మాతృ హృదయం

మాతృ హృదయం

రచన::వడలి లక్ష్మీనాథ్

ప్రతి తల్లి తన పిల్లల గురించి ఒకేలాగా ఆలోచిస్తుంది. తల్లులు వేరైనా,పిల్లలు వేరైనా….మాతృ హృదయం ఒక్కటే.

“బాధ వస్తే ముందు నోటి నుండి వచ్చేది ‘అమ్మా’ అనే పిలుపు….ఆ పిలుపు వింటే మొదలు పలికేదీ అమ్మే….అమ్మ, పిల్లల్ని గుండెకి హత్తుకోగానే, ఆ బాధ మటుమాయం అవుతుంది….మరి ఆ భాధకి కారణము అమ్మ లేక పోవడమే అయితే….ఆ పిల్లల్ని ఓదార్చేది ఎవరు?” గద్గదమైన స్వరంతో అడిగింది విశాల.

ఒళ్ళంతా కట్లతో దయనీయమైన పరిస్థితిలో ఉంది విశాల.

“అదేమి మాట విశాలా….నీకేమీ కాదు. అనవసరంగా ఆలోచించకు. నీ ఆరోగ్యం తొందర్లోనే నయమై పోతుంది. నన్ను పనిగట్టుకుని పిలిచింది, ఇందుకా” అంది మిధున కళ్ళ నీళ్ళు తుడుచుకొంటూ.

“నాకు, నేను పోతానని బాధలేదు మిధున……నా పిల్లలు, అమ్మలేని వాళ్ళుగా, నేను లేని ప్రపంచంలో ఎలా బ్రతుకుతారోనని దిగులు” అంది.

“విశాలా! పిచ్చి ఆలోచనలు మాను. నీ గురించి నువ్వు ఆలోచించుకో. పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు….వాళ్ల గురించిన చింతతో నీ ఆరోగ్యం పాడుచేసుకోకు” అంది మిధున.

“అందరి లాంటి పిల్లలూ కారు, నా పిల్లలు. అమ్మ మీద బెంగ ఎక్కువ……నా అనారోగ్యాన్నే వాళ్ళు తట్టుకోలేరు. అలాంటిది నాకు ఆక్సిడెంట్ అయిందని తెలిస్తే వాళ్ళు ఎంత బాధ పడతారో? నేను చనిపోతే వాళ్ళు ఎలా జీర్ణించుకుంటారు? …..ఆ బాధ తీరడానికి వాళ్ళని ఎవరు గుండెలకు హత్తుకొని ఓదారుస్తారు” కళ్ళు తుడుచుకొంది విశాల.

“ముందు నువ్వు కోలుకోవడం గురించి ఆలోచించు….నీకేమీ కాదు…..పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కనపెట్టు” అంది మిధున.

“మిధునా! తల్లి తర్వాత తల్లి, పినతల్లి అంటారుగా.. వాళ్ళని, చిన్నప్పుడంతా ఎక్కువగా నీ చేతుల మీదుగా పెంచావు…..నాకు మాట ఇవ్వవా!…..నా పిల్లల్ని నేను లేని లోటు లేకుండా చూసుకొంటానని” అంది విశాల.

“విశాలా! ముందు నీకేమీ కాదు……ఎక్కువ ఆలోచించకు…అయినా నీ తృప్తి కోసం చెబుతున్నాను….. నాకున్నదీ ఇద్దరూ ఆడపిల్లలేగా ……నీ పిల్లలైనా…… వాళ్లే నా కొడుకులు. నీ పిల్లలిని దగ్గరకు తీసుకొని, మంచి చెడు చూసుకొనే బాధ్యత నేను తీసుకొంటున్నాను. ఇకనైనా ఆ ఆలోచన మాని విశ్రాంతి తీసుకో” చెప్పింది మిధున.

మిధున, విశాల ఒక తల్లి పిల్లలైనా, ఆస్తి పంపకంలో పట్టింపులు వల్ల అక్క చెల్లెళ్ళ మధ్య మాట, మంతి ……రాక పోకలు కరువయ్యాయి. దానితో గత పదేళ్లుగా ఒకళ్ళ విషయాలు ఇంకొకరికి తెలియవు. విశాల పిల్లల్ని, చిన్నప్పుడు అక్క పిల్లలని అల్లారు ముద్దుగా ఆడించేది.

ఇన్నాళ్ళకి ఇలా విశాలకి ఆక్సిడెంట్ అవడంతో మిధునకి కబురు పెట్టింది.

“నేను వచ్చి రెండు రోజులైంది….ఇంట్లో వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారో…నేను వెళ్ళి రెండు రోజుల్లో తిరిగి వస్తాను…..నీ పిల్లలు కూడా బయలుదేరారని కబురు వచ్చింది…రేపు తెల్లారితే ఇద్దరూ దిగుతారు” అంది.

వెళ్లిన మర్నాడు విశాల మరణించింది అనే వార్తతో పరుగు పరుగున వచ్చింది మిథున. తల్లి పోయిందని, చాలా రోజుల తర్వాత కనబడ్డ పిన్నిని, పట్టుకొని భోరుమన్నారు ఇద్దరూ.

ఆ తర్వాత వాళ్ళు జరగాల్సిన కార్యక్రమాలు చూస్తున్నారు. విశాల చెప్పినట్టుగా ఇద్దరినీ హత్తుకోవలసిన అవసరం కూడా పెద్దగా రాలేదు మిధునకి. దాంతో ఊపిరి పీల్చుకున్నది మిధున.

విశాల రాసిన రెండు ఉత్తరాలు అందజేశారు హాస్పిటల్ వాళ్ళు. ఒకటి మిధున పేరున వుంటే, మరొకటి పిల్లల పేరున ఉంది. మిధున పేరున ఉన్నది మిధునకి అందచేసారు పిల్లలు.

అన్ని కార్యక్రమాలు అయ్యి బంధువులు అందరూ వెళ్లిపోయారు. అప్పుడు పిల్లలిద్దరూ మిధున దగ్గరకు వచ్చి,

“పిన్ని, అమ్మ మాకు రాసిన ఉత్తరంలో …..నీకు అన్నీ అప్పజెప్పి వెళ్ళానంది. మిమ్మల్ని మీ పిన్ని చేతుల్లో పెట్టాను. పిన్ని ఎలా చెబితే అలా వినండని చెప్పింది…… మేము చూడగా, మా అమ్మ ఎప్పుడూ ఖరీదైన బట్టలు కూడా వేసుకోలేదు. ఎప్పుడూ పొదుపు, పొదుపు అని బ్రతికేది…అప్పుడు మాకు అర్దం కాలేదు…అదంతా దాచి మాకోసం…నీ దగ్గర అప్ప చెప్పిందని, మా అమ్మ అప్పజెప్పినవన్నీ మాకు తిరిగి ఇవ్వు” అని.

సమాధానంగా మిధున,” మీ నాన్న పోయిన దగ్గరనుండి మీ అమ్మ…. తల్లీ, తండ్రి అన్నీ తనే అయి పెంచింది. తన మరణాన్ని పిల్లలు జీర్ణించుకోలేరని, అది మిమ్మల్ని కృంగదీస్తుందనీ, ఆ బాధ నుండి మిమ్మల్ని నా మాతృ హృదయంతో ఉపశమనం ఇవ్వమని నాకు రాసిన ఉత్తరంలో రాసింది. మీ అమ్మ నా దగ్గర దాచింది తల్లి ప్రేమ ….అది మీకు సమానంగా పంచాలని కోరింది” అంటూ విశాల రాసిన ఉత్తరాన్ని వాళ్ళకి అందించింది మిధున.

ఉత్తరం చదువుతున్న పిల్లలతో,

“నేను, మీ అమ్మతో కొన్ని సంవత్సరాలుగా విభేదిస్తూ వచ్చాను….. మా తల్లి తండ్రుల ఆస్తిలో నేను చిన్న దాన్ని కాబట్టి, నాకు ఎక్కువ వాటా రావాలని. కానీ, మీ అమ్మ పోయాకా నాకర్ధమయింది…..ఇన్నాళ్లూ నేను కోల్పోయింది…..ఒక తోబుట్టువు ప్రేమ….ఆ ప్రేమకి ఎంత నమ్మకం అంటే…… ఇన్ని రోజుల తరువాత కూడా ఆమె నన్ను నమ్మి, మీ బాధ్యత అప్పచెప్పింది. అప్పుడు నేను కోరుకున్నది, ఇప్పుడు మీరు కోరుకొనేది ఒకటే …అదే భౌతిక ప్రేమ….వస్తు ప్రేమ.

నేను చేసిన తప్పు మీరు చేయకండి…..అయినవాళ్ళ ప్రేమ ఎన్నికోట్ల ఆస్తికి సరికాదు” అంటూ పిల్లల్ని దగ్గరకు తీసుకుంది.

“పిన్నీ” అంటూ పిల్లలు ఆమె ఒడిలో ఒదిగిపోయారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!