అంతః సౌందర్యం

(అంశం:: “అర్థం అపార్థం”)

అంతః సౌందర్యం

రచన:: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన కూతురి చేతిలో బేగ్ అందుకొని తన పవిట కొంగుతో కూతురి కన్నీళ్ళు తుడుస్తూ అమ్మా సరళా చెల్లికి మంచినీళ్లు పట్టుకురా అంటూ పెద్ద కూతురికి చెప్పిందిలక్ష్మమ్మ .
సరేనంటూ మంచి నీళ్ళు తెచ్చి చెల్లికి అందించింది సరళ
అసలు  ఏమి జరిగింది  ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చావు అల్లుడుగారు రాలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది కంగారుపడుతూ లక్ష్మమ్మ.

అమ్మా  ఆయన నన్ను నువ్వు పుట్టింటికి వెళ్ళి పో ఇంక ఇక్కడికి రావద్దు అని శాశ్వతంగా నన్ను ఇక్కడకు పంపించేశారమ్మా  అంటూ తల్లి ని పట్టుకుని బోరుమన్నది స్వప్న . దానికి లక్ష్మమ్మ అసలు ఏం జరిగింది నువ్వు ఏం చేసావు అని అడిగింది కూతురుని.

నేను ఏమి చేయ లేదమ్మా నాకు మొహం మీద వచ్చిన ఈ మచ్చ ఏదో ఒక అంటురోగమట నాతో కాపురం చేస్తే ఆయనకూ వస్తుందని ,అందంగా ఉన్నానని నిన్ను పెళ్లి చేసుకున్నాను  ఇక నాకు నీతో పని లేదు పొమ్మన్నారమ్మా అని తన ముఖం మీద ఉన్న మచ్చలు చూపిస్తూ ఒకసారిగా ఘొల్లుమన్నది  స్వప్న.

ఆ మాటకి లక్ష్మమ్మ అల్లుడు గారు చాలా మంచి వారు అనుకున్నాను ఇలాంటి వారు అనుకోలేదు ఇంత చిన్న విషయానికే నిన్ను పుట్టింటికి పంపించేస్తారని నేనస్సలు అనుకోలేదు అంది.
స్వప్న అక్క సరళ  కూడా వచ్చి పక్కన కూర్చుంటూ స్వప్నా నువ్వేమి బాధపడకు పరిస్థితులు చక్కబడతాయి. నువ్వు మరలా నీ భర్త దగ్గరికి ఖచ్చితంగా వెళ్తావు సరేనా ఏది నవ్వు అంటూ చెల్లిని ఓదార్చింది సరళ .

అలా తనను ఓదార్చుతున్న అక్కను తల్లిని, చూసి వారి ఎడల తను చేసిన పని గుర్తొచ్చి నన్ను క్షమించు అక్కా, నన్ను క్షమించు అమ్మా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా నేను నానా మాటలు అని మీ మనసు నొప్పించినా మీరు ఆ మాటలేవి మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించడమే కాకుండా నన్ను ఓదార్చి ఇంటికి రానిచ్చి నా బాగు కోరుకుంటున్నారు  అంటూ తల వంచుకుని తన తల్లిని అక్కని క్షమాపణ వేడుకొంది స్వప్న . ఆ మాటకి ఇంత చిన్న విషయానికే క్షమాపణలదాకా ఎందుకు నువ్వేదో తెలియక చేసావు అన్నారు ముక్తకంఠంతో సరళ, లక్ష్మమ్మలు.
నన్ను క్షమించడం నిజంగా మీ గొప్పతనం అంది స్వప్న ఇంట్లోకి నడుస్తూ.

లక్ష్మమ్మ కి ఇద్దరు కూతుళ్లు భర్త పోయిన దగ్గరనుండి నాలుగు ఇళ్ళ దగ్గర పాచి పని చేస్తూ పిల్లలిద్దరినీ పెంచుకొచ్చింది. పెద్ద కూతురు సరళ నల్లగా వుండి చూడ డానికి అందవికారంగా ఉంటుంది. స్వప్న మాత్రం తెల్లని తెలుపు నిగనిగలాడుతూ చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది అదే తన అహంకారానికి  కారణం కూడానూ.
తను అందంగా ఉన్నానన్న గర్వంతో ప్రతిరోజు తన మాటలతో తన అక్క సరళను బాధ పెట్టేది స్వప్న

యుక్తవయసు వచ్చేసరికి సరళ అంద వికారంగా ఉన్న కారణం చేత తనకి పెళ్ళి కాకుండానే స్వప్న కి పెళ్లి సంబంధం వచ్చింది. అయినింటి సంబంధం కట్నకానుకలు ఏమీ వద్దు పిల్లని పంపిస్తే చాలు అన్నారు అబ్బాయి తరపు వాళ్ళు. అబ్బాయి కూడా చాలా మంచివాడు ఉద్యోగస్తుడు . స్వప్న కి వచ్చిన అదృష్టాన్ని కాదనలేక  పెద్ద కూతురికి పెళ్లి కాకుండానే చిన్న కూతురుకి పెళ్ళి చేసేసింది లక్ష్మమ్మ.

అప్పటి నుండి స్వప్న అహంకారం మరీ ఎక్కువైపోయింది నా అందానికి రూపాయి కట్నం లేకుండా డబ్బున్న ఉద్యోగస్తుడు కోరి వరించాడని  స్వప్న కి పొగరు కూడా మరీ ఎక్కువైపోయింది

ఒకరోజు స్వప్నని చూడటానికి తన ఇంటికి వచ్చిన తల్లిని అక్కని మీరిలా చింపిరి తలలతో,చిరిగిన బట్టలతో మా ఇంటికి రావడం ఎవరైనా చూస్తే మా పరువేం కాలాలి
ఇప్పుడు వస్తే వచ్చారు కానీ ఇంకెప్పుడూ రాకండని నానా మాటలు తిట్టింది స్వప్న . దాంతో లక్ష్మమ్మ ,సరళ  కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ  బయటకు వచ్చి ఇంటికి వచ్చేసారు .

స్వప్న పుట్టింటికి వచ్చి పది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఇంటికి వచ్చిన అల్లుడు సంతోష్ ని చూసి లక్ష్మమ్మ రండి  బాబూ కూర్చోండి అని తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి మీరు ఎంతో మంచివారు అనుకున్నాను. మీరు ఇలా చేస్తారని నేనస్సలు అనుకోలేదు అన్నది .

దానికి సంతోష్ మీరు నన్ను సరిగా అర్థం చేసుకోకుండా అపార్ధం చేసుకున్నారు అత్తయ్యా. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు స్వప్న మిమ్మల్ని తన మాటలతో బాధపెట్టడం , దానికి మీరు కళ్ళనీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోవడం నేను చూసాను. దాంతో స్వప్న కి మీ విలువ ఏంటో తెలుసొచ్చి ,తనకి బుద్ధి రావాలని అందంగా ఉన్నానన్న పొగరు కూడా తగ్గాలని బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే అసలైన అందమనీ, అంతః సౌందర్యం లేని బాహ్య సౌందర్యం వ్యర్ధం అని తను తెలుసుకోవాలని నేను కావాలనే మీ ఇంటికి పంపించేసాను అత్తయ్యా అన్నాడు సంతోష్.
ఇంత మంచి అల్లుడిని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నందుకు నేను నిజంగా సిగ్గు పడుతున్నాను బాబూ అన్నది లక్ష్మమ్మ.
స్వప్న కూడా నాకు మనుషుల  గొప్పతనం తెలిసొచ్చిందండీ
అంతః సౌందర్యమే గొప్పదన్న విషయం కూడా తెలుసుకున్నాను  నన్ను క్షమించండి అంటూ భర్త కాళ్ళపై పడింది స్వప్న.

You May Also Like

One thought on “అంతః సౌందర్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!