలనీ అందరికీ శ్రీనివాస్ చెప్పేడు. ఒకళ్ళిద్దరు ఫోన్ చేసేరు.

శ్రీదేవి ఎందుకయినా మంచిదని ఓ వారం బెడ్ రూమ్ లోనే గడిపింది. శ్రీనివాసే అన్నీ చేసేడు. తరవాత వంటింట్లోకి వచ్చింది.

అప్పటినించీ ఆమె చూపులు పద్మావతి కోసం వెతుకుతున్నాయి. పద్మ కనపడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రఘురాం శ్రీదేవిని చూస్తే
మొహం తిప్పుకుంటున్నాడు. పద్మావతి జాడలేదు‌. ఉక్రోషం‌‌ పట్టలేక శ్రీదేవి భర్త దగ్గర గోల పెట్టింది. “చూసేరా, నాకు ఇంత తగ్గినా, పద్మ కనీసం కనిపించలేదు. మనుషుల అసలు రంగు ఇప్పుడు కదా తెలుస్తోంది”

శ్రీనివాసు ఓదార్చేడు “దేవీ, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని కొందరి అభిప్రాయం. ఆవిడకి నేనే ‘నీకు చాలా మైల్డ్ గా వచ్చినా నాకు డిస్టెన్స్ పాటించాలని హాస్పిటల్ కి వెళ్ళేవని, భయం లేదని చెప్పేను’ అయినా వాళ్ళ భయం వాళ్ళది కదా” అన్నాడు. “మీరొకరు, అవతల వాళ్ళమాటే ఆడతారు” అని
మూతి ముడుచుకుంది శ్రీదేవి.

ఎదురింటి సుజాత ఫోన్ చేసింది శ్రీదేవికి, ఎలా ఉన్నావని అడిగిందికి.

శ్రీదేవి అంతా చెప్పి కాస్త నిష్ఠూరంగా అన్నాది “సుజాతా, మీరందరూ ‘అయ్యో’ అంటున్నారు. అదేం చిత్రమో పద్మ మాత్రం మొహం
చూపలేదు సరికదా, ఫోన్ స్విచ్ ఆఫ్. వాళ్ళ ఆయన నన్ను చూస్తే చాలు మొహం తిప్పుకొని వెళిపోతున్నారు. పోనీలే…. ఆవిడకి నావల్ల ఏదీరాక పోడమే నాకూ కావాలి”

“మీకు అసలు నిజం తెలీదు. పద్మకి కరోనా” సుజాత అంది.

“ఏమిటీ? నిజంగా” శ్రీదేవి నిర్ఘాంతపోయింది.
“అవును. వాళ్ళు ఎవరికీ చెప్పుకోటం లేదు. అతనికి లేదుట. మాకూ, వాళ్ళకీ కూడా పనిమనిషి లక్ష్మే కదా చేసేది. తను చెప్పింది. వాళ్ళింట్లో మానేసిందిట.
ఎవరి భయాలు వాళ్ళవి. ఏం చేస్తాం?” అంది సుజాత.

సుజాతతో కాసేపు మాటాడి ఫోన్ పెట్టి నీరసంగా వాలింది శ్రీదేవి.

ఎంతకీ తను తనని చూడడానికి పద్మ భయ పడిపోయిందనే అనుకుంది. పద్మకి ఏమయిందో అనే ఆలోచనే రాలేదు. తనలో తనే కాస్త సిగ్గు పడింది. “కనీసం వాళ్ళ ఆయన ఈ మాట చెప్పినా తను బోధపరచుకొనేది కదా” అని అనుకుంది. ఎక్కువమంది కరోనా వస్తే, చెప్పుకోడానికి ఇష్టపడరు అని శ్రీదేవికి తెలీదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!