మా ఊరి సర్పంచ్

మా ఊరి సర్పంచ్

రచన::లోడె రాములు

“ఒరే… ఎవడ్రా ఈ ఊరి సర్పంచ్..? ఊరి శివాలయం ముందున్న రచ్చబండ దగ్గర తోక తెగిన పులిలా నిప్పులు కక్కుతూ..
రంకెలు వేస్తున్న తాలూకా తహసీల్దార్.. అతనితో పాటు అధికార సిబ్బంది..
వీళ్ల హడావిడికి ఊరి జనమంతా గుమ్మికూడారు.. ఏమిటో..ఏమి జరుగుతుందో అని అమాయకంగా తమ తమ మనసుల్లో భయపడుతున్నారు..
ఇంతలో ఊరి కావలి నర్సింహను పిలిచి
“ఒరేయ్..మీ సర్పంచ్ గాన్ని పిల్చు కొని రా..రా” అని పురమాయించిండు..సరే దొరా అని నర్సింహ పరుగెత్తాడు..
ఓ అరగంటలో సర్పంచ్ గుర్రం పై స్వారి తో వచ్చాడు..
ఇక్కడకు వచ్చింది,ఎవరో..ఏమిటో, ఇంత జనం ఎందుకు గుమ్మికూడారో..ఏమి అర్ధం కాలేదు..ముందుగా జనం తో
“ఏమి జరిగింది..?ఎవ్వరికే మైనా ప్రమాదం జరిగిందా..? ఎవ్వరైనా దెబ్బలాడారా?” అని ఆతృతగా గుర్రం పై నుండి దిగి అడిగాడు..
తహసీల్దార్ కు కోపం చిర్రెత్తింది..
“ఏయ్..ముందు ఇక్కడ్రా..నా ముందే నక్ర్రాల్ జేస్తున్నావ్.రా!.”
అప్పటి వరకు విషయం అర్ధం కాలేదు..నన్ను నా ఊర్లో అమర్యాదగా మాట్లాడేది..అసలు వీడెవ్వడు అని వెను తిరిగి “ఎవడ్రా నువ్వూ నన్ను రా…అంటున్నావు” అని కోపంగా చూశాడు..
ఊర్లోని మిగతా పెద్దలు కల్గించుకొని ఇద్దర్ని శాంత పరచారు..విషయం చాలా చిన్నది..తహసీల్దార్ గా ఊరిని తనిఖీ నిమిత్తం అతనొచ్చాడు. అతనొస్తున్నాడని ముందే తెలుసుకొని ఊరి ఉపసర్పంచ్ అతన్ని కల్సి నక్క వినయాలతో, అతి మర్యాదలతో అతన్ని మంచి చేసుకొని..సర్పంచ్ మీద లేని పోని చాడీలు,నిందలు నూరి పోశాడు..గుంటకాడి నక్క లాగా ఎప్పుడు, నేను సర్పంచ్ అవుతానా..,(నేరుగా కావడానికి అంత మంచి పేరు లేదు.) అని ,ఇలా ఉసిగొల్పాడు..
గౌరవం దెబ్బతిన్న సర్పంచ్ ” నాకు ఈ సర్పంచ్ పదవి వద్దు.. ఎప్పుడైనా..ఇలాగే ఎవరో ఒకరు వచ్చి ,జనం ముందు ఎదో ఒకటి అంటారు.. నేను ఎవరితో మాట పడను..నాకు అవసరం లేదు..నా రాజీనామ ను తీసుకో “అని ఖరాఖండిగా చెప్పాడు..ఎవ్వరెంత సర్దిచెప్పినా, వినకుండా ,రాజీనామా ను ఇచ్చి గుర్రంపై స్వారీ చేస్తూ ,వేగంగా వెళ్ళిపోయాడు….

** ** **

అవి రజాకార్లు ఊర్లమీద పడి నానా బీభత్సవాలను సృష్టిస్తూ.. అమాయక ప్రజలను చిత్రహింసలు పెడుతూ,మహిళలపై అరాచకాలు చేస్తూ..దోపిడీలు,దౌర్జన్యాలు..
ఎదురుతిరిగితే కాల్చివేతలు..
మా ఊర్లో అంత పెద్దగా సంఘటనలు జరగపోయినా.. చుట్టుపక్కల జరుగుతున్న అకృత్యాలకు ప్రజల్లో ఎప్పుడూ భయానక వాతావరణం ఉండేది..
కమ్యూనిస్టుల సానుభూతి పరులను అప్పుడప్పుడు తీసుకెళ్లి దెబ్బలు కొట్టడం..బెదిరించడం జరిగేది..జనంలో రజాకార్ల మీద కసి,కోపం పీకల దాకా ఉండేది ,కానీ
సాహసించి ముందు నడిచే నాయకులెవ్వరూ..లేరు.. అడపాదడపా ఊర్లోని కమ్యూనిస్టు సానుభూతి పరుల తో కల్సి ఆరుట్ల రామచంద్రారెడ్డి,
రావినారాయణరెడ్డి గార్ల రహస్య సమావేశాల కు,రాత్రికి రాత్రి వెళ్లి జండాలు నాటడంలాంటి కార్యక్రమాలకు వెళ్ళేవాళ్లు..ఊర్లో వీరికి నాయకత్వం మా ఊరి మొదటి సర్పంచ్ (రాజీనామా చేసిన) వహించేవారు..ఆయన్నే అందరూ ప్రేమగా, ఊళ్లే మల్లయ్య అని పిలిచేవారు.(భీమిడి మల్లాజీ) ఆరోజుల్లో తానొక భూస్వామి ,కానీ ఆయనలో ఆ ఛాయలే లేవు.. అందరితో కలిసిపోవడం,లేదనక సాయంచేయడం,ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడం..అందుకే ఊరి జనానికి ఆయనంటే అభిమానం..గౌరవం..
ఆ గౌరవం డెబ్భై ఏళ్ళు పైబడి గడిచినా ,ఇప్పటికి సర్పంచ్ అంటే మా మొదటి సర్పంచ్ ఊళ్లే మల్లయ్య నే అని,ఆయన పదవి కోసం పాకులాడకుండా తృణప్రాయంగా చీ…కొట్టాడని పై సంఘటన ను కథలు కథలుగాచెప్పుకుంటారు.. నిజాం లొంగిపోయిన పిమ్మట , పంచాయతీ ఎన్నికలు మొదటి సారి నిర్వహించి నప్పుడు. అప్పట్లో ఊర్లోని కొంతమంది పెద్దలు కూర్చొని మన ఊరికి సేవ జేసేటోన్ని,మంచోన్ని ఏరి కోరి సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా కట్టబెట్టేవారు..రాను రాను అది ఏవిదంగా మారిందో..ఇప్పుడు అందరికి తెలుసు..
అలా..ఏకగ్రీవంగా వరించిందే మా ఊరి ఊళ్లే మల్లాజీ కి సర్పంచ్ పదవి. తాను మృదు స్వభావి..చీమకు కూడా హాని తలపెట్టని గుణం తనది..ఎవ్వరిమీదా అధికారం చేలాయించడం ఇష్టంలేదు..కానీ తనతో పాటు ఉన్న కార్యవర్గం ఆయనకు సహకరించక పోగా , కొత్తకొత్తగా వచ్చిన పెద్దరికాన్ని , గూడిపుటాన్ని కట్టి పదవిని లాక్కున్నారు.. ఏమి జరిగినా నిప్పులాంటి మనిషికి మంచే జరిగింది..ఆనాటి పదవి త్యాగమే ఈనాటికీ ప్రజల నోళ్ళలో ఆయన ఉన్నారు..ఊళ్లే మల్లాజీ గా

ఇన్నేళ్ళుగా ఎందరో సర్పంచ్ పదవులను చేశారు..కానీ ప్రజల నోళ్లలో ఉన్నోళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు… ఊరి కెళ్లినప్పుడల్లా అప్పటి కొద్దీ మంది పెద్దలు ఊరి సుద్దులు మాట్లాడుతుంటే తప్పకుండా ఊళ్లే మల్లాజీ ని యాది చేసుకోకుండా ముచ్చట వొడవదు .
ఎప్పటికైనా మంచి మంచే కదా…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!