కమలమ్మ గారి నమ్మకం

అంశం: బాలవాక్కు బ్రహ్మవాక్కు

కమలమ్మ గారి నమ్మకం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

అది ఆదివారం కావడంతో అబ్బాయి కోడలు పిల్లలు ఇంకా లేవలేదు. వారంతో పని లేకుండా మన సుజాత కి ఉదయం ఆరు కాకుండా లేచి ఓ కప్పు కాఫీ పడితే కానీ తోచదు. ఆ రోజు కాఫీ తాగి అలా కూర్చుంటే మనసు జ్ఞాపకాల లోకి జారుకుంది.
వాళ్ళు రాజమండ్రిలో ఉండే వారు. సుజాత భర్త రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేసి రిటైర్ అయి ఈ మధ్యనే కాలం చేశారు. అటు తర్వాత తాను కూడా కొడుకు దగ్గర వైజాగ్ లోనే ఉంటోంది. ఇప్పుడు కథ లోకి వెళ్తే వీళ్ళ పక్కింటి లో ఉండే వారు కమలమ్మ గారు, వారి కుటుంబం. కమలమ్మ గారు కొంచెం ఇంచు మించు సుజాత అమ్మ వయసు కావడం, అత్త మామలు లేక పోవడంతో ఆవిడతో చాలా సఖ్యంగానూ ఆప్యాయం గానూ ఉండేది. కమలమ్మ గారు కూడా సుజాతతో అలాగే ఉండే వారు. ప్రతి నిత్యం అన్నిటిలో చేదోడు వాదోడుగా ఉండేది కమలమ్మ గారు. ఏ మాత్రం తనకి, పిల్లలకు కొంచెం నలతగా ఉన్నా, మరేదైనా సమస్య అయినా సాయంగా వుండేది, ఏ మాత్రం కంగారు పడకుండా. కమలమ్మ గారిది మంచి మనసు. చుట్టు పక్కల ఉన్న అందరికి అవిడ ఓ పెద్దమ్మతో సమానం. ప్రతిదీ నిదానంగా ఆలోచించి, కంగారు పడకుండా జీవితం ఈదాలని చెప్పేది.
కమలమ్మ గారికి ఓ గమ్మత్తైన అలవాటు ఉండేది. ఈవిడకి దైవభక్తి కొంచెం ఎక్కువ. అన్నిటికీ దేవుడే ఉన్నాడని నమ్మేది. ఏదైనా సమస్య వస్తే ఆ ఇంట్లో ఉన్న పిల్లలని పిలిచి ఒరే అమ్మకి వచ్చిన జ్వరం తగ్గిపోతుంది, పోతుంది అనండి పిల్లలూ మీకు బెల్లం ముక్క పెడతాను, లేదా ఒరే ఇవ్వాళ ఆ పక్కింటి అక్క పరీక్ష ఫలితాలు వస్తాయి చక్కగా స్టేట్ రాంకు లో పాస్ అవుతుంది అనండి, ఒరేయ్ ఈ అన్నయ్య పెళ్లి చూపులకి వెళ్తున్నాడు చక్కని వదిన వస్తుంది అనండి అని అనిపించేది. వాళ్ళు చాక్లెట్ల కో బెళ్ళానికో కాకపోయినా సరదా గా ఉండేది, అలానే చేసేవారు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు అని, దేవుడే వారి చేత పలికిస్తాడు, తథాస్తు దేవతలు దీవిస్తారు అని గట్టి నమ్మకం. అనుకున్న పనులు కూడా అలాగే పూర్తి అయ్యేవి సంతోషంగా. దానితో కమలమ్మ గారి దగ్గరకు వచ్చి అన్నీ చెప్పుకునే వారు, చుట్టూ ఉన్న పెద్దవాళ్ళ తో బాటు పిల్లలు కూడా.
ఓ రోజు అటు పక్క ఉండే శాంతమ్మ గారి భర్త కి అనుకోకుండా ప్రమాదం జరిగి కొన్ని రోజులు స్పృహ లేకుండా పడి ఉన్నారు ఆసుపత్రిలో. పాపం ఆవిడ చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు అంటే నమ్మండి. అప్పుడు కమలమ్మ గారు ఊర్లో లేరు, ఏదో పని మీద వెళ్లి రెండు రోజుల తర్వాత వచ్చారు. విషయం తెలుసుకుని పరుగెత్తుకుని ఆసుపత్రి కి వెళ్లి చూసి, శాంతమ్మ ని కంగారు పడొద్దు అని, రేపటి కల్లా మీ ఆయన లేస్తారు చూడు అనగానే ఆవిడకి కొండంత ధైర్యం వచ్చింది. ఎప్పుడూ లాగే కమలమ్మ గారు దేవునికి పూజ ముగించు కుని చుట్టూ ఉన్న పిల్లలని పిలిచి వాళ్ళ చేత సుందరయ్య తాత (శాంతమ్మ గారి భర్త) ఈ రోజు ఇంటికి వస్తారు మాకు స్వీట్ట్లు ఇస్తారు అని పదేపదే అనిపిస్తుంది. ఆవిడ నమ్మకానికి తగ్గట్టే, వైద్యులు ఇచ్చిన మందులు చక్కగా పని చేసి సుందరయ్య గారు కళ్ళు తెరిచి చూసారు. దానితో శాంతమ్మ గారు పట్టలేని ఆనందం తో అర్ధరాత్రి అని చూడకుండా వచ్చి కమలమ్మ గారి తలుపు కొట్టింది. కమలమ్మ గారు లేచి దేవుని స్మరించుకుని తలుపు తీసింది. ఎదురుగా శాంతమ్మ, చూడగానే కొంచెం కంగారు పడింది రాత్రి వేళ కావడంతో. మెల్లిగా శాంతమ్మ మీ దయతో మా ఆయన కళ్ళు తెరిచారు అని అమాంతం కాళ్ళ మీద పడే సరికి, తేరుకుని లే అమ్మా, చూసావా బాల వాక్కు బ్రహ్మ వాక్కు, ఇక తగ్గి ఆయన ఇంటికి వస్తారు ఏమీ కంగారు పడకు అని చెప్పి పంపిస్తుంది. అలాగే ఆయన కూడా నెమ్మది గా తేరుకుని ఇంటికి వచ్చారు.
అనుకోకుండా ఆ శాంతమ్మ గారి అబ్బాయి కూడా ఇక్కడే ఉద్యోగం అవడం తో వాళ్ళు, వీళ్ళ ఇంటికి దగ్గర్లోనే ఉంటారు. గత రెండు సంవత్సరాల క్రితమే కమలమ్మ గారు కూడా కాలం చేశారు, వయసు రీత్యా. ఇలా జ్ఞాపకాలలో ఉండగా అమ్మా అనీ పిలవడం తో వాస్తవం లోకి వచ్చింది మన సుజాత.
ఆ కమలమ్మ గారు ఇచ్చిన బాల వాక్కు బ్రహ్మ వాక్కు అన్న విధానం మాత్రం ఇప్పటికీ సుజాత, శాంతమ్మ విధిగా పాటిస్తూ ఉంటారు. మంచి చేస్తూ, మంచి కోరుకుంటూ, దేవుని నమ్ముకున్న వారికి తప్పకుండా ఎప్పుడూ మంచే జరుగుతుంది. అందుకే పిల్లల నోట వెంట ఎప్పుడూ మంచి మాటలే వచ్చేలా మనం తీర్చి దిద్దాలి. ఆ దేవుడే వారి నోట పలికిస్తాడన్నది ఎప్పుడూ నిజమే మరి.
అదండీ బాల వాక్కు మహిమ.

You May Also Like

26 thoughts on “కమలమ్మ గారి నమ్మకం

  1. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటారని ఆశిస్తున్నా

  2. నోరు మంచిది అయితే వూరు మంచిది అన్నట్టు మాట మంచిదైతే మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుందని ఈ కధ తెలియజెప్పింది …బావుంది

  3. మంచి కథ. మంచి పలుకు మంచి ఫలితం అని మంచిగా చెప్పిన కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!