మనసు ప్రభావం

మనసు ప్రభావం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

“ఏరా సత్యం మొన్న మీ బాబు బర్త్ డే కి సుధీర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చినట్టున్నారు” అన్నాడు నరేష్. అవును మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళు తప్పకుండ వస్తారు. వాళ్లు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంతే కాకుండా మా నాన్న, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్” అన్నాడు సత్యం.
“మరి సుధీర్ వాళ్ళ చెల్లి దివ్యను చూస్తే నీకు ఏమీ బాధ అనిపించదా” అన్నాడు నరేష్. “ఎందుకు” అన్నాడు సత్యం. “నాకేం తెలియదనుకోకు. నీవు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామని ఒకప్పుడు అనుకున్నారు కదా. ఏవో కారణాల వల్ల చేసుకోలేదని నాకు తెలిసింది” అన్ళాడు నరేశ్.
“దీంట్లో తెలియడానికి ఏముంది. మా ఫ్యామిలీస్ తరచుగా కలవడం వల్ల ఆ అమ్మాయి గుణగణాలు, నడవడిక నచ్చి నాకు ఇష్టం ఏర్పడింది. ఆ అమ్మాయికి కూడా నేనంటే ఇష్టమే. యుక్త వయసులో ఉన్న వాళ్లకు ఇదంతా సహజమే కదా. అలాగే మేము కూడా. అందుకే మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. ఈ విషయమే దివ్య, నేను సుధీర్ ని వాళ్ళింట్లో ఇంట్లో చెప్పమని బ్రతిమిలాడాము. ఎలాగైనా వాళ్ళింట్లో చెప్పి ఒప్పిస్తే, వాళ్ళు ఒప్పుకుంటే నేను మా నాన్న వాళ్లకు చెప్పి ఒప్పిస్తానని సుధీర్ తో అన్నాను. సుధీర్ మమ్మల్నిద్దరిని కూర్చుండబెట్టి “సత్యం, నీవు నాకు ప్రాణ స్నేహితుడివి. నీవంటే నాకు చాలా ఇష్టం. నీకు మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తే అది చాలా సుఖ పడుతుందని నాకు తెలుసు. కానీ మీ పెళ్ళికి మీ వాళ్లు గాని, మా వాళ్ళు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఎందుకంటే మన ఫ్యామిలీస్ ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, ఇంకా ఛాందస భావాలు పోలేదు. మీ సమాజం వేరు, మా సమాజం వేరు, మీ ఆచార వ్యవహారాలు, మీ ఆహారపు అలవాట్లు అన్ని వేరుగా ఉంటాయి. ఫ్రెండ్షిప్ వరకు ఓకే కానీ పెండ్లికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు” అన్నాడు.
“ఎందుకలా అనుకుంటున్నావు” అన్నాడు సత్యం.
“మా నాన్నకు ఇద్దరు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. మా పెద్దత్తకు తాతగారు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. ఆమె ఇప్పుడు సుఖంగా ఉంటుంది. మా ఇంటికి ప్రతి పండుగకు వస్తుంది. చిన్న మేనత్త అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో ప్రేమ. చాలా అల్లారుముద్దుగా పెంచారు. ఆమె తన క్లాస్మేట్ ని ప్రేమించింది. ఈ విషయం తెలిసి మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. చివరికి ఇంట్లో చెప్పకుండా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా ఇంట్లో ఆమె పేరు కూడ ఎవ్వరు తలవరు. మా ఇంట్లో శుభకార్యాలకు గాని, పండుగలకు గాని ఆమెను, ఆమె భర్తను ఎప్పుడు పిలవరు.వాళ్ళింటికి ఎవ్వరూ వెళ్లరు. బంధువుల ఇళ్ళల్లో కూడా శుభకార్యాలకు పిలవరు. ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా మా ఇంట్లో వాళ్ళకు ఆమె పై కోపం పోలేదు. వాళ్ళ పిల్లలను కూడా ఇప్పటి వరకు చూడలేదు. కనుక  మీ పెళ్ళికి మా ఇంట్లో వాళ్ళు కాని, మీ ఇంట్లో వాళ్ళు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. మీరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేము, బ్రతకలేము అనుకుంటే ఎటైన వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి. కానీ మీకు మీ వాళ్ళ తరఫునుండి కానీ మా తరఫునుండి కానీ రాకపోకలు గాని, సపోర్ట్ గాని, ప్రేమలు కానీ ఏవీ ఉండవు. మీకే కాకుండా మీ పిల్లలకు కూడా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల  ప్రేమలు ఆప్యాయతలు అస్సలు ఉండవు. ఇంకా మన రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న స్నేహం కూడా తెగిపోతుంది. అలా ఒంటరిగా ఉంటూ ఎవరితో సంబంధం లేకుండా, బంధుమిత్రులతో తల్లిదండ్రుల తో సంబంధం లేకుండా మేము సంతోషంగా బ్రతకుతాము అనుకుంటే మీ ఇష్టం. ఇంక మీరు అనుకోవచ్చు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడి వాళ్ళని చేసుకోవడం లేదా అని. కానీ వాళ్ల జీవితాలు వేరు, మన జీవితాలు వేరు. వాళ్లు రెండు మూడేళ్లకు ఒకసారి వస్తారు. ఆ నెల రోజులు ఎలాగో గడుపుతారు. లేదంటే వాళ్ళని రెండు మూడేళ్ళకు చూసే అవకాశం కూడ ఉండదు.
ఇక్కడ కూడా చాలా కుటుంబాలు ఈ ప్రేమ పెళ్ళిళ్ళను ఇప్పుడిప్పుడు ఒప్పుకుంటున్నాయేమో.  కానీ మా ఫ్యామిలీ మాత్రం మారుతుందనుకోను. ఇక నిర్ణయం మీ చేతిలోనె ఉంది. మీ ఇష్టం” అన్నాడు సుధీర్. ఆ తర్వాత నేను దివ్య బాగా ఆలోచించాము. మేము మా సుఖము కొరకు కన్నవాళ్ళ ప్రేమను వదులుకొని బంధువుల పలకరింపులు వదులుకుంటామేమో. కానీ పుట్టబోయే పిల్లలకు ఆ ప్రేమలు దూరం చేసి ఏకాకులను చేయడానికి మాకు హక్కు లేదు. పలకరించే వాళ్ళు ఎవరు లేకుండా ఉండడం చాల కష్టం. అందుకని మేము ఇద్దరం బాగ ఆలోచించు కొని మా నిర్ణయం మార్చుకున్నాము. మా పెద్దలు చూసి నిర్ణయించిన జీవిత భాగస్వాములను చేసుకున్నాము. ఇప్పుడు మేమిద్దరం మునుపటిలా ఫ్రెండ్స్ అంతే. ఇది మా కుటుంబాలు కూడా ఫ్రెండ్లీ గా ఉంటాయి. అసలు అప్పుడు మేము పెళ్లి చేసుకుందామని అనుకున్నామన్న సంగతి కూడ  మేము ఎప్పుడో మర్చిపోయాము. మా మనసులో ఇప్పుడు ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు కలిసిన ఏ భావాలుగాని, వికారాలు కాని ఉండవు. మన మనసులను కంట్రోల్ చేసుకో గలుగుతే జీవితమంతా సంతోషం. మన మనసులని బట్టి మన సుఖసంతోషాలు ఉంటాయి. మన కొరకు స్వార్థంతో ప్రవర్తిస్తే మనకే కాకుండా మన వాళ్ళకి కూడా బాధలు. ఇప్పుడు నా భార్యే నా సర్వస్వం. నా పిల్లలే నాకు లోకం. నా ప్రేమ సంగతి నీవు జ్ఞాపకం చేస్తే గాని నాకు జ్ఞాపకం రాలేదు” అన్నాడు సత్యం. “ఇన్నేళ్ళ తర్వాత కలిశాము. నీ విషయాలేమి తెలియలేదు. పెళ్ళికి కూడ పిలువలేదు”అన్ళాడు మళ్ళీ సత్యం. “నాది పెద్ద కథలే. నీకు తెలుసు కదా మా అన్నయ్య తన ఆఫీసులో పనిచేసే నార్త్ఇండియన్ అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మానాన్న మొదట్లో చాలా గొడవ చేశారు. కానీ తర్వాత మా వదిన ప్రవర్తన చూసి వాళ్లే మారిపోయారు. మా ఇంటికి వచ్చిన మా వదిన మా పద్ధతులు నేర్చుకుని మాలో ఒకరిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె నార్త్ ఇండియన్ అంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు మా ఇంట్లో ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా పనులు జరగవు. మా అమ్మ నాన్న ఆమెను ఎంతో గౌరవంగా చూస్తారు. అదే నమ్మకంతో నేను ఒక కలకత్తా అమ్మాయి బాగా నచ్చి, మా అమ్మ వాళ్ళ అనుమతితోనే పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ అమ్మాయి మా ఇంట్లో పద్ధతులకు అనుగుణంగా ఉండలేకపోయింది. ఆమె ఆహార పద్ధతులు పూర్తిగా వేరు. అందుకని మా ఇంట్లో చేసిన ఆహారం ఏది నచ్చేది కాదు. ఆమె చేసింది మా వాళ్లకు నచ్చేది కాదు. అందుకే మా వాళ్ళు వేరు కాపురం పెట్టించారు. అయినా ఆమె నీటి నుంచి బయటపడ్డ చేపలా గిలగిల్లాడేది. ఆమె ఇక్కడ ఉండ లేకపోతే పోతుంది. నాకు మా కుటుంబంతో అటాచ్మెంట్ ఎక్కువే. అయినా నేనే వాళ్ళ ఊరికి వెళ్ళాను. కాని నేను అక్కడ ఉండలేక పోయాను. అందుకే ఇద్దరికీ కుదరదని ఒక నమ్మకానికి వచ్చేసి, బాగా ఆలోచించి విడాకులకు అప్లై చేశాం. ఇది నా కథ. మనం అనుకుంటాం కానీ మనపై మనసు ప్రభావం చాలానే ఉంటుంది. కొందరు ఈజీగా పరిస్థితులకనుగుణంగా మనసు మార్చుకుని జీవితాన్ని సుఖంగా గడప గలుగుతారు. కొందరు ఎన్ని రోజులైనా వారి మనసులు మార్చుకోవడానికి వీలు కాక జీవితాన్ని నరకం చేసుకుంటారు. నీవు బాగా ఆలోచించి నీ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నావు. చాలా మంచి పని చేశావని అనుకుంటున్నాను” అన్నాడు నరేష్. నరేశ్ మాటలకు సత్యం చాల ఆనందించాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!