విరిసిన వెన్నెల

(అంశము:: “కొసమెరుపు కథలు”)

విరిసిన వెన్నెల

రచన: మొహమ్మద్ .అఫ్సర వలీషా

కాలు గాలిన పిల్లిలా ఇంట్లో నుండి వాకిట్లోకి వాకిట్లో నుండి ఇంట్లోకి తిరుగుతున్నది దేవిక .షుగర్ ఉన్న మనిషి టైంకి తినకపోతే ఎలాగా .మధ్యానమనగా వెళ్ళారు ఒక ఫ్రెండ్ ను కలిసి వస్తానని, రాత్రి అయిపోతుంది ఎందుకంటే చెప్పరు , ఒకటికి రెండు సార్లు అడీగి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు దేవికది.చెబితే వింటుంది లేక పోతే మౌనంగా ఉండి పోతుంది. ఆడవాళ్ళందరూ అరుదుగా తొడిగే మౌనాభరణమది.మగవాళ్ళ వరమది .

గేటు చప్పుడుకు ఎదురెళ్లి అడిగింది ” ఇంత ఆలశ్యం చేశారేమిటి మీ ఆరోగ్యం ఏం కాను , ఇంత ఆలశ్యం చేసుకుంటే ఎలా అంది ఆదుర్దాగా “.

శ్రీధర్ కాళ్ళు కడుక్కుని లోపలికి రాబోతూ “ఎందుకంత కంగారు అన్నాడు.భార్య ఆందోళన చూసి. బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వస్తూ స్నేహితుణ్ణి కలిసి వస్తానన్నాను కదా ” అన్నాడు భోజనానికి కూర్చుంటూ సౌమ్యంగా . చాలా మంది మగవారికి లేని ఆడవారి సౌభాగ్యమది.

ఇద్దరూ భోజనాలు కానిచ్చేశాక గబ గబ వంటిల్లు సర్దేసి వచ్చి భర్త పక్కన కూర్చుంది. తాంబూలం అందిస్తున్న భార్య ముఖంలోకి తదేకంగా చూస్తూ “ఈ రోజు నా స్నేహితుల్లో ఒకతని భార్య చనిపోయింది అన్నాడు.”

“అయ్యో ఎలా జరిగింది అంది బాధగా” దేవిక.

“సడెన్ హార్ట్ ఎటాక్ ” అన్నాడు ఏదో ఆలోచిస్తూ..

“ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉంటారని ఒకరిని విడిచి మరొకరు ఉండరని పదే పదే చెబుతుంటాను కదా నీతో , వాళ్ళే అన్నాడు సాలోచనగా”.

“అయ్యో ఎంత పాపమండి చక్కని జంటను విడదీశాడా భగవంతుడు ” అంది దేవిక మరింత బాధగా. ఆ రాత్రి ఇద్దరికీ కలత నిద్రే అయింది.

మరునాడు దేవిక బట్టలు ఉతకబోతూ శ్రీధర్ ఫ్యాంటు జేబులో ఏవో కాగితాలు ఉంటే తీసి ఓ పక్కన పెడుతుంటే అందులో రాణి అనే పేరు మీద డబ్బులు కట్టిన పాసుపుస్తకం కనబడింది . ఎవరై ఉంటారా అని ఓ సెకను ఆలోచనలో పడి వెంటనే తన పనిలో నిమగ్నమై పోయింది.
మధ్యాహ్నం భోజనానికి వచ్చిన శ్రీధర్ ఆరుతున్న బట్టలు చూసి కంగారుగా “బట్టల్లో అవసరమైన కాగితాలు ఉండాలి చూశావా అన్నాడు “

“ఆ తీసి అల్మారాలో పెట్టానండి అంది” కనీసం మాట మాత్రమైనా ఎవరు అని అడగక .
“హమ్మయ్య ” అనుకున్నాడు మనసులో శ్రీధర్.

ఒక రోజు శ్రీధర్ భార్యతో సరదాగా కబుర్లు చెబుతూ చెబుతూ గుండెల్లో నొప్పి వచ్చి పడిపోయాడు. పక్క వాళ్ళ సాయంతో ఆటోలో తీసుకెళ్ళే లోగా ప్రాణాలు విడిచాడు. దేవిక కొయ్యబారిపోయి స్థాణువయి లోకమంతా అంధకారమై పోయినట్లైంది.

పక్క వాళ్ళే చుట్టాలకు, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న కొడుకూ కోడలు రాధా, గౌతమ్ లకు తెలియచేశారు. ఈ హఠాత్పరిణామానికి ఇద్దరూ గగ్గోలు పెడుతూ వచ్చారు.

కొడుకును హత్తుకుని ఘొల్లుమంది దేవిక. జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. చుట్టాలందరూ దేవికను అనునయించి “అసలే నోట్లో నాలుక లేనిది , అన్నీ భర్తే చూసుకునేవాడు, ఎలా బ్రతుకు తుందో అనుకుంటూ వెళ్ళి పోయారు.”

“దేవికకు ఒకే సారి లోకమంతా చీకటి ఆవరించినట్లైంది. కొడుకూ కోడలు వెళ్ళి పోతే తన పరిస్థితి ఏంటి ఆ దేవుడు ప్రేమాను రాగాలన్నీ రంగరించి ఒకే బంధంగా ఇమిడ్చి అంతలోనే ఏ సంబంధం లేనట్లు విడదీసి ఎందుకీ దొంగాట ఆడుతాడు అనుకుంటూ గుండెలవిసేలా ఏడ్చింది శ్రీధర్ ను తలుచుకొని.

రాధ వంటగదిలో ఉంది .బాబు రోహిత్ ఆడుకుంటూ హాలులోనే పడుకుండి పోయాడు.

ఏమీ తోచక గౌతమ్ తండ్రి గదిలో అడుగు పెట్టాడు బాధగా. మంచంమీద ఏడ్చి ఏడ్చి అలసి పడుకుని ఉంది దేవిక .ఒక్క సారి తండ్రి గుర్తొచ్చి కళ్ళ నీళ్ళు ఆగలేదు గౌతమ్ కు .

ఒక్కడే కొడుకని చాలా గారాబంగా , క్రమశిక్షణగా పెంచారు గౌతమ్ ను శ్రీధర్, దేవిక లు. ఉన్నత చదువులు చదివించి దూరపు బంధువుల అమ్మాయి రాధతో పెళ్లి చేశారు. రాధ అందంతో పాటు చదువు కున్నది. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నది .గౌతమ్ ఉద్యోగం అక్కడే కాబట్టి కాపురం ఇద్దరికీ అక్కడే పెట్టించారు తమ గూర్చి ఏమాత్రం ఆలోచించ వద్దని మేమిద్దరం ఒకరికి ఒకరం తోడున్నామని.

ఆ మాట గుర్తు రాగానే ఒంటరైన తల్లిని చూడగానే దుఃఖం తన్నుకు వచ్చింది గౌతమ్ కు. కళ్ళు తుడుచుకుని తండ్రి చదువు కునే పుస్తకాల అలమార నుండి పుస్తకం తీయబోతుంటే పుస్తకాల మధ్య నుండి ఒక కవరు జారి పడింది.

ఏమిటా అని తెరిచాడు .అందులో ఒక పాసు పుస్తకం, ఉత్తరం ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉత్తరం తీసి చదవసాగాడు.

” బాబూ గౌతమ్ ” అని తన పేరు మీద తండ్రి ఎందుకు ఉత్తరం వ్రాశాడో అర్థం కాక ఆతృతగా తన కళ్ళు అక్షరాల వెంటపడి పరుగులు తీశాయి.

పోయిన సారి నీవు కోడలు మనవడు నా రిటైర్ మెంట్ కు ఇంటికొచ్చి నప్పుడు ఓ వారం రోజులు మాతో ఉండేసరికి మా సంతోషాలకు అవధులు లేవు. మనవడితో మనసారా సరదాగా గడిపాము.నీతో కోడలితో బాబుతో గడిపామన్న తృప్తికి అవధులు లేవు. ఆ సంతోష జలపాతంలోనే ఓ నాడు నా ఆశల నావ మునిగి తలక్రిందులయ్యింది. అనుకోకుండా నీవు , కోడలు వాగ్వివాదం చేసుకోవడం నా చెవులారా విన్నాను. ” నాన్న రిటైర్ అయ్యారు మనతో తీసుకెళదామని నీవు, ససేమిరా మనతో వద్దని కోడలు, నీవు మాగురించి తనతో వేడుకోవడం ,నాకు చాలా బాధనిపించింది . ప్రస్తుతానికి ఇద్దరం హాయిగా ఉన్నాము కలిసి మెలసి. కానీ కాలం ఎన్నాళ్ళు అలా మమ్మల్ని ఉండనిస్తుంది .భార్యాభర్తలు ఒకేసారి చనిపోయిన వారు ఎంత అదృష్టవంతులు. ఎందరికి ఆ వరం లభిస్తుంది. ముందు మీ అమ్మ పోతే నేను ఎలాగోలా కాలం వెళ్ళదీయ గలను .మరి ముందు నేను పోతే మీ అమ్మ పరిస్థితి ఏంటి తప్పని పరిస్థితి లో మీ దగ్గరే ఉండాలి . తను ఎలాంటిదో నీకు పూర్తిగా తెలియదు.
“నా తరువాత చాలా ఆలశ్యంగా పుట్టిన మీ బాబాయి నాకు చాలా అలవాటు ,అమ్మా నాన్నా యాక్సిడెంట్ లో చనిపోతూ తనను నాకప్ప చెప్పారు.పెళ్లి లో ఈ మాట మీ అమ్మ తో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటే” మీ అమ్మే అంది “నాకు ఈ బాబు చాలండి ఇక పిల్లలు వద్దు మనకు “అని అంటుంటే ఆశ్చర్య పోయాను. స్థలం అమ్మిన డబ్బు తన పేరుమీద వేస్తే ఒప్పుకోదని తన పేరు ముందు ఉండే దేవికా తీసేసి చివర ఉన్న రాణి పేరు తో వేశాను. పొరపాటున ఒక రోజు పాస్ బుక్ చూసినా వేరే ఆడదాని పేరు మీద మీరు డబ్బు వేయడం ఏమిటని నిలదీసేది .కనీసం అడగను కూడా లేదు అంతటి మహా సాధ్వి తను. అలాంటి తను కొడుకూ కోడలికి భారమని అనుకోకూడదు .అందుకే చాలా రోజుల నుండి ఆలోచించి ఓ స్థలం అమ్మి పది లక్షలు మీ అమ్మ పేర బ్యాంకు లో పిక్స్ డ్ వేశాను నెల నెలా దాని మీద వచ్చే డబ్బు కోడలికి చెందేలా ఏర్పాటు చేశాను. ఇల్లు మనవడి పేరు మీద వ్రాసేశాను. మీ అమ్మ ఖర్చులకు తను బ్రతికున్నాళ్ళు నా పెన్షన్ ఎలాగూ వస్తుంది. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే నీవుండగా ఈ జన్మకిది చాలదా మాకు .ఈమధ్యనే గుండెల్లో నొప్పి గా ఉందని డాక్టర్ దగ్గర కెళ్తే “మీకు తెలియకుండానే చిన్న స్ట్రోక్ వచ్చింది సార్ మళ్ళీ సారి వస్తే కష్టం జాగ్రత్త గా ఉండండి” అని మందులు వ్రాసిచ్చారు.
ఏమో మాయదారి ప్రాణం ఎప్పుడు ఆ దేవుడు నన్ను పిలిపించుకుంటాడో తెలియదు.ముందు జాగ్రత్త కోసం వ్రాసి పెట్టాను. మరు జన్మంటూ ఉంటే మిమ్మల్నే భార్యా కొడుకుగా ఇమ్మని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ శెలవు నా హృదయ ఘంటిక ముద్దుల రోహిత్ కి లెక్క లేనన్ని ముద్దులు”.
గౌతమ్ ఆగని కన్నీటితో అక్షరాలన్నీ ఓదార్చలనే ఆరాటంతో కరిగి పోతుంటే ఉత్తరాన్ని హృదయానికి హత్తుకుని తండ్రి నే హత్తుకున్నంత అనుభూతికి లోనయ్యాడు.
ఎప్పుడూ గొడవే రాధతో తలి దండ్రుల విషయంలో గౌతమ్ కు. ఆమె స్నేహితులు ఆమెకు “అత్తామామలు మీ దగ్గరుంటే ఎప్పుడూ వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా సాధిస్తుంటారు అన్న బీజం రాధ మనసులో బలంగా నాటేశారు”. అందుకే తల్లి దండ్రులను మనతో తీసుకుని వెళ్దామన్న ప్రతిసారీ ససేమిరా వద్దు అని గొడవ పడుతున్నది. ఇప్పుడు తల్లి ఒంటరి దయ్యింది .ఎలాగైనా రాధను ఒప్పించి తీసుకెళ్ళి తనతో పెట్టుకుని హాయిగా చూసుకోవాలి అనుకున్నాడు మనసులో బలంగా కళ్ళు తుడుచుకుంటూ.

మరునాడు రాధ దేవిక గదిలో కెళ్ళి సూట్ కేసు తీసి బట్టలన్నీ సర్దుతుంటే గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ తన కళ్ళను తనే నమ్మలేక పోతున్నాడు.అలా ఎలా అని.
ఉత్తరం చదివి డబ్బు ఆశ పుట్టిందా అనుకుంటే ఆ ఉత్తరం తన జేబులోనే ఉంది
మళ్ళీ అలా ఎలా అని ఆలోచన లో పడ్డాడు కానీ అడగడానికి మనసొప్పుకోలేదు.
అన్నీ సర్దుకుని బరువైన మనసుతో కొడుకూ కోడలు తో బయల్దేరింది దేవిక .

సంతోషంతో తన తల్లి తో కలిసి మెలసి ప్రేమగా తల్లీ కూతుళ్ళలా ఉన్న రాధ వంకే చూస్తూ ” నిజంగా నీవు చాలా అందంగా ఉన్నావు రాధా ” అన్నాడు.” గౌతమ్ ఒక రోజు.

“అదేమిటి కొత్తగా చెబుతున్నారు” అంది రాధ ఆశ్చర్యంగా.

“ఇన్నాళ్ళూ నీ బాహ్య సౌందర్యమే నాకు తెలుసు .ఇప్పుడు నీ అంతః సౌందర్యాన్ని నేను మనసారా ఆస్వాదిస్తున్నాను అన్నాడు ప్రేమగా .

మీతో ఎన్నాళ్ళు గానో ఒక విషయం చెప్పాలను కుంటున్నాను.
“నిజంగా అత్తయ్య మా అమ్మ కన్నా ఎక్కువే .ఎందుకంటే మనం మీ నాన్న గారి రిటైర్ మెంట్ కు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చాక మన రోహిత్ నాకు “తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలాగూ లేరు, తాతయ్య నానమ్మ నన్నా ఇవ్వరా ఆడుకోవటానికి ఇవ్వరా అని అన్నాడు, అక్కడ ఊళ్లో నాతో చాలా బాగా ఆడుకున్నారు , బోలెడన్ని కధలు చెప్పారు అవన్నీ మీకు రావు కదా అన్నాడు బాధగా .నాకు అక్కడ ఉన్న వారం రోజులు అత్తయ్య లో అమ్మ కనబడింది. వాళ్ళను తెచ్చుకుందామని నేనే మీకు చెబుదామని అనుకునేంతలో ఈ ఘోరం జరిగిపోయింది. వాళ్ళను తప్పు గా అర్థం చేసుకుని మీతో గొడవ పడినందుకు నన్ను క్షమించండి అంది” ఏడుస్తూ. ” దేవుని దయ వలన అంతా శుభమే జరిగింది మన జీవితాలలో వెన్నెల విరిసిందని మనసారా ఆ దేవుని చేతులెత్తి దండం పెట్టుకున్నాడు గౌతమ్.

 

..సమాప్తం..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!