చంటిగాడి చొక్కా

చంటిగాడి చొక్కా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

“సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. ఐదేళ్ల చంటిగాడు చాలా హుషారుగా ఉన్నాడు.” ‘ఏడాదికోసారి వాడికి, అన్నయ్యకి ఒకే తానులో ముక్క కొని కొత్త బట్టలు కుట్టిస్తారు అదీ సంగతి’.
ఆ ఊరికి వీరన్న ఒక్కడే దర్జీ. వీడికి నాలుగు రోజుల నుంచీ వీరన్న అరుగు మీదే పగలంతా ఆట పాట, తిండీ, నిద్రా, తన బట్టలు ఎప్పుడు ఇస్తాడా అని. ఆ రోజు చంటి గాడి నిక్కరు కుట్టి ఇచ్చి, చొక్కా రేపు ఇస్తాను అని చెప్పి పంపాడు వీరన్న.
‘చంటి గాడు ఎంతో మురిసిపోతూ ఇంటికి వెళ్ళి వేసుకుని అమ్మ, అన్నయ్య, నాన్నకి పదే పదే చూపించి రాత్రి తల కింద పెట్టుకుని పడుకున్నాడు’. మరునాడు ఉదయమే మళ్లీ చొక్కా కోసం వీరన్న అరుగు మీదకి చేరాడు. రాత్రికి చొక్కా కుట్టి ఇచ్చాడు. తీరా ఇంటికి వెళ్లి చూస్తే అది వాడి అన్నయ్యది. బిక్క మొహం వేసుకుని ఏడుస్తుంటే అమ్మ ఊరుకో పెట్టి పడుకో పెట్టింది. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసి, వీరన్న అరుగు చేరాడు. అయ్యో, అన్నయ్యదా! పోన్లే ఇక్కడే కూర్చో అని అప్పటి కప్పుడు వీడి చొక్కా కుట్టి ఇచ్చాడు వీరన్న”. ఇక చంటిగాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతలో పండుగ రావడం కొత్త బట్టలు వేసుకుని అన్నయ్య తో బాటు ఊరంతా షికారు తిరగడం అయ్యాకా అప్పుడు ప్రశాంతంగా పడుకున్నాడు చంటి గాడు. అన్నదమ్ముల ఆనందం చూసి అమ్మా నాన్నా ఆనందంతో వాళ్ళకి కొత్త బట్టలు లేవనే సంగతే మరచిపోయారు.

You May Also Like

5 thoughts on “చంటిగాడి చొక్కా

  1. చిన్ననాట ముచ్చటలు…అలనాటి ఆనందాలు …చిన్ని చిన్ని సంతోషాలు….ఆ రోజులు….ఎప్పటికి మరువలేము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!