శాంతమ్మ

శాంతమ్మ

రచన::M. సుశీల రమేష్

శాంతమ్మ కాలనీ.
కానీ ప్రశాంతత కరువు. కారణం శాంతమ్మ. మనిషి మంచిదే. నోట్లో నాలుకలా ఉంటుంది అందరికీ. మంచితనానికి మాటకారి తనానికి గయ్యాళి తనానికి పెట్టింది పేరు శాంతమ్మ.

శాంతమ్మ పక్కింట్లో పెళ్లి జరుగుతుంది. ఇక వియ్యాలవారి విలనిజం అందరికీ తెలిసిందే, దానికి సణగడం, గొణగడం, చేస్తున్నారు వియ్యాల వారు.

మరిముఖ్యంగా పెళ్ళికొడుకు మేనమామ అతని భార్య, ఆడపెళ్ళి వారిని కాల్చుకొని తింటున్నారు.
ఉదయం నుండి అరడజన్ రకాల అల్పాహారాలు తిన్న తృప్తి చెందడం లేదు ఇద్దరు,.

అసలా ఇద్దరు ఎలా ఉన్నారంటే పందికి పంచె కట్టినట్టు అతను, నల్ల గేదెకు పట్టుచీర చుట్టినట్టు ఆమె భలే మంచి జంట.

వీళ్ళిద్దరి ని చూస్తుంటే అక్కడున్న వారందరికీ ఒళ్ళు మండిపోతోంది.
ఎందుకు ఓపిక పట్టిందో శాంతమ్మ కానీ, పెళ్ళికొడుకు మేనమామ దంపతులను ఓ కంట కనిపెడుతూనే ఉంది.

పాపం ఆడపిల్ల తండ్రి మింగలేక కక్కలేక దిగులు పడుతూ ఉంటే, ధైర్యం చెప్పింది శాంతమ్మ.

పందిట్లో పెళ్లి జరుగుతుంటే, అక్కడున్న అమ్మాయిలంతా పన్నీరు జల్లుతున్నారు , పెళ్లికి వచ్చిన అతిథుల మీద.

పెళ్ళికొడుకు మేన మామ కూడా తాంబూలం నములుతూ పార పళ్ళు ఇకిలిస్తూ, అమ్మాయిలు నా మీద కూడా జల్లండి పన్నీరు అని అడుగుతాడు, అతని పక్కనే అతని భార్య ఉంది.

అమ్మాయిలు లోపలికెళ్ళి శాంతమ్మ ఇచ్చిన పన్నీరు తీసుకొచ్చి పెళ్లికొడుకు మేనమామ దంపతుల మీద జల్లారు.

పెళ్లికి వచ్చిన అతిథులంతా బాగానే ఉన్నారు కానీ పెళ్ళికొడుకు మేనమామ దంపతులు గోక్కోవడం మొదలుపెట్టారు, ఎంత లా అంటే , అక్కడున్న గోడకేసి వీపు రుద్దు కుంటూ, భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గోక్కుంటూ ఉన్నారు,

ఎంత గోకినా దురదమాత్రం తగ్గడంలేదు. శాంతమ్మ ఈ దంపతుల దగ్గరికి వచ్చి ఏం జరిగింది అన్నయ్యగారు అంతలా గోక్కుంటున్నారు, అని అడిగింది.
ఏమోనమ్మా శాంతమ్మ ఏం జరిగిందో ఏంటో అంటూనే బీభత్సంగా గోక్కుంటున్నారు.

ఎలర్జీ ఏమో అన్నయ్య గారు, ఎలర్జీ అంటే మామూలు విషయం కాదు.
అది ఏ రకమైన ఎలర్జీ,నొ, తెలియదు కదా, మీరేమో ఉదయం వచ్చినప్పటినుండి అసలు ఇప్పటికి ఎన్ని రకాలు తిన్నారో, మీకే తెలియదాయే,, అదిగో చూడండి మీ కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి అందుకే తొందరగా వెళ్లి డాక్టర్ కి చూపించు కోండి అని అంటుంది శాంతమ్మ.

అంతే పెళ్లి కొడుకు మేనమామ దంపతులు పరుగో పరుగు గోక్కుంటూ.

అసలేం జరిగిందంటే పన్నీరు లో దురదగుండాకు కలిపింది శాంతమ్మ.
పందిట్లో ఆడపెళ్ళి వారి మీద చేసే జులుం చూడలేక.

పెళ్లి ప్రశాంతంగా జరిగిపోయింది. వాళ్ల పీడ వదిలించినందుకు పెళ్లి కూతురు తండ్రి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శాంతమ్మకు.

మర్నాడు కాలనీ లో ఏదో పెద్ద గొడవ జరుగుతుంది. జనమంతా చుట్టుతా చేరి చూస్తున్నారు.
అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి, అక్కడ గుంపులో ఉన్న ఒకరిని అడిగాడు, ఏంటయ్యా ఇంతమంది గుమిగూడారు, ఎవరు ఆడ మనిషి అంతలా అరుస్తుంది అన్నాడు.
ఎవరి ఏంటండీ మా శాంతమ్మగారు.
అనేసరికి ఆ వ్యక్తి అమ్మో శాంతమ్మ, అంటూ వడివడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

అలా యాభై ఏళ్ల శాంతమ్మ జీవితం రోజుకి అరడజను కొట్లాటలతో, మూడు మంచి కార్యాలతో సాగుతుండగా, అకస్మాత్తుగా ఒక రోజు గుండెపోటుతో కుప్పకూలిపోయింది. కాలనీ వాసులంతా హాస్పిటల్లో చేర్చారు.

శాంతమ్మ స్పృహ లో లేదు. అప్పుడు తనకు దేవుడి దర్శనం అయింది. ఏంటి దేవుడా నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను, ఆపదలో ఉన్న వారికి సాయపడ్డాను. అయినా నన్ను బ్రతకనియ్యకుండా, అర్ధాంతరంగా తీసుకెళ్లి పోతావా అంటూ దేవుడిని ప్రశ్నించింది శాంతమ్మ .

అప్పుడు దేవుడు అవునా కదా శాంతమ్మ నిజమే చాలా మంచి పనులు చేశావు నీకు మరో పదేళ్లు పెంచుతున్నాను అంటూ వరమిచ్చాడు.

ఆ మాటకు ఎంతో సంతోషించింది శాంతమ్మ. కళ్ళు తెరిచింది.
హాస్పిటల్లో కోలుకున్న తర్వాత, ఎట్లాగు దేవుడు నాకు పదేళ్లు ఆయుష్షు పెంచారు కాబట్టి, నేను ఇంకొంచెం స్టైల్ గా అందంగా ఎందుకు తయారవ కూడదు అనుకుంటూ, ఇంటికి వెళ్లకుండా, బ్యూటీపార్లర్కు వెళ్లి అందాన్ని అమాంతంగా పెంచేసింది. అప్పటికప్పుడు తన కాలనీవాసులు ఎవరైనా చూసినా కూడా గుర్తు పట్టలేని విధంగా, మారిపోయింది. అద్దంలో చూసుకుంటూ అబ్బో శాంతమ్మ ఎంత అందంగా ఉన్నావే నా దిష్టి తగులుతుందేమో సినిమా హీరోయిన్ల ఉన్నావు అంటూ మురిసిపోయింది శాంతమ్మ.

బ్యూటీ పార్లర్లకు మనీ పే చేసి ఇంటికి వెళ్లడానికి బయటకు వచ్చింది. రోడ్డు దాటుతుండగా స్పీడ్ గా వచ్చిన లారీ గుద్ధేసింది.
శాంతమ్మ అక్కడికక్కడే స్పాట్ లోనే ప్రాణాలు విడిచింది.

చనిపోయాక నేరుగా స్వర్గానికి వెళ్ళింది దేవుడి మీద దండయాత్రకు. వెళ్తూనే గయ్యాళి డబ్బా నోరుతో , ఏంటి దేవుడా నువ్వు చేసిన పని పదేళ్ళు ఆయుష్షు పెంచినట్టే పెంచి. అంతలోనే లారీ తో గుద్ధించి చంపేస్తావా నీకు ఏమైనా న్యాయంగా ఉందా అని అడుగుతుంది శాంతమ్మ.

దేవుడు ఆశ్చర్యంతో, ఓరిని శాంతమ్మ నువ్వా నేను గుర్తు పట్టలేదు సుమీ, ఇంతలా మారిపోయావు నేను ఎవరో అనుకున్నాను అంటాడు దేవుడు.

ఆ మాటకు శాంతమ్మ నోరెళ్ళ బెట్టింది.

********సమాప్తం***********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!