కాలభైరవుడు (శివరాత్రి ప్రత్యేక కవితలు)

అంశం: కాలభైరవుడు                                                        శివరాత్రి ప్రత్యేక కవితలు

చేతనాచేతన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: డా!!బాలాజీ దీక్షితులు పి.వి

ప్రళయాగ్నియై రగిలే
విలయాగ్నియై చెలరేగే
కాలభైరవ
కాటికాపుర క్షేత్రపాలక… వందనం
విషధార
గరళాన నింపి
నటరవం నాట్యమై ఎగిసే
కాలస్వరూప
ప్రచండ ప్రళయ….వందనం
ఝటరం విదిల్చి
ఢమరం కదిల్చి
శూలం స్పృశించి
కర్కశం నశింప వచ్చిన
త్రినేత్ర వరద
చేతనాచేతన
కాలభైరవ…వందనం
*******************************

అహం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చింతా రాంబాబు

అహం చేరితే
దైవానికైనా తప్పదు శిక్షని
చెబుతోంది కాలభైరవుడి సృష్టి
లయకారుని అంశీభూతుడుగా సృష్టించబడి
అతిభయంకర రూపుడై
బ్రహ్మతో కయ్యానికి దూకి
కాశీ నగర పరిపాలకుడిగా
భిక్షాటన చేస్తూ సంచారంచేసే
దిగంబరుడు  కాలభైరవుడు.
ఎవరూ ఎవరికీ తక్కువా కాదు ఎక్కువా కాదు
అందరికీ అందించాలి గౌరవం
మరచిపోకూడదు అందరం
అహం చేరితే దైవానికే
పట్టాయి ముచ్చెమటలు
నీవు ఎంతటివాడివి…!
ఓ..మనిషీ !
నీలో అహాన్ని త్యజించు
నీలో దైవత్వమనే జ్యోతిని వెలిగించు
మానవ సేవే మాధవ సేవని గుర్తించు.
*******************************

భైరవ రూపాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:కాటేగారు పాండురంగ విఠల్

భయంకరాకార స్వరూపుడు కాలభైరవుడు
దురాశ కామ కోపము శత్రు వినాశకారుడు
వజ్రభైరవ యమాంతకుడు మహాకాలుడు
భైరవుడు ధర్మ సంరక్షకుడు ధర్మపాలుడు

శివుని పరిపూర్ణ అవతారం శక్తిమంతుడు
మాయా అజ్ఞాన అహంకార విధ్వంషకుడు
దుష్ట శిక్షకుడు సర్వగ్రహపీడా నివారకుడు
వారణాసి క్షేత పరిపాలకుడు కాలభైరవుడు

సకల దోష భయ దుర్గుణ నివారకుడు
ఆయురారోగ్యం అదృష్ట ప్రదాయకుడు
పలువిధ స్వరూపుడు భక్తజన రక్షకుడు
శివాలయప్రథమ పూజితుడుభైరవుడు

అసితాంగ భైరవ రురు భైరవ చండ భైరవ
ఉన్మత్త భైరవ క్రోధ భైరవ కపాల భైరవ
భీషణ భైరవ సంహార భైరవ పాతాళ భైరవ
విక్రాంత భైరవ రుద్ర భైరవ పచ్చలి భైరవ
వామన భైరవ వరాహ భైరవ లంబకర్ణ భైరవ
విజ్ఞాన భైరవ త్రిశూల భైరవ దండ భైరవ
*******************************

కావాలిప్పుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఎం .వి .ఉమాదేవి

శాశ్వత మిత్రుడొకడు భువిలో
మనుషులకి తోడుగా ..ఇజ్జో అంటే చాలు !
త్యాగ భోగాలకి అతీతంగా …
విశ్వాసమే ఉఛ్వాస నిశ్వాసలై
అతడు కాలభైరవుడు !!

నిశితమైన చూపులు
నిన్ను నిలదీసి పరీక్ష చేస్తూ …
నాసికాపుటాల తో
నిజాయితీని పట్టిచూస్తాయి !
పరిసరాల ప్రభావం ,ప్రశాంతతని
బేరీజు వేసే తత్వం అబ్బురమై
నేరనిర్ధారణకీ పోలీసులకి ముఖ్యసాయం !
విపత్తుల భూకంప బాధితుల ఆచూకీ ప్రాణదాత !
పెంచుకున్న యజమానిపై
ప్రాణం పెట్టేలా ప్రవర్తన !

ఎదురు చూస్తూ ..
ఎదురు చూస్తూ …తిరిగిరాలేని యజమానికోసం
నిరాహారంగా ,కృశించి
కాలగర్భంలో కలిసే అచంచల
విశ్వాసo …
కనుమరుగైతే గుండె చెరువయి
పెంచిన ప్రేమ పడే వేదనా ..హృద్యం,కారుణ్యకరం !!

కార్తీకంలో కేదారవ్రతం పూర్ణత
కాలభైరవస్వామి మెడలో
గారెల హారంగా
భక్తి నివేదన ..
దక్షయజ్ఞ ధ్వంసరచన వీరభద్ర
అవతారమూర్తి
దయాసముద్రుడు కాలభైరవుడు దుష్టశిక్షకుడు !
నేటికీ కాలభైరవ అవసరం ఉంది!!
*******************************

కాలభైరవా!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

రుద్రుని అంశవు నీవు
కాలరుద్రుడివి నీవు

పవిత్ర కాశీ క్షేత్రంలో వెలసిన
కాలభైరవుడవు నీవు

కొలిచినంతనే భక్తుల కోర్కెలు
తీర్చెడి దైవం నీవు

దిగంబరాకారుడవు
భయంకరాకారుడవు

త్రిలోచనుడవు త్రినేత్రుడవు
నీలకంఠుడవు నిరంతరుడవు

భుక్తి ముక్తి దాయకం
జ్ఞాన ముక్తి సాధనం

భక్తవత్సలం భానుకోటి తేజం
అష్ట సిద్ధి దాయకం

సృష్టి స్థితి లయ కారకం
కపాల మాల ధారణం

*******************************

కాల బైరవం
(కవితా ప్రక్రియ:అంత్యప్రాస)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:కార్తీక్ నేతి

ఐదు తలలని అని విర్రవిగుతున్నా బ్రహ్మ  మోఖములను
తేగానరికెందుకు తన అంశం తో ఉత్త్పన్మించేను కాల బైరవం,
ఐదు తలలు మహా రూపం,
తూర్పుణా తత్పుర్శ ముఖం
దక్షిణాన అఘోర మొఖం,
పశ్చిమాన సజ్జో జాతం,
ఉత్తరాన వామ దేనం
పైన ఈశానం,
ఐదు తలలు మహా రూపం
మనిషికైనా , దైవనికైన గర్వం ఉండకోదని తెలిపేందుకు ఎత్తేను
కాల బైరవం మహా రూపం
ఆ త్రిముకుడిదే మోక్షం మీద అధికారం
శివమే సర్వం.

*******************************

కాల నిర్ణయము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

ప్రతి మనిషి జీవితంలో
మంచి మార్పులు అన్ని
కాల నిర్ణయమే శివుని
ప్రతి రూపంలో ఉండి సదా శివ సదా
శివ అనుజ్ఞ తో శివ భక్తితోనే కాల నిర్ణయం చేస్తూ ప్రజా రక్షణ కోసం సదా కృపపరుడై
మనకు కాశీ  క్షేత్రంలో అత్యంత ప్రసిద్ది
ప్రతి వ్యక్తి ఉన్నత స్థితిలో ఉండాలి అంటే
కాల బైరవు నీ
చల్లని కృప వీక్ష ణాలు కావాలి
ప్రతి నిత్యం అష్టకం పారాయణ
ఎంతో అవసరము మన జీవన యానంలో
ముఖ్య కార్యసిద్ధి.
ప్రతి ప్రసిద్ది  క్షేత్రంలో కాల బైరవుని దేవాలయం
ఉంటాయి.
పంచారామాలు మురమళ్ళ,
శ్రీ కాళ హస్తి క్షణ ముక్తేశ్వరము వంటి దివ్య క్షేత్రాల శివ పార్వతి ఆలయాల్లో పూజలు చేస్తారు.
*******************************

కాలభైరవుడు కర్షకుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: డేరంగుల శివకుమార్

కొండలు ఎత్తుగా ఉంటేనేం
వాటిని పిండిచేయగల సంకల్పం మాది
భూమి బీడుబారితేనేమి
దాన్ని దున్ని దుక్కిచేయగల శక్తియుక్తులు మావి
వర్షం భూమికి ప్రాణం పోయకపోతేనేం
మా రక్తంతో నేలని తడిపే తెగింపు మాది
పంట దిగుబడి ఇవ్వలేకా
మా సహనాన్ని పరీక్షిస్తేనేం
భూమికున్నంతా ఓపిక మాకుంది
దళారులు మా పంటని చౌకగా కొనేస్తేనేం
మా నుండి దోచుకోలేని శ్రమ దాగుంది మాలో
రైతులమని మమ్మల్ని లోకం చిన్నచూపు చూసినా
నిత్యం ప్రేమించే పొలం మాకుంది
పంటచేలో కలుపుమొక్కల్లా పెరిగే మనిషి
ఆలోచనల్ని పెరికేసే ధైర్యం కూడా ఉంది
అడుగడుగునా కష్టాలోస్తేనేం
కన్నీళ్ళని అమ్ముకొనైనా బ్రతికే దమ్ము మాకుంది
ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తేనేం
నీతిగా బ్రతికే సత్తా ఉంది మాలో
మాకు అన్నం దొరక్కపోతేనేం
లోకానికి కడుపునింపడానికి వెనుకాడని నైజం మాది
ప్రభుత్వం మా పిల్లలకి ఉద్యోగాలివ్వకపోతేనేం
వ్యవసాయం కూడా గొప్ప ఉద్యోగమని చేప్తాం
మా కనీళ్లు లోకానికి కనిపించపోతేనేం
లోకాన్ని చూడగలిగే హృదయం మాదంటాం
చట్టాలు మారినప్పుడల్లా చప్పట్లు కొట్టేవాడు మారిపోతేనేం
మారని మనుషులం మేమంటాం
మా బ్రతుకులు రోడ్డెక్కితే అడిగేవాడు లేడు
మేం రోడ్డెక్కితే ఆపేవాడు ,
అరిచేవాడు వస్తారు
మా ఓట్లు కావాలి
మా ఉత్పత్తులు కావాలి.. మార్పు మాత్రం
మా పోరాటంతోనే రావాలి…!!
మాకు కష్ట మొచ్చిన, నష్టం వచ్చినా మేము చేసే సాయమే వ్యవసాయం ..!!
అయినా మా సహనాన్ని చేతగానితనంగా భావించి పరీక్షిస్తే
‘కాలభైరవ కళ్ళెర్ర ‘ చేసి బస్మం చేయగలం తస్మార్ జాగ్రత్త
*******************************

సర్వాంతర్యామి ఒక్కడే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

సృష్టి స్థితి లయ కారకుడు
పరమాత్మ నిరాకారుడు
చిన్మయానంద విలాసుడు
సకల చరాచర సృష్టికీ
ఆధారమైన కాలాతీతుడు
శివుడన్నా కేశవుడన్నా
అభేదమై ఉన్నది ఒక్కడే
జగతిని కాచే ఆ పరంధాముని
సేవించే ఓ రూపం కాల భైరవుడు
నాగులాతని చెవి పోగులు
పుర్రెల దండ ఆభరణం
పులి చర్మమే వస్త్రము
మాంస నేత్రానికి మహా రుద్రుడు
మానస నేత్రానికి భక్త సులభుడు
చిటికెడు విభూతి సమర్పణకే
కటాక్షించే అపార కరుణామయుడు
*******************************

కవితా ప్రక్రియ: (స్తుతి)
!! క్షేత్రపాలకా !!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి

1.సమస్త లోక విగ్రహా!
కాశీ క్షేత్ర పాలకా !
కాల భైరవా! దిగంబరా !!

2.ధర్మసేతు పాలకా !
మోక్ష కారకా !
కాల భైరవా ! దిగంబరా !!

3.భుక్తి ముక్తిదాయకా!
భూత సంఘ నాయకా !
కాల భైరవా ! దిగంబరా !!

4.నీవే జ్ఞానముక్తిసాధనం
నీవే శోక మోహ నాశనం
కాల భైరవా! దిగంబరా!
*******************************

గత జ్ఞాపకాలను చెరిపివేయవే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాధ ఓడూరి

కాలభైరవా…!
కాలము వలె ప్రకాశించుచూ
కాలాన్ని నీతో తీసుకువెడుతూ
అండపిండ బ్రహ్మాండమైన
కాలవిపత్తులను సైతం
కాలంతో మరపిస్తున్నావే

నిన్ను…!
జ్ఞానానికి ప్రతి రూపం
కాలానికే భైరవుడని
కాలభైరవడు అన్నారే…!?

మరి…!
మనిషి మసుకయ్యే
జ్ఞాపకాల గాయాలను
కొనగోటితే చెరిపివేయవే
మనిషికి ప్రతీసారీ
కొత్త జీవితం ఇవ్వవే…!?
*******************************

కాల భైరవుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎస్.ఎల్. రాజేష్

రాగ ద్వేషాలు దేవుళ్ళకు
సైతం అతీతం కాదని వీరభద్రుని
జనన వృత్తాంతం తెలియ చేస్తుంది.
తనను అవమానించిన
పంచముఖ బ్రహ్మ పై ఆగ్రహించె
త్రినేత్రుడు. తన జూటము తో భద్రుని
సృష్టించి శిరము వధించమనెను.
శివాజ్ఞతో భద్రుడు బ్రహ్మ శిరసు
ఖండించెను . వీరునకు బ్రహ్మ హత్య
పాతకము చుట్టుకొనేను. శాప విమోచన
కొరకు తెంచిన శిరమును చేబూని
ముల్లోకములు తిరుగుచుండగ
కాశీ నగరంలో ఆ శిరస్సు పడెను.
ఆ పుణ్య క్షేత్రం బ్రహ్మ కపాలం
అని పిలవబడుతుంది.
నల్లని వాడు కనుక కాల భైరవుడు
అయ్యాడు. శునకమును వాహనము చేసుకుని
శివ భక్తులను కాపాడుచుండును.
*******************************

కాలం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధవి కాళ్ల

కాలాన్ని జయించే శక్తి కావాలి
అని ప్రతి ఒక్కరు పొరాటాతారు..
కాలాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు..
ఏమో చెప్పలేము ఒకప్పుడు ఉన్న కాలంలా  ఇప్పుడు లేదు..
కొత్త కొత్తగా వ్యాధులు వచ్చాయి..
ఆ వ్యాధితో అందరూ దూరం  అయ్యారు.
ఒకప్పుడు కాలంలో అందరూ కలసి మెలిసి ఉంటేవాళ్లు…
కాలం గడిచే కొద్దీ మన జ్ఞాపకాలు  మర్చిపోతాము..
కాలం కొందరికి మంచి ఇస్తుంది..
మరికొందరికి అయితే చెడు ఇస్తుంది…
కాలానికి బాగా తెలుసు  ఏ సమయంలో ఏం ఇవ్వాలో..
కాలాన్ని ఎప్పుడు అర్దం చేసుకోవాలి..
ఆ కాలానికి ఆది దేవుడు కాలభైరవుడు….
ఆయన  మన  ప్రార్థన ఎప్పుడు వింటారు…
కాలానికి మించిన దేవుడు ఎవరు లేరు…
ఆయన వాహనం కుక్క..
ఆ కుక్క కి ఉన్న విశ్వం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను….
మమల్ని కాలం ఎప్పుడు మర్చిపోదు..
*******************************

కాలభైరవా!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖర రావు

ఆధ్యాత్మికంగా,
కాలభైరవుడు ఙ్ఞానానికి ప్రతిరూపం,
కాశీనగర క్షేత్రాధిపతి,
శునకమును వాహనముగా కలవాడు,
కపాలమోచనుడుగా పేరుగాంచాడు!
ఇహ, వాడుకభాషలో,
ప్రపంచంలోకెల్ల అత్యంత విశ్వశనీయమైనది,
ఇంత తిండిపెడితే, జీవితమంతా ప్రేమానురాగాలను చూపుతుంది, శత్రు, చోర
భయంకరుడు, అదిలేకపోతే
ఇంట్లోమనిషిలేనట్లే ఉంటుంది,
అతడే కాలభైరవుడు
*******************************

దర్శనం పాపనాశనం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

దేవరాజ మానస పాప పంకజం
సూత్ర మిందు శేఖర కృపాకరం
యోగిబృంద వందిత దిగంబరం
ఆదిదేవ పరమ శివుని
ప్రతిరూపం కాలభైరవం
అష్ట నామాలతో వెలుగొందు
పరమ శక్తీవంత  అవతారం
శైవ క్షేత్రం లో కాల భైరవ స్వరూపం
దర్శనం పాప నాశనం
స్మరణ తో అపమృత్యు
దోషం దూరం
కాల భైరవ హోమంతో
సకల గ్రహ భాధలు మటుమాయం
భక్తవత్సలం ధర్మసేతు పాలకం
కారుణ్య స్వరూపం
కాశీ క్షేత్ర నివాసం
కాశీనగరం బ్రహ్మ కపాలమోక్షం
నల్లని వస్త్రం అత్యంత ప్రీతికరం
భక్తి ముక్తి దాయకం పరమ పావనం
కాల నిర్ణయం సహెతుకం
జగతికే విశ్వరూప కటాక్షం
*******************************

శివుని అవతారం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెరుకు శైలజ

సాక్షత్ పరమ శివుని అవతారం కాలబైరవుడు
దుష్టగ్రహ బాధలు నివారించ గల శక్తివంతుడు
అన్ని భయాలను నుండి రక్షించేవాడు రక్షదక్షుడు
కాల స్వరూపం తెలిసినవాడు
నిత్యం మనతో వుండేవాడు
నిత్యుడు కాలభైరవుడు
కాశీ క్షేత్ర పాలకుడు
పులి చర్మాన్ని ఎముకల్ని ధరించే వాడు
శునకం వాహనంగా కలిగి వుండేవాడు
కాలమే జగత్ మూలము
ఆ కాలరూపుడే కాలభైరవుడు
ఏది  సాధించాలన్న
ముందు కాలభైరవుని అనుగ్రహం తప్పనిసరి
ఇది కాశీ క్షేత్ర మహిమ చెప్పిన సంగతి
శివుని యొక్క విధేయుడు కాల భైరవుడు
కాల భైరవుడిని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగు
అందుకే  కాలభైరవుని కొలువు
ఎప్పుడు మనకు అండగా నిలుచు
మన జన్మ తరించు

*******************************

సర్వాంతర్యామి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పద్మావతి పి

సత్య-తమో-తేజస్సుల నే సమభావంగా
స్వీకరించిన ఆధ్యాత్మికతకే నిరాకార స్వరూపం..
అవ్యక్తాను వ్యక్త ఆనందానికి స్ఫూర్తి స్వరూపం..
జనన మరణములు సహజములంటూ
స్మశానాన్ని నివాసంగా మలచుకున్న
శక్తి యుతుడు..
త్రిలోకములకు సత్యం శివం సాధనలే సుందర
సాత్వికతలే  లోకకళ్యాణ కారణమని
బోధించినతత్వం
ధర్మానికి మూలం, అష్టదారిద్ర్య వినాశనం
భక్తి ముక్తి దాయకం..
కాలభైరవుని సన్నిధిలో కొలువైన శాసనం
విశ్వసించినచో
అండపిండ బ్రహ్మాండమంతా  నిండిన
విశ్వవ్యాప్తమైన
ఓంకార స్వరూపం
సృష్టి-స్థితి-లయ కారకం
శక్తీ-యుక్తీ కలిసిన అద్వైత సిద్ధాంతం..
*******************************

  శివ స్వరూపమ్
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య గిడ్డి వెంకట రమణ

కాల భైరవుడు
కరుణామయుడు
పాపాల  భక్షకుడు
భక్తుల రక్షకుడు
కాశీ క్షేత్ర పాలకుడు
సిరిసంపదల కారకుడు
భస్మాన్ని ధరించినవాడు
ఆ భయాన్ని ఇచ్చే వాడు
గ్రహ భాదల నివారకుడు
భ వ భాదలు తొలిగించెవాడు
రౌద్ర నేత్రాలు కలవాడు
త్రిశూల  ధారకుడు
శునక వాహనం పై తిరిగేవాడు
పులి  చర్మా న్ని ధరించినవాడు
*******************************

కాలభైరవ స్వరూపం…
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎల్ గంగాధర్

సూర్యచంద్ర అగ్ని నయనాల త్రినేత్రుడు
ఆరోగ్య జీవకళ తేజో గుణాల స్వభావుడు
జగతిన ఆఖరికి మిగిలేది బూడిదనే సత్యాన్ని తెలియజేసే భస్మధరుడు
మానవ అర్థ కాయాన్ని భార్యకు
ఇవ్వాలనే తెలిపే అర్థనారీశ్వరుడు
లోక కల్యాణం కోసం కంఠంలోనే గరళాన్ని దాచుకున్న నీలకంఠుడు
జీవులకు జననమే  మరణమని విహారభూమిగా
మలుచుకున్న శ్మశానవాసుడు …
*******************************

విశ్వాస పాత్రుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

విశ్వాసానికి మారుపేరుగా ఉండి
భక్తి పారవశ్యానికి మారుపేరుగా నిలచుండి
కాశీ మహాక్షేత్రాన్ని నివాసంగా ఎర్పరచుకొనుచుండి
భక్తులకు అభయ హస్తుడుగా ఉండి
గారెల దండతో సంతృప్తి చెందుచుండి
పుణ్యప్రసాదాన్ని జనులకు పంచుచుండు
విశిష్టతకు మారుపేరు ఈ ఆలయ దర్శనం
కన్నీటి జడివానలో తడిసిన జనులకు నీడై  ఉండి
భక్తి పారవశ్యంలో తననకి తాను అండై ఉండి
విశ్వేశ్వరుడికి మారు రూపుగా నిలచి ఉండి
అష్టాదశ పురాణాల్లో కూడా అత్యంత స్థానంలో ఉండి
కాలభైరవాష్టక మహిమా ప్రభావం మిన్నంటి ఉండి
జన్మజన్మల పాప పరిహారం క్షీణిస్తూ ఉండి
జంతువులో భగవంతుడిని చూసే అవకాశం ఉండి
అది తెలియని మూర్ఖులు జంతువులను హింసిస్తు ఉండి
ఒక్కసారి గొంతెత్తి చెప్పాలని ఉంది
మూగ జీవాలు భగవంతుడి స్వరూపాలని
వాటికి ఎన్నడూ హాని తలపెట్టరాదని
ఏ జీవి తపన అయినా పొట్టకూటి కోసమేనని
*******************************

శరణo
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాళ్ళపల్లి నాగమణి

కరములు మోడ్చి, శరణము వెడితి
కావుము నన్ను కాలభైరవా!!
కాలవశమున, మాయలొపడిన
కమలనాభునకు, కమలసంభువునకు
దర్పము  అణచిన కాలభైరవా!!
నీ అద్యాంతములను తెలిసికొనుట
ఎవరికి సాధ్యము దిగంబరా!!
కన్నుతెరిచినది మొదలుగా నే చేసిన కర్మలకు
కారణమే నువ్వని భ్రమసితిరా..
కన్నూ మిన్నుగానక నే చేసిన
కర్మఫలమిదని తెలిసితిరా..
కాలము నువ్వే,కాంతివి నువ్వే
నాదము నువ్వే, వేదము నువ్వే
పాశము నువ్వే, విమోచకుడవు నువ్వే,
నా చిత్తము అటునిటు తిప్పక
నీపైనే నిలిచేట్టు అనుగ్రహించరా హరా.
*******************************

చైతన్యానికి ప్రతీక కాలభైరవుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

సంపత్కారకుడైన శివుని ప్రతిరూపమే కాలభైరవుడు.
నాగులే యజ్ఞోపవీతంగా, కర్ణాభరణాలుగా, పులిచర్మాన్ని ధరించి,
ఎముకలను మెడలో వేసుకుని శునకమే వాహనంగా
ధర్మపరిరక్షణ చేసి ప్రజలను రక్షించు శివరూపమే…..!!
నేపాల్ దేశంలో కాలభైరవ ఆరాధన,
బౌద్ధమతంలో కూడా భైరవ పూజ అనాదిగా వచ్చు సంప్రదాయం.
ఈశ్వరుని అవమానించిన కారణంగా
కాలభైరవుని సృష్టించి బ్రహ్మ శిరస్సులలో ఒకదాని త్రుంచి పట్టుకుని
బ్రహ్మహత్యా పాతకంతో భాధ పడిన కాలభైరవుని చేతిలోని
బ్రహ్మ శిరస్సు పరమపవిత్రమైన కాశీ పుణ్యక్షేత్రంలో పడుటచే బ్రహ్మకపాలంగా పేరుగాంచెను.
కాలభైరవ దర్శనానంతరమే
కాశీ విశ్వేశ్వర దర్శనం మోక్షదాయకమని విశ్వసించెదరు
కష్టాలను కడతేర్చు కాలభైరవాష్టకం….!!
*******************************

భైరవి యాతనతో ముక్తిప్రదాత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పద్మజ

శివుని యొక్క భయంకరమైన కాలరూపం కాలభైరవుడు.
యమధర్మరాజుకే యమునివంటి
కాలభైరవుడు కాశిలో మృత్యువు దరి చేరే ముందు కలిగించే యాతనే  భైరవి యాతన అంటారు.
ఎన్నో జన్మలు మరలపుట్టి తొలగించుకోవలసిన గతజన్మల పాపాలను
కొన్ని క్షణాల తీవ్రమైన యాతనతో దగ్ధం చేసి ముక్తి ఓసగే
ముక్తి ప్రధాత.
శూలము, టంకము, పాశము మరియు దండము అను ఆయుధములు ధరించి
కర్మపాశము తొలంగించి నిత్య సుఖము ఇచ్చే కాశిపుర అధిపతి కాలభైరవుడు.
*******************************

అమర్దకుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

అజ్ఞానాన్ని తొలగించేందుకు
పరిపూర్ణ అవతారమై నిలచి
గ్రహ పీడలు తొలగిస్తూ
భక్తుల గుండెల  ధైర్యం నింపే శక్తివంతుడు..
దుష్టుల నుంచి కాశిని కాపాడే క్షేత్రపాలకుడై
రుద్రుని భృకుటిలోంచి జనించి
శివుని మరో రూపంగా
పూజలందుకొనే కాలభైరవుడు…
ఆయన కార్య ఫలదాత  కరుణిస్తే చాలు
సకల కోరికలూ నెరవేరుస్తూ
ఆయుష్షు పెంచే అమృత కలశమై
విశ్వసనీయతకూ చిహ్నమైన పరమాత్ముడు…
మంత్ర సాధనా అనుమతినిచ్చి
గురు రూపమై అనుగ్రహించే
భైరవుడు ఆరాధనతోటే సకల సిద్ధినిచ్చి
పాపాల తొలగించే అమర్దకుడు  ..!
*******************************

ఓ క్షేత్ర పాలకా 
సిసింద్రీ(ప్రక్రియ రూపకర్త _శ్రీ. N. కార్తిక్)

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: విస్సాప్రగడ పద్మావతి

ఓ కాల భైరవా!

పవిత్ర పాద పద్మములు గల నిరాకారుడు
పావన మూర్తిగా స్తుతింపబడు దిగంబరుడు

ఓ క్షేత్ర పాలకా

కర్మ బంధాలను నశింపజేసి, శుభాలనొసగు నిత్యుడు
క్షేత్ర పాలకుడైన అద్వితీయుడు…

ఓ రుద్రా

బ్రహ్మాండమును అట్టహాసంతో పేల్చే ప్రళయ కారకుడవు
బ్రహ్మాది దేవతల  ప్రణయ రుదృడవు

ఓ ఈశ్వరా

విభూతి రేఖల పుర్రెలదండ ధారీ
వింత తండవంతో  మురిపించి ఆనంద విహారీ

ఓ పరమేశ్వరా

ముక్కంటి మొముతో నల్లని కంఠము గలవాడా
ముక్కోటి దేవతల పూజలను స్వీకరించు వాడా..!
*******************************

బేగ ఎలిపోచ్చి.. శివయ్య!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: (రాజ్) తొర్లపాటి రాజు

శంకరా! శుభంకరా !
ఈశ్వరా! పరమేశ్వరా!
లింగేశ్వరా! భువనేశ్వరా!
భైరవుడా! రుద్రుడా!
ముక్కంటుడా! త్రినేత్రుడా!
కాలకంఠుడా! గరళకంఠుడా!
నిరంజనా! నీలకంఠ!
మహాదేవా! మహాశివా!
ఓ! శివయ‌్యా!
శతాధిక నామధేయ!
ఈ జగితిన …
జరిగేదంతయూ..నీ దయ..నీ లయ..
అని..వింటినయా!
కాని!
ఈడ సూత్తాంటే!
ఏ దయ లేకుండా..లయతప్పి..
విళయతాండవం  సేసే…
లయకారులెందరో….ఉన్నారయా!

ఓ పరమేశ్వరా!

ఈ స్రృష్టంతా…
నువ్వాడే ఆటే…అని ..వింటినయ్యా!
కాని!
ఈడ …
రాజకీయ నాయకులు ఆడే …
ఆట సూడాలంటే …
నీ మూడో కన్ను కూడా…సాలదేమొనయ్యా!
అప్పటికపుడే..
నిన్ను దేవుడని లేంపలేసుకుంటా రు
అడ్డమొస్తే … రాయవని.. లేపేస్తారు!
అబ్బబ్బా!
ఈడ జరిగే పాపాలు సూత్తాంటే!
నాకెందుకో…డౌటు కొడతాంది…శివయ్యా!
ఎక్కువ పాపాలు సేత్తే…
ఇంకా..ఎక్కువ..నిన్ను తలత్తారని!
నువ్వే..సేయిత్తున్నావా ! ఏంది!
లాభం నేదు..భైరవా!
నువు బేగ యెలిపొచ్చి….
నీ..పవరు..సూపిత్తేనే…గాని!
ఇక్కడ పవరున్నోల…పవరులు పోయి
నీ..పంచన…చేరేలానేరు….శివయ్యా…..!
*******************************

శ్రీ కాలభైరవం..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సత్య కామఋషి

కాలమే నీ భోక్తమట..
ఆ కాల నాశనము.,
కర్తవ్యమట..నీ ఆటట.!

నిన్నువు రేపువు కావట,
నేటి ప్రతి ఘడియలోన
కొలువై కదలాడేవట..!

విశ్వాసమే వాహనమట.,
మా గతులను శాసించగ
కాలమే నీ వాహకమట..!

అరుణోజ్వల త్రినేత్ర,
కపాలమాలాధారి..
పూర్ణ దిగంబరవతారి..
ప్రచంఢ ప్రళయ సంచారి.!

భయభీతి నాశనకారీ..
బాధాశోక క్షయంకర శౌరీ..
కాలభైరవం శివస్వరూపం..
దోష హరం సకల శుభకరం
నీ దివ్యమంగళ సాక్షాత్కారం.!
*******************************

శుభంకరుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

పరమేశ్వరుని ఉగ్రరూపం.కృష్ఢపక్ష అష్టమిన అవతరణం
శివుణ్ణి చులకన చేసిన విధాత గర్వభంగంకై సృష్టించబడిన రూపం
బ్రహ్మదేవుని పంచ శిరసు ఖండించాడు.బ్రహ్మహాత్యాపాపకం మూటకట్టుకున్నాడు
ప్రక్షాళనకై బ్రహ్మకపాలం చేబూని క్రేత్రదర్శనాలు చేసాడు
కాశీనగర క్షేత్ర పాలకుడయాడు
సృష్టి ,స్ధితి ,లయ కారకుడు ,శునక వాహనధారుడు
పుర్రె,ఢమరుకం ,శూలం ఖడ్గం చతురహాస్త భూషణుడు
నాగులు చెవిపోగులై,యజ్ఞోపవీతమై,పులిచర్మం అంబరమైన ఉగ్రస్వరూపుడు
భక్తుల పాలిట శుభంకరుడు
కాళం అంటే సమయం,సమయానికి దేవుడు ఇతడు
బుధవారం ఇష్టదినం,గారెలతో మాలధారణం
రోజంతా ఉపవాసం ,జాగరణం ,అర్ధరాత్రి నేతి  దీపారాధనం
కలకండ ,కొబ్బరి బెల్లం నివేదనం
అష్ట భైరవ రూపాల ఆరాధనం సంప్రదాయం
గ్రహబలాలను అధిగమించి,అదృష్ట జీవితాన్ని సంకల్పసిద్ధిని అనుగ్రహించు భైరవారాధనం
దారిద్ర్యం,అనారోగ్యం ,ఋణబాధలు,సమస్యల నిర్వీర్యం జరుగునని విశ్వాసం.
*******************************

ఎంత కాలం నీ ఆట..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వనపర్తి గంగాధర్

ఈ కలికాలపు కలియుగంలో
మనుషుల ప్రతిమలు చేసి నీ ఆటలో
మము పావుల చేసితివి
ఆనందాలను హరించి వేసితివి
ఏమిటీ కాలభైరవా! నీ మాయ…

కల్లోలాలను సృష్టించి కార్యములను
కర్మములను మాపై మోపి
మము బాధలలో బంధీలను చేసి
నీవు చల్లగా జారుకుంటావు
ఏమిటీ కాల భైరవా! నీ మహిమ…

ఎవరిని బాధలో,ఆనందంలో ఉండనివ్వవు
చీకటి వెలుగుల దాగుడు మూతలతో
ఓ కంటిలో పన్నీరు మరో కంటిలో కన్నీరును
కార్చి మమ్మల్ని లోకం నుండి నిష్క్రమింప చేసి
నీవు మాత్రం ఆటలాడుతూనే ఉంటావు జీవులతో
ఏమిటి కాల భైరవా! నీ ఈ జూదము…
*******************************

రౌద్రం-కరుణ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధురి మేక

సృష్టికర్తకే తప్పలేదు
భస్మాసుర హస్తం
కాలభైరవుడు కన్నెరచేస్తే
కాలం ఇక అంతం
ఇదే…శివుని రుద్రస్వరూపం!
కన్న తల్లిలా కరుణ చూపే
కాళేశ్వరుడు
కోరిన వెంటనే వరములిచ్చే
భోళా శంకరుడు
ఇదే…పరమశివుని ప్రేమస్వరూపం!!

*******************************

ఆదీ నీవే అంతం నీవే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేముల ప్రేమలత

జీవితంపై ఆశ కల్పించేదీ నీవే,
అది తీర్చేదీ నీవే
మా జీవితాలను నడిపే శ్వాసవు నీవే
అది ఇచ్చేదీ నీవే
నీపై ధ్యాసను నిలిపేలా చేసేదీ నీవే
ఆదీ నీవే అంతం నీవే శివయ్యా
నీవు ఆడించే ఆటలో బొమ్మలమే గదయ్యా మేము
మారేడు దళాలతో నిన్ను పూజిస్తే
శుభములు నొసగేవట
శివరాత్రి నాడు జాగారం చేసిన కోరిన కోర్కెలు తీర్చేవట
నీ  ఆరాధన,  నీ అభిషేకం అత్యంత పుణ్య ప్రదమట
చుక్క నీటితో అభిషేకానికే కోటి వరాలిచ్చే భోళా శంకరుడివే నీవటా
కళ్ళల్లో మండుచున్న మంటలు
ఒళ్ళంతా పూసుకున్న విభూతి
నాగేంద్ర హారాలు ధరించేవు
తలపై కూర్చున్న గంగమ్మ
తనువులో సగమైన గౌరమ్మ
లోకాన్ని పాలించే నా తండ్రీ!
ఎంత చూసినా తనివి తీరదయ్యా నీ రూపం
మధురాతి మధురం నీ పంచాక్షరీ నామం.
*******************************

ఈశ్వరా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీలత. కె

ఈశ్వరా…
ప్రణవం నీ నామమట
పంచాక్షరి నీ ధ్యానమట
పాములే నీ ఆభరణాలట
విభూతే నీ అలంకరణట
నిన్ను నమ్మిన వారికి
గుండెల్లో జేగంటవట
నిన్ను కొలిచిన వారి హృదయంలో
కొలువుంటావట
నిన్ను భోళాశంకరుడు అంటారట
మరి నా గుండెగుడిలో నీ జేగంట ఎప్పుడు
మోగిస్తావు శంకరా
నా హృదయంలో  ఎలా కొలువుంటావు ఈశ్వరా
నాకు మోక్షాన్ని ఏనాడు ప్రసాదిస్తావు పరమేశ్వరా..
*******************************

జటాధరం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

కాలభైరవ పఠంతియే
మనోహరం జ్ఞానముక్తి
సాధనం పుణ్య వర్దనం
శోక మోహ దైన్యలోభ
కోపతాప నాశనం

భుక్తి ముక్తి దాయకం
ప్రశస్తమైన చారు విగ్రహం
భక్తవత్సలం స్థతం
సమస్త లోక నిగ్రహం

దేవరాజ సేవ్యమాన
పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్ర
మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగి బృంద
వందిత దిగంబరం

శూలటంక పాశ దండ
పాణి మాది కారణం
శ్యామకాయ మాదిదేవ
మక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం
విచిత్ర తాండవ ప్రియం

భానుకోటి భాస్వరం
భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ
దాయకం త్రిలోచనం
కాలకాల మంబుజాక్ష
మక్షశూల మక్షరం

భూతసంఘ నాయకం
విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్య
పాపశోధకం విభుం
నీతిమార్గ కోవిదం
పురాతనం జగత్ర్పభుం

ధర్మసేతు పాలకం త్వ
ధర్మమార్గ నాశకం కర్మ
పాశమోచకం సుశర్మ
దాయకం విభవం స్వ
ర్ణవర్ణ కేశపాశ శోభితాం
గ మండలం

అట్టహాస భిన్న పద్మజా
అండకోశ సంతతిం దృ
ష్టి పాతనష్ట పాతజాల
ముగ్రనాశనం అష్టసిద్ధి
దాయకం కపాలమాలికా
ధరం

రత్న పాదుకా ప్రభాభిరామ
పాదయుగ్మకం నిత్యం మద్వితీయమిష్టదైవతం
నిరంతం మృత్యు దర్ప
నాశనం, కాశికాపురాధి
నాధకాలభైరవం నమామి
*******************************

కాశీ క్షేత్ర పాలకుడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

కాల భైరవుడే శివస్వరూపుడు
దోష నివారణ చేయగల శుభకరుడు
దివ్యమంగళ కర స్వరూపుడు
కాలాన్నే శాసించ గల సమర్ధుడు

సృష్టి లయ కారకుడి ప్రతిస్వరూపుడు
ఉగ్ర నేత్రుడైన భీకర రూపుడు
చతుర హస్త భూషణుడు
కాశీ నగర క్షేత్ర పాలకుడు
సమయ పాలక దేవుడు

గారెలు తో మాలాధారణ చేయువాడు
నేతి దీపారాధన ఇష్ట పడేవాడు
కొబ్బరి బెల్లంను ఇష్టపడేవాడు
జాగరణ కోరేవాడు

కృష్ణ పక్ష అష్టమిన అవతరించిన వాడు
బ్రహ్మ శిరస్సు ఖండించినవాడు
బ్రహ్మకపాలం తో భిక్షాటన
చేసినవాడు

దారిద్ర్యాన్ని ఋణభాదలను పోగొట్టువాడు
అనారోగ్య నివారణ గావించేవాడు
సంకల్పసిద్ధితో పూజిస్తే అనుగ్రహించే వాడు
పరమేశ్వరుని ప్రతిరూపమే ఈ కాలభైరవుడు
*******************************

ఓ శివా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లహరి

అందరి బంధువుడవు
మూడు కన్నుల ముక్కంటివి
నీలకంఠ ధరుడవు
నటరాజ స్వామివి
త్రిశూలధారివి
భక్తుని కొరకు యముడినే కాలితో తన్నినవాడివి
ఇసుక రేణువు నీవే
బ్రహ్మాండము నీవే
ఆత్మ స్వరూపుడవు
తిమిరాన్ని పాలద్రోలే జ్ఞాన జ్యోతివి
గరిటెడు నీళ్లు కుమ్మరించిన
సుఖ సంతోషాలు అనుగ్రహించే అమృత మూర్తివి
శివా అన్న రెండు అక్షరాలు పలికినంతనే
మా పంచ ప్రాణాలు కాపాడే వాడివి
ఒక్కసారి మా ఇంటికి రా శివయ్యా
మాకు సద్భుద్దిని,
శుభములనొసగవయ్యా
హర హర మహాదేవ శంభో శంకర..
*******************************

బ్రహ్మ కపాలదార
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొత్త ప్రియాంక(భానుప్రియ)

ప్రణవిల్లే పంచభూతాలే ఓ పరమేశ్వర నీ కోపాగ్నికి…
నీ పరిపూర్ణ అంశయై  భయంకార రూపమై అలరాడే కాలభైరవ….
బ్రహ్మ అహంకారాన్ని అంతమొందించేందుకు ఈశ్వరుడు సృష్టించిన అవతారమే నీవని….
కాలాన్నే శాసించగల శక్తి రూపమై
కొలిచితిరి…
దిగంబర అవతారమై కాశీ క్షేత్ర పాలకుడువై రక్షకుడువై నిలిచితివి….
నిత్యం నిను కొలుచు వారికి గ్రహదోషములు,దుష్టశక్తులనుంచి  విముక్తి కలుగునని భక్తులు విశ్వసించే….
ఎర్రటి పువ్వులు అలంకరణ ప్రీతి దాయకమై అష్ట భైరవులు గా ఆవిర్భావం చెందితివి…
బ్రహ్మకపాలం తో 12 సంవత్సరాల పాటు భిక్షాటనతో సంచరించితివి…
*******************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!