నేటి బంధాలు

అంశం: ఐచ్ఛికం – వ్యాసం

నేటి బంధాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక),

వ్యాసకర్త: బాలపద్మం

ఈ నాటి ఈ బంధమేనాటిదో… అని మధురంగా ఉండేవి ఏ బందమైనా. కానీ ఈ నాడు వాటి విలువలు కాలరస్తూ ప్రతి నిత్యం కొత్త బంధాలు వెతుక్కుంటూ పాతవి రోత అన్నట్టు తయారవుతున్నారు మనుషులు.
ముఖ్యంగా రక్త సంబంధాలు, కాలంతో బాటు వారి వారి అవసరాలు, సంసారాలు, పిల్లలు, ఉద్యోగాలు తో ప్రతి మనిషి జీవితం అల్లుకుని ఉంటుంది కదా. దానికి అనుగుణంగా వారు వివాహాల తరువాత ఎక్కడెక్కడో స్థిరపడవలసి వస్తుంది. అక్కడ దగ్గరగా ఉండే మనుషులు, కుటుంబాలతో అనుబంధం ఏర్పడడం సహజం. అలా అని కేవలం వారి తోటే కాలక్షేపం చేస్తూ పూర్తిగా రక్త సంబంధం ఉన్న వారిని, తోడ బుట్టిన వాళ్ళనీ నిర్లక్ష్యం చేస్తున్నాము అది ఎంత మాత్రమూ సబబు కాదు. సహోదరులు అందరూ ఆర్థికంగా, సామాజికంగా సమానంగా ఉంటారు అని చెప్పలేము, ఉండరు కూడా. అలా అని వారితో బంధాన్ని వాణిజ్య కోణం లో చూస్తే ముమ్మాటికీ తప్పే, మరికొన్ని బంధాలు ఉంటాయి అవి కేవలం అవసరానికి మాత్రమే. ఉదాహరణకి ఏదైనా ప్రయాణ సాధనం లో ఎవరైనా కలిశారు అనుకుందాం, అది ఆ ప్రయాణం ముగిసేవరకు మాత్రమే. తరువాత వారి అభిరుచులు, ఇత్యాది విషయాలు కలిస్తే కొంత మందితో ఆ బంధం కొంత కాలం లేదా సుదీర్ఘ కాలం కొనసాగవచ్చు.
స్నేహ బంధాలు ఇవి హద్దులు లేని ఆప్యాయత పంచేవి. ఒక ప్రియమైన స్నేహితుడు లేదా స్నేహితురాలు తప్పనిసరిగా ఉండాలి. కొందరు తన జీవిత భాగస్వామినే అత్యంత స్నేహంగా మలుచుకుని జీవిస్తారు, వారి అదృష్టానికి కొదవ లేదు. అత్యంత సుందరమైనది ఆ బంధం. ఈ మధ్య స్నేహం కూడా చాలా పరిమిత కాలం కోసమే అయిపోయింది. వారు వారి అవసరాల కోసం మాత్రమే స్నేహం చేస్తారు, కాదు నటిస్తారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఇక పోతే కొందరు ఉంటారు, వీరు కలియుగంలో మనిషి రూపంలో ఉన్న రాక్షసులే. వీరికి బంధాల విలువ తెలీదు, సాటి వారిని గౌరవించడం మాట పక్కకు పెడితే మనిషిగా చూసే సంస్కారం ఉండదు. ఇంకో అడుగు ముందుకు వేస్తే వావి వరుసలు కూడా చూడని సంస్కార హీనులు వీరు. ఆడపిల్ల కాస్త నవ్వుతూ మాట్లాడినా పలకరించినా వారిలోని కీచకుడో లేదా రావణుడో నిద్ర లేచి రాక్షస ప్రవృత్తి తో రగిలి పోతూ, సమాజంలో ఉన్నాం, సభ్యతగా ఉండాలి అని కూడా మరచిపోతారు. ఇక మోసాలు విషయానికి వస్తే నమ్మిన వారినే కదా మోసం చెయ్యగలం అనుకుంటారు. ఇలా బంధాలు నేడు పూర్తిగా విలువలకు ప్రాధాన్యత లేకుండా అవసరాలకు, సమయానుకూలంగా అతి ముఖ్యంగా ధన ప్రాధాన్యంగా మారిపోతున్నాయి. ఆ ధోరణి మారాలి, అందరూ మానవత్వానికి ప్రాముఖ్యత చూపుతూ నడవాలి అని ఒక రచయితగా కోరుకుంటున్నా.

You May Also Like

6 thoughts on “నేటి బంధాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!