బాధ్యత

బాధ్యత
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

మీ అమ్మకి ఒంట్లో బాలేదు బిడ్డ, పెద్ద హాస్పిటల్ లో చేర్పించిన, గర్భసంచిలో ఏదో చిన్న గడ్డ లేచిందంట, పెద్ద డాక్టర్లు క్యాన్సరెమో అంటున్నారు, చానా దినాల్నుంచి మీ అమ్మ నెప్పి తొ పరేషాన్ అయితుండే కడుపులో నొస్తుందని, మన ఊరి ఆర్ఎంపీ డాక్టర్ కి చూపిస్తిని కానీ గాని వల్ల నయం  కాలే, నావల్ల కాదు ప్రాణాల మీదకు వచ్చేట్టుందని పట్నం తీసుబోమ్మని చెప్పినాడు, అందుకే పట్నం లో పెద్ద హాస్పిటల్ లో చేర్పించిన, కానీ ఆ హాస్పిటల్లో అంతగా పట్టించుకోవట్లే బిడ్డ, మన మల్లేషన్న రంగయ్య బాబాయ్ వాళ్ళు అమ్మని ప్రైవేట్ దవాఖానాలో చేర్పిస్తే మంచిది అంటున్నారు, నాకు అదే మంచిగా తోస్తుండే కానీ, నాకాడ పైసలు లేవు, ఈ మధ్య వచ్చిన వరదలకు మన పంటంతా వరదలో కొట్టుకుపోయింది, ఎక్కడైనా కూలి పని చేద్దాం అన్న కూలి కూడా దొరకట్లేదు ఈ గడ్డు రోజుల్లో, ఏం చేయాలో అర్థం కాక నా కాళ్ళు చేతులు అడక నీ కాడికి లగేత్తుకొచ్చిన బిడ్డ అంటూ తన గోడును తన కొడుకు గిరికి వెళ్లబోసుకున్నాడు నరసింహం, తండ్రి మాటలు వింటూ కూడా అతని మాటలు అంతగా ఏమీ పట్టించుకోకుండా ఎలాంటి స్పందన లేకుండా తన పిల్లలతో ఆడుకుంటూ తల్లి ఆరోగ్యం పట్ల ఇసుమంతైనా బాధను బాధ్యతను చూపించని కొడుకుని చూస్తూ, తను మరి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక దీనంగా చూస్తూ ఉండిపోయాడు నరసింహం, పట్నంలో మంచి ఉద్యోగం చేస్తూ సొంత ఇల్లు వాకిలి తో తన భార్య పిల్లలతో హాయిగా ఉంటున్న తన కొడుకు గిరీ తో తన భార్య పడుతున్న బాధను చెప్పి కొడుకు సాయంతో భార్యను ప్రైవేట్ హాస్పటల్కి ఎట్లైనా మార్చాలి అనుకున్న అతని ఆశ అడియాస అయింది, వస్తున్న బాధతో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే మనసును మౌనంగా ఉగ్గపెట్టుకుంటున్నాడు, ఇంతలో కోడలు లోకేశ్వరి లోపలి గది లోంచి బయటకొచ్చి ఆదివారం నాడైనా ఆ మనిషిని తిన్నగా మనశ్శాంతిగా ఉండనివ్వరా, ఎంత సేపు మీ రోగాలు రోష్టులు అంటూ వెధవ గోల మా కొంప మీదే పడి ఏడవాలా మామ అంది చిదరింపుగా చూస్తూ, ఇక అక్కడ నుంచి ఎలాంటి సాయం  అందదనీ వాళ్లని ఏమైనా అడగడం తన సమయం వృధా తప్ప మరేం లేదు అని నరసింహానికి అర్థమైంది, ఇక వెళ్లి వస్తాను బిడ్డ అంటూ లేచిపోయాడు కూర్చున్నచోట నుంచి.
కాస్త అన్నం తినేసి పో నాన్న అన్నాడు గిరి, వద్దులే ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను అక్కడ మీ అమ్మ  ఒంటరిగా చావుబతుకుల్లో ఉంది, నాకోసమే ఎదురుచూస్తూ ఉంటుంది పిచ్చిది నేను వెళ్తాను అన్నాడు నరసింహం, సరే నాన్న నీ ఇష్టం అలాగే వెళ్ళు, ఇదిగో ఈ 500 ఉంచు అంటూ తండ్రి చేతిలో 500 నోటు పెట్టాడు. నరసింహం ఒకసారి ఆ 500 నోటు వంక కొడుకు వంక  చూసి, భాధని దుఃఖాన్ని గుండెల్లోనే దాచుకుంటూ  ఇంకేం అనలేక బయటికి వచ్చేశాడు. నరసింహం హాస్పిటల్ కి వచ్చిన తర్వాత భార్య నీలమ్మ  మన బిడ్డ, కోడలు, పిల్లల ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అని అడిగింది అలాంటి పరిస్థితుల్లో కూడా, బానే ఉన్నారు వాళ్ళకెం రోగం విసురుగా అన్నాడు నరసింహం, నీ కొడుకు నీకు ఒంట్లో బాలేదు అని చెప్పడానికి వెళ్తే 500 చేతిలో పెట్టాడు, అసలు నీ గురించి చెప్తుంటే పట్టించుకొనే పట్టించుకోలేదు ఎలాంటి కొడుకును కన్నవే, ఛీ తూ వాడు బతుకు చెడ అన్నాడు కోపంగా నరసింహం, పొన్లెయ్య వాడికెం కష్టాలు ఉన్నాయో పట్నంలో భార్యాపిల్లలతో ఏం బాధలు పడుతున్నాడో మనకేం ఎరుక, బిడ్డ మీద కోపం తెచ్చుకోకయ్యా అంటూ  భర్తకి నచ్చచెప్పింది  నీలమ్మ, తర్వాత రెండు రోజులకి నీలమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది, నీలమ్మ నరసింహంతో మన పిల్ల నాగలక్ష్మిని ఓసారి మనవళ్ళని తీసుకునిరమ్మని చెప్పయ్యా, పిల్లని చూడాలనిపిస్తుంది అని చెప్పడంతో సరే అన్నాడు నరసింహం. బయటికి వెళ్లి చిన్న పుస్తకంలో రాసుకున్న కూతురు ఫోన్ నెంబర్ తీసి బయట కూర్చుని ఫోన్ చూసుకుంటున్న ఒక అతని  దగ్గరికి వెళ్లి కాస్త ఈ నెంబర్ కి ఫోన్ చేసి పెడతారా బాబు అని అడిగాడు, అతను సరే అంటూ నరసింహం ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి రింగ్ అవుతూ ఉంటే నరసింహానికి ఇచ్చాడు, అవతలి నుంచి హలో ఎవరూ అంటున్న కూతురితో నేనే బిడ్డ మీ నాయన ని మాట్లాడుతున్నా, మీ అమ్మకి ఒంట్లో బాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్నాం, మీ ఆయన వెంకటేశం కి చెప్పి నువ్వు పిల్లల్ని తీసుకుని బయల్దేరిరా మీ అమ్మ మిమ్మల్ని చూడాలని అంటుంది, ఇక ఉంటాను జాగ్రత్త అంటూ ఫోన్ అతనికి ఇచ్చేసి కృతజ్ఞతగా చూశాడు నరసింహం, అతను నవ్వేసి మళ్ళీ ఫోన్ చూడ్డంలో మునిగిపోయాడు, మర్నాడు పొద్దున్నే నాగలక్ష్మి తన భర్త వెంకటేశం ఇద్దరు పిల్లలతో కలిసి హాస్పిటల్ కి పరిగెత్తుకొచ్చింది. చిక్కి శల్యమై పోయి కళ్ళలో ప్రాణాలు పెట్టుకున్నట్టున్న తల్లిని చూసి భోరున ఏడ్చింది, ఎంది నాయనా  ఇది అమ్మకి బాలేదని ఇప్పటివరకు నాకెందుకు చెప్పలేదు, ఇంత కష్టం లో కూడా నేను మీకు గుర్తుకు రాలేదా అంటూ తండ్రినీ నిలదీసింది. నీ కష్టాలు బాధలు నీకు ఉంటాయి, మళ్లీ అమ్మకు బాగా లేదని  చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు, అయినా ఆడపిల్లవి నువ్వేం చేస్తావు మీ అమ్మని చూసి ఏడవడం తప్ప, అయినా మీకు ఉండే ఇబ్బందులు మీకు ఉంటాయి, మళ్లీ నిన్ను ఎందుకు కష్టపెట్టడం అని చెప్పలేదు అన్నాడు నరసింహం ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మ కంటే ఎక్కువ ఏంటి నాన్న, అమ్మను మంచి ఆసుపత్రిలో చేర్పిద్దాం  త్వరగా తగ్గుతుంది అంది తండ్రితో నాగలక్ష్మి,
నాకు అలాగే చేర్పించాలని ఉంది, కానీ నా కాడ పైసలు లేక మిన్నకుండి పోయాను, మీ అన్నని అడిగితే ఎం మాట్లాడలేదు, మీ అమ్మ గురించి చెప్తుంటే తనకి కాదు, ఏదో గొడకి చెప్తున్నట్టు నిమ్మకు నీరెత్తినట్లుగా వింటు ఉండిపోయాడు, ఇంకేం చేయలేక అమ్మని ఇక్కడే ఉంచేసాను అన్నాడు బాధగా నరసింహం. ఏంటో ఈ పాడు లోకం, ఏదైనా కష్టం వస్తే కన్నోళ్ళకి కూతుర్లు గుర్తుకు రారు, ఎంతసేపు కొడుకులు, కొడుకులు అంటూ వాళ్ళనే పట్టుకుని వేలాడుతూ ఉంటారు, వాళ్ళు పుట్టిన  దగ్గర నుంచి ప్రాణాలన్నీ వాళ్ళమీదే పెట్టుకుని ఉంటారు, వాళ్లకి మంచి బట్టలు కొనాలి, వాళ్లనే బాగా చదివించాలి, వాళ్లే మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళే బాగుండాలి, ఎందుకో తల్లిదండ్రులు అందరూ ఇలాగే ఆలోచిస్తారు కష్టంలో సుఖం లో  కూడా మేము గుర్తు రానంతగా, చాలా బాధగా ఉంది  నాన్న అంది నాగలక్ష్మి ఏడుస్తూ. సరేలే బిడ్డ అయిందేదో అయింది, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఏం చేయగలం, అన్నాడు నరసింహం, నీలమ్మ కూతుర్ని దగ్గరికి తీసుకుంటూ నువ్వు బాధపడకు నేను బాగానే ఉన్నాను నా గురించి ఏమీ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు బిడ్డ  అన్నది. ముందు అమ్మని మంచి హాస్పిటల్ కి మారుద్దాము, నా దగ్గర మొన్నే నేను చిట్టి పాడిన లక్ష రూపాయల డబ్బులున్నాయి, ఇంకా అవసరమైతే ఉన్న నగానట్రా తాకట్టు పెడదాం లేదా అమ్మేదాం, అమ్మ ప్రాణం కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నా భర్త కూడా నా మాట కాదు అనడు, ఆయనే మీ అమ్మ నాన్ననీ జాగ్రత్తగా చూసుకో అని చెప్తా ఉంటాడు ఎప్పుడు, ఎందుకంటే ఆయనకి అమ్మానాన్న లేరు కదా మిమ్మల్నే అమ్మ నాన్న లెక్క అనుకుంటాడు అంటూ భర్త గురించి గొప్పగా  చెప్పింది నాగలక్ష్మి. కూతురు తల్లి మీద అంత ప్రేమ తో బాధ్యతగా, మాట్లాడుతుంటే, నరసింహం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో కూతుర్ని కొడుకుతో సమానంగా ఎప్పుడు చూడలేదు, కూతురు అంటే ప్రేమ ఉన్నా పరాయి ఇంటికి వెళ్లి పోతుంది అనే ఒక చులకన భావం, ఎప్పుడూ అన్ని  విషయాల్లో కూతురి కంటే కొడుకే గొప్పగా ఉండాలనే తను ఆశించాడు అలాగే చేశాడు కూడా. కూతురు చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా 10 పాస్ కాగానే పెళ్లి చేసేసాడు, అదృష్టం కొద్దీ అల్లుడు మంచివాడే దొరికాడు కాబట్టి సరిపోయింది గానీ, లేకపోతే ఎంత బాధ అనుకున్నాడు, అప్పుడు కూతురు పట్ల చేసిన తప్పుకి ఇప్పుడు బాధపడుతున్నాడు నరసింహం.
అన్నట్టుగానే కూతురు సహాయంతో నరసింహం నీలమ్మ ను ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు, అక్కడ ట్రీట్మెంట్ బాగా జరిగింది, ఆమెకు వచ్చిన రోగం మొదటి దశ లోనే ఉండడం వల్ల త్వరగానే నయమై నీలమ్మ కోలుకుంది. నాగలక్ష్మి తల్లి ఇంకా పూర్తిగా కోలుకునే వరకూ తల్లిదండ్రులు తమ ఊరు వచ్చి కొన్ని నెలలపాటు తమతోనే ఉండాలని తాను జాగ్రత్తగా చూసుకుంటాను అని చాలా పట్టుబట్టింది, అల్లుడు వెంకటేశం కూడా అత్తమామల్ని తమతో రమ్మని బతిమాలడంతో హాస్పటల్ నుంచి సరాసరి కూతురి ఇంటికే వెళ్లిపోయారు నరసింహం నీలమ్మ,
మధ్యలో కొడుకు గిరి మాత్రం ఓసారి చుట్టం చూపుగా వచ్చి తల్లిని చూసి పోయాడు ఒక గంట సేపు ఉండి, కోడలు అయితే అసలు రానేలేదు హాస్పటల్ కి వస్తే నాకు పడదు అంటూ అత్తగారిని ఫోన్లో మాత్రం ఎలా ఉన్నావు అత్త అంటూ ఓ సారి పరామర్శించింది అది కూడా భర్త హాస్పిటల్ కి వచ్చినప్పుడు, నరసింహానికి నీలమ్మకి బాగా అర్థమైంది కూతురు మనస్తత్వం, కొడుకు మనస్తత్వం ఎలాంటిదో బాగా తెలిసొచ్చింది.
తన కథ ఎంతసేపు కూతుళ్లను పట్టించుకోకుండా  కొడుకులు కొడుకులు అంటూ తపించిపోయే తమలాంటి తల్లిదండ్రులకు ఓ గుణపాఠం లాంటిది అనుకున్నాడు నరసింహ, తన కూతురులాంటి బంగారు తల్లి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన కూతురు ఉండడం తన అదృష్టం అనుకున్నాడు నరసింహం మనస్ఫూర్తిగా, ఏది ఏమైనా భార్య మరణం అంచుల వరకు వెళ్లి కూతురు ప్రేమాభిమానాలతో బయటపడడం నరసింహానికి చాలా సంతోషం కలిగించింది, కథ చదివిన మీ అందరికీ కూడా సంతోషమెగా నీలమ్మ కోలుకోవడం. శుభం, కథ కంచికి ఇక  మనం ఇంటికి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!