జీవిత నిత్య సత్యం

జీవిత నిత్య సత్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: దొడ్డపనేని శ్రీ విద్య

 పగలు దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది, అయితే రాత్రి కాగానే చీకటి ముంచేస్తుంది. పోనీ ఆ చీకటి అలాగే ఉంటుందా అంటే ఉండదు, ఉదయం అనేది వస్తుంది, వెలుగు రేకలు తెస్తుంది. మధ్యాహ్నం ఉజ్జ్వలంగా వెలుగుతుంది. చివరకు సాయంకాలమనే సంధ్యారాగంలో కలిసిపోతుంది.
ప్రతి రోజూ ఇంతే, కాలచక్రంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి.
ఈ ప్రయాణంలో ఎక్కడా ఒక్క క్షణమైనా ఆగదు. కాలం. శిశిరం, వసంతం గ్రీష్మం అంటూ ఆరు ఋతువులు మారుతున్నాయి. అవీ ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
కాలచక్రం అలా అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది, ఇలా కాలచక్రం దొర్లిపోతూ ఉంటే అలా అలా ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ప్రాణుల యొక్క ఆయుష్కాలం తరిగిపోతూ ఉంటుంది. సంవత్సరానికి ఒక సారి పుట్టిన రోజు చేసుకుంటాం, అంటే ఆయుష్కాలంలో మరొక సంవత్సరం తగ్గిపోయిందీ అని గుర్తుపెట్టుకోవాలి. కాలం ముందుకు వెళ్తుంటే మృత్యువు దగ్గరకు వస్తున్నదని గుర్తుపెట్టుకోవాలి. కాలం కదిలిపోతుంటే భవిష్యత్తు వర్తమానం గాను, వర్తమానం భూతకాలం గాను మారిపోతుంటుంది, కనుక ఏదీ నిత్యం కాదు, ఏదీ శాశ్వతం కాదు. “కఠోపనిషత్తు” లో నచికేతుడు చెప్పినట్లు ఈ జీవితం అనిత్యమైనది. ఎంత శ్రమపడ్డా, ఎన్ని అనుభవించినా, ఎంత ప్రోగుచేసినా ఒక నాటికి మృత్యువు అనేది అతడి నుంచి అన్నింటిని బలవంతంగా లాక్కుంటుంది. కష్టపడి సంపాదించిన అన్నింటిని విడిచిపెట్టి జీవుడు దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ దీనంగా, హీనంగా, ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే అతడు తీసుకెళ్లేది ఈ జీవితంలో కోరి సంపాదించుకొన్న సంచిత కర్మల, వాసనల మూటలను మాత్రమే తప్ప మరేది కాదని, మన వెంట రాదనీ గుర్తు పెట్టుకొని జీవితాన మంచి వైపు మన గమనం ఉండాలని, సంస్కారంతో నలుగురితో మెలగాలని నాలుగు కాలాల పాటు మన పేరు నలుగురు గుర్తుంచుకునేలా మనం బ్రతక గలిగితే చాలు.
ఇదే ఇదే కదా నిత్య జీవిత సత్యం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!