మూగ మనసు

మూగ మనసు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

సూర్యోదయానికి ముందే యాభై సంవత్సరాల వయసున్న ప్రణయ్ తన పెట్ జాకీని తీసుకుని ఉదయపు నడక కై వారి కోలనిలో ఉన్న పార్క్ కి వెళ్ళాడు. రోజూ తన దినచర్య అది. రోజూ చాలా మంది స్నేహితులు అక్కడ నడక పూర్తి అయ్యాకా కాసేపు కబుర్లు చెప్పుకుని ఎవరింటికి వారు చేరుకుంటారు. ఓ ఏడాది క్రితం ముచ్చటపడి తెచ్చుకుని పెంచుకుంటున్నాడు కుక్క పిల్ల జాకీని. అది అంటే భార్య సునీత కి అసలు ఇష్టం ఉండదు ఎందుకో మరి. అయినా దాన్ని కొట్టడం లాంటివి ఏమీ చెయ్యదు కానీ ఏదో అంటీ ముట్టనట్లు ఉంటుంది. ప్రణయ్ అలా కాదు దానితో సొంత పిల్లాడు అన్నట్టు పెనవేసుకు పోయాడు. జాకీ కూడా ప్రణయ్ కోసం రాత్రి పగలు చూస్తూ ఉంటుంది. బహుశా ఒక జీవి తో మరో జీవికి ఏదో తెలియని బంధం, రుణం ఉంటాయి అంటే అదే నేమో.
ఆ రోజు కొంచెం ముందు వచ్చారో లేదా మిగతా వారికి ఆలస్యం అయిందో కానీ ఇంకా ఎవరూ ఉదయపు నడకకి రాలేదు. ప్రణయ్ జాకీ ని తీసుకుని నడుస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఉన్నట్టుండి ఓ చోట కుప్పకూలి పోయాడు. జాకీ విల విల లాడిపోయింది. అటూ ఇటూ తిరుగుతూ అరుస్తోంది. సాటి మనిషి కన్నా ఎక్కువ కంగారు పడిపోతోంది. కూడా తెచ్చుకున్న మంచినీళ్ళ సీసా మూత తీసి మొహం మీద పోసింది. అయినా ప్రణయ్ లో చలనం లేదు. ఇంతలో అదృష్టం కొద్ది ప్రణయ్ స్నేహితుడు భార్గవ్ ఆ పార్క్ ద్వారం వైపు రావడం చూసింది. అంతే ఒక్క ఉదుటన పోయి భార్గవ్ని లాక్కు వచ్చింది. ప్రణయ్ ని చూసి పరిస్తితి అర్థం అయి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి, గుండెలను గట్టిగ్గా ఒత్తడం మొదలు పెట్టాడు. అతి కొద్ది సేపటికే అంబులెన్స్ రావడం, దగ్గర్లో ఉన్న హార్ట్ సెంటర్ కి నిమిషాల్లో చేరుకున్నారు. జాకీ కూడా వీళ్ళకన్నా ముందే అంబులెన్స్ ఎక్కి కూర్చుంది. దాని ఆందోళన అంతా ఇంతా కాదు. ఓ చోట నుంచోదు. ఇంతలో డాక్టర్లు పరీక్ష చెయ్యడం, మైల్డ్ హార్ట్ ఎటాక్ వచ్చిందని సరైన సమయంలో ఇక్కడకి రావడం వలన ప్రాణాపాయం లేదని చెప్పడంతో భార్గవ్ ఊపిరి పీల్చుకుని నించున్నాడు. ఈ లోపు తోక ఆడిస్తూ జాకీ, భార్గవ్ ని కాళ్ళతో మెల్లిగా గోకుతోంది. తను కృతజ్ఞత ఏమో అనుకుని, మనుషుల కన్నా ఎక్కువ విశ్వాసంగా ఉందే అనుకుని ఓ సారి చేయి అందించి, మెల్లిగా నిమిరాడు. దాంతో కాస్త కుదుటపడి మళ్లీ గోకడం మొదలెట్టింది. ఏమిటా అనుకుని తన దగ్గర ఉన్న బిస్కట్ ఇచ్చాడు. అది తినలేదు, ఇంకా అలా గోకుతూనే ఉంది. కాసేపటికి గుర్తు వచ్చి, ప్రణయ్ ఇంటికి ఫోన్ చేసి భార్యకి మెల్లిగా విషయం చెప్పాడు. సునీత ఎంతో కంగారు పడి, ఉరకలు పరుగుల మీద ఆసుపత్రికి చేరుకుంది. సునీత ని చూస్తూనే జాకీ పరుగు పరుగున వెళ్లి, చెయ్యి పట్టుకుని లాక్కొచ్చింది. ఒక్కసారి ఏడుస్తూ భార్గవ్ చేతులు పట్టుకుని కుమిలి పోయింది, సునీత. ఇప్పుడు ఏం పర్వలేదమ్మా, వాడికి ఏం కాదు. సమయానికి ఈ జాకీ నన్ను స్పృహ తప్పి పడివున్న వాడి దగ్గరకు తీసుకొని వెళ్ళి మంచి పని చేసింది. లేదంటే షూ వేసుకోవడం మర్చిపోయా అని తిరిగి ఇంటికి వెళ్ల బోయాను నేను. అలా వెళితే ఎంత ప్రమాదం జరిగేదో. నోరు లేకపోయినా మనసున్న జీవి ఈ జాకీ అమ్మా, దానికి ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి అన్నాడు. అవును నిజం అంది సునీత, జాకీని నిమురుతూ. అది మనసులోనే మెచ్చుకోలుగా చూసింది. మరి కొంత సేపటికి డాక్టర్ వచ్చి ప్రణయ్ ని రూమ్ కి మారుస్తున్నాం. ఒకరోజు తదుపరి పరిశీలన కోసం ఇక్కడే ఉండాలి అని చెప్పి వెళ్ళాడు. తరువాత కొంత సేపటికి ప్రణయ్ రూమ్ కి రావడం, తనకి తెలివి రావడం జరిగింది. భార్గవ్ జరిగిన విషయం అంతా ప్రణయ్ కి చెప్పి ఇంటికి బయలుదేరతాడు. మరి కొంత సేపు అయ్యాకా భోజనం తీసుకు వస్తానని చెప్తాడు. అప్పటికి కాస్త కుదుట పడ్డారు సునీత, జాకీ కూడా. పాపం జాకీ కూడా ప్రణయ్ కాళ్ళ దగ్గరే కూర్చుని అస్సలు కదలడం లేదు. పాలు, నీళ్ళు కూడా ముట్టడం లేదు. మరి కొంత సేపటికి భార్గవ్ వీళ్ళకి భోజనం తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. ప్రణయ్ కి పెట్టీ సునీత కూడా తిన్నాకా అప్పుడు జాకీ తింది. చూసారా మూగ జీవమైనా ఎంత మనసున్న జాకీనో. ఏ జన్మ ఋణమో ఇలా వీళ్ళ మధ్య చేరింది. ఆ రోజు నుంచి సునీత కూడా జాకీ ని ఓ మనిషిలా చూడడం మొదలు పెట్టింది.

You May Also Like

5 thoughts on “మూగ మనసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!