స్వయంకృతం

(అంశము:: “కొసమెరుపు కథలు”)

స్వయంకృతం

రచన: సావిత్రి కోవూరు 

హైదరాబాద్ పొలిమేరల్లో ఉన్న పెద్ద మ్యారేజ్ హాల్ లో రంగ రంగ వైభోగంగా పెళ్లి జరుగుతుంది. అబ్బాయి మోహన్ కు ఐదారేళ్ళ నుండి వెతుకుతుంటే ఇప్పుడు ఒక సంబంధం కుదిరింది. మోహన్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. మంచి బుద్దిమంతుడు. అందగాడే కాని చాలా మంది అమ్మాయిలు నిరాకరించారు. కారణం గవర్నమెంట్ జాబ్. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పిల్లలు ఇవ్వడానికి ఆడపిల్లల తండ్రులు క్యూ కట్టే వాళ్ళు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినప్పటి నుండి ఆడపిల్లలందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. పైగా ఈ కాలంలో ఆడ పిల్లలు కూడా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కనుక అబ్బాయిలు కూడా తమకు తగ్గట్టుగా మంచిగా చదువుకొని బాగా సంపాదించే వాళ్ళైతేనే చేసుకుంటున్నారు.

దానికి తోడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్లు కూడ ఆపేశారు. అందుకే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తొందరగా పెళ్ళిళ్ళు కుదరడం లేదు. ఆ విధంగా మోహన్ కు ముప్పై సంవత్సరాలు నిండే సమయానికి మ్యారేజ్ బ్యూరో ద్వారా రంజని అనే అమ్మాయితో పెళ్ళి కుదిరింది.

రంజని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి. తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుండి తల్లి కామాక్షి  అతి గారాబం చేయడం వల్ల, గర్వం, పెంకితనం బాగ అబ్బినాయి. వెనకాముందు చూడకుండ ఎవరితోనైన ఇష్టమొచ్చినట్లు మాట్లాడేస్తుంది.

ఆఫీస్ లో ‘సూర్య’ అనే అతన్ని ప్రేమించింది. రెండేండ్లు   బాగానే తిరిగారు. వాళ్ల తల్లిదండ్రులకు, వీళ్ళ తల్లిదండ్రులకి తెలిసి పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఎంగేజ్మెంట్ చేద్దామని డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ అమ్మాయి అందరిలో ఆ అబ్బాయిని చులకన చేసి మాట్లాడటం మొదలు పెట్టింది. వాళ్ల వాళ్ళని కూడా ఎగతాళి చేయడం, హేళన చేయడం మొదలు పెట్టింది. దానితో ఆ అబ్బాయి కుటుంబ సభ్యులకు ఈ అమ్మాయి మాట్లాడే పద్దతి నచ్చలేదు.

వాళ్ళు ఇప్పుడే ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అంటే, పెళ్లి అయినాక ఇంకా ఎలా మాట్లాడుతుందో  అనుకొని సూరితో “నీవు ఆ అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయి ఎలా మాట్లాడిన నీకు భరించక తప్పదు. మేమైతే ఆ మాటలు భరించలేము. ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్న మాకు, అలజడులు అవసరం లేదు. నువ్వు పెళ్లయిన తర్వాత విడిగా ఉంటేనే బాగుంటుందేమో” అన్నారు తల్లిదండ్రులు.

బాగా ఆలోచించిన సూరి, ఆ అమ్మాయితో “నీవు మా వాళ్ళతో కొంచెం మర్యాదగా మాట్లాడు. వాళ్ల ముందర నాతో కూడ చులకనగా, ఎగతాళిగా మాట్లాడకు బాగుండదు.” అన్నాడు.

“అంటే నేను మర్యాద తెలియని దానిలా కన్పిస్తున్నానా నీ కళ్ళకు” అన్నది రంజని.

“అలా అని కాదు. నీవు కొంచెం మాటతీరు మార్చుకుంటే,  మన పెళ్లి  ప్రశాంతంగా జరుగుతుంది” అన్నాడు

వెంటనే “లేకపోతే చేసుకోవా ఇంతేనా రెండేళ్ల నుండి ప్రేమించుకున్నాం కదా. ఇంతేనా నీ ప్రేమ” అన్నది.

“పెళ్ళి చేసుకోను అని కాదు కానీ, అలా ఉంటే బాగుంటుంది అని చెబుతున్నాను” అన్నాడు సూరి.

“అది అంతా ఉత్తిదే. నేను సరిగా మాట్లాడట్లేదు అనేది ఒక సాకు మాత్రమే. నన్ను ఎలా వదిలించుకోవాలని చూస్తున్నట్టున్నావు. నీవు చేసుకోకుంటే నాకు పెళ్లి కాదు అనుకుంటున్నావా? వారం లోపల నీకంటే అన్ని అర్హతలు ఉన్న అబ్బాయిని చూసి చేసుకోగలను నేను.” అన్నది రంజని పొగరుగా.

“వదిలించుకో తలుచుకుంటే ఇన్ని రోజులు నీతో కలిసి తిరిగే వాడినే కాదు. కొంచెం ఆలోచించు.” అన్నాడు సూరి.

“నేనాలోచించేది ఏమి లేదు.నీవే మారిపోయినవ్. నీవు తప్ప నన్నెవ్వరు చేసుకోరనుకుటున్నావు. నీ కంటే గొప్ప వాణ్ణి, వారం రోజుల్లో చేసుకోగలను.”
అన్నది రంజని.

“అంటే నీ వెళ్ళిపోతే నాకు పెళ్ళి కాదనుకుంటున్నావా? నీలాంటి పొగరుబోతును చేసుకొని నా జీవితం అశాంతి పాలు చేసుకోలేను” అన్నాడు.

“సరే పోయి ఎవర్నైన చేసుకో. నిన్ను ఎవరు బ్రతిమిలాడరు. చూడు ఒక వారంలో లోపల ఘనంగా పెళ్లి చేసుకుంటాను” అన్నది.

“జీవితమంటే చిన్న పిల్లల ఆట కాదు రంజని. బాగా ఆలోచించుకో. కొంచం నెమ్మదిగా, మర్యాదగా మాట్లాడ మంటున్నాను అంతే.”అన్నాడు.

“ఏం అక్కర్లేదు ఈరోజుతో నీవెవరో, నేనెవరో పదిరోజుల్లో నా పెళ్లి కార్డు పంపిస్తాను చూడు. చూసి ఏడువు.” అంటూ గబ గబ వెళ్ళిపోయింది.

ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో జరిగిందంతా చెప్పి “వెంటనే వారం లోపల నాకు పెళ్లి కుదర్చి చేసేయ్యండి. వాడు తను తప్ప ఇంకెవ్వరు లేరు అనుకుంటున్నాడు.” అన్నది.

తండ్రి రామనాథం “అది కాదమ్మా రెండేళ్ల పరిచయం తొందరపాటుతో తెగతెంపులు చేసుకోకు. కొంచెం ఓపిక పట్టు. కొన్ని వారాలు నెమ్మదిగా ఆలోచించు. నీకు ఆ అబ్బాయితో ప్రాబ్లం లేదు కదా. కొంచెం సర్దుకుపోతే సరిపోతుంది” అన్నాడు.

తల్లి మాత్రం “పోనీ లేవే ఇది కాకపోతే దీని తాత లాంటి సంబంధం వస్తుంది. వాడికి అంత పొగరేంటి చూడు నీవేమి లొంగి ఉండాల్సిన పని లేదు.” అన్నది.

రామనాథం “ఏంటి కామాక్షి అలా మాట్లాడతావు చిన్నవాళ్ళు తొందరపడితే, మనం బుద్ధి చెప్పేది పోయి ఇంకా రెచ్చగొడతావేంటి. ఇంతవరకు వచ్చిన సంబంధం కాకపోతే బాగుండదు” అన్నాడు.

“మీరు మాట్లాడకండి. దానికేం తక్కువ. మంచి అందం, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. దానికి వెంటనే వేరే సంబంధం చూసి నేను చేస్తాను” అన్నది.

“మీ ఇష్టం ఏమైనా చేసుకోండి” అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామనాధం వికలమైన మనస్సుతో.

కామాక్షి వెంటనే మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఫోన్ చేసి “మా అమ్మాయికి వెంటనే ఒక మంచి సంబంధం చూడండి. పది రోజుల్లో పెళ్లి అయిపోవాలి” అన్నది.

వాళ్ళు అనుకున్నట్టుగానే పది రోజుల్లో ఒక  సంబంధం కుదిరింది.  అబ్బాయి పేరు మోహన్ బ్యూరో వాళ్ళ ద్వారానే రంజని సంబంధం కుదిరింది. పెళ్ళి ఘనంగానే జరిగింది. పెళ్ళవగానే రంజని చేసిన మొదటి పని మోహన్ తో క్లోజ్ గా ఫోటో దిగి సూర్యకు పంపి “చూశావా నీ కంటే అందగాడిని నేను పెళ్ళి చేసుకున్నాను.” అని మెసేజ్ పెట్టింది.

పెండ్లైతే  చేసుకున్నది కానీ మోహన్ తో మనస్ఫూర్తిగా మాట్లాడటం గానీ, నవ్వడం గాని ఏమీ చేయట్లేదు. పెళ్లిలో అంత ముభావంగా ఉన్నది.

పెండ్లి అయిన రోజు మోహన్ ఏదో మాట్లాడకపోతే, “నాతో మాట్లాడకు. నీవేదో నన్ను ఉద్దరిస్తావని, నీతో ఎల్ల కాలం కాపురం చేయాలని నిన్ను చేసుకోలేదు. నా ఫ్రెండ్ సూరికి నేను ఏంటో చెప్పాలని, వాడు చేసుకోకపోతే నాకు పెళ్లి కాదు అనుకున్నందుకు బుద్ధి చెప్పడానికి నిన్ను చేసుకున్నాను. అసలు నీవు నాకు అక్కర్లేదు. నాతో మాట్లాడుతూ, నన్ను తాకొద్దు. రేపు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి డైవర్స్ పేపర్స్ పంపిస్తాను. సైన్ చేసి పంపించు” అనేసరికి మోహన్ హతాషుడయ్యాడు.

మరుసటి రోజు తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వాళ్లు ఆమెను పిలిచి “ఏమైందమ్మా. మా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? చెప్పు సరిదిద్దుకుంటం. నిన్ననే పెళ్లయింది. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు.” అన్నారు.

“చూడండి మీరు కుబేరులని మీ అబ్బాయి పెద్ద అందగాడని నేను చేసుకోలేదు. నా ఫ్రెండ్ కు బుద్ధి చెప్పాలని మీ అబ్బాయిని చేసుకున్నాను. అయినా ఈ మాటలన్నీ అనవసరం. నాకు మీ అబ్బాయి తో కాపురం చేయడం ఇష్టం లేదు. వెంటనే డైవర్స్ పేపర్స్  పంపిస్త. సైన్ చేసి పంపిస్తే నాకు మీ ముఖం చూసే అవసరం రాదు.” అని బట్టలు సర్దుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది.

మోహన్ కు వాళ్ల తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియలేదు. వెంటనే వాళ్ళ నాన్నకు మేనమామకు ఫోన్ చేసి చెప్పారు.

వాళ్ళు వచ్చి “మమ్మల్ని క్షమించండి మేమేం చేయలేము. మా అమ్మాయి పూర్తిగా తల్లి గారాబంతో చెడిపోయింది. అందువల్లనే ప్రేమించిన అబ్బాయిని వదులుకున్నది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయిని కూడా వదులుకుంటుంది. దాన్ని బ్రతికు అదే నాశనం చేసుకుంటున్నది. ఏమవుతుందో ఏమో తల్లి దానిని ఏం చేయదలచుకున్నదో” అని బాధపడి వెళ్లిపోయారు.

ఇద్దరి సమ్మతంతో ఏడాదికి డైవర్స్ వచ్చేసింది. మోహన్ అదృష్టం ఏంటో గాని అతని ఫ్రెండ్ ఒక అమ్మాయి అతనిని ఇష్టపడి ఆరు నెలల్లో పెళ్లి చేసుకుంది. భార్య ఇద్దరు పిల్లలతో  ఏ చీకు చింత లేకుండ హాయిగా కాపురం చేసుకుంటున్నాడు.

రంజిత మాత్రం 50 ఏళ్లు వచ్చి జుట్టు తెల్లబడ్డా, బుద్ధిలో ఏ మార్పు లేదు. ఒంటరిగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. అందుకే పిల్లలను సరైన మార్గంలో పెంచక పోతే వాళ్ల జీవితాలు ఎలా మలుపులు తిరుగుతాయో ఆ భగవంతునికే తెలుసు.

 

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!