మార్పు

మార్పు 

రచన::తిరుపతి కృష్ణవేణి

మంచితనం మానవత్వం ముఖంలో చిరునవ్వు, వుట్టిపడేలా కనిపించే రామయ్య మాస్టారు ఉదయాన్నే వరండాలో పడక కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తూన్నారు. ఉన్నట్టుండి ఏదో దీర్గాలోచనలో పడ్డారు.
పేపర్లో ఏం చూసారోఏమో,? కొంత కాలం క్రితం జరిగిన సంఘటన తన మనసులో మెదిలినట్లుంది.
తరచు ఆ వీధిలోకి ఒక యాచకుడు వస్తుండే వాడు. రోజు రామయ్య మాస్టారి ఇంటి ముందు నిలబడి ధర్మం చెయ్యండి అమ్మా!అని అరుస్తూ వుండేవాడు.
మాస్టారు జాలి దయా, ధర్మ గుణం కలిగిన వ్యక్తి.
ఆయన మనస్తత్వము గురించి తరచూ వచ్చే యాచకులకు బాగా తెలుసు, ఎందుకంటే,ఎవరిని ఉత్త చేతులతో పంపరు గనుక.
రామయ్య మాస్టారు భార్య రాధమ్మ స్వతహాగా మంచి మనిషే! కానీ, ఆయనకు భిన్నమైన మనస్తత్వం రాధమ్మ గారిది.
యాచించే వారికి కొన్ని అర్హతలు ఉండాలి అని ఆమె ఉద్దేశం!
అలా ఇంటి ముందు నిలబడి ధర్మం చెయ్యండి, అని అరుస్తున్న ఆ బిక్షగాన్ని చూసి ఇంటి పనిలో నిమగ్నమై ఉన్న రాధమ్మ కోపంతో, నీకు వేళాపాళా లేదా, ఉదయాన్నే తగలడతావ్? ఏమిటి నీ గోల? ప్రతీ రోజు వస్తూనే ఉంటావ్,? చూడడానికి దుక్కలా ఉన్నావు? వెధవ సంత,వెధవ సంత,అని గొణుగుతూ ఇలా సోమరిపొతులా తయారవక పోతే,ఏదైన పని చేసుకొని
బ్రతక రాదు,?అన్ని బాగానే ఉన్నాయి కదా?ఏమైనా కాలోంకరా? చేయోంకరా? లేక కళ్ళు లేని ముసలి వాడివా? యువకుడవే కదా! అని తిడుతూ బిక్షం వేసి తన పని లో నిమగ్నమైంది రాధమ్మ.
ఇంతలో బయట నుండి వస్తున్న రామయ్య గారు రాధమ్మ ఎవరి మీదో అరుస్తుంది? బిపి, కాస్త ఎక్కువ అయ్యింది అనుకుంటా! అని మనసులో అనుకుంటూ, ఆమె బీపీ కి కారణం గుమ్మంలో నిలబడి వున్న యాచకుడే అరుపులే, అనుకొని, ఏమయ్యా !నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కష్టపడి ఏదయినా పని చేసుకొని బతక రాదు!
ఇలా ఇంటింటికీ తిరిగి చివాట్లు తింటూ.,? అడుక్కోవటం
సిగ్గుగా లేదా? యువకుడవే గదా, వేరే ఎదైన పని చేసుకొని కష్ట పడి బ్రతకొచ్చుగా ! సోమరి పోతులా తిరగటం మానేసి,ప్రయత్నం చేస్తే ఏదయినా పని దొరుకుతుంది.
సమాజంలో గౌరవంగా ఉండొచ్చు అని సున్నితంగా మందలించి పంపారు రామయ్య మాస్టారు.
ఇంట్లోకి వచ్చిన రామయ్యా మాస్టారు రాధమ్మ ఇంకా గొణుగుతూ వుండటం విని, చూడు రాధమ్మా,మనకున్న దానిలో కాస్త ధర్మం చేస్తే పోయేది ఏమి లేదు! వూరికే బిపి పెంచుకోక కాస్త ప్రశాంతంగా ఉండు.
నువ్వు చేసిన పుణ్యం వూరికే పోదులే! కష్ట కాలంలో వున్నప్పుడు మనకు ఎవరయినా సహాయం చేస్తారులే! అని సర్ది చెప్పారు.
మీరు ఎన్నయినా చెప్పండి,ఇలా మనం దాన ధర్మాలు చేసుకుంటూ పోతే మన పరిస్థితి ఏమిటి?రోజు రోజుకు బిక్షగాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది తప్ప వాళ్ళు బాగు పడతారా ఏంటి?,చెప్పండి?
అన్నది రాధమ్మ.
ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ యువకుడు అడుక్కొంటూ మళ్ళీఆ వీధిలో కనిపించలేదు.
ఈరోజు పేపర్లో వార్త చూస్తుంటే ఎందుకో వాడే గుర్తుకు వచ్చాడు రామయ్య గారికి, నిన్నరాత్రి రోడ్డు పక్కన చెట్ల కింద నిద్రిస్తున్న వారిపై ప్రమాదవశాత్తూ ఒక లారీ దూసుకు పోవటంతో నలుగురు యువకులు చనిపోయారు వారిని, యాచకులుగా గుర్తించారు, అనే వార్త చూచి నప్పటినుండి పదే పదే మాస్టారి మనసులో వాడే మెదులు తున్నాడు.ఎందుకంటే వాడు అనాథ,వాడి నివాసం రోడ్ల ప్రక్కన చెట్ల క్రిందే నని రామయ్యగారికి తెలుసు.
ఆ నలుగురి యువకుల్లో వాడు గానీ లేడు కదా అని మనస్సులో ఏదో తెలియని ఆందోళన?అంతలోనే వాడు అయి ఉండడులే! ఎక్కడో బాగానే వుండి ఉంటాడులే?అని మనసును తమాయించు కుంటూ, పరి పరి
విధాలుగా ఆలోచిస్తున్న రామయ్యాగారిని,
ఏమండీ! టిఫిన్ చేద్దురు లేవండి!అన్న రాధమ్మ పిలుపుతో ఆలోచనల నుంచి బయట కొచ్చారు.
టిఫిన్ చేయటం పూర్తి అయిన తర్వాత, ఏమోయ్, నేను అలా బయటకి వెళ్లి, పండ్లు టేబ్లేట్స్ తీసుకొని వస్తాను అన్నారు.
త్వరగా వచ్చేయండి అంటూ,వంట పని లో నిమగ్నమైంది రాధమ్మ.
సమయం ఒంటి గంట కావస్తుంది,వంటంతా పూర్తి అయిన రాధమ్మ ఈయన ఇంకా రాలేదేమిటి అని అటు ఇటూ తిరుగుతూ ఆందోళనగా ఎదురు చూస్తూంది. బజారులో ఎవరయినా కలిసారేమో? ఫోన్ కూడా స్వచ్ ఆఫ్ అని వస్తుంది,వూరికే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు కానీ కాసేపు చార్జింగ్ పెట్టుకోవాలని ఆలోచన కూడా వుండదు, ఈయనకి. ఎందుకింత ఆలస్యం అయ్యింది,? అసలే బయట ఎండ తీవ్రత అధికంగా ఉంది!ఏమైనా నీరసంగా ఉండి ఎక్కడైనా కూర్చున్నారా?
ఎలా తెలుస్తుంది? అసలు ఇంత సేపు బజారులో వుండరే!ఎవరైనా పరిచయస్థులు కలిసారా?లేక ఎవరయినా స్నేహితుల ఇంటికి వెళ్ళారా?
రాధమ్మకి అంతా అయోమయంగా,ఆందోళనగా ఉంది. టైమ్ గడిచేకొద్దీ ఆదుర్దా ఎక్కువ అవుతూంది.!
చూసే కొద్దీ రాధమ్మ గారికి బిపి పెరుగుతుంది,ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదని పనమ్మాయిని వెంట పెట్టుకొని రామయ్యా మాస్టారు ఆచూకీ కొరకు బయలు దేరింది. ఇంతలో ఓ యువకుడు బైకు మీద రాధమ్మ గారి ఇంటి వైపు వస్తూ,మేడమ్ మీగురించే వస్తున్నాను. మిమ్ముల్ని తీసుక రమ్మన్నారు,రండి నెమ్మదిగా బైకు పై కూర్చోండి అన్నాడు ఆ అబ్బయి. ఏమైంది బాబు?మాస్టారు ఎక్కడున్నారు? ఆయనకు ఏమైంది బాబు అంటూ ఆదుర్దాగా అడిగింది రాధమ్మ బండి పై కూర్చుంటూ.అక్కడికే వెళ్తున్నాం మేడమ్.
రాధమ్మ గుండె వేగంగా కొట్టుకుంటూంది
ఇంతలో బైకు హాస్పటల్ ముందు ఆగింది. రాధమ్మ గబగబా దిగి హాస్పిటల్ లోకి పరుగు పరుగున వెళ్ళింది. ఒక గది ముందు చాలా మంది జనం నిలబడి గుంపుగా ఉన్నారు. మాస్టారికి ఏదో జరిగి ఉంటుంది అని ఏడ్చుకుంటూ ఆందోళనగా ఆ గదిలోకి వెళ్ళింది. రామయ్య మాస్టారు బెడ్ పై స్ప్రహ లేకుండా పడుకొని ఉన్నారు. ఏడుపు స్వరంతో మాష్టారుకు ఏం జరిగింది బాబు అని డాక్టర్ గారిని అడిగింది.
ఆమె ఆదుర్ధా
గమనించిన డాక్టర్ గారు ఏం లేదు అమ్మా , భయపడకండి, మాస్టారుకు బీపీ ఎక్కువై కళ్లు తిరిగి పడిపోయారు. ప్రమాదం ఏమి లేదులెండి కాసేపట్లో లేస్తారు. కొద్దిసేపు కూర్చోండి అన్నారు డాక్టర్. ఆయనను ఎక్కువగా తిరగనీయకండి అమ్మ ఆయనకి రెస్ట్ చాల అవసరం అన్నారు డాక్టర్. .సకాలంలో ఆయన్ని తీసుకుని రాక పోతే చాలా ప్రమాదం జరిగేదే,!ఆ అబ్బాయి ఎవరో గానీ టైమ్ కి హాస్పటల్ కి తీసుక వచ్చి ప్రమాదం తప్పించాడు,అని బయట కూర్చుని వున్న యువకున్ని చూపించారు డాక్టర్ గారు.
బాబు నీవేవరో గానీ నీకు చాలా కృతజ్ఞతలు, ఆ యువకునికి చేతులెత్తి నమస్కరించిది రాధమ్మ.
అయ్యో పెద్ద వారు మీరు నమస్కరించడం ఏమిటిఅమ్మా!
అయ్యగారు మా పండ్ల దుకాణం ముందు పడి పోవటం చూసి, వెంటనే దగ్గరలో వున్న ఈ హాస్పటల్ కి తీసుకొచ్చాను. ఎదో నాకు తోసిన సహాయం చేసాను అని ఆ యువకుడు తిరిగి చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసాడు.
ఇంతలో రామయ్య మాస్టారు మెలుకువ లోకి వచ్చారు. డాక్టర్ గారు మరో సారి ఆయన్ని పరీక్షించి కొన్ని మందులు రాసి తగు జాగ్రత్తలు చెప్పిఇక ఇంటికి తీసుకుని వెళ్ళండి అమ్మా అన్నారు. డాక్టర్ గార్కి కృతఙ్ఞతలు చెప్పి ఆటోలో రామయ్యా,రాధమ్మ లు ఇంటికి చేరుకున్నారు. వారితో పాటుగా ఆ యువకుడు కూడా ఇంటివరకు వచ్చాడు. మాష్టారి సామానుల సంచి లోపల పెట్టి ఇక వెళ్లోస్తాను అయ్యగారు అన్నాడు ఆ యువకుడు.
రామయ్యా మాస్టారు ఆ యువకుడిని దగ్గరకు రమ్మని సైగ చేసి, భుజం తడుతూ చాలా పెద్ద సహాయం చేసావురా బాబు,సకాలంలో నీవు హాస్పటల్ కి చేర్చక పోతే ఈ రోజు ఇలా ప్రాణాలతో బయట పడే వాడిని కాదు.
నీ మేలు ఈ జన్మలో మరువ లేమురా అన్నారు, కళ్ళలోఉబికి వస్తున్న నీళ్లు తుడుచు కుంటూ!!
రాధమ్మ ఆ యువకుడి వంక కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ, ఇంతకీ ఈ అబ్బాయి ఎవరండీ సమయానికి దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు అని అడిగింది.
ఓహో! చెప్పటం మరచాను, కొంత కాలం క్రితం ప్రతి రోజు మన ఇంటి ముందు నిలబడి నీ చేత తిట్లు తింటూ నీకు
బి. పీ తెప్పించి వెళ్ళే వాడే?వాడే వీడు! అవును అమ్మ గారు జీవిత మంటే ఏమిటో?నాకు తెలియ జెప్పి నాకు బ్రతుకు బాట చూపించారు. అప్పటి నుండి కష్టపడి పండ్ల దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాను అమ్మగారు. ” నీవు కష్టపడితే ఎవరైనా నీకు పని ఇస్తారు. జీవితంలో పైకి వస్తావు. నీవే ఇతరులకు సహాయం చేస్తావు. ఇకనుండి ఈ వీధిలో కనపడవద్దు అని నాకు కళ్లు తెరిపించి,మనసులో నాటుకొనే విధంగా చెప్పారు అయ్య గారు “ఆ నాటి నుండి నేను అడుక్కోవటం మనివేసాను అమ్మా!
ఆ రోజుల్లో నా ఆకలి తీర్చటానికి మీరు బిక్షం వేశారు . ఈ రోజు మాష్టారి మంచి మాటల బిక్షే,
నా జీవితంలో ఇంత మార్పుకు కారణం అయినది. ఎవరిని యాచించ కుండా హాయిగా బ్రతుకు తున్నానమ్మా! అనుకోకుండా
ఈ చిన్న సహాయం మీకు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు యువకుడు.

చూసావా రాధమ్మా! మనిషి అన్నాక ఒకరికొకరు సహాయ సహకారాలు అందించు కోవటం సహజం అది ఏ రూపం లోనైనా కావచ్చు! కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయటం మంచిది కాదు. ఒకరితో పనియేంటి,?
అనుకోవటం పొరపాటు.! అలాగే కష్టంలో ఉన్నవారికి మనం చేసే సహాయం ఊరికే పోదు? అని ఆ రోజే నీకు చెప్పాను కదా!
రాధమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అవునండి నేను మీ మాటలను అర్ధం చేసుకోలేక పోయాను అన్నది.
ఒక యాచకుడి సహాయం మనకు ఉంటుందని ఎప్పుడైనా అనుకున్నామా? ఈ రోజు నా ప్రాణాలు కాపాడి ఒక మానవత్వ విలువలు కలిగిన వ్యక్తిగా ఎంతో ఎత్తుకు ఎదిగాడు వాడు. నేను చెప్పిన కొన్ని మంచి మాటలు విని ఒక యాచకుడు ప్రయోజకుడిగా మారటం నాకెంతో ఆనందం కలిగిస్తుంది. ఇకనుండి మాకు ఆత్మయ బంధువు గా అప్పుడప్పుడూఇంటికి వస్తుండరా బాబు అన్నారు. సరే!అయ్య గారు అని ఆ యువకుడు అక్కడనుండి బయలుదేరాడు. అలా వెళుతున్న యువకుడి వైపు కృతజ్ఞతా భావం నింపుకొని తదేకంగా చూస్తుఉండి పోయారు రామయ్య రాధమ్మ దంపతులు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!