అపార్ధం

(అంశం:: “అర్థం అపార్థం”)

అపార్ధం

రచన:: పరిమళ కళ్యాణ్

పండుగ సంబరాలు ముమ్మరంగా జరుగుతున్నాయి అక్కడ.. ఆ ఊరి పెద్ద నరసరాజు గారు ఏర్పాట్లు అన్నీ దగ్గర ఉండి చూస్తున్నారు.

బయటనుంచి ఇంటికి వచ్చిన రాజు గారికి కాళ్ళు కడుగు నీళ్లిచ్చి, తువ్వాలు ఇచ్చి పక్కనే కూర్చున్నారు రాజుగారి భార్య దేవి.

“దేవీ! రేపు పండక్కి అమ్మాయి వస్తుంది కదా. ఇక అమ్మాయికి పెళ్ళి చేద్దాం అని నిశ్చయించాను. అమ్మాయి వచ్చాక పెళ్ళివాళ్ళు వచ్చి చూసుకుంటాం అన్నారు. అబ్బాయి ఎవరో కాదు, ఏటి పక్కనున్న మామిడి తోట సుబ్బరాజు గారి ఏకైక కొడుకు, వర్ధన్ విదేశాల్లో స్థిరపడి పోయాడు. అబ్బాయి చాలా అందగాడు, మంచివాడు. మన స్నేహకి మంచి ఈడు జోడు అవుతాడు. అమ్మాయి వచ్చాక తనకి ముందుగా చెప్పి ఒప్పించాలి. ఆ బాధ్యత నీదే మరి!” అన్నారు భార్యతో.

“ఓ, మంచి విషయం అండి, మీరు చూసారు అంటే అది ఖచ్చితంగా మంచి సంబంధం అయ్యే ఉంటుంది. పైగా ఒక్కడే కొడుకు, అత్తగారు చాలా మంచిది. ఆడపడుచులు లేరు. ఉన్నదంతా అబ్బాయికే కదూ. రానివ్వండి అమ్మాయితో నేనే మాట్లాడతాను” అందావిడ.

ఆరాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది ఊరు. మర్నాడు ఉదయాన్నే కొందరు కూలి పనులకు వెళ్లే జనం రాజుగారి అమ్మాయి స్నేహ ఊర్లోకి రావటం గమనించారు. స్నేహ ఒంటరిగా కాకుండా, చేతిలో చిన్న పసిబిడ్డ, పక్కనే ఒక యువకుడు ఉన్నారు. అది చూసిన ఆ జనం రాజుగారి అమ్మాయి ఎవరినో వెంటబెట్టుకుని వస్తోంది అని వేరే వాళ్ళకి చేరవేశారు.

ఆ వార్త విన్న ఇంకొకరు “రాజు గారి అమ్మాయి, పట్నంలో ఎవర్నో పెళ్ళి చేసుకుని, బిడ్డతో సహా ఇంటికి తీసుకుని వస్తోంది” అన్నారు.

అలా ఆ మాట ఊరంతా పాకిపోయింది. అదేమీ ఎరుగని స్నేహ ముద్దులొలికే పసి పాపని చూస్తూ పక్కనే ఉన్న యువకుడితో మాట్లాడుతూ ఇంటికి వస్తోంది.

ఆ వార్త ఆ నోటా ఈ నోటా స్నేహ కన్నా ముందుగా రాజుగారి ఇంటికి చేరింది.

పాలేరు వీరన్న, “అయ్యా అమ్మాయి గారు, ఎవర్నో తీసుకుని వస్తున్నారట అండి. ఆయన అమ్మాయిగారి భర్త గారని, వాళ్ల చేతిలో చంటి బిడ్డతో వస్తున్నారని తెలిసింది అండి. మీక్కూడా చెబుదాం అని.. ” అంటూ నసుగుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

ఆ వార్త విన్న రాజుగారు హతాశుడయ్యారు.
“ఏమిటి దేవీ ఇది, నేనేమో తనకి పెళ్లి సంబంధం చూస్తే, తను ఏకంగా పెళ్లి చేసుకుని బిడ్డతో వస్తోందట. ఏం చెయ్యాలి!” అని బాధ పడుతున్నారు.

“అయ్యో, మీరు అలా బాధపడకండి. చూద్దాం అసలు ఏం జరిగిందో, అందరూ ఏం చూశారో, ఎవర్ని చూశారో. ముందు కాస్త స్థిమిత పడండి” అంటూ రాజుగారిని కూర్చోపెట్టింది ఆయన భార్య.

ఈలోగా గుమ్మంలో అయిన తలుపు శబ్దానికి గుండె వేగంగా కొట్టుకోసాగింది రాజుగారి దంపతులకు. అటువైపు చూసిన ఇద్దరూ సంభ్రమాశ్చర్యలకు లోనయ్యారు.

గుమ్మంలో నుంచీ “అమ్మా, ఒకసారి ఇలా రా!” అంటూ తల్లిని పిలిచింది స్నేహ, బిడ్డని ఎత్తుకుని.

చేతిలో బిడ్డ, పక్కనే కుర్రాడిని చూసిన రాజుగారికి అందరూ అనుకుంటున్నదే నిజం అనిపించింది.

కూతుర్ని చూస్తూనే, “ఛీ పాపిష్టి దానా! నా కడుపున చెడబుట్టావు కదే. నీ గురించీ ఊరు ఊరంతా అనుకుంటున్నారు. నువ్వు చేసిన నిర్వాకం ఊరంతా తెలిసింది. ఇక ఈ ఊర్లో నా పరువు ఏం గానూ. నేను ఎలా తలెత్తుకు బ్రతకాలి. “

“అది కాదు నాన్నగారు, నేను చెప్పేది వినండి. అసలు మీరు ఏం విన్నారో, అందరూ ఏం చెప్పారో నాకు తెలీదు” అంటూ, తండ్రి దగ్గరకి వెళ్ళి, మోకరించి కూర్చుని, “అయ్యో నాన్నగారు, మీరు నన్ను అపార్ధం చేసుకుని ఏదేదో ఊహించుకుంటున్నారు. అసలు అతను నా భర్త కాదు, నేను అసలు ఎవర్నీ పెళ్ళి చేసుకోలేదు. నేను మీ కూతుర్ని నాన్నా, ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను కూడా.

నేను చెప్పేది స్థిమితంగా వినండి. అతను నా స్నేహితురాలు శాంభవి భర్త నిఖిల్. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. శాంభవి అనాధ, అందుకే నిఖిల్ ఇంట్లో వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేదు. పైగా వాళ్ళు మరాఠీ వాళ్ళు, వాళ్ళ సంప్రదాయాలు వేరు, పద్ధతులు వేరు. అతనికి తెలుగు రాదు, అందుకే ఇక్కడ ఏం జరుగుతోంది తెలియక తికమక పడుతున్నాడు. హిందీలో చెప్తేనే అర్దం అవుతుంది.

వాళ్ళకి నేనే దగ్గర ఉండి పెళ్లి జరిపించాను. శాంభవి ఈ బిడ్డని కని, కన్నుమూసింది. నిఖిల్ తల్లితండ్రులకు విషయం చెప్తే, ఆ బిడ్డని అనాధ శరణాలయంలో విడిచి పెట్టాలని అన్నారు. అదీ తనకి ఇష్టం లేక బిడ్డని ఒక్కడూ చూసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. తనకి పెద్దగా స్నేహితులు కూడా ఎవరూ లేరు. అందుకే నా మనసు అంగీకరించక తనకి సహాయం చేద్దామని మన ఇంటికి నేనే తీసుకుని వచ్చాను నాన్నగారూ.

ఇందులో నేను చేసిన తప్పు ఏమైనా ఉందా? మీకు చెప్పకుండా ఇంటికి తీసుకుని రావటం తప్పే కానీ, అప్పటికప్పుడు నాకు తట్టలేదు. అందుకే సరాసరి మన ఇంటికి తీసుకుని వచ్చాను. రేపు పండుగ సంబరాలు అన్నీ చూస్తాడు కదా అని. పాపకి కూడా కాస్త నలుగురు కలిస్తే బాగుంటుంది అని…” అసలు కథ వివరంగా చెప్పింది స్నేహ.

అసలు విషయం తెలుసుకున్న రాజుగారు అనవసరంగా అందరి మాటలు విని కూతుర్ని నానా మాటలు అన్నందుకు బాధపడుతూ “అయ్యో తల్లి, ఇది తెలియక తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు” అంటూ కూతురి చేతుల్ని తన ముఖంపై పెట్టుకున్నారు.

“అయ్యో నాన్నగారూ, నాకేమీ బాధ లేదు. మీరలా అన్నందుకు. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అందుకే ధీమాగా ఇక్కడకి తీసుకుని వచ్చాను” అంది స్నేహ.

“సరే ఇక మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండచ్చు. పాపని జాగ్రత్తగా చూసుకుంటాం అని అతనితో చెప్పమ్మా!” అన్నారు.

“పాపకి తల్లి లేని లోటు తెలియకుండా మనమే చేద్దాం అండి” అంది దేవి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!